MLC Kavitha Letter: మై డియర్ డాడీ అంటూ.. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ.. రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపింది. అందులో బీఆర్ఎస్‌కు సంబంధించిన నెగటివ్ పాయింట్లని హైలైట్ చేయడంతో.. హాట్ డిబేట్ మొదలైంది. ఆ లేఖని మొట్టమొదటగా బయటపెట్టింది.. బిగ్ టీవీనే! అప్పుడంతా.. అదో ఫేక్ లెటర్ అని కొట్టిపారేశారు. ముఖ్యంగా.. బీఆర్ఎస్ సోషల్ మీడియా! కానీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే.. కుండబద్దలు కొట్టేశారు కవిత. ఆ లేఖ తనే రాశానని చెప్పడంతో.. అంతా ఖంగుతిన్నారు. ఆ లేఖ రేపిన దుమారం.. బీఆర్ఎస్‌లో సునామీలా మారబోతోందా? అది.. ఆ పార్టీనే చుట్టుముట్టేయబోతోందా?
గులాబీ తీరంలో.. గుండెలదిరే సునామీ!
పార్టీ కోసం కవిత ఫైట్ చేస్తుంటే అంతా సైలెంట్!
కవిత అంటే.. డాటర్ ఆఫ్ ఫైటర్ అన్నారు! మరి.. ఆ డాటరే.. ఇప్పుడు పార్టీ కోసం ఫైట్ చేస్తుంటే.. అంతా సైలెంట్ అయిపోయారు. ఆమె రాసి లెటర్ లీకైతే.. ఒక్కరు కూడా సరైన స్థాయిలో రియాక్ట్ అవట్లేదు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. మొట్టమొదటగా.. తన తండ్రి కేసీఆర్‌కు కవిత రాసిన లేఖని.. బిగ్ టీవీ బయటపెట్టినప్పుడు.. అంతా ఫేక్ అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే.. బిగ్ టీవీని టార్గెట్ చేస్తూ.. వేల పోస్టులు పెట్టారు. అదో ఫేక్ లెటర్ అని.. కవిత రాయలేదని.. అందులో ఉన్న సంతకం ఆమెది కాదని.. ఇలా ఎన్నో రకాలుగా కవర్ డ్రైవ్‌లు ఆడారు. కానీ.. వాళ్లెంత కవర్ చేసినా.. అది నిజమని తేలేందుకు ఎంతో టైమ్ పట్టలేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా.. ఎన్నో రకాలుగా ఆపసోపాలు పడుతూ అది ఫేక్ లెటర్ అని బాగా ప్రచారం చేసింది. కానీ.. నిజం నిప్పులా భగ్గుమంది. కవిత.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే.. ఆ లెటర్ తాను రాసిందేనని కన్ఫామ్ చేయడంతో అంతా అవాక్కయ్యారు. బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా బయపెట్టిన లేఖ.. ఫేక్ కాదని తేలిపోయింది. బిగ్ టీవీ చెప్పింది నిజమేనని అంతా ఒప్పుకోక తప్పలేదు. దీనికి తోడు.. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, కోవర్టులున్నారని.. కన్నకూతురు కవితే చెప్పడం.. పెద్ద చర్చకు దారితీసింది.
