Washington Post Reports: అమెరికన్ మీడియా రెచ్చిపోతోంది. హాయిగా ఉన్న దేశాల మధ్య పుల్లలు పెట్టడం దానికి అలవాటుగా మారింది. ముఖ్యంగా, భారత్ విషయంలో అత్యుత్సాహం చూపిస్తోంది. మొన్నటి దాకా భారత్‌పై కెనడాను ఉసిగొల్పిన “ది వాషింగ్టన్ పోస్ట్”.. ఇటీవల, అమెరికాలో మోడీ వ్యతిరేకుల్ని భారత్ టార్గెట్ చేస్తుందంటూ, తప్పుడు ప్రచారం చేసింది. తాజాగా, మరో అభాండానికి ఒడిగట్టింది. చిన్న చిన్న భేదాభిప్రాయాలున్న మల్దీవ్స్-ఇండియా మధ్య పెద్ద మంట పెట్టే నివేదికలు ప్రచురించింది. అంతేనా, పాక్-భారత్ బద్ద శత్రుత్వాన్ని మరింత పెంచడానికి ప్రయత్నం చేసింది. అసలేమైంది..? దీనిపై భారత్ ఎలా స్పందించింది..? ఈ పరిణామం దేనికి దారి తీస్తుంది..?
అంతర్జాతీయంగా భారత్‌కి పెరుగుతున్న పరపతి
పచ్చ కామెర్లు ఉన్నోళ్లకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. అలాగే, అబద్దాలు ప్రచారం చేయడంలో అగ్రగామి అయిన అమెరికా మీడియాకి భారత్ కూడా తప్పుగానే కనిపిస్తోంది. అభిప్రాయాలు చెప్పడానికి, అవాస్తవాలు ప్రచారం చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. గత కొంత కాలంగా.. ది గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్‌లు భారత్‌పై తయారు చేస్తున్న నివేదికలు చూస్తుంటే ఈ తేడా స్పష్టంగానే కనిపిస్తోంది. అంతర్జాతీయంగా భారత్‌కి పెరుగుతున్న పరపతిని ఓర్వలేని వాషింగ్టన్ పోస్ట్ లేనిపోని కథనాలను కుక్ చేస్తోంది. అదిగో పులి అంటే, ఇదుగో తోక.. అన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ ఇటీవలి నివేదికలు భారత్ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.
పాకిస్తాన్‌లో కోవర్ట్ ఆపరేషన్లు చేస్తుందని అభాండాలు
పూర్తి పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నాయి. కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదులను భారతీయ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయనే తప్పుడు కథనాలతో మొదలైన ఈ పైత్యం.. ఇప్పుడు చాలా దూరం వచ్చింది. అమెరికాలో ప్రధాని మోడీని వ్యతిరేకించే వారిని భారత్ బెదిరిస్తుందనే ఆరోపణలు కూడా చేసింది. హిట్ టీమ్ అనే కిరాయి ముఠాను భారత్ తన శత్రువులపై ప్రయోగిస్తుందంటూ అబద్దాలు ప్రచారం చేసింది. ఇక, తాజా ఈ పక్షపాతం హద్దులు మీరింది. ఇటీవల, భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న చిన్నపాటి ఉద్రిక్తలను ఆధారం చేసుకోని.. భారత్‌ను నిందించే ప్రయత్నం చేసింది వాషింగ్టన్ పోస్ట్. అలాగే, పాకిస్తాన్‌లో కోవర్ట్ ఆపరేషన్లు చేస్తుందని కూడా అభండాలు మోపింది. అయితే, ఈ తప్పుడు కథనాలపై భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్‌గా స్పందించింది.
ముయిజ్జూను అధికారం నుండి తప్పించడానికి భారత్ వ్యూహం
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూను అధికారం నుండి తప్పించడానికి భారత్ ప్రయత్నిస్తుందని తాజాగా ది వాషింగ్టన్ పోస్ట్ ఒక నివేదికను ప్రచురించింది. ముయిజ్జూను తొలగించడం కోసం మాల్దీవుల్లోని ప్రతిపక్ష పార్టీలు, న్యూ ఢిల్లీ నుండి $6 మిలియన్ డాలర్లు… అంటే, రూ.50 కోట్ల రూపాయలకు పైగా అడిగినట్లు ఈ అమెరికా న్యూస్ పేపర్ నివేదిక ఆరోపణలు చేసింది. ఈ అభియోగాన్ని, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్రంగా ఖండించారు.
