Census of India: జనగణన, అందులోనే కులగణనకు వేళైంది. షెడ్యూల్ రిలీజైంది. ఆ వెంటనే డీలిమిటేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇంకాస్త ముందుకెళ్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వ్యవహారం కూడా రెడీగా ఉంది. సో ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. పరిణామాలు ఎలాగైనా మారొచ్చు. చెప్పాలంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ వ్యవహారం భారీ ప్రకంపనలు సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది. అన్నీ ఒకదానికొకటి ఇంటర్ లింక్‌గా ఉండడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.
జనగణనతో పాటే కులగణనకు రెడీ
ప్రతి పదేళ్లకోసారి జనగణన చేయాలి. ఆ వెంటే డీలిమిటేషన్ చేపట్టాలి. అంటే నియోజకవర్గాలను జనాభా ఆధారంగా పెంచాలి. ఇదీ మనదేశంలో రాజ్యాంగం చెప్పిన మాట. కాబట్టి ఇప్పుడు ఆ ప్రక్రియకు రూట్ క్లియర్ అవుతోంది. 2021లో జనాభా లెక్కలు సేకరించాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడి 2027కు షెడ్యూల్ అయింది. ఈ సారి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే.. జనగణనతో పాటే కులగణన కూడా చేయబోతోంది కేంద్రం. ప్రతిపక్షాలు ముఖ్యంగా రాహుల్ గాంధీ కులగణన చేయాల్సిందే అని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం, ఈ విషయంలో వెనుకంజ ఎందుకన్న ఆలోచనతో మోడీ ప్రభుత్వం కులాలవారీ లెక్కలు తీసేందుకు కూడా రెడీ అయింది.
2029 నాటికి రాజకీయ రూపురేఖలు మారేనా?
చాలా ఏళ్ల తర్వాత ఈ లెక్కలు తీస్తుండడంతో చాలా ఉత్కంఠ కూడా ఉంది. ఏ కులం వారి సంఖ్య ఎంత ఉంది? వారి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఒక రోడ్ మ్యాప్ రానుంది. వీటికి తోడు డీలిమిటేషన్ కూడా ఉండడంతో పొలిటికల్‌గా హైటెన్షన్‌గా మారిపోయింది. అటు వన్ నేషన్, వన్ ఎలక్షన్ కూడా అండర్ ప్రాసెస్ ఉండడంతో రాజకీయంగా దేశం రూపు రేఖలు 2029 నాటికి ఎలా మారిపోతాయో ఊహించడం కూడా కష్టంగానే మారింది. 2034లో జమిలికి ప్రణాళికలు కొనసాగుతున్నాయి. అయితే అంతకు ముందే డీలిమిటేషన్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందన్నది చూడాలి.
16 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన
16 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన జరుగుతోంది. చివరగా 2011లో జరిగాయి. ప్రతిసారి జనాభా లెక్కలు తీసేటప్పుడు ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రత్యేకంగా లెక్కలు వెల్లడించేవారు. అయితే ఈసారి అన్ని కులాల వారీ లెక్కలు తీయబోతున్నారు. కుల గణనకు ఏప్రిల్ 30వ తేదీన జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. జనాభా లెక్కలతో పాటే జాతీయ జనాభా రిజిస్టర్‌ను అప్‌డేట్ చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత ప్రస్తుతానికైతే లేదు. 2020లో షెడ్యూల్ ఇచ్చినప్పుడు మాత్రం ఎన్‌పీఆర్ అప్‌డేట్ వెంటనే జరుగుతుందన్నది కేంద్రం.
కోటా లిమిట్ 50శాతం దాటించాలన్న డిమాండ్లు
కులగణన చేయాల్సిందే అని రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దేశంలో ఏ సామాజికవర్గం వాళ్లు ఎంత మంది ఉన్నారు. వారి స్థితిగతులు ఏమిటి.. వారి కోటా వారికి కల్పించాలి.. 50 శాతం కోటా లిమిట్ దాటి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ వినిపిస్తూ వస్తున్నారు. వీటికి మొదట్లో మోడీ సర్కార్ ఆసక్తి చూపలేదు. కులగణనతో చాలా చిక్కులు వస్తాయని అనుమానించారు. ఈ డిమాండ్ ను ఎంటర్ టైన్ చేయొద్దనుకున్నారు. అయితే చివరికి జనగణనతో పాటే కులగణన చేయాలని డిసైడ్ అయ్యారు.
