Elon Musk Tesla Pay| ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు బిలియనీర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్‌కు అమెరికాలోని డెలావేర్ కోర్టు షాకిచ్చింది. టెస్లా కంపెనీ సిఈఓగా ఆయనకు అందుతున్న భారీ వేతనం చాలా ఎక్కువని అంత ఇవ్వడం కుదరదని తీర్పు వెలువరించింది. అయితే కోర్టు ఇదే తీర్పు జనవరి 2024లో ఇచ్చింది. కానీ దానిపై మరోసారి రివ్యూ చేయాలని టెస్లా కంపెనీ పిటీషన్ వేయగా.. కుదరదని స్పష్టం చేసింది.
ఎలన్ మస్క్‌కు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్, అంతరిక్షంలో రాకెట్ లాంచ్ చేసే స్పేస్ ఎక్స్ సంస్థ, ప్రముఖ ఎలెక్ట్రిక్ వాహానాల కంపెనీ టెస్లాలో వాటాలున్నాయి. ఈ కంపెనీలకు ఆయన సీఈఓగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో టెస్లా కంపెనీలో ఆయన సిఈఓ పదవిలో ఉంటూ వార్షికంగా 56 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.48 లక్షల కోట్లు ) వేతనం పొందుతున్నారు. ఆయనకు అంత వేతనం ఇవ్వడం చాలా ఎక్కువని టెస్లా కంపెనీ షేర్ హోల్డర్లలో ఒకరు రిచర్డ్ టోర్నెట్టా 2018లో డెలావేర్ రాష్ట్రంలోని చాన్సెరీ కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ విచారణ సుదీర్ఘకాలం సాగింది. 2.6 బిలియన్ డాలర్ల వేతనం పొందే మస్క్ అనతికాలంలో తన వేతనం 56 బిలియన్ డాలర్లుకు పెంచుకున్నారని.. టెస్లా కంపెనీ బోర్డు డైరెక్టర్లు కూడా మస్క్ చెప్పుచేతల్లో ఉన్నారని పిటీషన్ లో రిచర్డ్ పేర్కొన్నారు.
Also Read: కొరియాలో సైనిక పరిపాలన.. కూలిపోవడానికి అడుగుదూరంలో ప్రభుత్వం
ఈ క్రమంలో 2024 జనవరిలో డెలవేర్ చాన్సెరీ కోర్టు మహిళా న్యాయమూర్తి జడ్డి కేథలీన్ జె మెక్‌కార్మిక్ టెస్లా కంపెనీ సీఈఓకు పరిమితిలకు మించి వేతనం అందుతోందని.. ఆయన వేతనం తగ్గించాలని తీర్పు చెప్పారు. ఆ సమయంలో కోర్టు తీర్పుని ఎలస్ మస్క్ తీవ్రంగా విమర్శించారు. తన కంపెనీ కార్యకలాపాలను డెలావేర్ రాష్ట్రంలో చేయనని.. ఇతర రాష్టాల్లో అభివృద్ధి చేసుకుంటానని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. కానీ బోర్డు సభ్యులు ఆయన వేతనం అంశంపై కంపెనీ షేర్ హోల్డర్ల మీటింగ్ లో ఓటు ప్రతిపాదించారు. షేర్ హోల్డర్లందరూ మస్క్ మద్దతు తెలుపుతూ ప్రతిపాదనను ఆమోదించారు.
ఆ తరువాత ఇటీవల డెలావేర్ కోర్టులో జనవరిలో ఇచ్చిన తీర్పునకు రివ్యూ చేయాల్సిందిగా షేర్ హోల్డర్ల ఆమోదాన్ని ఆధారంగా ప్రవేశపెట్టారు. అయితే ఈ సారి కూడా డెలావేర్ కోర్టులో జడ్జి కేథలీన్ జె మెక్‌కార్మిక్ మస్క్ వేతనం చాలా ఎక్కువంటూ గతంలో తాను ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉన్నానని డిసెంబర్ 3, 2024న చెప్పారు. ఈ తీర్పు చెప్పే సమయానికి టెస్లా కంపెనీలో 13 శాతం వాటా ఉన్న సిఈఓ ఎలన్ మస్క్ తన వద్ద ఉన్న కంపెనీ షేర్ల విలువ భారీగా పెరగడంతో ఆయన వేతనం 101 బిలియన్ డాలర్లకు చేరిందని న్యూ యార్క్ టైమ్స్ మీడియా తెలిపింది. డెలావేర్ కోర్టు వెలువరించిన 101 పేజీల తీర్పులో పిటీషన్ దారుడు రిచర్డ్ టోర్నెట్టా లాయర్లకు టెస్లా కంపెనీ 345 మిలియన్ డాలర్లు ఫీజు చెల్లించాలని కూడా ఉంది. ఇంత పెద్ద మొత్తం లాయర్ ఫీజుగా ఇవ్వడం అమెరికా షేర్ హోల్డర్ కేసుల్లో ఇదే తొలిసారి
డెలావేర్ కోర్టు తీర్పుని టెస్లా కంపెనీ సుప్రీం కోర్టులో సవాల్ చేయనుందని సమాచారం. కోర్టు తీర్పు పట్ల ఎలన్ మస్క్ అసహనంగా ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. డెలవేర్ కోర్టు తీర్పు భారీ అవినీతిని సూచిస్తోందని ఆయన ట్వీట్ లో రాశారు.
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ఎలన్ మస్క్ ఆస్తి విలువ భారీగా పెరిగిపోయింది. ఇటీవలే ఆయన కంపెనీల షేర్ల విలువలు భారీ పెరిపోయి.. ఆయన నెట్ వర్త్ (నికర ఆస్తలు విలువ) 340 బిలియన్ డాలర్లకు చేరింది.