BigTV English

India vs Pakistan War: పాక్ కుంభస్థలం బద్దలే.. మ్యాప్ నుండి అవుట్..!

India vs Pakistan War: పాక్ కుంభస్థలం బద్దలే.. మ్యాప్ నుండి అవుట్..!

India vs Pakistan War: సైన్యానికి సెలవులు రద్దు చేశారు! లీవుల్లో ఉన్నవాళ్లని వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు! పాక్ సరిహద్దుల్లో బలగాల మోహరింపు మొదలైంది. భారత త్రివిధ దళాలు అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే.. పాకిస్థాన్ బోర్డర్‌లో కాల్పులు మొదలయ్యాయి. ఇవన్నీ చూస్తుంటే దాయాది దేశంతో యుద్ధం ఖాయమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు యుద్ధమే అనివార్యమైతే.. ఏం జరగబోతోంది? భారత్-పాక్ సైనిక బలమెంత? సమయం సరదా పడితే.. సమరంలో గెలిచేదెవరు?


అందరి కళ్లు ఇప్పుడు పాకిస్థాన్ బోర్డర్ మీదే!

26 ఏళ్ల తర్వాత మళ్లీ యుద్ధం రాబోతోందా?


పాక్ బలుపుని దించే సమయం వచ్చేసిందా?

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత మొత్తం పరిస్థితులే మారిపోయాయి. ఉగ్రవాదులను ఎగదోసి.. అమాయక టూరిస్టుల దేహాల్లోకి తూటాలను దించి.. దాయాది దేశం పాకిస్థాన్ ఎప్పటికీ క్షమించరాని తప్పు చేసింది. 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఆ ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన నరమేధం.. పహల్గామ్ ఉగ్రదాడి. మంచుకొండల్లో జరిగిన ఈ మారణహోమం తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. భారత్ మొత్తం అట్టుడికిపోతోంది. భారతీయులంతా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు.

బోర్డర్ లో ఏ క్షణం.. ఏమైనా జరగొచ్చనే అంచనా

పాక్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా బుద్ధి చెప్పాలనే డిమాండ్లు మొదలయ్యాయ్. ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే.. ఇంకోసారి పాకిస్థాన్ సైన్యం గానీ, ఆ దేశం ఎగదోసే టెర్రరిస్టులు గానీ.. ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటేనే.. ఒక్కొక్కడికి ఎకరం తడిసిపోవాలనేలా ప్రతీకారం తీర్చుకోవాలంటున్నారు. ఇప్పటికే వివిధ రకాలుగా పాకిస్థాన్‌పై చర్యలు తీసుకుంది భారత సర్కార్. పాక్‌ని ఎడారి చేసేందుకు.. వ్యూహాత్మకంగా సింధూ నది జలాలను ఆపేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనిక సన్నద్ధతని పెంచింది. దాంతో.. భారత్ కూడా తన బలగాలను సరిహద్దుల్లో మోహరిస్తోంది. బోర్డర్‌లో ఏ క్షణం.. ఏమైనా జరగొచ్చనే అంచనాలున్నాయి.

ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి భారత త్రివిధ దళాలు

ఇప్పటికే.. ఇండియన్ ఆర్మీ సెలవులు రద్దు చేసింది. లీవుల్లో వెళ్లిన వాళ్లని కూడా తిరిగి వచ్చి వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీ.. ఇలా త్రివిధ దళాలన్నీ ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా.. పాకిస్థాన్‌తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా భారత్ రద్దు చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన రఫేల్, సుఖోయ్ 30 యుద్ధ విమానాలు కూడా సన్నద్ధమైపోయాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అరేబియా సముద్రంలోకి ఎంటరైపోయింది. భారత దళాలన్నీ.. ఇప్పుడు పాకిస్థాన్ వైపు కదులుతున్నాయి. దాంతో రెండు దేశాల సరిహద్దుల్లో హీట్ అమాంతం పెరిగిపోయింది. భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయడంతో.. పాకిస్థాన్ అప్పుడే కవ్వింపు చర్యలు మొదలుపెట్టింది.