వాష్టింగ్టన్ పోస్ట్ చేసే వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవు
వాష్టింగ్టన్ పోస్ట్ చేసే వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవనీ… విశ్వసనీయత లేనివని అభివర్ణించారు. భారతదేశం పట్ల బలవంతపు శత్రుత్వం ఉండబట్టే, వాషింగ్టన్ పోస్ట్ పత్రిక, విలేఖరలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారనీ… అది వారి విశ్వసనీయతకే వదిలేస్తున్నామని వెల్లడించారు. గత కొంత కాలంగా వాషింగ్టన్ పోస్ట్ వరుస కథనాలు భారతదేశంపై వారికున్న శత్రుత్వానికి అద్దం పడుతున్నాయనీ.. భారతదేశానికి సంబంధించినంతవరకు ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
ముయిజ్జు పార్టీ సభ్యులతో సహా మాల్దీవుల ప్రతిపక్ష రాజకీయ నేతలు
ఇక, వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించిన.. ముయిజ్జు అభిశంసన పథకంలో భాగంగా ముయిజ్జు పార్టీ సభ్యులతో సహా మాల్దీవుల ప్రతిపక్ష రాజకీయ నాయకులైన 40 మంది పార్లమెంటు సభ్యులకు లంచం ఇవ్వాలని అడిగినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదికతో ఈ వివాదం రేగింది. ముయిజ్జూని గద్దె దించడం కోసం “డెమోక్రటిక్ రెన్యూవల్ ఇనిషియేటివ్” అనే ఇన్‌సైడర్ నివేదికను కూడా రూపొందించినట్లు వాషింగ్టన్ నివేదిక వెల్లడించింది. ఈ ప్లాట్‌ను అమలు చేయడానికి, భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలసీస్ వింగ్-RAWకి చెందిన ఒక సీనియర్ అధికారి పనిచేస్తున్నారని తెలిపింది.
40 మంది పార్లమెంటు సభ్యులకు లంచం ఇచ్చినట్లు నింద
మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజ్జూ బాధ్యతలు స్వీకరించిన నెలల తర్వాత ఆయన్ను పదవి నుండి దింపడానికి భారత్ అన్ని విధాలుగా వ్యూహాలు రెడీ చేసిందని కూడా నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా.. 40 మంది మాల్దీవుల ఎంపీలు ముయిజ్జుపై అభిశంసానం తీసుకురావాలని లంచం ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే, ఈ వ్యూహం ఫలించలేదనీ.. ముయిజ్జుపై అభిశంసానానికి సరిపోయే ఓట్లు సాధించలేకపోయినట్లు తెలిపింది.
రీసెర్చ్ అండ్ ఎనాలసీస్ వింగ్-RAW ఆధ్వర్యంలో ప్లాన్
అయితే, ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ-MDPకి నాయకత్వం వహిస్తున్న మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ కూడా వాషింగ్టన్ పోస్ట్ నివేదికను తోసిపుచ్చారు. అధ్యక్షుడు ముయిజ్జుకు వ్యతిరేకంగా ఎలాంటి తీవ్రమైన కుట్ర జరగట్లేదనీ.. అలాంటిది ఏదైనా జరుగుతుందనే సమాచారం కూడా తనకు తెలియదని నషీద్ పేర్కొన్నారు. ఇక, మాల్దీవుల ప్రజాస్వామ్యానికి భారతదేశం ఎప్పుడూ మద్దతు ఇస్తోందనీ.. అలాంటి చర్యలకు భారత్ ఎప్పటికీ పాల్పడదని ఆయన ఉద్ఘాటించారు.
పాకిస్థాన్‌లో భారత్ రహస్య హత్యలు చేసిందన్న వాషింగ్టన్ పోస్ట్
ఇక పోతే, పాకిస్తాన్ గురించి కూడా వాషింగ్టన్ పోస్ట్ ఒక నివేదికను ప్రచురించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌లో భారత్ రహస్య హత్యలు చేసిందని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పేర్కొంది. అయితే, దీనిపైన కూడా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైస్వాల్ స్పందించారు. పాకిస్తాన్ పెంచి పోషించిన తీవ్రవాద గ్రూపులే పాకిస్తాన్‌పై కుట్ర చేస్తున్నాయనీ… పాకిస్తాన్ గురించి గతంలో అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్, హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ‘పాకిస్తాన్ తన పెరట్లో పాములను ఉంచుకొని.. అవి పొరుగువారిని మాత్రమే కాటువేయాలని ఆశించకూడదు’ అనే హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యల్ని జైస్వాల్ గుర్తు చేశారు.
