ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారే భారత్
ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందనే నివేదికలు వస్తున్నాయి. కరోనా కాలాన్ని కూడా దాటుకొని భారత్ నిలదొక్కుకున్న మాట కూడా వాస్తవమే. ప్రపంచంలో చాలా దేశాలు కరోనా దెబ్బకు చతికిలపడితే.. భారత్ మాత్రం అనుకూలమైన ఆర్థిక విధానాలను అమలు చేస్తూ.. ఆర్థికంగా ముందుకు సాగుతోంది. ఈ ధీమాతోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారతామనే కాన్ఫిడెన్స్ అందరిలోనూ కనిపిస్తోంది. అయితే, ఇటీవల, దీని కంటే ఉత్తమంగా.. 2031 నాటికి భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుందనీ.. 2060 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని రిజర్వ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది.
అమెరికా మొత్తం జనాభా కంటే ఎక్కువ జనరేషన్ Z
అంటే, చైనా, అమెరికాల స్థాయికి చేరుకుంటుంది. అందుకే, భారతదేశం ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌కు గమ్యస్థానంగా ఉందని అంటున్నారు. అందులోనూ, అమెరికా మొత్తం జనాభా కంటే ఎక్కువ జనరేషన్ Z ఉన్న దేశం.. అంటే, డిజిటల్ ప్రపంచంలో పుట్టి, పెరిగి.. సాంకేతికత, సోషల్ మీడియా, ఇన్‌స్టెంట్ కమ్యూనికేషన్‌లతో సహజీవనం చేస్తున్న యువత అనమాట. వీళ్లు ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచ వినియోగ రాజధానిగా మార్చారనే అభిప్రాయాలు వస్తున్నాయి.
1990లకు ముందు అందుబాటులో లేని భారత్
ప్రపంచంలో లిబరలైజేషన్‌కు ముందు.. అంటే, ప్రభుత్వం మార్కెట్ నియంత్రణలను తగ్గించి, వ్యాపారాన్ని, ఆర్థిక వ్యవస్థను మరింత స్వతంత్రంగా, పోటీతత్వంగా మార్చడానికి ముందు.. ఇండియా, పాశ్చాత్య కంపెనీలకు పెద్దగా అందుబాటులో లేదన్నది వాస్తవం. 1990లకు ముందు భారతదేశంలో తమ వస్తువులను పెట్టుబడిగా పెట్టడం, విక్రయించడం పాశ్చాత్య దేశాలకు చాలా కష్టంగా ఉండేది. కానీ 1990ల్లో వచ్చిన లిబరలైజేషన్ తర్వాత దశాబ్దాలుగా.. భారతదేశంలో వేగంగా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న కన్య్జూమర్ మార్కెట్‌గా మారింది.
ప్రైవేట్ వినియోగ వ్యయం 2025లో 7.6%
అందుకే ప్రపంచంపై ట్రంప్ టారీఫ్‌లతో వార్ చేస్తున్నప్పటికీ.. పాశ్చాత్య దేశాలు భారతదేశంతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడంలో వాణిజ్యం, హోటళ్ళు, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్‌లకు సంబంధించిన సేవల రంగాల్లో ఇప్పుడు భారత్ దూసుకుపోతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 6.4% విస్తరణ కొనసాగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే, ప్రైవేట్ సెక్టార్‌లో వినియోగ వ్యయం 2025లో 7.6% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే, ప్రపంచంలో మార్కెట్లు గల్లంతైనా.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుందని అనుకుంటున్నారు.
భారతదేశంలో ఒక భారీ కన్య్జూమర్ క్లాస్
గత కొన్ని దశాబ్దాలుగా, భారతదేశంలో ఒక భారీ కన్య్జూమర్ క్లాస్ ఏర్పడింది. ఇది 1991కి ముందు ఉన్న “రోటీ, కప్డా, మకాన్” లాంటి ప్రాథమిక అవసరాల కంటే ఎక్కువగా వినియోగ విధానాలతో విస్తరించింది. ఇలాంటి వర్గం భారత్‌లో ఏర్పడిన తర్వాత… అభివృద్ధి చెందిన దేశాలన్నీ.. తమ వస్తువులను తక్కువ సుంకాలకు విక్రయించడానికి భారతదేశాన్ని ఎంచుకోవడం ప్రారంభించాయి. వాస్తవానికి, భారతదేశాన్ని “వినియోగ మూలధనం”గా మార్చడానికి ప్రధాన కారణాలు.. ఇక్కడ అనూహ్యంగా పెరిగిన చిన్నకుటుంబాల సంస్కృతి. దానితో పాటు పెరిగిన ప్రపంచ శ్రామిక శక్తిలో భారతీయులు భాగం కావడం, ఇంకా అనేక ఇతర అంశాలు. నివేదికల ప్రకారం, భారతదేశంలో పొదుపు చేసే పద్ధతి.. ఇక్కడి ప్రజల్లో ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి దారితీసింది.