యుద్ధం అనివార్యమైతే.. పాకిస్థాన్ తట్టుకోగలదా?

అవతలి వైపు నుంచి పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. భారత సైన్యం కూడా దీటుగా బదులిస్తోంది. మరోవైపు.. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ కూడా తన యుద్ధ విమానాలను కరాచీలోని సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి భారత సరిహద్దులకు దగ్గరగా ఉన్న లాహోర్, రావల్పిండి ఎయిర్‌బేస్‌లకు తరలిస్తోంది. ఈ వరుస పరిణామాలన్నింటిని చూస్తుంటే రెండు దేశాల మధ్య దాదాపు యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో.. ఇప్పుడు గనక ఇండియా-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే.. ఎవరి బలమెంత? సైనిక బలగమెంత? అనే చర్చ కూడా సాగుతోంది. యుద్ధం అనివార్యమైతే.. ఇండియాని పాకిస్థాన్ తట్టుకోగలదా?

9వ స్థానం నుంచి 12వ స్థానానికి పజిపోయిన పాకిస్థాన్

గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సైన్యాల జాబితాలో భారత్.. నాలుగో స్థానంలో ఉంది. ఇదే సమయంలో పాకిస్థాన్.. తొమ్మిదో స్థానం నుంచి 12వ స్థానానికి పడిపోయింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్.. ఒక దేశం పోరాట సామర్థ్యాన్ని నిర్ణయించేందుకు.. ఆ దేశ జీడీపీ, జనాభా, సైనిక బలం, ఆయుధాలు, కొనుగోలు శక్తి లాంటి 60కి పైగా అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ లెక్కన.. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం గనక వస్తే.. రెండు దేశాల సైనిక బలం ఎంత అనే అంచనాలు మొదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ బడ్జెట్ 6 లక్షల 80 వేల కోట్లుగా ఉంది.

సరికొత్త ఆయుధాలను సమకూర్చుకుంటున్న భారత్

ఇది.. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల కంటే.. తొమ్మిదిన్నర శాతం పెరిగింది. ఇక పాకిస్థాన్ ఈ ఆర్థిక సంవత్సరంలో తన రక్షణ బడ్జెట్‌ని 159 బిలియన్ డాలర్లకు పెంచుతుందని రిపోర్ట్స్ చెబుతున్నాయ్. దేశ రక్షణ విషయంలో భారత్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అధునాతన ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేస్తోంది. యుద్ధం వచ్చినా, రాకపోయినా.. పక్కలో బల్లెంలా మారిన పాకిస్థాన్‌, చైనాని ఎప్పటికీ నమ్మటానికి వీల్లేదు. అందువల్లే.. భారత్ ఆయుధాల విషయంలో ఒక అడుగు ముందే ఉంటోంది. దాడికి ముందే సరైన వ్యూహంతో సిద్ధంగా ఉంటోంది.

ఆ దేశాల సైనిక బలగమెంత? ఆయుధ బలమెంత?

యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయనేది ఎంత నిజమో.. ఆయుధాలే యుద్ధాన్ని గెలిపిస్తాయన్నది కూడా అంతే నిజం. యుద్ధం గెలవాలంటే వ్యూహం ఒక్కటే సరిపోదు.. అధునాతన ఆయుధ వ్యవస్థలు కూడా కావాలి. రెండు దేశాల మధ్య ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు మొదలైనా.. ముందుగా చర్చకు వచ్చేది.. ఆ దేశాల సైనిక బలగమెంత? ఆయుధ బలమెంత? అనే దాని గురించే! మరి.. పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది?

