India vs Pakistan War: భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే చైనా ఎవరి వైపు ఉంటుంది? తాజాగా పహెల్గాం దాడిలో, దాడి తర్వాత కూడా బయట పడ్డ చైనా ఆనవాళ్లేంటి? డ్రాగన్ దేశం ఈ మొత్తం ఇష్యూలో ఎలాంటి వైఖరి అవలంబించేందుకు ప్రయత్నిస్తోంది. అసలు చైనా వాదనేంటి? రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య సాగిన సంభాషణ మనకు ఎలాంటి సంకేతాలను అందిస్తోంది.
భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే చైనా ఎవరి వైపు ఉంటుంది?
పాకిస్థాన్‌ని కూడా దాదాపు తమ సొంత భూభాగంగానే పరిగణిస్తోన్న చైనా.. భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే చైనా ఎవరి వైపు ఉంటుంది? ఆప్షన్ ఏ) చైనా, ఆప్షన్ బి) చైనా, ఆప్షన్ సీ కూడా సేమ్ అన్సర్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే చైనా ప్రస్తుతం ఎన్నేసి అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కుంటున్నా.. వైఖరిలో మార్పు వస్తుందని ఆశించడం పొరబాటే. ఇది మరోమారు తేట తెల్లమైందా? అంటే అదే నిజమని తెలుస్తోంది.
పాక్ విదేశాంగ మంత్రితో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి
చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యి, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాద దాడి తర్వాత జరుగుతున్న పరిణామ క్రమాలను చైనా నిశితంగా గమనిస్తోందని.. ఈ ఘటనపై నిష్షాక్షిక దర్యాప్తునకు మద్ధతు ఇస్తున్నట్టు చెప్పారు చైనా ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్.
పాకిస్థాన్ భద్రతా సమస్యలను అర్థం చేసుకుంటాం చైనా
ఇక్కడి వరకూ సాధారణంగానే జరిగిన ఈ సంభాషణ..పెద్దరికంగా కనిపించింది. ఆ తర్వాత సాగిన మాటల్లో అసలు విషయం బయట పడింది. అదేంటని చూస్తే… ఉగ్రవాద వ్యతిరేక చర్యలలో పాకిస్థాన్ కి ఎప్పుడూ మద్ధతు నిలుస్తుందని అన్నారు చైనా మంత్రి వాంగ్ యి. పాకిస్థాన్ కి దృఢమైన స్నేహితుడిగా ఉంటుందని.. చెప్పుకొచ్చారు చైనా విదేశాంగ మంత్రి. వ్యూహాత్మక భాగస్వామిగా.. పాకిస్థాన్ భద్రతా సమస్యలను అర్ధం చేసుకుంటుందని.. కామెంట్ చేశారు. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలను కాపాడ్డంలో తాము స్పష్టమైన మద్ధతునిస్తున్నట్టుగా చెప్పారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యి. ఇక్కడే అసలు విషయం బయట పడిపోయింది.
పరిస్థితి అదుపులోకి తేవడానికి ఇరుపక్షాలు చొరువ చూపాలన్న చైనా
పాక్ మంత్రితో ఇంకా ఎన్నో విషయాలను మాట్లాడారు చైనా మంత్రి. చైనా ప్రస్తుత పరిస్థితిని దాని పురోగతిని నిశితంగా పరిశీలిస్తోందనీ.. వీలైనంతగా నిష్పాక్షిక దర్యాప్తునకు మద్దతిస్తుందని కూడా అన్నారు వాంగ్. ఈ వివాదం విషయంలో భారత్, పాక్ కాస్త సంయమనం పాటించాలని చెప్పుకొచ్చారు చైనా మంత్రి. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఇరు పక్షాలు చొరవ చూపాలని కూడా కోరారు. ఇదెలాగుందంటే తానే గిల్లి జోలపాడినట్టు ఉందని భావిస్తున్నారు నిపుణులు.
ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతను చైనాకు వివరించిన పాక్
ఇక పాక్ ఉప ప్రధాని కూడా అయిన దార్ వర్షెన్ ఎలాగుందో చూస్తే.. ఉగ్రదాడి తర్వాత భారత్‌తో తలెత్తిన ఉద్రిక్తతను చైనాకు వివరించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇస్లామాబాద్ ఎప్పుడూ గట్టిగానే నిలబడుతుందని అన్నారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోడానికి సిద్ధంగానే ఉందని అన్నారు. పరిణితి చెందిన రీతిలో పరిస్థితి చక్కబెట్టే యత్నం పాక్ చేస్తుందని అన్నారు పాక్ మంత్రి. ప్రపంచ సమాజంతోనూ టచ్ లోనే ఉన్నామని వాంగ్‌తో అన్నారు దార్. భారత్ తమపై ఏకపక్ష చట్ట విరుద్ధ చర్యలు చేపడుతోందని.. నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని .. ఈ విషయంలోనే భారత్‌తో తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు పాక్ విదేశాంగ మంత్రి.