చివరిసారిగా 1971లో డీలిమిటేషన్
ఇప్పుడు జనగణన, కులగణన మ్యాటర్ పై హీట్ తగ్గింది. వాట్ నెక్ట్స్.. అంటే అంతా డీలిమిటేషన్ డీల్స్ చుట్టూనే తిరుగుతోంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన డేటా కీలకం కాబోతుంది. చివరిసారి 1971లో డీలిమిటేషన్ చేశారు. ఆ తర్వాత 2001 వరకు దాన్ని వాయిదా వేశారు. మళ్లీ దాన్ని 2026 వరకు పొడిగించారు. కాబట్టి 2027లో జనగణన పూర్తై వివరాలు ప్రకటించిన తర్వాత అసలు గేమ్ మొదలు కావడం ఖాయమంటున్నారు.
నార్త్ ఇండియా జనాభా ఎక్కువుండడంతో టెన్షన్
భారత దేశ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఆ లెక్కన ఉత్తర భారతదేశంలో ఇంకింత ఎక్కువగా ఉండబోతోంది. అదే సమయంలో సౌత్ ఇండియాలో జనాభా నార్త్ కంటే తక్కువగానే ఉండబోతోంది. అంటే జనాభా ప్రకారం కొత్తగా సీట్లు పెరగబోతున్నాయి. అంటే పార్లమెంట్‌లో నార్త్ డామినేషన్ పెరుగుతుందని ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న వాదన పెరుగుతోంది. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలా అన్నది ఆలోచిస్తున్నాయి. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ విషయంలో పెద్ద స్టెప్ తీసుకున్నారు. ఇటీవలే దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీలతో చెన్నైలో మీటింగ్ పెట్టారు. 7 రాష్ట్రాల సీఎంలతో జేఏసీ కూడా ఏర్పాటు చేశారు.
జనాభా కంట్రోల్ చేసిన రాష్ట్రాలకు శిక్షేనా?
ఈ సమస్య ఒక్క దక్షిణాది రాష్ట్రాలదే కాదు.. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకూ సమస్యగా మారుతోంది. ఎందుకంటే విపరీతంగా జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు విపరీతంగా పెరుగుతాయి. జనం తక్కువున్న రాష్ట్రాల్లో తగ్గకపోయినా అంతే సంఖ్యలో ఉండిపోతాయి. సో నిధులు కూడా తక్కువే అందుతాయి. ఇంకొన్ని పార్టీలైతే.. జనాభా తగ్గితే సీట్లు కూడా తగ్గించేస్తారన్న ఆందోళనతో ఉన్నాయి. అదే జరిగితే మరీ ఘోరం. అందుకే ఆందోళనల్ని ఇప్పటి నుంచే పెంచే ప్లాన్ తో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. డీలిమిటేషన్ ను మరో పదేళ్లు వాయిదా వేయాలంటున్నారు. నిజానికి భారత్ లో జనాభా విపరీతంగా పెరగడంతో ఒక దశలో కుటుంబ నియంత్రణ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఈ రూల్‌ను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. జనాభాను అదుపులోకి తెచ్చాయి. అదే యూపీ బిహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా కంట్రోల్ కాలేదు. అదే సమస్యగా మారింది.
డీలిమిటేషన్ కు కొత్త ఫార్ములా కనుక్కుంటారా?
జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని స్టాలిన్ సహా ఇతర నాయకులు చెబుతున్న మాట. సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన వారిగా మిగిలిపోతామన్న ఆందోళన పెరుగుతోంది. మ్యాటర్ ఏంటంటే.. నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిందే. అయితే జనాభా ప్రాతిపదికన చేయొద్దన్నదే అసలు డిమాండ్. న్యాయబద్ధంగా, పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలంటున్నారు. జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాలు ఉండేలా చూడాలన్నది పాత సూత్రం. అందుకే కొత్త ఫార్ములా తీసుకురావాలంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో చర్చించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒక వ్యక్తి వేసే ఓటు.. మరో వ్యక్తి వేసే ఓటు కంటే తక్కువ కాదు. దీన్ని డీలిమిటేషన్ కు అప్లై చేయాలంటున్నారు.
ఇది జనగణన, కులగణన కంటే బిగ్ టాస్క్.
1972 నాటి పునర్విభజన కమిషన్ లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 542గా నిర్ణయించింది. తరవాత సిక్కిం స్థానాన్ని కలిపి మొత్తం సీట్లను 543గా ఖరారు చేశారు. అదే ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూ వస్తోంది. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే ఎంపీ సీట్లు, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. అయితే అసెంబ్లీ స్థానాల విషయంలో ఎలాంటి సమస్య లేదు. కానీ దేశానికి ప్రాతినిథ్యం విషయంలోనే సమస్యలు వస్తున్నాయి. ఇది జనగణన, కులగణన కంటే బిగ్ టాస్క్.
అసలు ఈసారి జనాభా లెక్కలు ఎందుకు ప్రత్యేకం??
ఈసారి చేసే జనాభా గణన ఫుల్ అడ్వాన్స్ డ్‌గా ఉండబోతోంది. అంతకు ముందు పేపర్ వర్క్ ఉండేది. ఇప్పుడంతా డిజిటల్ సెన్ససే. అది కూడా నెలరోజుల్లో కులగణన ముగించేలా ప్లాన్ చేస్తోంది కేంద్రం. రెండు దశల్లో జన గణన చేయబోతున్నారు. ఈసారి చేపట్టేది 16వ జనాభా గణన. మొత్తం 36 ప్రశ్నలు అడిగే ఛాన్స్ కనిపిస్తోంది. వాటితోనే జనం సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేస్తారు. 2027లో చేసే జనాభా లెక్కల్లో అసలు ఎన్ని కోట్ల మంది ఉండే ఛాన్స్ ఉంది? అసలు ఈసారి జనాభా లెక్కలు ఎందుకు ప్రత్యేకం??
ఈసారి జనగణన వెరీవెరీ స్పెషల్
ఈసారి జనాభా లెక్కలు వెరీ వెరీ స్పెషల్‌గా మారబోతున్నాయి. ఎందుకంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. చాలా సవాళ్లకు చిక్కుముడులు వీడిపోనున్నాయి. లెక్కలు తేలిపోనున్నాయి. జనగణన 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్రం డిసైడ్ అయింది. దీంతోపాటే కుల గణననూ చేపట్టి అదే నెలలో పూర్తి చేస్తారు. ఇందుకోసం 2027 మార్చి 1 ని రెఫరెన్స్ డేట్‌గా నిర్ణయించారు. ఫిబ్రవరి 28 రాత్రి 12 గంటలకల్లా జనగణన పూర్తి చేస్తారు. 2026 ఏప్రిల్‌లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ ప్రారంభిస్తారు. లడాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో 2026 సెప్టెంబర్ నాటికే జన గణన పూర్తి చేస్తారు. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1ని రెఫరెన్స్ డేట్‌గా ప్రకటించింది.
2011లో సామాజిక, ఆర్థిక, కుల గణన
చివరిసారి 2011లో దేశ జనాభాను లెక్కించారు. మళ్లీ 2021లో జనగణన నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. అప్పట్లో దానికి సంబంధించిన ప్రక్రియ 2020లోనే కేంద్రం ప్రారంభించింది. ఫస్ట్ ఫేజ్ 2020 ఏప్రిల్–సెప్టెంబర్‌లో, సెకండ్ ఫేజ్ 2021 ఫిబ్రవరిలో నిర్వహించేందుకు షెడ్యూల్ రెడీ చేసింది. కానీ కరోనా వ్యాపించడంతో వాయిదా పడింది. మళ్లీ 2027కు సాధ్యమవుతోంది. ఈసారి స్పెషల్ ఏంటంటే బ్రిటిషర్ల హయాంలో 1881 నుంచి 1931 వరకూ కుల గణన చేశారు. ఆ తర్వాత 2011లో యూపీఏ హయాంలో సామాజిక, ఆర్థిక, కుల గణన జరిగింది. అయితే ఆ వివరాలు బయటకు రాలేదు. సో క్యాస్ట్ సెన్సస్ రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో ఎలాంటి మార్పులు, పరిణామాలకు దారి తీస్తుందన్న ఉత్కంఠ అయితే ఉంది.
