Ex-Armymen 2006 Murder Kerala | ఒక మహిళను పెళ్లి పేరుతో మోసం చేసి ఆమెకు గర్భవతి చేశాడు ఓ సైనికాధికారి. ఫలితంగా ఆమెకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తరువాత ఆమెను అడ్డుతొలగించుకునేందుకు తన స్నేహితుడితో కుట్ర చేసి హత్య చేశాడు. పోలీసులు వారి కోసం వెతుకుతుండగా తప్పించుకొని పారిపోయారు. 19 ఏళ్ల తరువాత ఇప్పుడు వారిద్దరూ అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన కేరళలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాకు చెందిన దిబిల్ కుమార్ (28) అనే యువకుడికి రంజిని (24) అనే యువతితో 2005లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ కొల్లం జిల్లాలోని ఆంచల్ పట్టణంలోనే నివసించేవారు. ఈ క్రమంలో రంజిని గర్భవతి అయింది. ఆ సమయంలో దిబిల్ కుమార్ దేశ సరిహద్దులో సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రంజిని గర్భవతి అనే విషయం తెలిసి తనకు ఆమె గర్భంతో సంబంధం లేదని ఆమెను కలవడం మానేశాడు.
ఆర్మీ నుంచి చెప్పాపెట్టకుండా తిరిగి వచ్చేశాడు. రంజిని, దిబిల్ కుమార్ మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో 2006 జనవరిలో రంజిని ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండానే రంజిని ఇద్దరు పిల్లల తల్లి కావడంతో ఆమెకు సమాజంలో సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఆమె స్టేట్ వుమెన్ కమిషన్ (రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్) లో దిబిల్ కుమార్ పై ఫిర్యాదు చేసింది. దీంతో చిక్కుల్లో పడ్డ దిబిల్ కుమార్ సైన్యంలో తనతో పాటు పనిచేసిన తన ప్రాణ స్నేహితుడు రాజేష్ ని సంప్రదించాడు. ఆ తరువాత రాజేష్ రంజని, ఆమె తల్లిని కలిసి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. దిబిల్ కుమార్ తో రంజని వివాహం తాను జరిపిస్తానని నమ్మించాడు.
Also Read: రూ.30 లక్షల కోసం బిచ్చగాడి హత్య.. అంతా పెద్ద స్కామ్.. కానీ చిన్న తప్పుతో..
ఈ క్రమంలో ఫిబ్రవరి 10, 2006న రంజిని తల్లి పిల్లల బర్త్ సర్టిఫికేట్లు తీసుకురావడానికి బయటికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న రంజిని, ఆమె ఇద్దరు కవల పిల్లలను రాజేష్, దిబిల్ కుమార్ హత్య చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. రంజిని తల్లి ఇంటికి వచ్చి చూస్తే.. అక్కడ అంతా రక్త సిక్తమై ఉంది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సైనికాధికారులైన దిబిల్ కుమార్ , రాజేష్ కోసం గాలించారు. కానీ వారి జాడ ఎక్కడ తెలియలేదు. చివరికి వారు సైన్యంలో ఉంటారని అనుమానంతో ఇండియన్ ఆర్మీకి వారిద్దరూ హత్య కసులో నిందితులని తెలిపారు.
కానీ రాజేష్, దిబిల్ కుమార్ చాలాకాలంగా సైన్యంలో లేరని.. విధులకు హాజరు కావడం లేదని తెలిసి వారి పేర్లను మార్చి 2006లో సైన్యం నుంచి పారిపోయిన వారి జాబితాలో చేర్చింది. ఈ కేసు కేరళ హై కోర్టు వరకు చేరింది. నిందితులిద్దరూ చాలా కాలంగా పరారీలో ఉండడంతో హై కోర్టు.. 2010లో ఈ కేసుని సిబిఐ అధికారులు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరి సమాచారం తెలిపిన వారికి పోలీసులు రూ.2 లక్షలు బహుమానం కూడా ప్రకటించారు. కానీ 19 ఏళ్ల వరకు ఆ ఇద్దరూ ఎక్కడున్నారో ఎవరికీ తెలియలేదు.
అయితే వారం రోజుల క్రితం సిబిఐ అధికారులకు వారిద్దరి గురించి అనుకోకుండా సమాచారం అందింది. ఇద్దరూ పాండిచ్చేరిలో మారు పేర్లతో జీవిస్తున్నారని తెలిసింది. అక్కడే మారు పేర్లతో ఆధార్ కార్డులు చేసుకొని.. టీచర్ ఉద్యోగం చేస్తున్న ఇద్దరు కేరళ మహిళలను పెళ్లి చేసుకొని పిల్లలతో ఉన్నారని అధికారులు తెలుసుకున్నారు. సిబిఐ అధికారులు వారే వీరు అని పూర్తిగా ధృవీకరణ చేసుకున్నాక.. శుక్రవారం జనవరి 3, 2025న అరెస్ట్ చేసి కొచ్చి తీసుకొచ్చారు. ఎర్నాకులం కోర్టులో శనివారం ప్రవేశపెట్టారు. కోర్టు వారిని జనవరి 18 వరకు విచారణ కోసం పోలీస్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది