BigTV English

India – China Friendship: కలిసుందాం.. రా.! భారత్‌ను దెబ్బకొట్టేందుకు భారత్‌తో చైనా దోస్తీ

India – China Friendship: కలిసుందాం.. రా.! భారత్‌ను దెబ్బకొట్టేందుకు భారత్‌తో చైనా దోస్తీ

కలిసి పనిచేయడం రెండు దేశాలకు మంచిది!

ఎంటీ.. ఈ మాటలు భారతదేశం నుండి వచ్చాయని అనుకుంటున్నారా..? కానే కాదు. చీనా దేశం టోన్ మార్చింది. అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతున్న పరపతి ఒకవైపు.. ప్రపంచంలో చైనా ఒంటరిగా మారుతుండటం మరోవైపు.. ఇక, ట్రంప్ చేసే టారిఫ్ వార్‌కి చైనా మార్కెట్లో ముచ్చెమటలు పడుతున్నాయి. భారత్‌లాగా దౌత్యం నేర్చుకోని డ్రాగన్ కంట్రీ.. పొగర్ని తగ్గించుకొని కలిసిపోదామనే పాట పాడుతోంది. ఆర్థికంగా భారత్ పరుగులుపెడుతుంటే.. అనుకున్న లక్ష్యాలు చేరుకోలేక చైనా నానాపాట్లూ పడుతుంది.


భారత్ లాంటి భాగస్వామ్యం అత్యవసరం

చిన్నా చితకా దేశాలకు అప్పులిచ్చి, వాళ్లను తన గుప్పెట్లోకి లాగాలనుకున్న డ్రాగన్ కంట్రీ.. అంతర్జాతీయంగా అభాసుపాలయ్యింది. స్వదేశంలో సవాలక్షా సమస్యలతో సతమతమవుతోంది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లను నమ్ముకుంటే తీవ్రవాదం తప్ప తిరిగొచ్చేది ఏమీ లేదని అర్థమయ్యింది. ఇప్పుడు చైనాకున్న ఒకే ఒక్క దారి.. భారత్‌తో రాజీ పడటమే. అమెరికా వేసే టారిఫ్ బరువులు తట్టుకోవాలంటే.. భారత్ లాంటి భాగస్వామ్యం అత్యవసరం అయ్యింది. బ్రిక్స్ వేదిక ఎలాగూ ఉంది కాబట్టి భారత్‌తో బంధం పెంచుకోవాలని అనుకుంటుంది.

గతేడాది రష్యా ఆతిధ్యం ఇచ్చిన కజాన్‌ కార్యాక్రమంలో..

ట్రంప్ పాలనలో కొత్త వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొంటున్న చైనా, భారత్‌తో సంబంధాలను మరింత స్థిరపరచుకోడానికి ప్రయత్నిస్తోంది. ఈ దిశగా.. మార్చి 8న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. న్యూఢిల్లీతో బీజింగ్ సంబంధాలు గత సంవత్సరంలో సానుకూల పురోగతి సాధించాయని చిలకపలుకులు పలికారు. గతేడాది రష్యా ఆతిధ్యం ఇచ్చిన కజాన్‌ కార్యాక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సమావేశం జరిగింది.

ఇరుదేశాల మధ్య మార్పిడి, ఆచరణాత్మక సహకారం

ఈ సందర్భంగా.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయనీ.. అభివృద్ధికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం వచ్చిందని కూడా వాంగ్ యి పేర్కొన్నారు. అందుకే, కలిసి పనిచేయడం రెండు దేశాలకు మంచిదని వాంగ్ వెల్లడించారు. “మా నాయకులు ఇద్దరి ఆలోచనల్లో ఉన్నట్టే రెండు వైపులా హృదయపూర్వక సంబంధం కొనసాగించాలని అనుకుంటున్నట్లు వాంగ్ తెలిపారు. ఇక అన్ని స్థాయిలలో ఇరుదేశాల మధ్య మార్పిడి, ఆచరణాత్మక సహకారాన్ని బలోపేతం అయ్యాయనీ.. గత కొన్ని నెలలుగా సానుకూల ఫలితాలను సాధిస్తున్నట్లు పేర్కొన్నారు.