పాకిస్తాన్‌లో భారత్ “షాడో” ఆపరేషన్లు
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం, పాకిస్తాన్‌లో భారత్ “షాడో” ఆపరేషన్లు చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం పేరులేని పాకిస్తాన్ అధికారులు, పాశ్చాత్య అధికారుల నుండి పొందినట్లు వెల్లడించింది. ఈ సీక్రెట్ ఆపరేషన్ కోసం, భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్.. 2021 నుంచి పాకిస్థాన్‌లో, కనీసం అర డజను మందిని చంపడానికి వ్యూహాలు పన్నుతున్నట్లు పేర్కొంది. నిజానికి, పాకిస్తాన్‌లో జరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాల ప్రభావం ఇటీవల స్పష్టంగా ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్-అఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
హిల్లరీ క్లింటన్ చెప్పినట్లు పాముకి పాలిచ్చి పెంచిన పాకిస్తాన్
రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలకు పాత నేపధ్యమే కారణమని అందరికీ తెలసిన విషయమే. హిల్లరీ క్లింటన్ చెప్పినట్లు పాముకి పాలిచ్చి పెంచిన పాకిస్తాన్.. పాములను తన పెరట్లో ఉంచుకుని, అవి పక్కనున్నోళ్లని కాటేయాలని ఆశించింది. కానీ, చివరికి, ఆ పాములు పెరట్లో ఉన్నవారిపైనే తిరుగబడటం స్పష్టంగా కనిపించింది. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్‌ల అధికారం తిరిగి రావడానికి పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ హస్తం కూడా లేకపోలేదు. ఏళ్ల తరబడి పాకిస్తాన్ పోషించిన తాలిబాన్ ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశాన్ని కభళించడానికి రెడీ అయ్యింది.
జనవరి 3న న్యూఢిల్లీలో భారత్-మాల్దీవుల విదేశాంగ మంత్రులు
వాషింగ్టన్ పోస్ట్ ఏ ఉద్దేశంతో భారత్‌పై విషం చిమ్మినప్పటికీ.. అవన్నీ అసత్య ఆరోపణలని స్పష్టంగానే అర్థమవుతుంది. దీనికి రుజువు.. తాజాగా భారత్-మాల్దీవుల విదేశాంగ మంత్రులు జనవరి 3న న్యూఢిల్లీలో సమావేశం కావడమే! మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్, మూడు రోజుల అధికారిక పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌తో పాటు ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. దీనికి ముందు, గతేడాది అక్టోబర్‌లో భారత్‌లో మల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జూ కూడా అధికారిక పర్యటన కోసం వచ్చారు.
భారతదేశం ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానం, ‘విజన్ సాగర్’
అప్పుడు, కుదిరిన అవగాహనలపై సాధించిన పురోగతిని.. ఇప్పుడు, రెండు దేశాల విదేశాంగ మంత్రులు సమీక్షించారు. అలాగే, వాటిపై మరింత దృష్టి సారించాల్సిన అంశాలను కూడా చర్చించారు. ఈ సందర్భంగా.. మాల్దీవులతో భారత్ సంబంధాల ప్రాముఖ్యతను జైశంకర్ తెలిపారు. భారతదేశం ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానంతో పాటు.. ‘విజన్ సాగర్’లో భాగంగా పొరుగు ప్రాంతాల్లో అందరికీ భద్రత, వృద్ధికి సంబంధించి, మాల్దీవులకు నిరంతర మద్దతు ఉంటుందని భారత్ హామీ ఇచ్చినట్లు సమావేశంలో జైశంకర్ వెల్లడించారు.
చారిత్రకంగా రెండు దేశాలకు సుదీర్ఘ సంబంధం
ఇక, తన తాజా పర్యటనపై మాల్దీవుల విదేశాంగ శాఖా మంత్రి అబ్దుల్లా ఖలీల్ కూడా స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో.. ‘ఇరు దేశాలు మా ద్వైపాక్షిక సహకారంపై పురోగతిని సమీక్షించామని’ అన్నారు. అలాగే, ‘కీలక రంగాలలో పరస్పర చర్యలను పెంపొందించడానికి బలమైన నిబద్ధత ఉందనీ.. చారిత్రకంగా రెండు దేశాల సుదీర్ఘ సంబంధా్లో మాల్దీవులకు భారతదేశం తిరుగులేని మద్దతుగా ఉందనీ.. ఈ సహాయానికి ప్రశంసలు తెలియజేసామని’ తెలిపారు.
