BigTV English

KCR Meeting Failed: ప్రసంగంలో పసలేదు.! కేసీఆర్ చేసిన దిశానిర్దేశమేంటి?

KCR Meeting Failed: ప్రసంగంలో పసలేదు.! కేసీఆర్ చేసిన దిశానిర్దేశమేంటి?

KCR Meeting Failed: బీఆర్ఎస్ అంచనాలకు తగ్గట్లు జనం రాలేదంటున్నారు! వాళ్లు అనుకున్నంత స్థాయిలో పొలిటికల్ మైలేజ్ దక్కలేదంటున్నారు! గులాబీ దళపతి కేసీఆర్ స్పీచ్ ముగిసేదాకా చాలా మంది జనం అక్కడ లేనేలేరని చెబుతున్నారు. కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్లు.. పాత చింతకాయ పచ్చడి లెక్క కేసీఆర్ ప్రసంగం సాగిందనే మాటలు.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయ్. 25 ఏళ్ల పార్టీ పండుగకు గుర్తుగా.. వరంగల్‌లో నిర్వహించిన రజతోత్సవ సభ మాత్రమే కనిపించింది తప్ప.. కేసీఆర్ సభ రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపలేదనే మాటలు వినిపిస్తున్నాయ్. బీఆర్ఎస్ నేతల ఉత్సాహం తప్ప.. పార్టీకి ఎలాంటి ఊపు రాలేదనే చర్చ జోరుగా సాగుతోంది. వరంగల్ సభతో కేసీఆర్ సాధించింది.. బీఆర్ఎస్‌కు ఒరిగిందేమీ లేదనే మాటలు ఎందుకొస్తున్నాయ్?


బీఆర్ఎస్‌కు ఊపు తెచ్చే ప్రయత్నమేనని చర్చ

వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని చూశాక.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయట. ఓరుగల్లు సభ బీఆర్ఎస్‌కు ఊపు తెచ్చే ప్రయత్నంగానే విజయవంతమైంది తప్ప.. పార్టీని, క్యాడర్‌ని రాజకీయంగా యాక్షన్ మోడ్‌లోకి తెచ్చే విషయంలో సక్సెస్ కాలేకపోయిందనే చర్చ జోరుగా సాగుతోంది. కేసీఆర్ ప్రసంగం.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, గత బీఆర్ఎస్ పాలనలో విజయాలను హైలైట్ చేయడం కోసమే అన్నట్లుగా సాగింది తప్ప.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేసినట్లుగా అనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. చాలా రోజుల తర్వాత ఫామ్ హౌజ్ నుంచి అడుగు బయటపెట్టిన కేసీఆర్.. వరంగల్ సభలో ఏం మాట్లాడతారు? పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? కేసీఆర్ ఏం మాట్లాడతారు? అని ఎంతో ఊహించుకుంటే.. ఉసూరుమనిపించారనే టాక్ వినిపిస్తోంది. సభకు ముందు బీఆర్ఎస్ క్రియేట్ చేసిన హైప్‌కి, వరంగల్ సభలో కేసీఆర్ స్పీచ్‌కి అస్సలు సంబంధం లేదంటున్నారు.


ఎన్నికల తర్వాత నిరాశలో కూరుకుపోయిన బీఆర్‌ఎస్

వాస్తవానికి.. అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత 6 నెలలకు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నిరాశలో కూరుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లకే పరిమితమవడం.. పార్టీని బాగా దెబ్బకొట్టింది. ఈ పరిస్థితుల్లో.. వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభతో పార్టీ కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపేందుకు ప్రయత్నించారు కేసీఆర్. ఈ సభతో బీఆర్ఎస్ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉందనే సంకేతం ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నించారు. కానీ.. అది నెరవేరలేదనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోందట. 10 లక్షల మందికి పైగా జనం వస్తారని ఆ పార్టీ నేతలు చెప్పిన మాటలకు, బీఆర్ఎస్ చేసిన ప్రచారానికి.. వరంగల్ సభకు వచ్చిన జనానికి అస్సలు పొంతనే లేదంటున్నాయ్ ప్రత్యర్థి పార్టీలు.

ఇక ముందు కేసీఆర్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది?

ఇదంతా పక్కనబెడితే.. ఇక ముందు కేసీఆర్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇకపై.. దూకుడుగా వ్యవహరిస్తారా? అసెంబ్లీకి వచ్చి అడగాల్సినవి అడిగి.. కడిగి పారేస్తారా? కార్యకర్తలను ఎలా యాక్టివ్ మోడ్‌లోకి తీసుకొస్తారు? నాయకులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? అని అంతా ఎదురుచూశారు. కానీ.. కేసీఆర్ మాత్రం సింపుల్‌గా తేల్చేశారనే ప్రచారం సాగుతోంది. ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకోవాలని, పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చి.. స్టేజ్ దిగి వెళ్లిపోవడం చూసి.. అంతా ఆశ్చర్యపోయారు.