కొండంత బలాన్ని ఇచ్చిన ఆనందం వ్యక్తం చేసిన పాక్
ఇవన్నీ ఇలా ఉంటే ఈ ఇరువురి నేతల మధ్య సాగిన సంభాషణ ద్వారా బయట పడ్డ అసలు విషయం ఏంటని చూస్తే.. ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాక్ సార్వభౌమత్వానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా.. దాన్ని తిప్పి కొట్టేందుకు తాము సదా సిద్ధమని చైనా చెప్పడం. ఇక్కడే చైనా పాక్ సపోర్టర్‌గా డిక్లయిర్ చేసుకోవచ్చు. అందుకే పాక్ విదేశాంగ మంత్రి దార్, తమకింతటి మద్దతునిస్తోన్న చైనా మంత్రికి థాంక్స్ చెప్పారు పాక్ మంత్రి దార్. తమ వ్యూహాత్మక భాగస్వామి మాటలు కొండంత బలాన్ని ఇచ్చినట్టు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దాడిలో వాడిన సమాచార సాధనాలు కూడా చైనావే
ఇవన్నీ ఇలాగుంటే దాడి సమయంలో ఉగ్రవాదులు వాడిన సమాచార సాధనాలు కూడా చైనాకు చెందినవేని తెలుస్తోంది. ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉగ్రవాదులు చైనా యాప్ లు, ఇతర పరికరాలను వాడినట్టు చెబుతున్నాయి నిఘా వర్గాలు.
2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత్‌లో చైనా యాప్‌ల నిషేధం
2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ లో నిషేధించిన ఈ యాప్ ల ద్వారా ఉగ్రవాదులు సమాచారం ఇచ్చిపుచ్చుకున్నట్టు తెలుస్తోంది. పహెల్గాం దాడి జరిగిన రోజు.. ఆ ప్రాంతంలో ఒక చైనీస్ శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు గుర్తించాయి నిఘా వర్గాలు. ఈ రెండు విషయాలు ఎన్ఐఏ దర్యాప్తులో బయట పడ్డాయి.
పహెల్గాం దాడి ముందు వెనక చైనా పాత్ర స్పష్టం
వీటన్నిటిని బట్టీ చూస్తే.. పహెల్గాం దాడి ముందు వెనక చైనా పాత్ర స్పష్టంగా తెలిసిపోతోందని అంటున్నారు నిపుణులు. దాడి సమయంలో సాంకేతిక అంశాలతో సహకరించిన డ్రాగన్ దేశం.. దాడి తర్వాత కూడా తమ మద్ధతు కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. పైపెచ్చు నిష్పక్ష పాత విచారణ చేయాలని కోరుకోవడంతో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఇరు దేశాలూ సంయమనం పాటించాలంటూ భారత్‌కు నీతులు చెబుతోంది చైనా. దీన్నిబట్టీ చూస్తే డ్రాగన్ కంట్రీ నిజస్వరూపం ఏంటో ఇట్టే చెప్పొచ్చని అంటున్నారు విదేశాంగ నిపుణులు.
చైనా-పాక్ ఫోన్ సంభాషణపై ఇంకా స్పందించని భారత్
అయితే ఈ ఇరు దేశాల మంత్రుల ఫోన్ సంభాషణపై భారత్ ఇంత వరకూ స్పందించలేదు. బ్రిటన్ మంత్రి డేవిడ్ లామీతో మాట్లాడి పహెల్గాం దాడిలో బయట పడ్డ సీమాంతర ఉగ్రవాదం గురించి వివరించారు జైశంకర్. అంతే కాదు తన ఎక్స్ పోస్టు ద్వారా ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ప్రాధాన్యతను తెలియ చేశారు. పహెల్గాం దాడి తర్వాత కొన్నాళ్లుగా జైశంకర్, మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సహా ఎందరో ప్రపంచ నాయకులతో మాట్లాడారు. వీరంతా భారత్ వైపే ఉంటూ.. సంఘీభావం తెలియ చేశారు.