‘హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్’లపై సంతకం
ఇరు దేశాల ప్రజల ప్రయోజనం, శ్రేయస్సు కోసం.. పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా మా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మాల్దీవులు దృఢ నిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక, సమావేశం తర్వాత రెండు దేశాలూ ‘హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లకు’ సంబంధించి అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపారు. అట్టడుగు స్థాయి ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ప్రాజెక్ట్ ఆధారిత సహకారంలో మూడవ దశను ప్రారంభించినట్లు” స్పష్టం చేశారు.
భారతీయ గ్రాంట్ అసిస్టెన్స్, లైన్-ఆఫ్-క్రెడిట్ ఇనిషియేటివ్
అయితే, మాల్దీవుల విదేశాంగ శాఖ రీడౌట్ కూడా.. మాల్దీవులకు భారత్ ఇస్తున్న ఆర్థిక సహకారాన్ని ప్రశంసించింది. భారతీయ గ్రాంట్ అసిస్టెన్స్, లైన్-ఆఫ్-క్రెడిట్ ఇనిషియేటివ్‌ల ద్వారా ఆర్థిక భాగస్వామ్యాన్ని, కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిని మంత్రులిద్దరూ అంగీకరించినట్లు వెల్లడించింది. మాల్దీవుల్లో కొనసాగుతున్న ఆర్థిక సవాళ్లను తగ్గించడానికి భారత్ మద్దతు, సహాయానికి.. మాల్దీవుల ప్రభుత్వం నుండి ప్రసంశలు తెలియజేసినట్లు పేర్కొంది. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో సన్నిహిత సహకారం.. అలాగే, మాల్దీవుల సామాజిక ఆర్థిక అభివృద్ధిలో భారతదేశం నిబద్ధతను కూడా మంత్రి ఖలీల్ అంగీకరించినట్లు తెలిపింది.
మాల్దీవుల సామాజిక ఆర్థిక అభివృద్ధిలో భారతదేశం నిబద్ధత
ఏది ఏమైనప్పటికీ, భారత్-మాల్దీవులు 2024 వేసవి నేటికే ద్వైపాక్షిక సంబంధాలను సరిదిద్దుకోవడం ప్రారంభించాయి. మే నెలలో న్యూ ఢిల్లీ మల్దీవులకు ఆర్థికంగా సహకారం ఇచ్చింది. ఆ తర్వాత సంబంధాలు మెరుగుపడ్డాయి. అలాకాక, గత సంవత్సరం ప్రారంభంలో ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జును పదవి నుండి తొలగించడానికి.. మాల్దీవుల ప్రతిపక్షంతో కలిసి భారత్ ప్రయత్నించి ఉంటే.. 2024 అక్టోబర్‌లో ముయిజ్జు భారత్ పర్యటించి ఉండేవారు కాదు. అలాగే, తాజాగా న్యూ ఢిల్లీలో ఇరు దేశాల మంత్రుల సమావేశం జరిగుండేదే కాదు. దీనితో, భారతదేశం మీద వాషింగ్టన్ పోస్ట్ తయారుచేసిన నివేదిక ట్రాష్ అని తేలిపోయింది. ఇందులో ఎలాంటి విశ్వసనీయత లేదని అర్ధం అయ్యింది.
దశాబ్దాలుగా రాడికల్ మిలిటెంట్లను అనుమతించిన పాక్
ఇక, పాకిస్తాన్ గురించి భారత్ ఎప్పుడు స్పష్టంగా వాస్తవాలనే మాట్లాడుతూ వచ్చింది. కానీ, పాకిస్తానే తన లోతైన వ్యూహాత్మక చర్యల ముసుగులో.. దశాబ్దాలుగా రాడికల్ మిలిటెంట్లను అనుమతించింది. తమ దేశంలోనే తీవ్రవాద శిక్షణకు అనుమతి ఇచ్చింది. తర్వాత, వారిలో చాలా మంది తాలిబాన్, ఇతర టెర్రర్ గ్రూపులతో చేతులు కలిపారు. ఈ సందర్భంలో.. భారతదేశంలోకి టెర్రరిస్టులను పంపడానికి పాకిస్తాన్ తాలిబన్‌ను ఉపయోగించుకుంది.
1990లు-2000లలో తాలిబాన్-నియంత్రిత ప్రాంతాల్లో శిక్షణ
కాశ్మీర్ సమస్యను రహస్యంగా ఎదుర్కోవడానికి భారత్‌కు వ్యతిరేకంగా తాలిబాన్‌లను వ్యూహాత్మక సాధనంగా పాకిస్తాన్ ఉపయోగించుకుంటోందని కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. జైష్-ఎ-మొహమ్మ, లష్కరే తోయిబా వంటి గ్రూపులు 1990లు-2000లలో తాలిబాన్-నియంత్రిత ప్రాంతాలలో శిక్షణ పొందుతూ చాప కింద నీరులా పనిచేశాయి.
