Indian Defence Failure: ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. భారత త్రివిధ దళాలు.. వేటికవే సాటి. శత్రు దేశాలు ఏమాత్రం తోక జాడించినా.. వెంటనే దీటుగా సమాధానం చెప్పగల సత్తా ఉన్న సాయుధ దళాలు మనవి. అయితే.. యుద్ధ విమానాల విషయంలో ఇండియా పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. ఐఏఎఫ్‌కి ఏడాదికి 40 కొత్త ఫైటర్ జెట్స్ అవసరమవుతాయని చెప్పడంలో ఆంతర్యమేంటి? ఇంకొన్నేళ్లలో.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ప్రపంచంలో గుర్తింపు పొందాలంటే.. వైమానిక రంగంలో అభివృద్ధే కీలకమా?
మన ఎయిర్‌ఫోర్స్ పైకి కనిపిస్తున్నంత స్ట్రాంగ్‌గా లేదా?
ఎయిర్ చీఫ్ మార్షల్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి?
ఏడాదికి 40 కొత్త ఫైటర్ జెట్స్ కావాల్సిందేనా?
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కనిపిస్తున్నంత స్ట్రాంగ్‌గా లేదా?
ఇదే.. ఇప్పుడు నడుస్తున్న చర్చ. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో.. యుద్ధ విమనాల సామర్థ్యం గురించి.. ఎయిర్ చీఫ్ మార్షల్ ఇటీవల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ డిబేట్‌కి దారితీశాయి. మిగతా దేశాలతో పోలిస్తే.. ఫైటర్ జెట్స్ విషయంలో మనమెంత వెనుకబడి ఉన్నామో అందరికీ అర్థమయ్యేలా చేశాయి. ఇప్పటికిప్పుడు శత్రు దేశాలు దాడి చేస్తే.. తిప్పికొట్టగల సామర్థ్యం మన ఎయిర్‌ఫోర్స్ దగ్గర పుష్కలంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా, రాబోయే ఇంకొన్నేళ్లలో మారబోయే పరిస్థితుల దృష్ట్యా.. అప్‌గ్రేడేషన్ కచ్చితంగా అవసరమనే ఆలోచనని ఆయన రేకెత్తించారు.
కొత్త ఫైటర్ జెట్స్‌ని తయారు చేసుకుంటున్న మిగతా దేశారు
ప్రపంచ దేశాలు, మన శత్రు దేశాలు ఎప్పటికప్పుడు తమ వాయుసేనని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎప్పటికప్పుడు కాలం చెల్లిన ఫైటర్ జెట్స్‌ని పక్కన పెట్టేయడం, పాతబడిన యుద్ధ విమానాల్ని ఆపరేషన్స్ నుంచి తొలగించడం, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, కొత్త ఫైటర్ జెట్స్‌ని తయారుచేసుకోవడం, కొత్త జనరేషన్ ఫైటర్ జెట్స్‌ని ఫ్లీట్‌లో చేర్చుకోవడం లాంటివి చేస్తున్నాయి. ఈ విషయంలో ఇండియా కాస్త వెనుకబడిందనే వాదనలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి.
రాఫెల్ ఫైటర్ జెట్స్ మొత్తం అవసరాలని తీర్చలేవనే చర్చ
కొన్నేళ్ల కిందటే.. రాఫెల్ యుద్ధ విమానాలని కొనుగోలు చేసినప్పటికీ.. అవి మాత్రమే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అవసరాల్ని పూర్తి స్థాయిలో తీర్చలేవనే చర్చ కూడా ఉంది. అందువల్ల ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పినట్లుగా.. ఏడాదికి 35 నుంచి 40 కొత్త యుద్ధ విమనాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి జోడించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చర్చ జరుగుతోంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ జెట్‌ల కొరత తగ్గించాలి!
ముందుగా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ జెట్‌ల కొరతని తగ్గించడంతో పాటు రాబోయే కొన్నేళ్లలో పాతబడిపోయిన మిరాజ్, మిగ్-29, జాగ్వార్ ఫైటర్ జెట్స్‌ని దశలవారీగా తొలగించేందుకు.. ఐఏఎఫ్‌కి ప్రతి సంవత్సరం రెండు స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు అవసరమవుతాయన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్. ఆ లెక్కన.. ఏడాదికి దాదాపు 40 కొత్త యుద్ధ విమానాలని వైమానిక దళానికి జోడించాల్సి ఉంటుంది. ఇదంతా రాత్రికి రాత్రే జరిగే వ్యవహారమేమీ కాదు. రాబోయే ఐదు నుంచి పదేళ్లలో దశలవారీగా కొత్త ఫైటర్ జెట్స్‌ని సమకూర్చుకునేందుకు.. ఏటా 40 యుద్ధ విమానాలు అవసరమవుతాయని చెబుతున్నారు.