ఒక్క చైనా మాత్రం పాక్‌పై ఈగ వాలనివ్వమంటోన్న సీన్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పట్ల తమ వైఖరి స్పష్టం చేస్తుంటే.. ఒక్క చైనా మాత్రం.. పాక్ పై ఈగ వాలనియ్యమని అంటోంది. పాకిస్థాన్ ని కూడా దాదాపు తమ సొంత భూభాగం మాదిరిగానే లెక్కిస్తోంది. ఇప్పటికే రష్యా వ్యతిరేక పోరులో భాగస్వాములమైన తాము తీవ్రంగా నష్టపోయామంటోన్న పాకిస్థాన్.. ప్రపంచ వ్యతిరేకతను ఎదుర్కుంటూన్న చైనాతో అంటకాగడం ఎంత వరకూ కరెక్టు? ఈ దిశగా పాకిస్థాన్ ఎందుకు ఆలోచించడం లేదు? పాకిస్థాన్ కి అలాంటి కాంట్ బట్ పొజిషన్ ఎందుకొచ్చినట్టు? ఇది పాకిస్థాన్ కు వరమా శాపమా? అన్నదిపుడు చర్చనీయాంశమైంది.
Also Read: ప్రసంగంలో పసలేదు.! కేసీఆర్ చేసిన దిశానిర్దేశమేంటి?
భారత్ పాక్ యుద్ధం ఖాయమైతే.. పాకిస్థాన్ కి సరిపడా ఆయుధ సంపత్తిని అందించడానికి కూడా చైనా సిద్ధమైందా? అంటే అందుకు కూడా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే మన ఆయుధాల్లో డెబ్భై శాతం రష్యా, ఆపై ఫ్రాన్స్ కి సబంధించినవి ఉన్నాయి. రష్యా ఫ్రాన్స్ ఈ దిశగా మనకు మద్ధతు కూడా పలికాయి కూడా. ఇంతే స్థాయిలో చైనా నుంచి పాక్ కి ఆయుధ మద్ధతునందించడానికి చైనా ముందుకు వచ్చిందా? అందుకు తగిన ఆధారాలేంటి?
పాక్‌కి చైనా PL-15 క్షినణులు?
భారత్‌తో సత్సంబంధాలూ చైనాకు అవసరమేభారత్ నంచి రాఫెల్ ముప్పును ఎదుర్కోడానికి పాకిస్థాన్ కి చైనా PL-15 క్షిపణులను ఎక్స్‌ప్రెస్ డెలివరీ చేయడానికి రెడీ. ఇప్పటి వరకూ ఈ వార్త కన్ఫం కాకున్నా.. ఇందుకు ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న పరిస్థితుల్లో.. పాకిస్థాన్ వైమానిక దళానికి, చైనా అధునాతన PL-15 మిస్సైళ్లను అందించడానికి అవకాశమున్నట్టు చెబుతున్నాయి కొన్ని నివేదికలు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్.. PL-15 కి సంబధించిన చిత్రాలను విడుదల చేసింది. దీన్నిబట్ట చూస్తే పాకిస్థాన్‌కి చైనా ఎంత మేర సాయం చేయడానికి సిద్ధపడిందో చెప్పొచ్చు.
యుద్ధం వస్తే.. బీజింగ్‌టు ఇస్లామాబాద్.. ఆయుధ సరఫరా
భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగితే బీజింగ్ టు ఇస్లామాబాద్.. ఆయుధ సరఫరా మరింత వేగంగా సాగేలా తెలుస్తోంది. చైనా అధునాతన మిస్సైళ్లయిన ఇవి.. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కి ఎంతో ప్రయోజనకరంగా మారే అవకాశముంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను దూరం నుంచే పాకిస్తాన్ విమానాలు ధీటుగా ఎదుర్కోగలవు. ఈ క్షిపణుల విషయంలో అధికారిక ప్రకటనలు ఇంకా విడుదల కాలేదు కానీ.. ఇందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌కి భారత్.. జీలం జలక్
ఇక సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు వ్యవహారం. ఇప్పటికే ఈ అంశంలో భారత్ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌కి జీలం జలక్ ఇచ్చింది. పీవోకే రాజధాని ముజఫరాబాద్‌కి దగ్గర ఒక్కసారిగా నది వరద పెరిగింది. దీంతో అక్కడ నీటి అత్యయిక పరిస్థితి ప్రకటించారు. ఇది అంతర్జాతీయ నీటి వినియోగ నిబంధనలకు విరుద్ధం అంటుంది పాక్. ఇది శాంపిల్ మాత్రమే అసలు సినిమా ముందు ఉందంటోది భారత్. ఈ విషయంలో భారత్ పాక్ ని ఇబ్బంది పెడితే.. చైనా నుంచి కూడా భారత్ కి సరిగ్గా ఇలాంటి ఇరకాటమే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
