E-Paper
Advertisement

సామాన్యులకు షాక్.. ఏయే వస్తువులపై ధరలు పెరిగాయంటే?

సామాన్యులకు షాక్.. ఏయే వస్తువులపై ధరలు పెరిగాయంటే?

Commodity Prices: కమర్షియల్ గ్యాస్, జెట్ ఫ్యూయెల్, ప్రీమియం పెట్రోల్, బల్క్ డీజిల్, కుకింగ్ ఆయిల్, సిమెంట్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, గ్లాస్ ఇండస్ట్రీ, ఒక్కటేమిటి అన్ని రేట్లూ పైపైకి వెళ్తున్నాయ్. కారణం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధమే.. హర్ముజ్, ఎర్ర సముద్రం దగ్గర్నుంచి చమురు కంటైనర్లు రావడం ఆలస్యమవుతోంది. క్రూడ్ బై ప్రొడక్ట్స్ తో తయారయ్యే ఇండస్ట్రీలపై ఎఫెక్ట్ పడుతోంది. ప్లాస్టిక్, సింథటిక్, మెడికల్ ఇండస్ట్రీ.. ఒక్కటేమిటి అన్నిటిపైనా ప్రభావం ఉంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ముందు ముందు ఎరువుల రేట్లపైనా ఎఫెక్ట్ పడే ప్రమాదాలు కనిపిస్తున్నాయ్. ఖరీఫ్ లో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పూటకో మాట మాట్లాడుతున్న ట్రంప్

యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నాయ్. చమురు దిగుమతులపై వార్ ఎఫెక్ట్ ఉంది. రూపాయి వాల్యూ తగ్గుతోంది. దిగుమతి బిల్లు పెరుగుతోంది..ఇది చాలదా.. అదును చూసి రేట్లు పెంచడానికి? ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ట్రంప్ కూడా పూటకో మాట మాట్లాడుతుండడంతో సమస్య పెరుగుతోంది.

కమర్షియల్ గ్యాస్ ధరల భారీ పెంపు

సామాన్యులపై కంటికి కనిపించేలా రేట్ల ఎఫెక్ట్ పడుతోంది. ఫస్ట్ కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగాయి. రెండోసారి కూడా రేటు పెరిగింది. హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలతో గ్యాస్ దిగుమతి చేసుకునే నౌకల ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. రావాల్సినంత గ్యాస్ స్టాక్ రావట్లేదు. దీంతో బయట భోజనం, టిఫిన్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయ్. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రేటు ఫిబ్రవరిలో 1,961 రూపాయలు ఉండేది. యుద్ధంతో 214 రూపాయలు పెరిగింది. దీని ఎఫెక్ట్ హోటల్ మీల్స్, టిఫిన్ రేట్లపై పడింది. కూరగాయలు, పాలు, వంటనూనె ఇలా అన్నిటి రేట్లు పరోక్షంగా పెరిగిపోతున్నాయ్.నిజానికి దేశంలో డీజిల్ ధర పెంచలేదు. అయినా సరే రేట్లు పైపైకే అన్నట్లు వెళ్తున్నాయ్. నిజంగా డీజిల్ ధర పెంచితే మాత్రం కథ మరోలా ఉండబోతోందంటున్నారు. బల్క్ డీజిల్ పైనే రేటు పెంచారు.

సామాన్యుడికి తప్పని ముడిచమురు కష్టాలు

పెట్రోల్, డీజిల్ రేటు పెరగకపోయినా మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ ధరలు పెరగడంతో ప్రైవేట్ వాహనాల ప్రయాణంపైనా ఎఫెక్ట్ ఉంది. ఇక గృహ అవసరాల్లో వాడే ప్లాస్టిక్ వస్తువుల రేట్లూ పెరిగాయి. డిటర్జెంట్లు, సోపుల తయారీలో వాడే పెట్రోకెమికల్స్ రేట్లు పెరగడంతో వీటి ధరలపైనా ప్రభావం ఉంది. అటు బకెట్లు, కంటైనర్లు ప్యాకేజింగ్ వస్తువుల ధరలు ముడిచమురు ప్రభావంతో పెరిగాయి. ప్లాస్టిక్ తయారీకి ప్రధానమైన నాఫ్తా ధరలు అంతర్జాతీయంగా పెరగడంతో ప్లాస్టిక్ ముడి పదార్థాల ధరలు 15 నుంచి 20 శాతం పెరిగాయి. పాలీఇథిలిన్ , పాలీప్రొఫైలిన్ ప్యాకేజింగ్, కవర్లు, పైపుల తయారీలో వాడుతారు. PVC – పాలీవినైల్ క్లోరైడ్ కన్స్ట్రక్షన్ రంగంలో వాడే పైపులు, వైర్ల ధరలపైనా ప్రభావం పడింది.
అటు నైలాన్, పాలిస్టర్, అక్రిలిక్ వస్త్ర పరిశ్రమలో కీలకం. ఈ సింథటిక్ దారాల ధరలు కూడా పెట్రోలియం ధరలతో ముడిపడి ఉన్నాయి. ముడిచమురు బై ప్రొడక్ట్స్ నుంచి ఇవి తయారవుతాయి. సో ఇప్పుడు వీటి ధరలు పెరగడంతో వీటి తయారీ వ్యయం పెరిగింది. ఎఫెక్ట్ వస్త్ర పరిశ్రమపైనా కనిపిస్తోంది.

