Russia Attack Ukraine| రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ తూర్పు నగరం డోబ్రాపిలియా, ఖార్కివ్ ప్రాంతంలోని ఒక స్థావరంపై రాత్రిపూట రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో 14 మంది మృతి చెందగా, 37 మంది గాయపడ్డారు. ఇందులో ఐదుగురు పిల్లలు ఉన్నారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
రెండు రోజుల క్రితం క్రీవి రీహ్‌లోని ఓ హోటల్‌పై రష్యా క్షిపణిదాడిలో నలుగురు మృతి చెందారు. ఈ హోటల్‌లో అమెరికా, బ్రిటన్ జాతీయులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ వైమానికదళం ప్రకటన ప్రకారం, రష్యా 112 షాహెడ్, డెకాయ్ డ్రోన్లను, రెండు బాలిస్టిక్ ఇస్కందర్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుగా ఉన్నప్పటికీ, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయంతో పాటు శాటిలైట్ సర్వీస్ కూడా అమెరికా నిలిపేసింది. మరో వైపు, ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను యుధ్దం కోసం ఇస్తానంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యూయెల్ మాక్రాన్ వివాదాస్పద ప్రతిపాదన చేశారు.
Also Read: ఉక్రెయిన్ యుద్ధం కోసం ఫ్రాన్స్ అణ్వాయుధాలు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా
గత గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు సభ్య దేశాల నుంచి భారీ స్పందన లభించింది.
రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) మండిపడ్డారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అమెరికా, ఇతర దేశాలకు పిలుపునిచ్చారు. ‘రష్యా లక్ష్యాలు మారలేదని ఇటువంటి దాడులు నిరూపిస్తున్నాయి. అందువల్ల తమ ప్రాణాలను రక్షించడానికి వైమానిక రక్షణను బలోపేతం చేయడానికి రష్యాపై కఠిన ఆంక్షలను పెంచాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ముఖ్యం’ అని పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు (Putin) ఆర్థిక సహాయం చేసేందుకు దోహదపడే ప్రతి పరిణామాన్ని ముగించాలని సూచించారు. శాంతిని కోరుకునే భాగస్వాములతో తాము కలిసి పని చేస్తూనే ఉంటామని తెలిపారు. మరోవైపు, అమెరికా, ఉక్రెయిన్ మధ్య చర్చలు వచ్చే వారం సౌదీ అరేబియాలో (Saudi Arabia) జరగనున్నాయి.
ఉక్రెయిన్‌తో తాత్కాలిక ఒప్పందానికి సిద్ధమన్న రష్యా
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు కొన్ని షరతులతో తాత్కాలిక ఒప్పందానికి సిద్ధమని రష్యా విదేశాంగ మంత్రి ఇటీవల ప్రకటించారు. అమెరికా ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఈ అంశంపై ప్రస్తావన వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధం త్వరగా ముగించేందుకు రష్యా, ఉక్రెయిన్ల మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా అధ్యక్ష భవనంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రష్యా.. ఉక్రెయిన్ పై దాడులు తీవ్రతరం చేస్తోంది. కానీ యద్ధం ముగించేందుకు రష్యా కూడా వినకపోతే తీవ్ర ఆంక్షలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పుడు యుద్ధం ముగియలాంటే చివరగా ఆ నిర్ణయం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీనే తీసుకోవాలి. కానీ ఆయన పెట్టే షరతులకు ట్రంప్ అంత త్వరగా అంగీకరించడం లేదు.