పాక్‌కి సిందూ నదీ జాలాలు ఎలాంటివో.. భారత్‌కి బ్రహ్మపుత్రా నదీ జలాలు అలాంటివి
పాక్‌కి భారత్ సింధూ జలాల జర్క్ ఇస్తే.. భారత్ కి చైనా నుంచి మరో ముప్పు ముంచుకొచ్చేటట్టు తెలుస్తోంది. అదేంటని చూస్తే బ్రహ్మపుత్రా నది. పాక్ కి సిందూ నదీ జలాలు ఎలాంటివో.. భారత్‌కి బ్రహ్మపుత్రా నదీ జలాలు కూడా సరిగ్గా అలాంటివే. ఈ నది విషయంలో భారత్ చైనా మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవు. అయితే భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల అతిపెద్ద నీటి వనరు బ్రహ్మపుత్రా నది. ఈ నది మీద ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆనకట్టు నిర్మిస్తోంది చైనా. భారత్ ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా డ్రాగన్ కంట్రీ ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. పాక్ మీద భారత్ జల ఖడ్గం ప్రయోగిస్తే.. చైనా సైతం బ్రహ్మపుత్ర అస్త్రం ప్రయోగించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. బ్రహ్మపుత్రా నదిపై సర్వ హక్కులూ తమవేనని చైనా అడ్డుకట్ట వేస్తే.. భారత్ లోని పలు ప్రాంతాలు నీటి కటకట ఎదుర్కునే అవకాశాలు లేక పోలేదు.
చైనా పాక్ దేశాల మధ్య గల ఎకనామిక్ కారిడారే కారణం
చైనా పాకిస్థాన్‌ని అంతగా వెనకేసుకుని రావడానికి గల రీజన్లేంటని చూస్తే.. ఈ రెండు దేశాల మధ్య గల ఎకనామిక్ కారిడార్. గత కొంత కాలం నుంచి చైనా పాకిస్థాన్ మౌలిక సదుపాయాల రంగంలో, ఇంధన రంగంలో అతి పెద్ద పెట్టుబడిదారుగా ఉంటోంది. అందులో CPEC అత్యంత కీలకం. దీని కారణంగా చైనా పాక్ సంబంధాలు ప్రస్తుతం పీక్ స్టేజ్‌కి చేరాయి. అందుకే చైనా భారత్‌ను కట్టడి చేయడానికి వీలైనన్ని ప్రయత్నాలు సాగిస్తూ వస్తోంది. పైకి తాము తటస్తంగా ఉన్నామని చెబుతూనే.. లోలోపల పాకిస్థాన్ కు సహకరిస్తూ వస్తోంది.
భారత్‌తో సత్సంబంధాలూ చైనాకు అవసరమే
అయితే చైనా పాకిస్తాన్‌కి ఎంత మద్ధతు ఇచ్చినా.. భారత దేశంతో సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. ఇరు పక్షాలతో సమాన దూరం పాటించాల్సిన అవసరం చైనాకు సో ఇంపార్టెంట్. ఎందుకంటే భారత్ మార్కెట్ చైనాకు చాలా చాలా అవసరం. ఈ దిశగా ఆలోచిస్తే.. చైనా భారత్‌ను తోసి రాజనడానికి లేదని కూడా అంటారు.
ఏది ఏమైనా పాకిస్థాన్ కష్టకాలంలో ఉంటే చైనా చూస్తూ ఊరుకోదనడానికి ఇప్పటికే ఎన్నో సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. పహెల్గాం దాడిలో ఉగ్రవాదులు చైనా సమాచార సాధనాలను వాడారంటే ఇరు దేశాల మధ్య ఎంతటి సత్సంబంధాలున్నాయో ఊహించుకోవచ్చు. మనం నిషేధించిన యాప్‌లను వాడి సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం వెనక చైనా కుట్ర కూడా ఉందనే భావించాలి. సరిగ్గా అదే సమయంలో తమకేం తెలీదంటూనే.. చాటుమాటుగా ఆయుధాల సరఫరా చేయడానికి కూడా సిద్ధమేనంటోంది చైనా. వీటన్నిటినీ సునితంగా గమనిస్తూన్న భారత్.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బాధిత దేశాలన్నిటినీ ఏకం చేస్తోంది. పాక్ వైపు ఒక్క చైనా మాత్రమే ఉంటే.. ప్రపంచ మంతా భారత్ వైపు ఉన్నట్టు కనపిస్తోంది.