కార్యకర్తలందరినీ ఒక చోట చేర్చింది.. ఇది చెప్పడానికేనా?

లక్షలాది మంది కార్యకర్తలను ఒక చోట చేర్చింది.. ఇది చెప్పడానికేనా? అని మాట్లాడుకుంటున్నారు. కనీసం.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీఆర్ఎస్ శ్రేణులు ఎలా పనిచేయాలి? ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేస్తారనుకుంటే.. దానిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పట్ల.. ఆ పార్టీ కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారట.

పాత ముచ్చట్లు, చంద్రబాబుపై విమర్శలు

కేసీఆర్ ప్రసంగం కూడా పస లేకుండా సాగిందనే మాటలు వినిపిస్తున్నాయ్. వరంగల్ సభను తెలంగాణ ఉద్యమంతో ముడిపెట్టి.. పాత ముచ్చట్లే మళ్లీ చెప్పి.. చంద్రబాబుపై కొన్ని విమర్శలు విసిరి.. బీజేపీని గట్టిగా మందలిస్తే ఏమవుతుందోనని ఫీలై.. అధికార కాంగ్రెస్ పార్టీపై కాస్త ఘాటు విమర్శలు చేసి.. తమ హయాంలో చేసిన పనులనే పదే పదే హైలెట్ చేసి వెళ్లిపోయారనే వాదన.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అంతే తప్ప.. ప్రజల్లో మళ్లీ బీఆర్ఎస్‌పై నమ్మకం కలిగించేలా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.

కాంగ్రెస్‌పై అసంతృప్తిని రేకెత్తించేందుకు కేసీఆర్ ప్రయత్నం

తమ విమర్శలతో.. తెలంగాణ ప్రజల్లో అధికార కాంగ్రెస్‌పై అసంతృప్తిని రేకెత్తించేందుకు మాత్రమే కేసీఆర్ ప్రయత్నించారనేది.. కొందరు రాజకీయ విశ్లేషకుల మాట. చాలా రోజుల తర్వాత వరంగల్‌లో బీఆర్ఎస్ సభ పెడుతోందంటే.. కేసీఆర్ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా ఉంటుందనుకున్నారట. కానీ.. అది బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాబట్టి.. పార్టీ అధినేతగా తాను ఓ నాలుగు ముక్కలు మాట్లాడాలి కాబట్టి.. తనవంతుగా ఓ నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్లిపోయారనే చర్చ సాగుతోంది.

లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని బీఆర్‌ఎస్

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం, అనేక మంది నాయకులు కాంగ్రెస్, బీజేపీలో చేరడంతో.. బీఆర్ఎస్ బలహీనమైందని ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేశాయ్. ఈ అభిప్రాయాన్ని జనంలో నుంచి తీసేందుకు.. ప్రత్యర్థుల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు.. బీఆర్ఎస్ రాజకీయంగా ఇంకా చురుగ్గానే ఉందని చాటే ప్రయత్నం చేశారు కేసీఆర్. కానీ.. కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం కేసీఆర్ వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్లు ఇస్తుండటంతో.. రాజకీయ వర్గాల్లో మరో కొత్త చర్చ మొదలైంది. ఓటమి తర్వాత కేసీఆర్ రాజకీయంగా బలహీనపడ్డారని.. బీఆర్ఎస్ కోలుకోవడం కష్టమేనని చెప్పడం కూడా చర్చకు దారితీస్తోంది. తమ రాజకీయ ఉనికిని పునరుద్ధరించేందుకు.. కేసీఆర్ చేసిన చివరి ప్రయత్నమే వరంగల్ సభ అని చర్చించుకుంటున్నారు.

Also Read: లీడర్లు దూరం.! మనోహర్ భవిష్యత్ ఏంటి?

రాజకీయంగా బీఆర్ఎస్ మళ్లీ బలపడేందుకు ఇదొక అడుగు

రాజకీయంగా బీఆర్ఎస్ మళ్లీ బలపడేందుకు.. ఇదొక అడుగుగా చూస్తున్నారు. కానీ.. ఇప్పటికే కేసీఆర్ కుటుంబంపై ఉన్న రాజకీయ ఆరోపణలు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ లాంటి వివాదాలు.. ఇప్పటికీ పార్టీ ఇమేజ్‌పై ప్రభావం చూపుతున్నాయట. వరంగల్ సభని.. బీఆర్ఎస్ రాజకీయ పునరాగమనానికి ఓ ప్రారంభంగా చెబుతున్నప్పటికీ.. కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే ఒడిదొడుకులు, పార్టీలో అంతర్గత సమస్యలు.. బీఆర్ఎస్‌కు సవాళ్లుగా మారతాయనే చర్చ సాగుతోంది. వీటన్నింటిని దాటుకొని.. బీఆర్ఎస్ మళ్లీ రాజకీయ శక్తిగా అవతరిస్తుందా? లేదా? అన్నదే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×