Bangladesh Violence: బంగ్లాదేశ్, భారత్ మధ్య గ్యాప్ రోజు రోజుకూ ముదురుతోంది. బంగ్లాలో భారతీయులను, ముఖ్యంగా హిందూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఘోరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ హిందువుపై దాడి జరుగుతుందో.. ఏ హిందూ నాయకుడు అరెస్ట్ అవుతారో అనే ఆందోళన పెరుగుతోంది. దీనితో, అటు బంగ్లాదేశ్‌లోనే కాక భారత్‌లోనూ నిరసనలు పెరుగుతున్నాయి. త్రిపురలో బంగ్లాదేశీయులకు భోజనం, వైద్య సేవలు బంద్ అంటూ భారీ ర్యాలీలు జరుగుతున్నాయ్. మరోవైపు, బంగ్లా-భారత్‌తో సంబంధాల్లో మార్పు వచ్చిందనీ.. తిరిగి బలోపేతం చేస్తామంటూ రెండు దేశాలూ వ్యాఖ్యానిస్తున్నాయి. ఇంతకీ, బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది..? ఈ హేట్రేట్ ఎలా పెరుగుతూ వస్తోంది..? ఇది ఎటు దారితీయబోతోంది..?
బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా పెరుగుతున్న దాడులు
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపధ్యంలో రెండు దేశాల్లోనూ ఆందోళనలు పెరుగుతున్నాయ్. ఇటీవల, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన గురువును పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితుల మరింత దారుణంగా మారాయి. తర్వాత మరో హిందూ గురువును కూడా అరెస్ట్ చేసారు. దీనితో, బంగ్లాదేశ్‌లో, అసలు, తిలకం, కాషాయం వాడొద్దంటూ ఇస్కాన్ టెంపుల్, అక్కడి హిందువులకు సూచించే పరిస్థితి వచ్చింది.
ఇటీవల, భారత ఏజెంట్ అంటూ ఒక జర్నలిస్ట్‌పై కూడా దాడి జరిగింది. బంగ్లాదేశ్‌కు వెళ్లే భారతీయ పర్యాటకులపై దాడులు జరుగుతున్నాయి. ఇటు, భారత్‌లో కూడా ఇలాంటి హైట్రేట్ కొనసాగుతోంది. త్రిపురలో బంగ్లాదేశానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. త్రిపురలో బంగ్లాదేశీయులకు భోజనం, వైద్య సేవలు నిరాకరించాలని నిరసనకారులు పిలునిచ్చారు. అగర్తలలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఇక, త్రిపురలో జరుగుతున్న బంగ్లా వ్యతిరేక కార్యక్రమాలు వెస్ట్ బెంగాల్‌లో కూడా మొదలైతే..? పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుందనడంలో సందేహం లేదు.
అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న బంగ్లా
బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం దేశంలో హిందువులు, భారతీయుల భద్రత గురించి అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ, వారిపై దాడులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో, రాజధాని ఢాకాలో భారత పర్యాటకుడు సయన్ ఘోష్‌ను స్థానిక ప్రజలు దారుణంగా కొట్టారు. దాడి అనంతరం తాను ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు శ్యాంపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటే.. పోలీసులు చర్య తీసుకోకపోగా.. బంగ్లాదేశ్‌కు రావడానికి గల కారణాలేంటంటూ ప్రశ్నించడం ప్రారంభించారని భాదితుడు ఘోష్ ఆరోపించారు.
ఆ తర్వాత అగర్తల నుంచి కోల్‌కతా వెళ్తున్న బస్సుపై కూడా దాడి ఘటన వెలుగు చూసింది. బంగ్లాదేశ్‌లోని బ్రాహ్మణ బారియా జిల్లాలో అగర్తల నుంచి కోల్‌కతా వెళ్తున్న బస్సుపై దాడి జరిగింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే, భారతీయులకు బంగ్లాదేశ్ ఏ మాత్రం సురక్షితం కాదనే సందేహాలు వస్తున్నాయి.
నవంబర్ 30న హిందూ మహిళా జర్నలిస్టుపై దాడి
నవంబర్ 30న ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టుపై బంగ్లాదేశ్‌లో దాడి జరిగింది. బంగ్లాదేశ్‌ను భారత్‌లో భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తూ బంగ్లాదేశ్ సీనియర్ జర్నలిస్టు మున్నీ సాహాను అల్లరి గుంపు ఢాకాలో చుట్టుముట్టింది. సాహా ఒక భారతీయ ఏజెంట్ అనీ.. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారంటూ ఆమెను చుట్టుముట్టారు. ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి చేసేందుకు ప్రయత్నించారు.