కేటీఆర్.. చెల్లి కవిత గురించే మాట్లాడతారనే ఊహాగానాలు
కవిత ఎయిర్‌పోర్ట్ ఎపిసోడ్ ముగిసిన కొన్ని గంటల్లోనే.. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. కేటీఆర్ మీడియా ముందుకు వస్తున్నారనగానే.. అంతా కవిత గురించే మాట్లాడతారని అనుకున్నారు. చెల్లి రాసిన లేఖపై.. అన్న రియాక్షన్ ఎలా ఉంటుందోనని.. ఆమెపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారోనని ఎదురుచూశారు. మరీ ముఖ్యంగా.. లేఖలో కవిత లేవనెత్తిన అంశాలపై.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ మాట్లాడటమే కాదు.. అందరికీ క్లారిటీ ఇస్తారనుకున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలున్నా.. కేటీఆర్ లేఖ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా.. పార్టీలో కోవర్టులుంటే ఉండొచ్చని.. సింపుల్‌గా తేల్చేశారు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి.. కోవర్టులుంటే ఉండొచ్చు.. సమయం వచ్చినప్పుడు.. వాళ్లే బయటపడతారని చెప్పారు. అంతేకాదు.. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని.. ఎవరైనా అధినేతకు ఏవైనా సలహాలు, సూచనలు చేయొచ్చని అన్నారు. అయితే.. కొన్ని విషయాలను అంతర్గతంగా చెబితినే బాగుంటుందని.. ఇది అందరికీ వర్తిస్తుందని పరోక్షంగా కవితను ఉద్దేశించి అన్నట్లుగా కనిపించింది.
కవిత వ్యవహారంపై రియాక్ట్ అవకుండానే సైడ్ అయిన కేటీఆర్
ఓకే.. కేటీఆర్ ఏదో చెప్పేసారు. ఆయన.. కవిత రాసిన లేఖపై.. ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించడం ఆయనకు ఇష్టం లేకపోవచ్చు. ఇది.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన నిర్ణయమా? పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన డైరెక్షనో తెలియదు గానీ.. మొత్తానికి కవిత వ్యవహారంపై పెద్దగా రియాక్ట్ అవకుండానే.. సైడ్ అయిపోయారు. మరి.. నాన్నకు రాసిన లేఖలో.. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు బదులిచ్చేదెవరు? ఇదే.. ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న బిగ్ క్వశ్చన్. ముఖ్యంగా.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలని.. ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కవిత లేఖ రేపిన దుమారం అలాంటిది మరి! ఇప్పుడదే.. బీఆర్ఎస్‌లో ఓ సునామీలా మారబోతోందా? ఆ పార్టీని చుట్టుముట్టేస్తుందా? ఇదే.. ఇప్పుడు బీఆర్ఎస్‌తో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. కవిత ఆ లేఖ తానే రాశానని చెప్పడం.. కోవర్టులే లీక్ చేశారనడం, పార్టీ అధినేత చుట్టూ దయ్యాలున్నాయనడం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ కూడా స్పందించకపోవడం లాంటివి చూస్తే.. లేఖలో కవిత రాసిన నెగటివ్ అంశాలన్నీ నిజమేనని తెలుస్తోంది. బీఆర్ఎస్‌లోని మెజారిటీ నాయకులు, కార్యకర్తల్లోనూ అంతర్గతంగా ఈ చర్చ ఎప్పట్నుంచో ఉంది. దీనిపై తమ స్టైల్లో క్లారిటీ ఇచ్చి.. కేటీఆర్ ఫుల్ స్టాప్ పెడతారని అంతా అనుకున్నారు. కానీ.. అలా జరగలేదు. దాంతో.. నెక్ట్స్ ఏం జరగబోతోంది? అనేది ఆసక్తిగా మారింది.
కొన్ని నెలలుగా బీఆర్‌ఎస్‌లో పెరిగిన అసంతృప్తి
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. పార్టీలో అసంతృప్తి మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు చూశాక.. ఆ అసంతృప్త జ్వాలలు మరింత ఎగశాయ్. ఈ అసంతృప్తి.. ఇప్పుడు కొత్తగా కవిత లేఖ వల్ల వచ్చిందేమీ కాదు. పార్టీలో ఎప్పట్నుంచో ఉడుకుతున్న వ్యవహారాన్నే.. ఆమె లేఖలో రాసి తన తండ్రికి పంపారు. పార్టీలో మెజారిటీ నేతలు, కార్యకర్తల ఫీలింగ్ కూడా ఇదే. ఇన్నాళ్లూ.. వాళ్లంతా కేసీఆర్‌ని చూసి ఆగారు. కానీ.. ఎప్పుడైతే కవిత లేఖ బయటకొచ్చిందో.. మొత్తం బరస్ట్ అయింది. ఆవిడే.. ఓ అడుగు ముందుకేసి.. పార్టీలో కోవర్టులున్నారని.. దయ్యాలున్నాయని చెప్పడంతో.. ఇప్పుడున్న అసంతృప్తి.. మరింత పెరిగే చాన్స్ ఉందనే చర్చలు మొదలయ్యాయ్. అందువల్ల.. ఇప్పుడు వెంటనే బీఆర్ఎస్ కవిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరముందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. మరీ ముఖ్యంగా.. ఆ దయ్యాలెవరో తేల్చాలి. ఆ కోవర్టుల్ని పార్టీ నుంచి బయటకు పంపాలనే చర్చ.. బీఆర్ఎస్‌లో అంతర్గతంగా జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. కేసీఆర్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారనేది ఆసక్తిగా మారింది.
కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయనే కవిత స్టేట్‌మెంట్.. చెప్పి వచ్చిన తుపాను లాంటిది! కానీ.. భవిష్యత్‌లో గులాబీ తీరంలో రాబోయే పింక్ సునామీ గురించి.. ఇప్పటికైతే హెచ్చరికలేమీ లేవు. కానీ.. వచ్చాక చెప్పుకునే సునామీ లాంటి పరిణామాలు చాలానే ఉంటాయనే చర్చే.. ఇప్పుడు బీఆర్ఎస్‌ని టెన్షన్ పెడుతోంది. అసలు.. కవిత అలా ఎందుకన్నారు? ఆవిడని.. ఇబ్బంది పెట్టిన వాళ్లెవరు? పార్టీలో.. కన్న కూతురికి ఇంత అన్యాయం జరుగుతుంటే.. అసలు కేసీఆర్ ఎందుకు రియాక్ట్ కావట్లేదు?
పార్టీలో తనపై కుట్ర జరుగుతుందన్న కవిత
కవిత రాసిన లేఖ.. బీఆర్ఎస్‌లో రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. కొంతకాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని.. ఆమె బయటపెట్టిన తీరు అందరినీ షాక్‌కి గురిచేసింది. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం లేదని.. కొంతకాలంగా ఆమె అసంతృప్తితో ఉన్నారనే చర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. మరోవైపు కవిత తీరుపై పార్టీ నాయకత్వం కొంత అసంతృప్తితో ఉందనే గుసగుసలు కూడా ఉన్నాయ్. ఇలాంటి టైమ్‌లో.. ఆమె రాసిన లేఖ లీక్ అవడం సంచలనంగా మారింది. అది ఫేక్ లెటర్ అని, తమ రాజకీయ ప్రత్యర్థులు చేసిన కుట్ర అని బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంది. ఇంతలోనే.. కవిత ఆ లేఖ తానే రాశానని చెప్పడంతో.. సైలెంట్ అయిపోయారు. అయితే.. ఇదే బీఆర్ఎస్ నేతలు ఇంతకుముందు కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో.. బీజేపీ ఇబ్బంది పెడుతోందని.. వరుసపెట్టి ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఆరోపించారు. మరి.. ఇప్పుడు పార్టీలో అంతర్గతంగానే.. ఆమె ఇబ్బంది పడుతోందని తెలుస్తోంది. మరి.. ఆమెను ఇబ్బంది పెట్టినోల్లపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదనేదే.. బిగ్ క్వశ్చన్. పార్టీలో.. కన్న కూతురికి ఇంత అన్యాయం జరుగుతుంటే.. కేసీఆర్ ఎందుకు రియాక్ట్ కావడం లేదనేది మరో ప్రశ్న.
కేసీఆర్ కోటరీ దయ తలిస్తేనే కేసీఆర్ దర్శనం!
