Padmadurg Fort : ఛత్రపతి శివాజీ ఈ కోటను ఎందుకు కట్టారో తెలుసా..? చరిత్ర ఇదే..!

Padmadurg Fort : ఛత్రపతి శివాజీ ఈ కోటను ఎందుకు కట్టారో తెలుసా..? చరిత్ర ఇదే..!

Padmadurg Fort
Share this post with your friends

Padmadurg Fort : స్వరాజ్య కోసం శివాజీ అనేక కోటలు నిర్మించారు. వాటి గురించి చర్చ జరిగినప్పుడు సహ్యాద్రి కొండలు, లోయలలో కట్టిన దుర్గాలు గుర్తుకొస్తాయి. భూమిపై మాత్రమే కాదు సముద్రంపై కూడా ప్రత్యేకంగా దుర్గాలను నిర్మించారు. ఛత్రపతి శివాజీ 5 కోటలను నిర్మించారు. ఏ ఒక్క పాలకుడు ఇన్ని కోటలు నిర్మించలేదు. మొఘలులు, డచ్ వారు , పోర్చుగీసులు, బ్రిటీష్ వారు వరకు అన్ని వైపులా శత్రువుల భయం ఉన్నా శివాజీ సముద్రంపై తన నియంత్రణను విస్తరిస్తూనే ముందుకు సాగారు.

ఖాందేరి, కులాబా, సువర్ణ దుర్గ్, సింధు దుర్గ్, పద్మ దుర్గ్ కోటలను చూస్తే ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యాన్ని విస్తరించిన తీరు కనిపిస్తుంది. ఆయన ఘనతను, విశిష్టతను ఇప్పటికీ ఈ ఐదు కోటలు ప్రతిబింబిస్తూనే ఉంటాయి. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, తుపానులు, సముద్రపు గాలుల ప్రభావంతో ఈ కోటలు కొంత దెబ్బతిన్నాయి.

పద్మ దుర్గ్ కోట..
పద్మ దుర్గ్ కోటను కన్సా ద్వీపంలో నిర్మించారు. రాజ్‌పురి తీర ముఖద్వారంలో జంజీరాకు వాయువ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది. రాయ్‌గఢ్ జిల్లాలోని మురుఢ్ తాలుకాలో ఈ కోట ఉంది. నిజాం షాహి కాలంలో సిద్ధీ వంశస్తులు సముద్ర తీర ప్రాంతాలను ఆధీనం చేసుకున్నారు. తీర ప్రాంతంలో కొన్ని కోటలు నిర్మించారు. జంజీరాను జయించాలని చాలాసార్లు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రయత్నించారు. కాన సఫలం కాలేకపోయారు.

అరబిక్ పదం జజీరా నుంచి జంజీరా అనే పేరును పెట్టారు. జజీరా అంటే ద్వీపం అని అర్థం. సిద్ధీలు తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వెళ్లడంతో మరాఠాలు తమ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి వారిని నిరోధించడం తప్పనిసరైంది. అందుకే శివాజీ సిద్ధీ కురాపతీలపై కన్నేశారు. వారిని నిరోధించేందుకు పద్మ దుర్గ్ కోటను నిర్మించారు. పద్మ దుర్గ్ కోటకి కనుచూపు మేరలోనే సామ్రాజ్‌గఢ్‌ను నిర్మించారు. సామ్రాజ్‌గఢ్‌ నుంచి సిద్దీల రాకపోకలను గమనిస్తూ ఉండే వారు. సముద్ర రాకపోకలను పద్మ దుర్గ్ నుంచి నియంత్రించారు.

పద్మ దుర్గ్ చరిత్ర గురించి ప్రత్యేకంగా ఎవరూ రాయలేదు. కానీ శివ రాయ కోటల చరిత్రలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పద్మ దుర్గ్ కోటలో కలువ రేకుల టవర్లు ఉన్నాయి. పద్మ దుర్గ్ కోటలో రెండు భాగాలు.. ప్రధాన కోట, పడ్కోట్ ఉంటాయి. కలువ రేకుల ఆకారంలో టవర్లను కట్టడం వల్ల ఈ కోటకు పద్మ దుర్గ్ అనే పేరు పెట్టి ఉంటారని దుర్గ్ వైభవ్ ఆఫ్ రాయగఢ్ డిస్ట్రిక్ పేరుతో రాసిన పుస్తకంలో స్కాలర్ డాక్టర్ సచిన్ జోషి వెల్లడించారు.

ప్రధాన కోట పడ్కోట్ కంటే పెద్దదిగా ఉంటుంది. ప్రధాన కోటలోకి ప్రవేశం తర్వాత ఇరు వైపులా గేట్లకు గార్డులు ఉంటారు. ప్రధాన కోటనే పద్మ దుర్గ్‌కి కంచుకోటగా చెబుతుంటారు. ఎందుకంటే ఈ కోట ప్రాంగణంలో ఉన్న ప్రధాన నిర్మాణాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. కోటలోకి ప్రవేశించిన తర్వాత మూడు గన్‌లతో స్వాగతం కనిపిస్తుంది. తలుపు గుండా లోపలికి వెళ్లిన తర్వాత కుడివైపున అనేక నిర్మాణాలకు చెందిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎదుట ఒక ద్వారం ఉంటుంది. అది పడ్కోట్‌కి వెళ్లేందుకు మార్గం.