చుట్టుపక్కల జనాలు మహిళా జర్నలిస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత, ఆమెను పోలీసులు తేజ్ గావ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను అరెస్టు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆమెను అరెస్టు చేయలేదని తర్వాతి రోజు బంగ్లాదేశ్ పోలీసులు వివరణ ఇచ్చారు. కాగా సాహాను వేధించిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైరల్‌గా మారిన ఈ దాడి వీడియోలో.. 57 మంది ప్రాణాలు బలిగొన్న బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు సంబధించి ఆమె ప్రజలను తప్పుదారి పట్టించిదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భారత జాతీయ జెండాను తొక్కుకుంటూ వెళ్లిన బంగ్లా విద్యార్థులు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, భారతదేశానికి రాజకీయ శరణార్థిగా వచ్చినప్పటి నుండీ ఆ దేశంలో భారత వ్యతిరేకత బహిర్గతమయ్యింది. ఆమెను భారత్, శరణార్థిగా కాకుండా, రాజకీయ శరణార్థిగానే ప్రకటించినా బంగ్లాదేశ్ నేతలు మాత్రం.. ఆమెను తమ దేశానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అక్కడ కొన్ని వర్గాలను రెచ్చగొట్టి, భారత్‌కి వ్యతిరేకంగా నిరసనలు పురిగొల్పడాన్ని తరచూ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్‌ను దేశ ద్రోహిగా ప్రకటించడం దగ్గర నుండీ ఈ వివాదాలు మరింత తీవ్రం అయ్యాయి. ఈ క్రమంలోనే… బంగ్లాదేశ్ విద్యార్థులు.. బంగ్లాదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోకి వెళ్తూ.. ఆ సంస్థ గేటు దగ్గర నేలపై పరచి ఉన్న భారత జాతీయ జెండాను తొక్కుకుంటూ వెళ్తున్న దృశ్యం నవంబర్ 27న ఎక్స్‌లో ట్వీట్ చేయగా… సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read: కొలిక్కి వచ్చిన చర్చలు.. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్..
భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని పిటీషన్
మరోవైపు, భారతదేశానికి చెందిన టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని కోరుతూ అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. బంగ్లాదేశ్‌లోని సుప్రీంకోర్టు న్యాయవాది ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.
భారత టీవీ ఛానళ్లు బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని సదరు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ దుష్ప్రచారం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని వెల్లడించారు. ఈ పిటిషన్‌పై బంగ్లాదేశ్ హైకోర్టు వచ్చే వారం విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య భారత్‌లో కూడా బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు రేగాయి. బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, అక్కడి హిందువులపై జరుగుతున్న దాడులపై త్రిపురలో నిరసన ర్యాలీ చేపట్టారు.
ఆల్ త్రిపుర హోటల్ & రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్
త్రిపుర రాజధాని అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషన్ వద్ద డిసెంబర్ 1న ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది నిరసనకారులు బంగ్లాదేశ్ ఎంబసీ ప్రాంగణంలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులతో పాటు.. భారతీయ జెండాను అగౌరవ పరిచినందుకు బంగ్లాదేశ్ నుండి వచ్చే అతిథులకు సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు ఆల్ త్రిపుర హోటల్ & రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది.
అలాగే, బంగ్లాదేశ్‌కు చెందిన రోగులకు ఇకపై వైద్య సేవలు అందించబోమని అగర్తలాలోని ILS మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటించింది. బంగ్లాదేశ్ పౌరులకు సేవలను నిలిపివేయాలని అభ్యర్థిస్తూ స్థానిక సంస్థలు చేసిన ర్యాలీ తర్వాత ఈ ప్రకటన వచ్చింది. కోల్‌కతాలోని మానిక్‌టాలా ప్రాంతంలోని JN రే అనే మరో హాస్పిటల్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. బంగ్లాదేశ్ రోగులకు చికిత్సను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
దౌత్య కార్యాలయం చుట్టుముట్టడాన్ని ఖండించిన భారత్
అయితే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ త్రిపురలో బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఘటనను ఖండించింది. అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషన్ ప్రాంగణంలో భద్రతను ఉల్లంఘించడం చాలా విచారకరమని తెలిపింది. దౌత్య, కాన్సులర్ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యంగా చేసుకోకూడదని పేర్కొంది. ఈ సంఘటన నేపథ్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర డిప్యూటీ, అసిస్టెంట్ హైకమిషన్ల వద్ద భద్రతను పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
బంగ్లాదేశ్‌లో హిందువుల లక్ష్యంగా జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఆ దేశంలో మైనారిటీలపై పెరుగుతున్న హింసాత్మక సంఘటనలను కేవలం మీడియా అతిశయోక్తిగా అని కొట్టి పారేయలేమని కూడా భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇక, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. భారత్-బంగ్లాదేశ్ మధ్య గ్యాప్ అతకలేనంతగా మారుతుందేమో అనే సందేహాలు వస్తున్నయ్.