Earthquake: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భూకంపం వచ్చింది. పలు జిల్లాల్లో సెకెన్ల పాటు భూమి కంపించింది. ఉదయం సరిగ్గా 7:27 గంటలకు పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. గోదావరి రివర్ బెల్ట్ లో భూకంప తీవ్రత అధికంగా ఉంది. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు భూకంప పరిశోధన కేంద్రం అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా ఉన్నట్లు గుర్తించారు. ఉపరితలం నుంచి 40 కి.మీ దిగువన భూ ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల కారణంగా భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 4న మేడారం పరిధిలో ఏకంగా 4 లక్షల వృక్షాలు కూలిపోయాయి. ప్రస్తుతం అదే ప్రాంతంలో భూకంప కేంద్రం ఉండటం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
An earthquake with a magnitude of 5.3 on the Richter Scale hit Mulugu, Telangana at 7:27 AM today: National Center for Seismology pic.twitter.com/PKq7BnFxke
— ANI (@ANI) December 4, 2024
తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు
తెలంగాణలోని పలు జిల్లాలో భూకంపం సంభవించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్పల్పంగా భూమి కంపించింది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇల్లందు పట్టణంతో పాటు పలు సమీప గ్రామాలలో స్వల్పంగా భూమి కంపించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. మహబూబాబాద్ జిల్లా గంగారంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ లో భూకంపం ప్రభావం కనిపించింది. కరీంనగర్, గోదావరిఖని, సుల్తానాబాద్, హుజురాబాద్‌లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ స్వల్పంగా కంపించింది. ఆత్మకూర్(S), హుజూర్ నగర్ ప్రాంతాల్లో సెకన్ల పాటు భూమి కంపించింది. అటు హైదరాబాద్ లోని బోరబండ, రహమత్ నగర్, కార్మిక్ నగర్, యూసుఫ్ గూడా, సికింద్రాబాద్, బేగంపేట, హిమాయత్ నగర్, రాజేంద్రనగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం#earthquake #TeluguNews #Swetchadailyepaper pic.twitter.com/52kTCV4Nhb
— Swetcha Daily (@swetchadaily) December 4, 2024
ఏపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు
ఏపీలోనూ భూకంపం సంభవించింది. ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాల్లో ఉదయం ఏడు గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రకంపనల ధాటికి కొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లోని వస్తువులు కిందపడినట్లు తెలుస్తోంది.
జోన్ 2లో తెలంగాణ.. జోన్ 3లో ఏపీ
దేశంలో భూకంపాలు సంభవించే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించింది నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. వాటిలో జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5గా కేటగిరీ చేసింది. జోన్ 5లో సంభవించే భూకంపాల తీవ్రత అత్యంత ఎక్కువగా ఉంటుంది. ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా ఉంటుంది. తెలంగాణను జోన్ 2లో ఉంచింది. అంతే చాలా తక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతంగా గుర్తించింది. ఇక్కడ 5.3 తీవ్రతతో భూకంపం సంభవించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అటు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం జోన్ 3 పరిధిలో ఉంది. అంటే, ఇక్కడ ఓ మాదిరి భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రత 7 వరకు ఉంటుంది.
మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం – శాస్త్రవేత్తలు
తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చిన నేపథ్యంలో మళ్లీ కొన్ని భూ ప్రకపంనలు వచ్చే అవకాశం ఉందంటున్నారు NGRI భూకంప అధ్యయన విభాగం అధిపతి పూర్ణచంద్రరావు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.“తెలంగాణలో ఇవాళ వచ్చిన భూకంపం తీవ్రత 5.3గా ఉంటుంది. దీన్ని పెద్ద భూకంపంగానే భావించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద భూకంపాలు సాధారణంగా రావు. గతంలో వచ్చినవి కూడా ఈ స్థాయిలో లేవు. ఈ భూకంప కేంద్రం గోదావరి రివర్ బెల్ట్ పరిధిలో ఉంది. గతంలోనూ గోదావరి నదీ ప్రవాహ పరిసరాల్లో భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయి. వాటిని పాల్స్ అంటారు. తాజాగా భూకంపానికి ప్రధాన కారణం పాల్స్ గా భావిస్తున్నాం. తర్వాత చిన్న చిన్న భూకంపాలు వస్తే రావచ్చు. వీటిని ఆఫర్ట్ షాక్స్ అంటారు. ఎక్కడైనా పెద్ద భూకంపం వస్తే, కొద్ది రోజుల పాటు చిన్న చిన్న ప్రకంపనలు వస్తాయి. వాటి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. భూకంప తీవ్రత 6కు పైగా ఉంటేనే ప్రమాదంగా గుర్తించాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలు జోన్ 2, జోన్ 3లో ఉన్నాయి. ఇప్పటి వరకు మన దగ్గర చిన్న చిన్న భూకంపాలు మాత్రమే వచ్చాయి” అన్నారు.
Read Also: హైదరాబాద్‌లో అప్పటి వరకు వానలే వానలు, పెరగనున్న చలి తీవ్రత