ఈ నిర్మాణంలో కింద, పైన నిర్మాణ పరంగా చాలా భిన్నత్వం కనిపిస్తోంది. పక్కనే ఉన్న నాలుగు గుదుల భవంతిలో ఇలా ఉండటాన్నే గమనించవచ్చు. ఆ తర్వాత ఈ కోట సిద్ధీల ఆధీనంలోకి వెళ్లిపోయింది. పునాదులు దెబ్బతినకుండా ప్రధాన కట్టడంపైనే కొత్త నిర్మాణాలు చేపట్టారు. పద్మ దుర్గ్‌లో ఒక మసీదు ఉంది. ఈ మసీదులో నాలుగు గోడలు, ఒక తలుపు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. మసీదుకు వెనుకవైపు 8 చిన్న గదులు సముద్రానికి ఆనుకుని ఉన్నాయి. ఈ కోట బ్రిటీష్ వారి చేతుల్లోకి వచ్చాక జైళ్లను నిర్మించి ఉండొచ్చని డాక్టర్ సచిన్ జోషి అభిప్రాయపడ్డారు.

ఈ కోటలో టవర్లు అచ్చం కలువ రేకుల మాదిరి ఉంటాయి. కోట దగ్గరకి వెళ్లే వరకు కూడా ప్రవేశం కనిపించదు. ఈ కోట నిర్మాణానికి సున్నం వాడారు. కింద, పక్క గేట్లలో సిమెంట్ మెటీరియల్‌ను ఉపయోగించారు. ఈ గేట్లు బలంగా ఉంచేందుకు వీటికిపైన రెండు లేయర్లలో రాళ్లను ఉంచారు.ఇవి దాదాపు 1670 కాలం నాటివి. సముద్ర గాలులు, అలలు కారణంతో ఈ నల్ల రాతి కోటలోని రాళ్లు కొట్టుకుపోయినా, సున్నం మాత్రం ఉపరితలంపై కనిపిస్తూనే ఉంటుంది. ఈ కోటలో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు 3 తొట్టెలు ఉన్నాయి. నిర్మాణం శివాజీ కాలం నాటి నిర్మాణ శైలిలో ఉంటుంది. కోట ప్రాకారాల నుంచి మురుఢ్ తీరాన్ని, సామ్రాజ్‌గఢ్ , జంజీరా కోటలను వీక్షించవచ్చు.

పద్మ దుర్గ్ చరిత్ర..
చారిత్రక డాక్యుమెంట్ల ప్రకారం ఖాందేరి, పద్మ దుర్గ్ కోటలను ఛత్రపతి శివాజీ 1678 ఆగస్టులో నిర్మాణం మొదలుపెట్టారు. రాయ్‌గఢ్ జిల్లా గెజిటీర్‌లో నమోదు చేసిన రికార్డుల ప్రకారం పద్మ దుర్గ్‌ను 1693లో నిర్మించారని ఉంది. రాయ్‌గఢ్ జిల్లా గెజిటీర్ రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే శివాజీ మరణం తర్వాతనే ఈ కోటను నిర్మించారని తెలుస్తోంది. ఇతర రీసెర్చ్‌ల ప్రకారం 1675- 1678 మధ్య కాలంలోనే పద్మ దుర్గ్ కోట నిర్మాణాన్ని ప్రారంభించారనే ఆధారాలు ఉన్నాయి.

రాయ్‌గఢ్ జిల్లా గెజిటీర్ రికార్డులో పేర్కొన్న ఏడాది ఈ కోట నిర్మాణం పూర్తై న కాలమని చాలా మంది పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఛత్రపతి శివాజీ కాలంలోనే ఈ కోట నిర్మాణాన్ని చేపట్టారని అంటున్నారు. ఆ తర్వాత ఛత్రపతి శంభాజీ కాలంలో దీన్ని పూర్తి చేసినట్లు చాలా మంది చరిత్రకారులు భావిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నా శివాజీ పద్మ దుర్గ్ నిర్మాణాన్ని ప్రారంభించారని అంటారు.

పద్మ దుర్గ్ నిర్మాణాన్ని శివాజీ సవాలుగా తీసుకున్నారు. దీంతో సిద్దీలు ఎన్నో రకాలుగా పద్మ దుర్గ్ నిర్మాణానికి ఆటంకాలను సృష్టించారు. పద్మ దుర్గ్ నిర్మాణాన్ని చేపట్టే కన్సా ద్వీపంలోని ప్రజలను సంరక్షించాలని దర్యసారంగ్ ఇబ్రహీం ఖాన్, దౌలద్ ఖాన్‌లను ఛత్రపతి శివాజీ కోరారు. వారు శివాజీ బృందంలోని ప్రముఖ ముస్లిం నాయకులు.