పాకిస్థాన్‌ దగ్గర 6 లక్షల 54 వేల మంది సైన్యమే ఉంది

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్.. త్రివిధ దళాల బలగాల విషయంలో భారత్-పాక్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సైనికుల పరంగా చూస్తే.. భారత్ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 14 లక్షల 55 వేల 550 మంది యాక్టివ్ ఫోర్స్ ఉంటే.. పాకిస్థాన్‌ దగ్గర 6 లక్షల 54 వేల మంది సైన్యమే ఉంది. భారత్ దగ్గర రిజర్వ్ ఫోర్సెస్ 11 లక్షల 55 వేల మంది ఉంటే.. పాకిస్థాన్ దగ్గర 2 లక్షల 80 వేల ఫోర్స్ మాత్రమే ఉంది. ఇక.. పారామిలిటరీ దళాల విషయానికొస్తే.. భారత్ దగ్గర 25 లక్షల 27 వేల మంది బలగాలు ఉండగా.. పాకిస్థాన్ దగ్గర 5 లక్షల పారామిలిటరీ దళం మాత్రమే ఉంది. మొత్తంగా చూసుకుంటే.. ఇండియా దగ్గర మిలిటరీ ఫోర్స్ 51 లక్షల 37 వేలకు పైగా ఉంటే.. పాకిస్థాన్ దగ్గర మొత్తం సైన్యం కలిపి 14 లక్షల 34 వేల మంది ఉన్నారు.

యుద్ధ ట్యాంకుల్లోనూ.. భారత్ ఆధిపత్యమే కొనసాగుతోంది.

యుద్ధ ట్యాంకుల్లోనూ.. భారత్ ఆధిపత్యమే కొనసాగుతోంది. మన దగ్గర 4 వేల 201 యుద్ధ ట్యాంకులు ఉండగా.. పాకిస్థాన్ దగ్గర 2 వేల 627 ఉన్నాయి. సాయుధ వాహనాలు భారత్ దగ్గర లక్షా 48 వేల 594 ఉన్నాయి. పాక్ దగ్గర కేవలం 50 వేల 523 మాత్రమే ఉన్నాయి. ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్ వెహికిల్స్ భారత్ దగ్గర 2 వేల 415 ఉంటే.. పాకిస్థాన్ దగ్గర 2 వేల 300 ఉన్నాయి. ఇక.. ఆర్మ్‌డ్ పర్సనల్ క్యారియర్స్.. భారత్ దగ్గర 4 వేల 391 ఉండగా.. పాకిస్థాన్ దగ్గర 14 వందలు మాత్రమే ఉన్నాయి. ఫీల్డ్ ఆర్టిలరీ ఇండియా దగ్గర 3 వేల 975 ఉండగా.. పాక్ దగ్గర 2 వేల 629 ఉన్నాయి. ఇవే గాక.. ఇండియన్ ఆర్మీ దగ్గర టీ-90 భీష్మ, అర్జున్ ట్యాంకులు, బ్రహ్మోస్ మిస్సైల్, పినాక రాకెట్ సిస్టమ్ లాంటి అధునాతన ఆయుధాలున్నాయి.

ఇండియా దగ్గర మొత్తం 2 వేల 229 ఎయిర్‌క్రాఫ్ట్స్

ఎయిర్‌ఫోర్స్ విషయానికొస్తే.. పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. భూమి మీదే కాదు గగనతలంలోనూ మన ఆధిపత్యమే కొనసాగుతోంది. ఇండియా దగ్గర మొత్తం 2 వేల 229 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉండగా.. వాటిలో 513 యుద్ధ విమానాలున్నాయి. పాకిస్థాన్ దగ్గర మొత్తం 13 వందల 99 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉండగా.. వాటిలో 328 యుద్ధ విమానాలున్నాయి. ఐఏఫ్ దగ్గర 6 ఏరియల్ ట్యాంకర్లు ఉండగా.. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 4 ఏరియల్ ట్యాంకర్లే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 899 హెలికాప్టర్లు ఉండగా.. పాక్ దగ్గర 373 హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దెబ్బ ఎలా ఉంటుందో.. దాయాది దేశానికి బాగా తెలుసు

ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ విషయానికొస్తే.. రెండు దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భారత్ దగ్గర 276 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉంటే.. పాకిస్థాన్ దగ్గర 64 మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దెబ్బ ఎలా ఉంటుందో.. దాయాది దేశానికి బాగా తెలుసు. బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ నుంచి ఇప్పటికీ పాక్ తేరుకోవడం లేదు. ఇప్పుడు గనక యుద్ధమంటూ మొదలైతే.. ఐఏఎఫ్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో.. పాకిస్థాన్ ఊహకు కూడా అందదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బంగాళఖాతం, అరేబియా సముద్రంతో సరిహద్దు

