
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కుట్ర కోణం నిజం లేదంటోంది ఎక్స్ పర్ట్స్ కమిటీ నివేదిక. బ్యారేజ్ కుంగిపోవడం వెనుక కుట్ర ఉందంటూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్ద శబ్దంతో కుంగిపోవడం వెనుక కుట్ర ఉందని ప్రభుత్వ అధికారులు చెప్పడం ఉద్దేశంపూర్వకంగా ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యారేజీ కుంగిపోవడంపై ప్రాజెక్టు అధికారులు మహదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్రిడ్జ్ కుంగిపోవడం వెనుక కుట్రకోణం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు FIR ఫైల్ చేశారు. ఈ అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ కిరణ్ తెలిపారు. ఫోరెన్సిక్, క్లూస్ టీంల సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. డ్యాం సేఫ్టీ కమిటీ కూడా బ్యారేజ్‌ను పరిశీలించినట్లు ఎస్పీ కిరణ్ తెలిపారు. ఐతే నిపుణుల కమిటీ నివేదిక తరువాత మాత్రమే తాము ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు. అప్పటి వరకు తమ దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు బ్యారేజ్ ప్రమాదంలో ఉన్నందున ఎవరినీ అనుమతించడం లేదని ఎస్పీ చెప్పారు.
కాగా.. మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై హైదరాబాద్‌లో కేంద్ర బృందం కీలక సమావేశమైంది.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని అధికారుల బృందం.. జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సమీక్షిస్తోంది. తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ కమిటీ బాధ్యులు, ఈఎన్సీ నాగేంద్రరావు నేతృత్వంలో మంగళవారం క్షేత్రస్థాయిలో బ్యారేజ్‌ను పరిశీలించింది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో చర్చించనుంది. సాంకేతిక వివరాలపై కేంద్ర బృందం ఆరా తీస్తోంది. ఈ సమావేశం తరువాత కేంద్రానికి తన నివేదికను సమర్పించనుంది.
.
.