మరాఠా సామ్రాజ్యం పద్మ దుర్గ్ కోటకు పనిచేసిన కొందరి పేర్లను చరిత్రకారుల రికార్డుల్లో ఉన్నాయి. రామాజీ నాయక్ 1684- 1685 మధ్య కాలంలో పద్మ దుర్గ్‌కు కానిస్టేబుల్‌గా వ్యవహరించారు. 1702లో శుభాంజి మోహితే ఈ కోటలో ఫోర్ట్ లార్డ్‌గా విధులు నిర్వహించారు. పద్మ దుర్గ్ కోటకు సంబంధించి 1704 ఏప్రిల్ 28 నాటి ఒక లేఖ ఉంది. ఈ లేఖను పరశురాం త్రియంబక్, నీల్‌కంఠ్ పింగ్లే రాశారు.

నీల్‌కంఠ్ పింగ్లే మరాఠా సామ్రాజ్యంలో తొలి పీష్వా మోరోపాంత్ పింగ్లే కొడుకు. పరుశురాం త్రియంబక్ మరాఠా సామ్రాజ్యానికి సేనాపతి. కోటల నిర్వహణ బాధ్యత కొన్ని గ్రామాలకు ఇచ్చే వారు. కోటలను నిర్వహణ కోసం ఆ గ్రామాల నుంచి పన్నులు వసూలు చేసేవారు. నీలకంఠ్ పింగ్లే, పరశురాం త్రియంబక్‌లు రాసిన లేఖలో జంజీరా, పద్మ దుర్గ్ కోటల నిర్వహణ, ఖర్చులున్నాయి. శివాజీ మహారాజ్ జంజీరా, పద్మ దుర్గ్ కోట నిర్వహణ బాధ్యతలను బహిరో పండిట్‌కు రెండు గ్రామాలను అప్పగించారు. ఆ గ్రామాలను పద్మదుర్గ కోటలోని గుమాస్తాకు అప్పగించాలని ఆ లేఖలో ఉంది.

శివాజీ మరణం తర్వాత 1710లో సిద్ధి సురుల్ ఖాన్ పద్మ దుర్గ్ కోటను మరాఠాల నుంచి తీసేసుకున్నారు. పీష్వాలు 1732లో జంజీరాను ఆక్రమించారు. అప్పుడు సిద్ధీలు, పీష్వాల మధ్యలో ఒప్పందం కుదిరింది. జంజీరా, పద్మ దుర్గ్ కోటలు సిద్ధీల వద్దనే ఉంచుకునేలా, బీర్వాడి, తలే, ఘోసాలే కోటలను పీష్వాలు పొందేలా ఈ ఒప్పందం కుదిరింది.

మరాఠాల చేతిలోకి మళ్లీ పద్మ దుర్గ్ కోట ఎప్పుడొచ్చింది?
మహారాష్ట్ర ప్రభుత్వ గెజిట్ ప్రకారం మానాజీ ఆంగ్రే మరణం తర్వాత రఘూజీ ఆంగ్రే వారసత్వ సంపదను పొందారు. అప్పడు మరాఠా సామ్రాజ్యంపై సిద్ధీలు దాడి చేశారు. కొన్ని ఆలయాలను ధ్వంసం చేశారు. పీష్వాల సాయంతో సిద్ధీల దాడిని రఘూజీ అడ్డుకున్నారు. ఆ సమయంలో సిద్ధీల దగ్గర నుంచి ఉంధేరి కోటను పొందారు. పీష్వాలకు ఉంధేరి కోటను రఘూజీ గిఫ్ట్‌గా ఇచ్చారు.తదనంతరం ఉంధేరి కోటకు జయదుర్గగా పేరుపెట్టారు. పద్మ దుర్గ్ ను సిద్ధీల నుంచి 1759 ఫిబ్రవరి 21న రఘూజీ స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కాలంలో పద్మ దుర్గ్ కోట బ్రిటీష్ వారి చేతులోకి వెళ్లిపోయింది. బ్రిటీష్ వారే ఈ కోటలో జైలుగా మార్చారని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పద్మ దుర్గ్ కోట పాడుబడింది. అరేబియా సముద్రపు అలలకు పద్మ దుర్గ్ టవర్‌ రాళ్లు కొట్టుకుపోయాయి. దాని సున్నపు నాణ్యత మాత్రం చెక్కు చెదరకుండానే ఉంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Stubble Burning : గ్యాస్‌ చాంబర్‌లా ఢిల్లీ.. వాళ్లే కారణమా?

Bigtv Digital

Drishyam movie crime : దృశ్యం సినిమా చూసి జంట హత్యలు.. ఎలా చంపాడంటే?

Bigtv Digital

Manchu Family News: టీడీపీలోకి మంచు మనోజ్!.. అన్న విష్ణుకు పోటీగానా?

Bigtv Digital

Khanapur : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. ఖానాపూర్ ఖాన్ ఎవరు?

Bigtv Digital

Viveka Murder Case : వివేకా సోదరి సంచలన కామెంట్స్.. వాళ్లే హంతకులు..!

Bigtv Digital

Dec 1st Changes: డిసెంబర్ 1 నుంచి మారేవి ఇవే.. తప్పక తెలుసుకోవాల్సిందే..

BigTv Desk

Leave a Comment