ఇక.. కేసీఆర్ దేవుడని.. ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత చెప్పడం మరింత కలకలం రేపింది. దాంతో.. ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరో తేల్చాలనే చర్చ జోరుగా నడుస్తోంది. నిజానికి.. కేసీఆర్ చుట్టూ ఓ కోటరీ ఉన్న మాట వాస్తవమే. వారు దయ తలిస్తేనే.. కేసీఆర్ దర్శనం దక్కుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఎప్పట్నుంచో ఉంది. పార్టీ అధికారం కోల్పోయాక కూడా ఇంకా అదే పరిస్థితి నడుస్తోందనే టాక్ ఉంది. ఇప్పుడు అదే కోటరీ వల్ల.. తనకు, తన తండ్రి కేసీఆర్‌కు మధ్య దూరం పెరిగిందనే భావనలో ఆమె ఉన్నారనే చర్చ నడుస్తోంది. అయితే.. పార్టీలో కవిత దూకుడుకు చెక్ పెట్టేందుకే.. ఈ లేఖను లీక్ చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్. గతంలో పార్టీలో సంక్షోభాలు నెలకొన్న సమయంలో.. ప్రతిపక్షాలనో, ప్రత్యర్థుల పని అనో, తెలంగాణ ద్రోహులనో, ఢిల్లీ వాళ్లనో.. ఇతరులపై నెపం నెట్టి.. ఆ సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ హైకమాండ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కన్న కూతురు కవితే.. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పడంతో.. ఇతరులపై తోసేందుకు వీల్లేకుండా పోయింది. దాంతో.. కవిత వ్యవహారం బీఆర్ఎస్ అధిష్టానానికి మింగుడుపడటం లేదు. దాంతో.. ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది.
పార్టీలోని రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయి?
కవిత ఎపిసోడ్‌తో.. పార్టీలోని రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయి? బీఆర్ఎస్‌లో చీలికలు ఏర్పడతాయా? అన్న కోణంలోనూ.. పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ మొదలైంది. పార్టీలో నెలకొన్న సమస్యల్ని మాత్రమే.. అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని.. అందులో తన వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని కవిత ప్రకటించారు. ఇదే సమయంలో తమ నాయకుడు కేసీఆరే అని కూడా నొక్కి చెప్పారు. మరి.. కవితకు మద్దతుగా.. గులాబీ పార్టీ నేతల్లో ఎంతమంది ఆమె వైపు నిలుస్తారు? అన్నది కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది. పార్టీలోని అంతర్గత సమస్యల్ని మాత్రమే.. కవిత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారా? మరేదైనా కోణం ఉందా? అన్నదానిపైనా.. బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల మాదిరిగానే.. కవిత కూడా పార్టీని వీడి ఇతర పార్టీలో చేరతారా? అన్నదానిపైనా చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. కొంతకాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కకపోవడంపై.. కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే.. సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని, పదేళ్లు అధికారంలో ఉన్నా.. భూమిలేని పేదలకు ఏమీ చేయలేకపోయామని చెప్పడం పెద్ద చర్చకే దారితీసింది. మరోసారి.. తనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు. తనను బాధపడితే.. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని ముందే సూచించారు. ఈ పరిణామాలన్నింటిని చూశాక.. బీఆర్ఎస్‌లో అసలైన ముసలం ముందుందనే చర్చ మొదలైంది.
కవిత రాసిన లేఖపై పార్టీ నుంచి కనిపించని స్పందన
ఇక.. గులాబీ దళపతికి.. కవిత రాసిన లేఖపై ఇప్పటివరకు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. కేటీఆర్ కూడా కవిత వ్యవహారంపై పెద్దగా స్పందించేందుకు ఇష్టపడలేదు. ఖండించలేదు. ఈ అంశంపై.. బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరూ మాట్లాడట్లేదు. దాంతో.. ప్రస్తుత పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో వేచి చూసి.. ఆ తర్వాత కేసీఆర్ సూచన మేరకు స్పందించాలనే ఆలోచనతో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. కవిత లేఖ వ్యవహారం మాత్రం కచ్చితంగా బీఆర్ఎస్‌ని ఇబ్బంది పెడుతుందనే టాక్ మాత్రం పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోకపోతే.. మరింత నష్టం తప్పదనే చర్చ గులాబీ వర్గాల్లో నడుస్తోంది.