భారత్ పొదుపు సామర్థ్యం రాబోయే 25 ఏళ్లలో 10 రెట్లు అధికం
1997-2023 మధ్య భారతదేశంలో మొత్తం పొదుపులు $12 ట్రిలియన్లు అని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. అలాగే, భారతదేశ పొదుపు సామర్థ్యం రాబోయే 25 సంవత్సరాల్లో 10 రెట్లు పెరుగుతుందని అంచనా. ఇక, భారతదేశం ప్రపంచ ట్రేడ్ డీల్స్‌లో సక్సెక్ కావడానికి ఈ పరిస్థితి ఒక ట్రంప్ కార్డ్. భారతదేశంలో ఇప్పుడు అమెరికన్ బోర్బన్ విస్కీ నుండీ హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళు, బ్రిటిష్ లగ్జరీ కార్లను కొనుగోలు చేసే వ్యక్తుల సంఖ్య చాలా పెరిగింది. దీన్ని బట్టి, ఇప్పుడు భారత్ ప్రపంచదేశాలకు బంగారు బాతు గుడ్డులాంటిది.
2026లో జర్మనీ, జపాన్‌లను అధిగమించి భారత్
దేశంలో సంపన్న వర్గం పెరుగుతుండటం వల్ల.. భారతదేశం 2026లో జర్మనీ, జపాన్‌లను అధిగమించి.. అమెరికా, చైనా తర్వాత మూడవ అతిపెద్ద వినియోగదారు మార్కెట్‌గా మారుతుందని అంచనాలు ఉన్నాయి. పెట్టుబడి బ్యాంకు అయిన UBS గతేడాది ప్రచురించిన నివేదిక ప్రకారం.. “2023 నాటికి, భారతదేశంలో 40 మిలియన్ల మంది సంపన్న వర్గంలో ఉంటారు. అంటే, 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభాలో 4% వాటా జనాభాకు.. $10 వేల డాలర్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉంటుంది. ఇది రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని” UBS పేర్కొంది.
ఈ జనాభా 88 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా
అలాగే, 2028 నాటికి $10 వేల డాలర్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న జనాభా 88 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక, ఫిచ్ సొల్యూషన్ కంపెనీ అయిన BMI ఇటీవలి నివేదిక కూడా ఇదే అంచనాను వేసింది. భారతదేశ తలసరి గృహ వ్యయం.. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న ఆసియా ఆర్థిక వ్యవస్థల కంటే సంవత్సరానికి 7.8% ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
2050 నాటికి ప్రపంచ కన్య్జూమర్ పర్చేజింగ్..
ఇక ASEAN అంచనా ప్రకారం.. భారతదేశం అంతటా మొత్తం గృహ వ్యయం మధ్య అంతరం కూడా దాదాపు మూడు రెట్లు పెరుగుతుందని పేర్కొంది. ఇలాంటి నివేదికలు భారతదేశంలోని సంపన్న వర్గంలో భారీ పెరుగుదలను సూచిస్తున్న తరుణంలో.. ఇటీవలి కాలంలో ప్రీమియం ప్రొడక్ట్ కొనుగోలు చేస్తున్న వర్గం పెరిగింది. అందుకే, భారత్ కన్య్జూమర్ కింగ్‌గా మారింది. కొన్ని నివేదికల ప్రకారం, 2050 నాటికి ప్రపంచ కన్య్జూమర్ పర్చేజింగ్ పవర్ పారిటీలో భారత్ 16%కి ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య 1997లో 4% ఉండగా.. 2023లో 9% నుండి పెరుగుతూ వచ్చింది. ఇక, భారతదేశ వినియోగం దాని GDPలో 56% వాటాను కలిగి ఉందని అంచనా వేశారు. ఇది చాలా వేగవంతమైన వృద్ధి రేటుగా పరిగణిస్తున్నారు. ఇది 2034 నాటికి రెట్టింపు అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. అంటే, భారతదేశ కన్జ్యూమర్ కథ ఇటీవల పెరిగిన మధ్యతరగతిపై భారీగా ఆధారపడింది.