యుద్ద విమానాల డెలవరీ ఆలస్యంపైనా అసంతృప్తి
అంతేకాదు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి యుద్ధ విమానాల డెలివరీ ఆలస్యమవడంపైనా.. ఎయిర్ చీఫ్ మార్షల్ అసంతృప్తిగా ఉన్నారు. టెక్నాలజీని ఆలస్యం చేయడమంటే.. దానిని తిరస్కరించడంతో సమానమన్నారు. తయారీ సంస్థలు.. అత్యాధునిక నిర్మాణ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ.. తేజస్ యుద్ధ విమానాల డెలివరీలను 2016లో ప్రారంభించింది. ఇప్పటికీ.. మరో 40 ఫైటర్ జెట్స్‌ని తయారుచేయాల్సి ఉందన్నారు ఏపీ సింగ్.
యుద్ధ విమానాల ఉత్పత్తిని పెంచాలంటున్న ఏపీ సింగ్
సరైన సమయానికి ఫైటర్ జెట్స్ డెలివరీ ఇచ్చేందుకు.. తయారీ సంస్థలు కీలక చర్యలు చేపట్టాలన్నారు ఐఏఎఫ్ చీఫ్. ఉత్పత్తిలో వేగం పెంచేందుకు అత్యాధునిక వ్యవస్థలపై పెట్టుబడులు పెట్టాలని, మానవ వనరుల నైపుణ్యాలకు మెరుగులు దిద్దాలని సూచించారు. ఏం చేసైనా సరే.. యుద్ధ విమానాల ఉత్పత్తిని పెంచాలన్నారు. ఇదే సమయంలో.. ఫైటర్ జెట్స్ తయారీ విషయంలో ప్రైవేటు రంగాన్ని కూడా బలోపేతం చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎయిర్ చీఫ్ మార్షల్. ఆర్డర్లు కోల్పోతామనే భయం తయారీ సంస్థలకు ఉండాలన్నారు. అప్పటివరకు పరిస్థితులు మారవని తన అసంతృప్తినంతా వెళ్లగక్కారు.
స్క్వాడ్రన్‌ల బలాన్ని లోపాలను అధికమించాల్సిన అవసరం
ప్రస్తుతం.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వచ్చే ఏడాది 24 తేజస్ మార్క్-1ఏ జెట్‌లని ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా.. సుఖోయ్-30 యుద్ధ విమానాలను కూడా తయారుచేయగలదు. దీనికి తోడు ప్రైవేట్ సంస్థల సహకారం తీసుకుంటే ఏడాదికి 12 నుంచి 18 ఫైటర్ జెట్స్ అదనంగా పొందొచ్చనే లెక్కలున్నాయి. ప్రధానంగా యుద్ధ విమానాల విషయంలో సంఖ్యాపరంగా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎంతో వెనుకబడి ఉంది. దీనిని వెంటనే పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌లో తగ్గుతున్న స్క్వాడ్రన్‌ల బలాన్ని, లోపాలను అధిగమించేందుకు.. రిటైర్ చేయాల్సిన ఫైటర్ జెట్స్‌ని భర్తీ చేసేందుకు.. కచ్చితంగా ఏడాదికి 40 కొత్త యుద్ధ విమానాలను ఉత్పత్తి చేయడమే ఏకైక మార్గమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
114 మీడియం రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్టల అవసరం
ప్రస్తుతం.. స్వదేశీ పరిజ్ఞానంతో లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీపై భారత్ దృష్టి పెట్టాల్సి ఉంది. మరోవైపు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 114 మీడియం రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల అవసరం ఉంది. దానికోసమే.. ఏటా 30 యుద్ధ విమానాలని ఫ్లీట్‌లో జోడించే దిశగా ఐఏఎఫ్ కసరత్తు చేస్తోంది. ఇది.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారానే సాధ్యమవుతుందని చెబుతున్నారు. దాంతో పాటు మరో ప్రైవేట్ సంస్థ కూడా ఈ రంగంలోకి వస్తే.. ఇంకొన్ని యుద్ధ విమానాలను తయారుచేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రైవేట్ రంగం సామర్థ్యాన్ని.. మల్టీరోల్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంటి భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా ఉపయోగించుకోవచ్చనే అభిప్రాయాలున్నాయి.
సరిహద్దుల్లో పెరుగుతున్న ఆందోళన
చిరకాల శత్రువుగా పాకిస్థాన్.. పక్కలో బల్లెంలా చైనా.. ఈ రెండు దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు బాగానే ఉన్నట్టనిపిస్తున్నా.. సరిహద్దుల్లో ఎప్పుడెలాంటి వివాదం తలెత్తుతుందో అర్థం కాదు. అందుకోసమే.. భారత ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన రక్షణ వ్యవస్థల్ని పటిష్టం చేసుకుంటుంది. వివాదాలు, పోటీ గణనీయంగా పెరిగిపోయి.. ప్రపంచం ప్రమాదం అంచుకు చేరిందనే ఆందోళన ఇప్పటికే ఉంది. పైగా.. భారత్ శత్రు దేశాలైన పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో పెరుగుతున్న సైనికీకరణ కూడా ఆందోళనకరస్థాయిలో ఉంది.