డ్రాగన్-ఎలిఫాంట్‌లు కలిసి సహకారించుకోవాలన్న చైనా

చైనా-భారత్‌లు ఒకదానికి ఒకటి అతిపెద్ద పొరుగు దేశాలనీ.. రెండు దేశాలూ ఒకరి విజయానికి ఒకరు దోహదపడే విధంగా భాగస్వాములుగా ఉండాలని చైనా ఎల్లప్పుడూ నమ్ముతున్నట్లు చైనా విదేశాంగ మంత్రి వెల్లడించారు. అందుకే, డ్రాగన్-ఎలిఫాంట్‌లు కలిసి సహకారించుకోవాలని అన్నారు. అయితే, వాంగ్ కేవలం మంత్రి మాత్రమే కాదు, చైనాలో అతిపెద్ద, అధికార పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా వాంగ్ ఉన్నారు. కాబట్టి, ఆయన మాట కచ్ఛితంగా చైనా అధ్యక్షుడి మాటతో సమానంగానే పరిగణించాల్సి ఉంటుంది. అందుకే, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన దేశాలుగా ఉన్న భారత్-చైనాల సాంగత్యం స్ట్రాంగ్ అవ్వాలని కోరారు.

గ్లోబల్ సౌత్‌ని బలంగా మార్చుకోడానికి అవకాశాలు

ఇక, గ్లోబల్ సౌత్‌లో ఆధిపత్యం, అధికార రాజకీయాలు వంటివి లేకుండా ఇరు దేశాలు బాధ్యతగా వ్యవహరించాలని పిలునిచ్చారు. రెండు దేశాల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడమే కాకుండా అంతర్జాతీయ సంబంధాలను నియంత్రించే ప్రాథమిక నిబంధనలను కూడా నిలబెట్టాలని మంత్రి వాంగ్ ఆశించారు. చైనా-భారత్‌లు చేతులు కలిపితే.. అంతర్జాతీయ సంబంధాలలో గొప్ప ప్రజాస్వామ్యానికి ప్రాతినిధులుగా ఉంటామనీ.. గ్లోబల్ సౌత్‌ని బలంగా మార్చుకోడానికి అవకాశాలు బాగా మెరుగుపడతాయని అన్నారు.

ఒకరినొకరు తగ్గించుకునే బదులు సహకరించుకుందామనే ధోరణి

అయితే, చైనా మంత్రి వాంగ్ చెప్పిన మాటల్లో.. అభివృద్ధి చెందుతున్న రెండు అతిపెద్ద దేశాలుగా.. చైనా-భారత్‌లు ఒకరినొకరు తగ్గించుకునే బదులు ఒకరినొకరు సహకరించుకుందామనే ధోరణి కనిపిస్తోంది. అలాగే, ఒకరినొకరు రక్షించుకోవడానికి బదులుగా ఒకరితో ఒకరు కలిసి పనిచేయాలనే అభిప్రాయం ఉంది. చైనా తన అవసరం కోసం ఎంత ఆత్రుత పడుతుందంటే.. ఇటీవల వరకూ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన సరిహద్దు వివాదాలను ద్వెపాక్షిక సంబంధాలతో ముడిపెట్టొద్దని కోరుతోంది.

భారత్-చైనాలు రెండూ పురాతన నాగరికతలు

ఇలాంటి చిన్న చిన్న అంశాలు రెండు దేశాల మధ్య దౌత్యాన్ని మొత్తంగా ప్రభావితం చేయకూడదని అంటోంది. ఈ క్రమంలో.. భారత్-చైనాలు రెండూ పురాతన నాగరికతలని చెబుతూ చారిత్రక సారుప్యతను కూడా తెరమీదకు తీసుకొస్తుంది. అందుకే, న్యాయమైన పరిష్కారం కోసం సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించడానికి రెండు దేశాలకు తగినంత జ్ఞానం, సామర్థ్యం ఉన్నాయంటూ చైనా మైత్రి మంత్రం చదువుతోంది.