ఇండియన్ మార్కెట్ ఎదుగుదలకు ముఖ్యమైన సపోర్ట్ మధ్యతరగతే
ఇండియన్ మార్కెట్ ఎదుగుదలకు ముఖ్యమైన సపోర్ట్ మధ్యతరగతే. ఇటీవల కాలంలో ఈ మధ్యతరగతి జనాభా విపరీతంగా పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు బలం వచ్చింది. అయితే, దీనికి ప్రభుత్వాలు కూడా తోడ్పాటును అందించకపోలేదు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ట్యాక్స్ కోతలు కూడా ప్రజల వినియోగ శక్తిని పెంచాయనడంలో సందేహం లేదు. ఇలాంటి చర్యలతోనే, భారతదేశం ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సరసన నిలబడటానికి అడుగులేస్తోంది. అందులోనూ, భారీగా పెరుగుతున్న జెన్ జెడ్ జనాభా, సంపన్న వర్గాలు భారత్‌ను కన్య్జూమర్ మార్కెట్‌కు కింగ్‌ను చేస్తున్నాయి.
ఆకర్షిస్తున్న భారతదేశ మార్కెట్ పరిమాణం
ప్రపంచమంతా ట్రంప్ సుంకాల సమరాన్ని ఎదుర్కుంటున్న తరుణంలో.. అమెరికాతో సహా ప్రపంచదేశాన్నీ.. ముఖ్యంగా, వెస్ట్రన్ కంట్రీలు తమ ఉత్పత్తులకు తక్కువ సుంకాలను కోరుకుంటున్నాయి. అలాగే, భారత మార్కెట్లో పోటీతత్వం లేకుండా ఉండకూడదని అనుకుంటున్నాయి. కాబట్టి, పాశ్చాత్య మల్టీనేషనల్ దిగ్గజాలు.. ముఖ్యంగా, మాస్ కన్స్యూమర్ విభాగంలో ఉన్న సంస్థలు.. వాటి వాల్యూమ్ వృద్ధి కోసం భారత్ వైపు చూస్తున్నాయి. భారతదేశ మార్కెట్ పరిమాణం కూడా వీళ్లను ఆకర్షిస్తోంది.
ఖర్చులో రూ.13.3 లక్షల కోట్ల జోడింపు, GDP 1% పెరుగుదల
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న భారత్‌లో ఇంత పెద్ద మధ్యతరగతికి కొనుగోలు శక్తి ఉంటే దాన్ని పాశ్చత్య మార్కెట్లే కాదు ఎవ్వరూ వదులుకోలేరు. అంటే, అంతర్జాతీయ కంపెనీలతో పాటు దేశీయ కంపెనీలు కూడా దేశీయ స్థాయి మద్దతుతో ప్రపంచ పెద్ద కంపెనీలుగా సులభంగా ఎదుగుతాయని కూడా కొందరు భావిస్తున్నారు. అందులోనూ వినియోగ శక్తిని పెంచడానికి ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో పన్ను కోతలు కూడా ఉపయోగపడ్డాయి. ప్రభుత్వం ఇస్తున్న ఈ పన్ను కోతలతో ఎక్కువ ఖర్చు చేయడానికి ప్రజలు ఎగబడుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం, ఇది లక్ష కోట్లను మార్కెట్లోకి తీసుకొస్తుందనే అంచనా ఉంది. మొత్తంగా ఖర్చులో 13.3 లక్షల కోట్లను జోడిస్తుంది. ఇది భారతదేశ GDPని 1% పెంచడానికి సహాయపడుతుంది.
ఆదాయాలు పెరగడంతో వినియోగ శక్తికి కేంద్రంగా భారత్
ఇక, భారతదేశంలో దుస్తులు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ వంటి వ్యయాల్లో అవసరమైన ఖర్చులకు మించి వినియోగం జరుగుతుందనే నివేదికలు ఉన్నాయి. మధ్యతరగతి పెరుగుదలతో పాటు తిరిగి వినియోగించే ఆదాయాలు పెరగడం భారతదేశాన్ని వినియోగ శక్తికి కేంద్రంగా మారుస్తుంది. భారత జనాభాలో సగానికి పైగా మధ్యతరగతి ఉండగా… సాధారణ మధ్యతరగతి కూడా నాణ్యమైన విద్యకే మొగ్గు చూపుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో కాలేజ్-గ్రాడ్యుయేట్లతో ఖచ్చితంగా కొత్త ఆవిష్కరణలు, సంస్థల ఏర్పాటుతో పాటు భారీ స్థాయిలో ఇన్‌కమ్ జనరేషన్ జరుగుతుందని భావస్తున్నారు.
