India France defence deal: అమెరికా, ఈయూతో బిగ్ ట్రేడ్ డీల్స్ ఫైనల్ చేసిన తర్వాత భారత్ మరో భారీ ఒప్పందానికి సిద్ధమవుతోంది. ఈసారి జరగబోయే డీల్ వాణిజ్యానికి సంబంధించింది కాదు.. దేశ రక్షణకు సంబంధించింది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ భారత్‌లో పర్యటించడానికి ముందే.. 114 రాఫెల్ జెట్‌ల కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ డీల్ గనక కుదిరితే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఇంకెంత శక్తిమంతంగా మారుతుంది?
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. ఇదే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో.. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన 3 లక్షల కోట్లకు పైగా భారీ రక్షణ ఒప్పందం ఫైనల్‌కు చేరుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే.. డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ బోర్డు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. వచ్చే వారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అధికారిక ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గడంతో.. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ ఒప్పందం గనక కుదిరితే.. దేశంలో అతిపెద్ద యుద్ధ విమానాల సేకరణలో ఒకటిగా నిలుస్తుంది. దీని విలువ.. సుమారు 3 లక్షల 25 వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత వాయుసేన తీవ్రమైన స్క్వాడ్రన్ కొరతను ఎదుర్కొంటోంది. అటు పాక్ సరిహద్దుల్లోనూ, ఇటు చైనా బోర్డర్‌లోనూ ముప్పు పెరుగుతున్న క్రమంలో.. కచ్చితంగా మల్టీరోల్ ఫైటర్ జెట్స్‌ని కొనాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యం.. 42 స్క్వాడ్రన్‌లు కాగా, ప్రస్తుతం 29 ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఆపరేషన్‌లో ఉన్నాయ్. ఈ కొత్త ఒప్పందంతో సుమారు 6 కొత్త స్క్వాడ్రన్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఉన్న 36 రాఫెల్ జెట్లు, నేవీ కోసం ఆర్డర్ చేసిన 26 రాఫెల్-M జెట్లతో కలిపి భారత్ దగ్గర.. మొత్తం 176 రాఫెల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఇది ఆసియాలోనే అత్యంత శక్తిమంతమైన వైమానిక దళాల్లో ఒకటిగా భారత్‌ను నిలబెడుతుంది. ఫ్రాన్స్‌తో కుదరబోయే ఈ ఒప్పందంలో మరో విశేషం ఏమిటంటే.. మొత్తం 114 జెట్లలో కేవలం 18 మాత్రమే ఫ్రాన్స్ నుంచి నేరుగా ఫ్లై-అవే కండీషన్‌లో కొనుగోలు చేయనున్నారు. మిగిలిన 96 విమానాలు.. భారత్‌లోనే తయారవుతాయ్. మేకిన్ ఇండియా ఫ్రేమ్‌వర్క్ కింద, స్వదేశీ కంటెంట్ 60 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. విమానాల తయారీలో 60 శాతం మేర భారతీయ స్పేర్ పార్ట్స్‌ని వాడనున్నారు. ప్రతిపాదిత కాన్ఫిగరేషన్ కింద.. ఐఏఎఫ్ 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లని ప్రవేశపెడుతుంది. డస్సాల్ట్ ఏవియేషన్ విమానాల స్థానిక తయారీ, అసెంబ్లింగ్ కోసం భారతీయ ప్రైవేట్ రంగ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటుందని భావిస్తున్నారు. రాఫెల్ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి లభిస్తుంది.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి.. రాఫెల్ లాంటి ఫైటర్ జెట్ స్ట్రాంగ్ ఎలిమెంట్. ఇప్పటికే.. ఆపరేషనల్‌లో ఉన్న ఈ విమానం.. దాని అధునాతన సెన్సార్లు, లాంగ్ రేంజ్ దాడి సామర్థ్యం కారణంగా.. అద్భుతంగా కనిపిస్తోంది. మెటియార్ బియాండ్-విజువల్-రేంజ్ మిసైల్, స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్ లాంటి ఆయుధాలను రాఫెల్ మోసుకెళ్లగలదు. అలాంటి రాఫెల్ ఫైటర్ జెట్స్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ శక్తిని డబుల్ చేయనున్నాయ్. పాకిస్థాన్, చైనా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సమన్వయం.. రాఫెల్ జెట్స్ కొనుగోలు వెనక ఉన్న మరో కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత.. ఈ డీల్ టెక్నాలజీ, వాణిజ్య చర్చల దిశగా వెళ్లనుంది. రాబోయే కొద్దిరోజుల్లోనే.. ఈ ఒప్పందం తుదిదశకు చేరుకునే అవకాశం ఉంది.
చైనా సరిహద్దుల్లోని ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో, పాక్ సరిహద్దుల్లోని మైదాన ప్రాంతాల్లో రాఫెల్ జెట్లు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా రాడార్లకు చిక్కకుండా లోతుగా చొచ్చుకుపోయే స్టెల్త్ ఫీచర్లు, సెన్సార్ డేటా ఫ్యూజర్ టెక్నాలజీ.. భారత పైలట్లకు యుద్ధరంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ఇస్తాయి. ఈ డీల్ గనక ఖరారైతే.. రాబోయే దశాబ్దకాలంలో.. భారత గగనతలానికి రాఫెల్ ఒక అజేయమైన రక్షణ కవచంలా మారుతుందనడంలో డౌట్ లేదు. సరిహద్దుల్లో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ని బలోపేతం చేయడం అత్యవసరం. ఇప్పుడున్న స్క్వాడ్రన్ల సంఖ్యని పెంచి.. గగనతలంలో ఆధిపత్యాన్ని చాటుకునేందుకు.. ఈ 114 రాఫెల్ ఫైటర్ జెట్ల ఒప్పందం.. ఓ గేమ్ ఛేంజర్ కానుంది.