చైనా జే-36 యుద్ధ విమానానికి వైట్ ఎలిఫెంట్ అనే పేరు
ఇప్పటికే.. డ్రాగన్ కంట్రీ చైనా.. తన ఎయిర్‌ఫోర్స్‌పై వేల కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ మధ్యకాలంలో.. చైనా రెండు స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ని ఆవిష్కరించింది. అంతేకాదు.. చైనా తన అత్యాధునిక జే-36 యుద్ధ విమానానికి వైట్ ఎలిఫెంట్ అనే పేరు కూడా పెట్టింది. మరోవైపు.. పాకిస్థాన్ సైతం కొత్త యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. భారత్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ప్రోగ్రామ్, అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ డిజైన్ దశలోనే ఉంది. అందుకోసమే.. యుద్ధ విమానాల తయారీ, కొనుగోళ్లపై.. ఇప్పుడింత చర్చ నడుస్తోంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 31 స్క్వాడ్రన్‌ల ఫైటర్ జెట్స్
ఓ పక్క పాకిస్థాన్.. మరో పక్క చైనా.. ఇలా రెండు వైపుల నుంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి.. 42 స్క్వాడ్రన్‌ల యుద్ధ విమానాలు అవసరం. ప్రస్తుతం.. భారత వైమానిక దళం దగ్గర.. 31 స్క్వాడ్రన్‌ల ఫైటర్ జెట్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కో స్క్వాడ్రన్‌లో 16 నుంచి 18 కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉంటాయి. అందువల్ల.. జెట్ ఫ్లీట్‌కు.. మరిన్ని యుద్ధ విమానాలను జోడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2030 నాటికి రిటైర్ కానున్న 4 రకాల ఫైటర్ జెట్స్
అదేవిధంగా.. జాగ్వార్, మిగ్ 29, మిరాజ్ 2000 లాంటి ఫైటర్ జెట్స్‌ని.. 1980ల్లో దశలవారీగా వైమానిక దళంలో చేర్చారు. అవి.. తర్వాతి బ్యాచ్‌ల్లో.. 2030 నాటికి రిటైర్ అయిపోతాయి. ఈ 4 రకాల ఫైటర్ జెట్స్ సంఖ్య దాదాపు 250గా ఉంది. వీటిని.. నాలుగైదేళ్లలో కచ్చితంగా తప్పించాల్సిన అవసరం ఏర్పడింది. వాటి స్థానంలో.. ఇప్పట్నుంచే ఏడాదికి 40 కొత్త యుద్ధ విమానాలను.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి జోడించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
ప్రస్తుతం.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా.. భారత రక్షణ రంగం మరింత వృద్ధి చెందుతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డీఆర్డీవో, DPSU లాంటి కీలకమైన రక్షణ రంగ సంస్థలు.. అధునాతన రక్షణ పరికరాలని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్, అదానీ డిఫెన్స్ లాంటి.. ప్రైవేట్ కంపెనీలు సైతం మన రక్షణ రంగ వృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాయి. భారత ప్రభుత్వం.. దేశీయ తయారీదారుల నుంచి రక్షణ పరికరాల సేకరణని తప్పనిసరి చేయడం ద్వారా.. మరింత మద్దతు దొరుకుతోంది.
20 ఏళ్లలో విదేశీ ఆయుధాలపై ఆధారపడటాన్ని తగ్గించాలనే లక్ష్యం
ఈ విధమైన పురోగతి ఉన్నప్పటికీ.. ఏఐ ఆధారిత వ్యవస్థలు, హైపర్‌సోనిక్ మిసైల్స్ లాంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అవసరంతో.. అధిగమించాల్సిన సవాళ్లు ఇంకా చాలానే ఉన్నాయి. అందువల్ల.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. దేశీయ ఆయుధ వ్యవస్థల్ని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ విమానాలతో.. లింక్ చేసేందుకు కృషి చేస్తోంది. రాబోయే.. 20 ఏళ్లలో విదేశీ ఆయుధాలపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఉంది. ఇది.. భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు.. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, గైడెన్స్ బాంబుల్ని కూడా సొంతంగా అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది భారత రక్షణ శాఖ.
2047 నాటికి భవిష్యత్తు దళాల నిర్మాణం స్ట్రాంగ్‌గా ఉండాలనే లక్ష్యం
మన స్వదేశీ వ్యవస్థలు.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చాలా కీలకం. అలాగే.. యుద్ధ విమానాల ఉత్పత్తి మందకొడిగా ఉండటంపై ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని సూచించడానికి.. రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తే బాగుంటుందనే చర్చ కూడా సాగుతోంది. ఏదేమైనా.. 2047 నాటికి భవిష్యత్ దళాల నిర్మాణం చాలా స్ట్రాంగ్ గా ఉండాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అప్పటికి.. ఎక్కువ ఆటోమేషన్‌తో పాటు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోగలిగే పరిస్థితులుంటాయి. ఆ సమయానికి.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. టెక్నాలజీ పరంగా.. అగ్ర దేశాలతో సమానంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.