మొబైల్ యాప్, సెన్సస్ పోర్టల్ తో జనాభా లెక్కలు
ఈ జనగణన పూర్తిగా డిజిటల్ రూపంలోనే చేస్తారు. మొబైల్ యాప్, సెన్సస్ పోర్టల్ ఉపయోగిస్తారు. మొత్తం 33 లక్షల మంది ఎన్యుమరేటర్లు ట్యాబ్‌లు ఉపయోగించి డేటాను సేకరిస్తారు. పేపర్ విధానంలో ఉన్నా వాటిని అప్ లోడ్ చేస్తారు. సెన్సస్ యాప్ 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది. రీజినల్ లాంగ్వేజెస్‌లో డేటా సేకరణ ఈజీ కానుంది. అంతే కాదు.. ఆన్‌లైన్ సెన్సస్ పోర్టల్‌లో జనం తమ ఫోన్ నెంబర్‌తో లాగిన్ అయి.. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చు. వియత్నాం సహా పలు దేశాల్లో ఇలాంటి వెసులుబాట్లు కల్పించారు. సెన్సస్ డిజిటల్ లైబ్రరీలో జనగణన డేటా ఎక్సెల్ ఫైల్స్ రూపంలో స్టోర్ చేస్తారు. దీనివల్ల చట్టాలు చేసే వారికి ఈజీగా యాక్సెస్ చేసి తెలుసుకోవచ్చు.
జనగణనలో 36కు పైగా ప్రశ్నలు అడిగే అవకాశం
జనం సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకునేందుకు 36కు పైగా ప్రశ్నలు అడుగుతారంటున్నారు. ఇంటి నంబర్, ఇంటి తీరు, కుటుంబం, విద్య, ఉపాధి ఏంటి వంటి విషయాలు అడుగుతారు. 2027 జన గణనకు 13 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2021లో చేపట్టాలనుకున్న జన గణనకు 8,754 కోట్లు, ఎన్‌పీఆర్ అప్‌డేట్‌కు 3,941 కోట్లు అవుతుందని ఆనాడు లెక్కలు వేశారు. అయితే జన గణన రిజిస్ట్రార్ జనరల్‌కు కేంద్ర ప్రభుత్వం.. 2025-26 బడ్జెట్‌లో కేవలం 574 కోట్లే కేటాయించింది. 2027 కూడా లింక్ అవడంతో మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది.
2011 లెక్కల ప్రకారం.. దేశ జనాభా 121 కోట్లు
2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభా 121 కోట్లుగా తేలింది. ఇందులో 62.3 కోట్ల మంది పురుషులు. 58.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఇక 2020 జులైలో జన గణన విభాగం రిలీజ్ చేసిన అంచనాల ప్రకారం.. 2027 నాటికి దేశ జనాభా దేశ జనాభా 143 కోట్ల 64 లక్షలుగా ఉండే అవకాశం ఉందంటున్నారు. యూపీలో 24 కోట్లు, బిహార్ 13 కోట్లు, మహారాష్ట్ర 13 కోట్లు, బెంగాల్ 10 కోట్లు, మధ్యప్రదేశ్ 9 కోట్లు, రాజస్థాన్ 8 కోట్ల జనం ఉండే ఛాన్స్ ఉందని ఐదేళ్ల క్రితం సెన్సస్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది. మరి జనగణన చేశాక ఈ సంఖ్య మరింత ఎక్కువుంటుందన్న అంచనాలైతే ఉన్నాయి.
Story By vidya Sagar, Bigtv Live