Bengaluru Stampede| బెంగళూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో 11 మంది మరణించడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో బెంగళూరు పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌లను సస్పెండ్ చేసినట్లు సిఎం సిద్దరామయ్య గురువారం రాత్రి ప్రకటించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ నిర్వాహకులైన డిఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌పై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా ఐపిఎల్ విజయోత్సవం కార్యక్రమాన్ని ఆర్‌సిబి తొందరగా నిర్వహించిందని అని ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం ఈ తొక్కిసలాట ఘటన కారణంగా బెంగళూరు కమిషన్ దయానందని సిఎం సిద్ధరామయ్య సస్పెండ్ చేయగా.. కొత్త కమిషనర్ గా సీమంత్ కుమార్ సింగ్ బాధ్యతలు చేపట్టారు.
ఈ దుర్ఘటనపై సిఐడి దర్యాప్తు చేపడుతుంది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ మైఖేల్ కున్హాతో కూడిన కమిషన్ దర్యాప్తు చేస్తోంది. ఆర్‌సిబి ఐపీఎల్ విజయం తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 47 మంది గాయపడ్డారు.
పోలీసు బలగాలు సరిపోక, భద్రతా ఏర్పాట్లు విఫలమయ్యాయి. ఆర్‌సిబి జూన్ 4న ఈవెంట్ గురించి ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అయితే ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. కర్ణాటక హైకోర్టు స్వయంగా ఈ ఘటనలో విచారణ చేపట్టి.. ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
తొక్కిసలాటలో 11 మంది మరణించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) దాఖలైంది. ఈ ఘటన జూన్ 4న జరిగింది. RCBతో పాటు, ఈవెంట్ నిర్వహణ సంస్థ DNA ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కమిటీపై కూడా FIR నమోదైంది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు దాఖలు చేయబడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంజజ ఈ కేసు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 (హత్య కాని నేరపూరిత మరణం), 115 (స్వచ్ఛందంగా గాయపరచడం), 118 (ప్రమాదకర ఆయుధాలతో గాయపరచడం), 190 (సమూహంలో సభ్యుల బాధ్యత), 132 (ప్రభుత్వ ఉద్యోగిని విధి నిర్వహణలో అడ్డుకోవడం), 125(12) (ఇతరుల జీవన భద్రతకు హాని కలిగించే చర్యలు), 142 (అక్రమ సమూహం), 121 (నేరానికి ప్రేరేపణ) కింద నమోదైంది.
స్టేడియం వద్ద తొక్కిసలాట విషాదం
ఆర్‌సిబి తమ తొలి IPL టైటిల్ విజయాన్ని స్టేడియం వెలుపల ఘనంగా జరుపుకుంటుండగా ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమే కానీ, 2 నుంచి 3 లక్షల మంది జనం ఈ ఉత్సవానికి తరలివచ్చారని తెలిపారు. ఈ భారీ జనసమూహాన్ని నిర్వహించడం స్టేడియం సిబ్బందికి సాధ్యపడలేదు.
బాధితులకు ప్రభుత్వం, ఆర్సీబీ నుంచి ఆర్థిక సాయం
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹10 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారందరికీ బౌరింగ్ ఆసుపత్రితో సహా నగరంలోని ఇతర ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది.
Also Read: ఫ్యాన్స్ చనిపోయినా పట్టించుకోరా?.. సోషల్ మీడియాలో ఆర్సీబీ విజయోత్సవాలపై ట్రోలింగ్..
ఆర్‌సిబి కూడా ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. అదనంగా, గాయపడిన అభిమానులకు సహాయం చేయడానికి ‘RCB కేర్స్’ అనే ఫండ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
“బెంగళూరులో జరిగిన ఈ దురదృష్టకర ఘటన ఆర్‌సిబి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. మరణించిన 11 కుటుంబాలకు సంతాపంగా, ఒక్కొక్క కుటుంబానికి ₹10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాము. ఈ విషాదంలో గాయపడిన అభిమానులకు సహాయం చేయడానికి RCB కేర్స్ ఫండ్‌ను స్థాపిస్తున్నాము,” అని ఆర్‌సిబి ఒక ప్రకటనలో తెలిపింది.