సంవత్సరాలు గడిచేకొద్దీ.. యుద్ధ తంత్రం, యుద్ధం చేసే తీరు మారిపోయింది. ఇప్పుడు యుద్ధాలన్నీ చాలావరకు గాల్లోనే. ఎయిర్‌ఫోర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. అంత ధైర్యం. అందుకే.. భారత రక్షణ శాఖ వాయుసేనని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ రాఫెల్ డీల్ కూడా అందులో భాగమే. ఇప్పటికే ఉన్న రాఫెల్ ఫైటర్ జెట్లకి.. మరో 114 యుద్ధ విమానాలు తోడైతే.. భారత్ ఇంకెంత శత్రుదుర్భేద్యంగా మారుతుంది?
యుద్ధ రంగం రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు పదాతి దళాలు, ఫిరంగులతో మొదలైన యుద్ధం, ఇప్పుడు ఆకాశం నుంచి నిప్పులు కురిపించే ఎయిర్‌ఫోర్స్ వైపు మళ్లింది. గగనతలంపై ఎవరికి పట్టు ఉంటే, వారే యుద్ధ విజేతలుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో.. భారత వాయుసేన అమ్ములపొదిలో రాఫెల్ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మరో 114 మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌కి కొనుగోలు చేస్తే.. భారతదేశ రక్షణ కవచం మరింత పటిష్ఠం కానుంది. రాఫెల్ జెట్ల గనక వస్తే.. మొత్తం సమీకరణాలే మారిపోనున్నాయ్. ప్రస్తుతం ఐఏఎఫ్ దగ్గర 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయ్. ఇవి ఇప్పటికే పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో భారత్‌కు వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందించాయి. శత్రువుల నుంచి పొంచి ఉన్న టూ-ఫ్రంట్ వార్‌ని ఎదుర్కోవాలంటే, మనకు కనీసం 42 స్క్వాడ్రన్లు అవసరం. ఈ లోటును పూడ్చడానికి 114 కొత్త యుద్ధ విమానాల రాక అత్యంత కీలకం.
రాఫెల్ అనేది.. కేవలం ఓ ఫైటర్ జెట్ మాత్రమే కాదు. ఇందులో ఉన్న మీటియార్ మిసైల్ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాన్ని చూడకుండానే ధ్వంసం చేయగలదు. 114 కొత్త యుద్ధ విమానాలు తోడైతే.. వాయుసేన శక్తి మరింత పెరుగుతుంది. సరిహద్దుల్లో.. చైనాకు వాయుసేన బలం ఉన్నప్పటికీ, హిమాలయాల ఎత్తులో వారి విమానాలు పూర్తిస్థాయిలో పనిచేయడం కష్టం. కానీ.. రాఫెల్ లాంటి మల్టీరోల్ ఫైటర్ జెట్స్.. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోనూ అద్భుతంగా పనిచేస్తాయ్. అలాంటి రాఫెల్ స్క్వాడ్రన్లు ఎన్ని ఎక్కువుంటే.. శత్రుదేశం మన ఎయిర్‌స్పేస్‌లోకి ఎంటరయ్యేందుకు కూడా వణికిపోతుంది. ఈ 114 విమానాల డీల్ కేవలం కొనుగోలుకే పరిమితం కాదు. ఇందులో ఎక్కువ భాగం విమానాలను భారతదేశంలోనే తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల.. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. దేశీయంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. భవిష్యత్తులో మనమే సొంతంగా అత్యాధునిక జెట్‌లని తయారుచేసుకునే స్థాయికి చేరుకుంటాం.
ఆపరేషన్ సిందూర్‌లో రాఫెల్ ఫైటర్ జెట్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పాకిస్థాన్ వాడిన చైనా మేడ్ PL-15 క్షిపణులని.. రాఫెల్‌లోని ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ సమర్థవంతంగా ఎదుర్కొంది. అలాంటి ఫైటర్ జెట్స్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 160కి పైగా ఉంటే.. ఎలా ఉంటుంది? భారత్ మరింత శత్రుదుర్భేద్యంగా తయారవుతుంది. గాల్లోనే 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం రాఫెల్ సొంతం. శత్రు భూభాగంలోకి వెళ్లకుండానే సుదూర లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. కొత్తగా రాబోయే జెట్లలో అత్యంత శక్తిమంతమైన ఎం88-T-రెక్స్ ఇంజిన్లను వాడే అవకాశం ఉంది. ఇది విమాన వేగాన్ని, శక్తిని.. 20 శాతం పెంచుతుంది.
యుద్ధం రాకూడదని కోరుకోవడం శాంతి కాముకత, కానీ.. యుద్ధం వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటమనేది జాతీయ భద్రత. 114 అదనపు యుద్ధ విమానాలు వాయుసేనలో చేరడమంటే, భారతదేశం తన ఆత్మరక్షణ కోసం ఉక్కు గోడను నిర్మించుకోవడమే. గగనతలం నుంచి రక్షణ కవచం బలంగా ఉంటేనే.. దేశం ఆర్థికంగా, సామాజికంగా, నిర్భయంగా ముందుకు సాగగలదు. రాఫెల్ ఫైటర్ జెట్స్ రాకతో.. భారత్ విశ్వ వేదికపై తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. శత్రుదేశాల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది.
Also Read: ప్రియురాలి పెళ్లి పత్రిక చూసి యువ బాడీబిల్డర్ ఆత్మహత్య
Story by: Anup, Big Tv