Iran Attacks UAE: నెల రోజుల కిందటి వరకు.. దుబాయ్, అబుదాబి నగరాలు.. టూరిస్టులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. అజ్మాన్, షార్జాలో.. చమురు, రవాణా, ఆర్థిక రంగాల్లో వాణిజ్యం యథావిధిగా సాగింది. కానీ.. ఇప్పుడు ఇరాన్ మిసైళ్లు, డ్రోన్ల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈ నగరాల్లో.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా చురుగ్గా పనిచేస్తున్నాయ్. యుద్ధ విమానాలు ఆకాశంలో గస్తీ కాస్తున్నాయ్. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించాక.. ఇరాన్ మిడిల్ ఈస్ట్ అంతటా దాడులు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా.. ఇరాన్ యూఏఈని టార్గెట్ చేయడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆలోచింపజేస్తోంది.
ఖమేనీ అంతమైనప్పటి నుంచి.. ఇరాన్ ప్రతీకార దాడులను మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆస్తులను, ఎంబసీలను లక్ష్యంగా చేసుకొని.. వందలాది మిసైల్లు, వేలాది డ్రోన్లను ప్రయోగించింది. అయితే, ఇతర గల్ఫ్ దేశాల కంటే.. ఇరాన్ దాడుల్లో యూఏఈనే ఎక్కువగా నష్టపోతుందని రిపోర్టులు సూచిస్తున్నాయ్. ఇప్పటివరకు అరబ్ ఎమిరేట్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్.. 3 వందలకు పైగా బాలిస్టిక్ మిసైళ్లు, 15కి పైగా క్రూయిజ్ మిసైళ్లు, 1600 పైగా సూసైడ్ డ్రోన్లను ఎదుర్కొన్నాయని.. అబుదాబి రక్షణశాఖ తెలిపింది. ఈ నెంబర్స్.. ఇతర గల్ఫ్ దేశాలైన.. ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్‌తో పోలిస్తే.. చాలా ఎక్కువగా ఉన్నాయ్. ఇతర అరబ్ దేశాలపై చేస్తున్న దాడులకంటే.. యూఏఈపైనే ఇరాన్ దాడులు చాలా ఎక్కువగా ఉన్నాయ్. చివరికి జనావాసాలున్న ప్రాంతాల్లోనూ దాడులు జరిగాయ్. బుర్జ్ అల్ అరబ్ సమీపంలోని కట్టడాలు కూడా దెబ్బతిన్నాయ్. యూఏఈ పోర్టుల్లోనూ అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయ్. అబుదాబి, దుబాయ్‌లో ఆరుగురి కంటే ఎక్కువమంది చనిపోయారు. భారత విదేశాంగ శాఖ ప్రకారం.. దుబాయ్‌లో ఓ భారతీయుడు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
అయితే, ఇరాన్.. యూఏఈపై ఇంత తీవ్రంగా ఎందుకు విరుచుకుపడుతోంది? అనే ప్రశ్నకు.. అనేక కారణాలున్నాయ్. ఇందులో.. కొన్ని వ్యూహాత్మకమైనవి, భౌగోళికమైనవి ఉన్నాయ్. ముఖ్యంగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో.. అల్ ధప్రా ఎయిర్‌బేస్ లాంటి కీలకమైన అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. అందువల్ల, అమెరికా భూభాగాన్ని నేరుగా తాకకుండానే, అమెరికా ప్రయోజనాలపై దెబ్బకొట్టేందుకు.. ఇదొక టార్గెట్‌గా మారింది. తమపై దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్, అమెరికాపై నేరుగా దాడులు చేయలేకపోతోంది. అందుకే, మిడిల్ ఈస్ట్‌లో దాని మిత్రదేశం యూఏఈ.. ఇరాన్ ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే, ఇతర గల్ఫ్ దేశాల్లోనూ అమెరికా స్థావరాలు ఉన్నాయ్ కదా.. అనే వాదనలు వినిపిస్తున్నాయ్. దీనికీ.. ఓ లెక్కుంది. అరబ్ ఎమిరేట్స్.. అమెరికన్ స్థావరానికి హోస్ట్‌గా ఉండటమే కాదు, అగ్రరాజ్యానికి ప్రధాన రక్షణ భాగస్వామి కూడా. అధునాతన ఆయుధాలు, జాయింట్ మిలటరీ విన్యాసాలు సహా రక్షణ సంబంధాలను బలోపేతం చేసేలా.. రెండేళ్ల కిందటే.. రెండు దేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అందువల్ల.. అమెరికా మిత్రదేశంపై దాడి చేసి, ఎక్కువగా నష్టం కలగజేస్తే.. టెహ్రాన్‌కు వ్యతిరేకంగా సాగే కార్యకలాపాలకు వారి మద్దతుని బలహీనపర్చాలని ఇరాన్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేసినప్పటి నుంచి.. ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్లలో 65 శాతం యూఏఈనే టార్గెట్‌గా చేసుకున్నాయ్. ఇదేదో.. యాదృచ్ఛికం కాదు. పొలిటికల్ ఇస్లాంకు, విప్లవాత్మకమైన పంథాకు.. అత్యంత విజయవంతమైన ప్రత్యామ్నాయంపై పథకం ప్రకారం చేస్తున్న దాడి.