2047 నాటికి $103 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా
అందులోనూ, ఫ్లాగ్‌బేరర్స్‌గా ఉన్న జెన్ జెడ్.. భారతదేశంలో భారీగా ఉంది. అమెరికా మొత్తం జనాభా కంటే ఎక్కువ GenZ భారత్‌లో ఉంది. భారతదేశంలోని వీళ్ల అలవాట్లు ఖర్చును మరింత పెంచుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం, “2035 నాటికి, భారతదేశంలో ఖర్చు చేసే ప్రతి రెండవ రూపాయి జెన్ జెడెర్ నుండి వస్తుందని పేర్కొంది. అంటే, జెన్ జెడెర్ అతి పెద్ద ఖర్చుదారులుగా మారుతున్నారు. అయితే, వీళ్ల పొదుపు సామర్థ్యాన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదని నివేదికలు చెబుతున్నాయి. దీని ప్రకారం, రాబోయే 25 సంవత్సరాల్లో… భారత్ పొదుపు పది రెట్లు పెరిగి 2047 నాటికి $103 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా ఉంది.
2024 నాటికి భారతదేశ రిటైల్ వాణిజ్యంలో..
ప్రస్తుతం.. దేశంలో స్థానిక కిరాణా దుకాణాలకు వాణిజ్య ముప్పు ఉన్నప్పటికీ.. 2024 నాటికి భారతదేశ రిటైల్ వాణిజ్యంలో 92% చిన్న కిరాణా దుకాణాలపై ఆధారపడి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు, భారతీయ ఎంటర్‌టైన్మెంట్, మీడియా పరిశ్రమ 8.3% CAGR వద్ద వృద్ధి చెందుతుందని అంచనా ఉంది. అలాగే, 2028 నాటికి 3.65 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇది 4.6% ప్రపంచ రేటుని అధిగమిస్తుంది. దీనితో పాటు ఆన్‌లైన్ గేమింగ్, OTT కూడా అధిక వినియోగాన్ని చూస్తున్నాయి.
2028 నాటికి 93 వేల 753కి పెరుగుతుందని అంచనా
అందుకే, విదేశీ కంపెనీలకు భారత మార్కెట్ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మారింది. ఇక్కడున్న అధిక కొనుగోలు శక్తితో పాటు ధనవంతులు కూడా పెరుగుతున్నారు. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం, $10 మిలియన్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న భారతీయ అధిక-నికర-విలువ గల వ్యక్తుల సంఖ్య గతేడాది 6% పెరిగి.. 85 వేల 698కి చేరుకుంది. ఇక, 2023 సంవత్సరంలో ఇది 80 వేల 686గా ఉంది. ఈ సంఖ్య 2028 నాటికి 93 వేల 753కి పెరుగుతుందని అంచనా. ఇది భారతదేశంలో విస్తరిస్తున్న సంపదను తెలియజేస్తుంది.
భారత్ భారీ కన్జ్యూమర్ మార్కెట్‌గా ఉండటం వల్ల..
ప్రస్తుతం, భారతదేశం సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి తయారీకి ప్రాధాన్యత ఇచ్చే ఆర్థిక వ్యవస్థకు మారుతోంది. దీని వల్ల ఎగుమతిగా కూడా మారాలని చూస్తుంది. దీంతో భారత్‌లో తయారైన వస్తువుల కోసం ఇతర దేశాల మార్కెట్లకు కూడా ప్రాప్యత అవసరంగా మారింది. ఇక, ఇప్పటికే సంపన్న వినియోగదారుల జనాభాతో భారత్ భారీ కన్జ్యూమర్ మార్కెట్‌గా ఉండటం వల్ల అంతర్జాతీయ ట్రేడ్ డీల్స్‌లో పరపతి పెరుగుతోంది. ఇక, ఇక్కడ పెరుగుతున్న వినియోగదారుల మార్కెట్ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా వేగంగా కదులుతోంది. మార్కెట్ ఇలా పెరుగుతూ, మరింత సంపన్న వినియోగదారులను కూడా కలుపుకుంటూ పోతుంటే.. అభివృద్ధి చెందిన దేశాలుగా పోటీగా భారత్ చాలా వేగంగా పుంజుకుంటుంది. ఇది, భారత్ ఆర్థిక లక్ష్యాల అంచనాలు నిజం చేస్తుంది.