పాకిస్తాన్ ఆశించిన ఈ ప్రాక్సీ యుద్ధానికి ఎదురుదెబ్బ
అయితే, పాకిస్తాన్ ఆశించిన ఈ ప్రాక్సీ యుద్ధానికి ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. కాబూల్ కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ తాలిబాన్ గ్రూపు, తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్‌లు కలిసి పాక్‌ను స్వాధీనం చేసుకోడానికి పన్నాగం పన్నాయి. తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్.. అఫ్ఘాన్‌లో ప్రభుత్వం నడుపుతున్న తాలిబాన్‌తో సీక్రేట్ ఫ్రెండ్‌షిప్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారింది. తాలిబాన్‌తో రెండు వైపుల నుండి ఆడుతున్న పాకిస్తాన్ సుదీర్ఘ ఆటలో పాక్‌కు ఎదురుదెబ్బ తగులుతోంది. పాకిస్తాన్ ఒకప్పుడు వ్యూహాత్మక ఆస్తిగా అనుకున్న తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్ స్థిరత్వాన్నే దెబ్బతీసే శక్తిగా మారింది.
డిసెంబరు 10న ప్రచురించిన వాషింగ్టన్ పోస్ట్ మరో నివేదిక
నేపధ్యమంతా ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ.. అమెరికా మీడియా సంస్థ ‘ది వాషిగ్టన్ పోస్ట్’ ఇంతగా అబద్దాలను ఎందుకు ప్రచారం చేస్తుందన్నది దానికే తెలియాలి. డిసెంబరు 10న ప్రచురించబడిన వాషింగ్టన్ పోస్ట్ మరో నివేదికలో కూడా భారత్‌పై బురదచల్లే ప్రయత్నం చేసింది. భారతదేశానికి సంబంధించిన డిస్ఇన్ఫో ల్యాబ్ అనే షాడో సంస్థ నిర్వహించే రహస్య కార్యకలాపాలను ఈ నివేదికలో వెల్లడించింది. 2020 నుండి, ఈ సంస్థ డోసియర్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అమెరికా నుండి విమర్శలు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇందులో పేర్కొంది.
మోదీపై అమెరికా నుండి విమర్శలు చేస్తున్నవారే లక్ష్యం
యూఎస్ ప్రభుత్వ అధికారులు, పరిశోధకులు, మానవతావాద సంఘాలు, భారతీయ అమెరికన్ కార్యకర్తలు భారత్‌కు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్లు డిస్‌ఇన్ఫో ల్యాబ్ పేర్కొందని వాషింగ్టన్ నివేదిక తెలిపింది. డిస్ఇన్ఫో ల్యాబ్ చేసిన ఈ ఆరోపణలు మోడీ అనుకూల వర్గాల ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు పేర్కొంది. ఆ మధ్య, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ చీఫ్ జార్జ్ సోరోస్ వాదనలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచారం చేసింది.
ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్‌లలో RAW ఏజెంట్ల పేరుతో ఆరోపణలు
అమెరికా, కెనడాలోనే కాదు. ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్‌లలో కూడా భారత్ రా ఏజెంట్లు ఆరోపణలు ఎదుర్కోవడం వెనుక వాషింగ్టన్ పోస్ట్ లాంటి అమెరికా మీడియా సంస్థల తప్పుడు ప్రచారం ఉందనడంలో సందేహం లేదు. అందుకే, విదేశాల్లో రా ఏజెంట్లుగా ఉన్నారని ముద్ర పడిన వ్యక్తులకు, ఆయా దేశాల భద్రతా సంస్థలకు మధ్య అనేక గొడవలు ఉన్నాయి. వస్తున్నాయి. వాస్తవానికి, ఇలాంటి విషం చిమ్మే ప్రచారాలు కేవలం ద్వేషంతో మాత్రమే అగవు.. కరోనా వైరస్‌లా ప్రపంచమంతా వ్యాపిస్తాయి. అది చివరికి, భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. అదే, ఇప్పుడు అగ్రదేశానికి కూడా అవసరం. అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను దెబ్బతీయాలంటే ఇలాంటి కుట్రలు చేయాల్సిందే. అందుకే, ది వాషింగ్టన్ పోస్ట్, ది గార్డియన్ వంటి చాలా పాశ్చాత్య మీడియాలు బలవంతంగా భారత్‌పై బురుద చట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.