అరబ్ ఎమిరేట్స్.. సరికొత్త మిడిల్ ఈస్ట్‌కు గ్లోబల్ హబ్‌గా మారింది. ఇక్కడ వ్యాపారం జోరుగా సాగుతుంది. రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. సేఫ్ హెవెల్ అనే విషయంలో ఎలాంటి డౌట్స్ కూడా లేవు. ఈ ప్రాంతంలోని మరే దేశానికి.. ఇంత ప్రాముఖ్యత లేదు. బలమైన సైనిక సామర్థ్యాలు, విస్తృతమైన అణెరికా ఉనికి ఉన్న సౌదీ అరేబియాతో పోలిస్తే.. డిఫెన్స్ విషయంలో యూఏఈ చాలా బలహీనంగా ఉంది. ఈ యుద్ధంలో.. సౌదీ అరేబియా కూడా ఇరాన్ దాడులను ఎదుర్కొంది. కానీ, అరబ్ ఎమిరేట్స్‌తో పోలిస్తే.. మిగతా గల్ఫ్ దేశాలు తక్కువ సంఖ్యలో దాడులు ఎదుర్కొన్నట్లు రిపోర్టులు తెలియజేస్తున్నాయ్.
టెహ్రాన్ యూఏఈని లక్ష్యంగా చేసుకోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయ్. యూఏఈ తనని తాను గల్ఫ్, పశ్చిమ దేశాల మధ్య వారధిగా నిలబెట్టుకుంది. పైగా.. ఆర్థిక, పర్యాటక, సాంకేతిక, వాణిజ్య రంగాలకు.. గ్లోబల్ హబ్‌గా మారింది. ఈ ప్రాంతంలో.. పాశ్చాత్య ప్రభావాన్ని ఇరాన్ చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. దాంతో.. యూఏఈని టార్గెట్‌గా చేసుకునేందుకు.. ఇది మరో కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. మధ్యప్రాచ్యంలో.. అమెరికాకు సన్నిహిత మిత్రదేశం ఉండటం.. ఇరాన్ ప్రాంతీయ ఆశయాలకు ఓ సవాల్ లాంటిది. ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగించడం, చమురు మార్కెట్లపై ఒత్తిడి తేవడం, స్థిరమైన సురక్షిత దేశంగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి ఉన్న ప్రతిష్ఠని సవాల్ చేసేందుకు.. ఇరాన్ తీవ్రమైన దాడులు చేస్తోంది. కేవలం, అమెరికా స్థావరాలపైనే కాదు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల లాంటి ఆర్థిక కేంద్రాలపైనా దాడులు చేసింది.