నేవీ విషయానికొస్తే.. భారత్‌కు బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో.. ఆర్థిక, భద్రతా ప్రయోజనాలతో కూడిన పొడవైన సముద్ర సరిహద్దు కలిగి ఉంది. అదే.. పాకిస్థాన్ మాత్రం కేవలం అరేబియా వెంబడి మాత్రమే సముద్ర సరిహద్దు కలిగి ఉంది. ఇక.. పాకిస్థాన్ నావల్ ఫ్లీట్‌తో పోలిస్తే.. భారత నావికాదళం చాలా పెద్దదే కాదు.. అంతకుమించి బలమైనది కూడా. ఇండియా దగ్గర 293 నౌకల నావల్ ఫ్లీట్ ఉంటే.. పాకిస్థాన్ దగ్గర కేవలం 121 నౌకల నావల్ ఫ్లీట్ మాత్రమే ఉంది. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ విషయానికొస్తే.. ఇండియాదే పైచేయిగా ఉంది.

ఇండియా దగ్గర 18 సబ్‌మెరైన్లు

మన దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. పాకిస్థాన్ దగ్గర ఇలాంటివి ఒక్కటి కూడా లేవు. ఇక.. ఫ్రిగేట్స్ భారత్ దగ్గర 14 ఉంటే.. పాక్ దగ్గర 9 ఉన్నాయి. నేవీలో కీలకమైన సబ్‌మెరైన్ల విషయానికొస్తే.. రెండు దేశాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఇండియా దగ్గర 18 సబ్‌మెరైన్లు ఉన్నాయి. ఇందులో.. బాలిస్టిక్ మిస్సైల్‌ని ఫైర్ చేసే సిస్టమ్ కూడా ఉంది. అదే.. పాకిస్థాన్ దగ్గర కేవలం 8 సబ్‌మెరైన్లు మాత్రమే ఉన్నాయి. ఒక్క డిస్ట్రాయర్ కూడా లేదు.

డిస్ట్రాయర్లు, కార్వెట్‌లు, ఫ్రిగేట్‌లు

ఇండియన్ నేవీ దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్‌తో పాటు డిస్ట్రాయర్లు, కార్వెట్‌లు, ఫ్రిగేట్‌ల లాంటివన్నీ.. ఇండియాని బ్లూ వాటర్ నేవీగా మార్చాయి. అంటే.. ఇండియా ప్రపంచవ్యాప్తంగా పనిచేయగలిగే మారిటైమ్ ఫోర్స్‌గా ఉంది. మన దగ్గరున్న యుద్ధ విమానాలను, ఇతర ఆయుధ వ్యవస్థలను.. మన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లతో ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుంటుంది. అదే పాకిస్థాన్ నేవీ.. గ్రీన్ వాటర్ నేవీగా పనిచేస్తోంది. అంటే.. పాక్ నావికాదళం బలం తన సముద్ర సరిహద్దుకు మాత్రమే పరిమితం. సైనిక బలం పరంగా భారత్‌తో పాక్‌కు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది.

పాక్ కవ్వింపు చర్యలకు బదులిచ్చేందుకు ఇండియా రెడీ!

నేల, నింగి, సముద్రం.. ఇలా ఎక్కడైనా సరే భారత బలగాలదే పైచేయి అవుతుంది. యుద్ధమంటూ వస్తే.. సరిహద్దుల్లో మన త్రివిధ దళాల ఆధిపత్యమే కొనసాగుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా బోర్డర్‌లో పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. భారత సరిహద్దులకు దగ్గరలో యుద్ధ విమానాలను మోహరించడం, యుద్ధ సన్నాహాలు చేయడం లాంటివన్నీ.. పాక్ అతి ప్రవర్తకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పాక్ కవ్వింపు చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు ఇండియా కూడా సన్నద్ధంగానే ఉంది. బోర్డర్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. ఎప్పుడైనా, ఏమైనా జరగొచ్చనే చర్చ బలంగా వినిపిస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×