2025కు చైనా-భారత్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం

2025 నాటికి చైనా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. అందుకే, గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. ఒక మైత్రి మార్గాన్ని ఏర్పరచుకోవాలని ఆశిస్తోంది. చైనా-భారత్ సంబంధాలను బలమైన, స్థిరమైన అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లడానికి చైనా భారతదేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పిలుపునిచ్చారు. కలిసి పనిచేయడం రెండు దేశాలకు మంచిదని అన్నారు.

అయితే, తూర్పు లడఖ్‌లో నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిన సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలికి.. రెండు పొరుగు దేశాల మధ్య గతేడాది సాధించిన పురోగతి తర్వాత చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. బీజింగ్‌లో చైనా వార్షిక విలేకరుల సమావేశం సందర్భంగా.. రెండు దేశాలు సంబంధాలలో చాలా కాలంగా ఉన్న ప్రతిష్టంభనకు ఫుల్‌స్టాప్ పెట్టి.. ద్వైపాక్షిక సంబంధాలను ఎలా కొనసాగించాలని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి వాంగ్ యి ఈ వ్యాఖ్యలు చేశారు.

డెప్సాంగ్, డెమ్‌చోక్ అనే రెండు ఘర్షణ ప్రాంతాలు

దశాబ్ధాలుగా చైనా-భారత్ సంబంధాల్లో ఇలాంటి ఒడిదుడుకులు కనిపిస్తూనే ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం…సరిహద్దు తూర్పు లడఖ్‌లో చివరి ఘర్షణ జరిగింది. డెప్సాంగ్, డెమ్‌చోక్ అనే రెండు ఘర్షణ ప్రాంతాల్లో ఏర్పడిన ఈ ఉద్రిక్తతల తర్వాత గత నాలుగు సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు స్తంభించాయి. 2020లో భారత్, చైనా దళాలు లడఖ్‌లోని గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణకు దిగడంతో ఈ ప్రతిష్టంభన ప్రారంభమైంది. దీని ఫలితంగా రెండు వైపులా ప్రాణనష్టం కూడా జరిగింది. దీనికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

డిసెంబర్ 18, 2025న అజిత్ దోవల్, వాంగ్ యిల మధ్య సమావేశం

తర్వాత గతేడాది చివర్లో భారత్, చైనాలు సరిహద్దు నుండి ఇరు సైన్యాలను వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నాయి. దాదాపు 60 సంవత్సరాల్లో భారత్-చైనా సరిహద్దులో మరణాలు నమోదైన మొదటి సంఘటన ఇది. అయితే, ఈ ప్రతిష్టంభన తర్వాత, రెండు దేశాల ప్రతినిధుల మధ్య అనేక సమావేశాలు, చర్చలు జరిగాయి. వాటిలో ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ జిన్‌పింగ్ మధ్య కూడా సమావేశం జరిగింది. ఆ తర్వాత, డిసెంబర్ 18, 2025న, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిలు.. బీజింగ్‌లో 23వ స్పెషల్ రిప్రజెంటేటీవ్ డైలగ్‌ను నిర్వహించారు. అప్పటి నుండీ ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి.

అక్టోబర్ 23న రష్యా కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం

గతేడాది, అక్టోబర్ 23న, రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో కూడా మోడీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఐదు సంవత్సరాల్లో ఇది వారి మొదటి అధికారిక చర్చ. ఈ సమావేశం తర్వాత, 2020లో ప్రారంభమైన ప్రతిష్టంభన నుండి.. తూర్పు లడఖ్‌లో పరిష్కరం కాని చివరి రెండు ఘర్షణ అంశాలపై ఒక అవగాహనకు వచ్చినట్లు రెండు పక్షాలు వేర్వేరు పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి.