దుబాయ్, అబుదాబి చాలా ఏళ్లుగా.. ప్రధాన టూరిజం కేంద్రాలుగా ఉన్నాయ్. కానీ, ఇప్పుడు హోటళ్లపై ఇరాన్ డ్రోన్లు దాడులు చేస్తున్నాయని.. టూరిస్టులు పోస్ట్ చేస్తుండటంతో, సేఫ్ హాలీడే, షాపింగ్ డెస్టినేషన్‌గా యూఏఈకి ఉన్న ఇమేజ్ దెబ్బతింటోంది. ఇది ఎమిరేట్స్ టూరిజం రంగంపై ప్రభావం చూపుతాయ్. పామ్ జుమేరా లాంటి ఐకానిక్ ప్రదేశాలు, బుర్జ్ ఖలీఫా సమీప ప్రాంతాలపై దాడి చేయడం వల్ల.. ప్రపంచ పెట్టుబడులకు, పర్యాటకానికి సేఫ్ హెవెన్‌గా దుబాయ్‌కి ఉన్న పేరుని నాశనం చేయాలని.. ఇరాన్ టార్గెట్‌గా పెట్టుకుంది. పైగా.. యూఏఈకి కూడా ట్రంప్‌పై చాలా పట్టుందనే చర్చ ఉంది. ఇరాన్‌పై.. దాడులను ఆపేలా ట్రంప్‌పై ఒత్తిడి తెస్తుందని.. ఇరాన్ ఆశిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. అంతేకాదు, యూఏఈ-ఇజ్రాయెల్ సంబంధాలను సరళీకరించిన 2020 అబ్రహం ఒప్పందాలు ఇప్పటికీ ఓ వివాదాస్పద అంశంగానే ఉన్నాయ్. ఓ అరబ్ దేశంగా.. తన బద్ధశత్రువుతో.. యూఏఈ అగ్రిమెంట్ చేసుకోవడాన్ని.. ఇరాన్ ద్రోహంగా భావిస్తోంది.
ఇదంతా పక్కనబెడితే.. యుద్ధం మొదలయ్యాక, ఫిబ్రవరి 28న.. ఇరాన్‌లోని మినాబ్‌లో ఐఆర్‌జీసీ కేంద్రాన్ని టార్గెట్ చేసి అమెరికా ప్రయోగించిన టోమాహాక్ మిసైల్.. పొరపాటున స్కూల్‌పై పడి 165 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. ఈ మిసైల్‌ని.. యూఏఈ బేస్ నుంచే ప్రయోగించారనే ఆరోపణలున్నాయ్. దాంతో.. అమెరికాపైనా, దాని మిత్రదేశమైన యూఏఈపైనా.. ప్రతీకారం తీర్చుకోవాలనే కసి ఇరాన్‌లో మరింత పెరిగింది. అరబ్ ఎమిరేట్స్‌పై దాడులతో.. అమెరికాపై వీలైనంత ఎక్కువ ఒత్తిడి తేవాలని ఇరాన్ కోరుకుంటోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. కానీ, ఇరాన్ చేస్తున్న దాడులు.. యూఏఈ ప్రజల రోజువారీ జీవితాలను అతలాకుతలం చేశాయ్. గగనతలాన్ని మూసివేయడం, విమాన సర్వీసులను నిలిపివేయడంతో.. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ్. దీని ఆర్థిక ప్రభావాలు.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి.
యూఏఈ డిఫెన్స్ సిస్టమ్స్.. చాలా వరకు ఇరాన్ మిసైళ్లను, డ్రోన్లను అడ్డుకుంటున్నప్పటికీ, అమెరికా పూర్తి స్థాయిలో సహాయం అందించకపోవడంతో.. అరబ్ ఎమిరేట్స్ ఆత్మవిశ్వాసం కూడా రోజురోజుకు సన్నగిల్లుతోంది. యుద్ధంలో భాగంగా ఇజ్రాయెల్-అమెరికా జరుపుతున్న నిరంతర దాడులతో.. ఇరాన్‌కు యూఏఈ టార్గెట్ అవుతోంది. ఆ దేశాల మధ్య.. అరబ్ ఎమిరేట్స్ బలిపశువుగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే.. ఈ దేశంలో మౌలిక సదుపాయాలు చాలావరకు దెబ్బతిన్నాయ్. టూరిజంపై దెబ్బ పడింది. రియల్ ఎస్టేట్ కూడా బాగా పడిపోయింది. యుద్ధం ఆగితే తప్ప.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎప్పటికి కోలుకుంటుందన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
Also Read: ఇది మా యుద్ధం కాదు!.. అమెరికాకు ముఖం చాటేసిన ఏడు దేశాలు.. ఏం జరగబోతోంది?
Story by: Anup, Big Tv