రెండు ఘర్షణ అంశాలపై ఒక అవగాహనకు వచ్చినట్లు ప్రకటన

తూర్పు లడఖ్‌లో సైనిక విరమణ ప్రక్రియను పూర్తి చేయడానికి రెండు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే, ముందుగా భారత్ దీనిపై స్పందించింది. చైనాతో సంబంధాలను నార్మలైజ్ చేయడం కోసం జాగ్రత్తగా నడవాలని కోరుకుంది. అలాగే, ఇటీవల, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌తో జరిగిన సమావేశంలో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇందులో, ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించాలనీ.. సరిహద్దు శాంతిని సంయుక్తంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

చైనా వస్తువులపై 20% సుంకాన్ని విధించిన ట్రంప్

సరిగ్గా, ఇలాంటి పరిస్థితుల మధ్య.. అమెరికాకు చైనాకు మధ్య టారిఫ్‌ల చిచ్చు రాజుకుంది. దీనితో, అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై 20% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగా చైనా.. అమెరికా దిగుమతులపై ప్రతి-సుంకాలను విధించింది. ఈ చర్య ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధానికి కారణం అయ్యింది. అమెరికా సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను ఉల్లంఘిస్తున్నాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరోపించింది.

ఫిబ్రవరి 10 నుండి అమల్లోకి వచ్చిన సుంకాలు

ఈ పెరుగుదల వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిబంధనలను ఉల్లంఘించడమేనని వెల్లడించింది. ఇక, చైనా ప్రతీకార చర్యలో భాగంగా అమెరికా బొగ్గు, లిక్విడ్ నేచురల్ గ్యాస్ ఎగుమతులపై 15% సుంకం విధించింది. అలాగే ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, భారీ కార్లపై 10% సుంకం విధించింది. ఈ సుంకాలు ఫిబ్రవరి 10 నుండి అమల్లోకి రానున్నాయి. అదనంగా, జాతీయ భద్రతా ప్రయోజనాలను పేర్కొంటూ.. టంగ్‌స్టన్, టెల్లూరియం, రుథేనియం, మాలిబ్డినం, రుథేనియం సంబంధిత అరుదైన లోహాలపై ఎగుమతి నియంత్రణలను విధించింది చైనా.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ మాట్లాడే అవకాశం

అయితే, అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, పరిష్కారం కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడే అవకాశం ఉంది. ఇద్దరు నాయకులు ఇద్దరికీ ప్రయోజనం చేకూరే ఒప్పందంపై చర్చలు జరపుతారనే అంచాలు ఉన్నాయి. ఇవి వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించగలవని, ఆర్థిక అంతరాయాలను నివారించవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ వాణిజ్య యుద్ధం ప్రభావం అంతకుమించింది. అందుకే.. ట్రంప్ టారీఫ్‌లపై మండిపడిన చైనా.. “అమెరికా యుద్ధం కోరుకుంటే అది టారిఫ్ వార్ అయినా, ట్రేడ్ వార్ అయినా, లేదా మరే ఇతర యుద్ధమైనా.. మేము తుది వరకు పోరాడేందుకు సిద్ధం” అని చైనా రాయబార కార్యాలయం తేల్చి చెప్పింది.

చైనాకు మరో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌

ఈ నేపధ్యంలో.. రెండు దేశాలు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా దిగుమతులపై చైనా విధించే సుంకాలు.. అమెరికన్ వ్యాపారాలు, వినియోగదారులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే, చైనా వస్తువులపై అమెరికా విధించే సుంకాలు వల్ల ధరలు పెరిగి, డిమాండ్ తగ్గడానికి దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి, ఈ పరిస్థితుల్లో చైనాకు మరో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌ సహకారాన్ని డ్రాగన్ కంట్రీ కోరకుంటుంది.

ట్రంప్ మొదటి పదవీ కాలంలో చైనాపై సుంకాలు

ఇక, గతంలో ఇలాగే అమెరికా, చైనాల మధ్య టారీఫ్ వార్ నడిచినప్పుడు భారత్ భారీగా లాభపడింది. ట్రంప్ మొదటి పదవీ కాలంలో చైనాపై సుంకాలు పెంచిన తర్వాత… భారత్ నుండి అమెరికాకు ఎగుమతులు పెరిగాయి. ఆ సమయంలో అమెరికాకు ఎగుమతులు చేసే దేశాల్లో భారత్ నాలుగో అతిపెద్ద లబ్దీదారుగా నిలిచింది. అలాగే, ప్రస్తుతం చైనా దిగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించడంతో మరోసారి యూఎస్ ప్రత్నమ్నాయ సరఫరాదారుల కోసం చూస్తుంది.

అమెరికా, భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్‌ను తీసుకొచ్చే ఆలోచన

ఈ క్రమంలో.. ఇటీవల భారత్‌పై కూడా ట్రంప్ పరస్పర సుంకాలు విధించడం.. ఏప్రిల్ నుండి అవి అమల్లోకి వస్తుండగా.. భారత్ తెలివైన స్టెప్ తీసుకుంది. అమెరికా, భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్‌ను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే, ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో సుంకాలు నామమాత్రంగా ఉంటాయి. దీనితో ఇప్పుడు ట్రంప్ కూడా భారత్ వైపు మొగ్గారు. ఈ పరిణామంతో భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత మెరుగ్గా నడుస్తాయి. ఇది కచ్ఛితంగా చైనా ఆర్థిక వ్యవస్థకు నష్టమనే చెప్పాలి.

అమెరికాతో చెడినా భారత్‌తో చైనా వాణిజ్యం

ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయంతో ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలైతే.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ రెండు దేశాలపైనే కాకుండా, ప్రపంచ దేశాలపైనా తీవ్ర ప్రభావం పడనుంది. ఈ తరుణంలో.. చైనా భారత్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అమెరికాతో చెడినప్పటికీ.. భారత్‌తో వాణిజ్యాన్ని నడిపే విధంగా వ్యూహాలు రచిస్తోంది. ఎందుకంటే, భారతదేశంలో చైనా యాప్‌లు నిషేధానికి గురైనప్పటికీ.. సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు వచ్చినప్పటికీ.. భారత్, చైనా మధ్య వాణిజ్యం లాభసాటిగానే సాగింది.

చైనాకు భారత్ ఎగుమతులు 202-21లో $17.51 బిలియన్లు

ఇటీవల భారతదేశంతో చైనా ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాలను చూస్తే.. 2021 నుండి 2022 వరకు, సుమారు $130 బిలియన్ల వాణిజ్యం జరిగింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 44 శాతం ఎక్కువ. అలాగే, చైనాకు భారతదేశం ఎగుమతులు కూడా 202-21లో ఉన్న $17.51 బిలియన్లతో పోల్చుకుంటే.. 2021-22 నాటికి $26.46 బిలియన్లుగా పెరిగాయి. ఇక, ఒక దేశం ఎగుమతి ప్రధాన దేశంగా ఉండాలంటే.. అది దిగుమతి ప్రధాన దేశంగా కూడా ఉండాలి. దాని ధర కారణంగా చైనా భారతదేశానికి అత్యంత ముఖ్యమైన దిగుమతి వనరు. కాబట్టి, చైనాకు భారత్ అవసరం ఉంది. మరి, చైనా కొత్త బాణీ ఈ బంధాన్ని ఎక్కడ వరకూ తీసుకెళ్తుందో.. ఎప్పటిలాగే, మధ్యలో వదిలేస్తుందో చూడాలి.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×