యూరియా దిగుమతులపై చమురు ధరల ప్రభావం.

ప్రపంచమంతా పెట్రోలియం ప్రొడక్టుల చుట్టే తిరుగుతోందా అన్నది యుద్ధాలు, సంక్షోభాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. నాన్ ఎసెన్షియల్ ప్రొడక్టుల సంగతి పక్కన పెడితే అత్యవసరాల తయారీ చాలా కీలకం. ముఖ్యంగా వ్యవసాయ ప్రధానమైన మనలాంటి దేశాల్లో మాత్రం ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. భారత్ తన యూరియా అవసరాలలో సుమారు 25-30% దిగుమతులపై ఆధారపడుతుంది. యూరియా తయారీకి ప్రధాన ముడి పదార్థం సహజ వాయువే. యుద్ధంతో వీటి రేట్లు పెరిగాయి. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరగడంతో, దిగుమతి చేసుకునే ఎరువుల ధరలు కూడా భారంగా మారే ప్రమాదం ఉంది.

ఖరీఫ్ ముంగిట ఎరువుల సవాల్

ఎరువులను రష్యా, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. హర్ముజ్ దగ్గర భారత నౌకలకు ఇరాన్ సపోర్ట్ ఇస్తున్నా చాలా డౌట్లు అయితే నెలకొంటున్నాయి. అయితే ఇప్పుడు సమస్యేంటంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సమయానికి నిల్వలు సరిపడా ఉంచుకోవాల్సిన పరిస్థితి. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రైతులపై భారం పడకుండా ఎరువుల సబ్సిడీని పెంచుతోంది. గతంలో కూడా యుద్ధ సమయాల్లో ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను అదనంగా కేటాయించి యూరియా, DAP ధరలను స్థిరంగా ఉంచింది. అటు ఎరువులను ప్యాక్ చేసే ప్లాస్టిక్ బస్తాల తయారీకి వాడే పాలిమర్ల ధరలు క్రూడ్ ఆయిల్ వల్ల పెరిగాయి. ఇది పరోక్షంగా ఎరువుల కంపెనీల ఉత్పత్తి ఖర్చును పెంచుతోంది. యూరియా విషయంలో కొంత ధీమా ఉన్నా, DAP, పొటాష్ విషయంలో మాత్రం అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడాల్సి ఉంటుందంటున్నారు.

రికార్డు స్థాయిలో జెట్ ఫ్యూయెల్

అటు జెట్ ఫ్యూయెల్ ధర కిలోలీటర్‌కు 2 లక్షల రూపాయలు దాటింది. తాజాగా జెట్ ఫ్యూయెల్ ను కేంద్రం పెంచింది. ఇండియా చరిత్రలోనే మొదటిసారిగా ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు 2 లక్షల మార్కును దాటింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులో దాదాపు 40% ఇంధనం కోసమే ఖర్చవుతుంది. జెట్ ఫ్యూయెల్ ధరలు ఇలా పెరగడం వల్ల విమాన టికెట్ల రేట్లపైనా ప్రభావం కొనసాగుతోంది. మరోవైపు మనం వాడే మేకప్ వస్తువులలో చాలా వరకు పెట్రోలియం నుండి వచ్చే రసాయనాలే ఉంటాయి. లిప్‌స్టిక్‌లు, ఫౌండేషన్లు, క్రీమ్స్ తయారీలో వీటిని విరివిగా వాడతారు.

లిప్‌స్టిక్ నుంచి నెయిల్ పాలిష్ వరకు

క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల వీటి రేట్లు 20-30% పెరిగాయి. నెయిల్ పాలిష్‌లు, ఇతర మేకప్ ఉత్పత్తుల తయారీలో వాడే రసాయనాలు పెట్రోకెమికల్స్ నుండే వస్తాయి. మేకప్ కిట్స్, లిప్‌స్టిక్ ట్యూబ్‌లు అన్నీ ప్లాస్టిక్‌తో తయారవుతాయి. ప్లాస్టిక్ తయారీకి వాడే పాలిమర్లు క్రూడ్ ఆయిల్ బై ప్రొడక్ట్స్. యుద్ధం వల్ల వీటి ధరలు పెరగడమే కాకుండా, ప్యాకేజింగ్ మెటీరియల్ కొరత ఏర్పడింది. దీనివల్ల కొత్త స్టాక్ మార్కెట్లోకి రావడం ఆలస్యమవుతోంది. మేకప్ వస్తువులకు వాడే సింథటిక్ కలర్స్ తయారీలో కూడా పెట్రోలియం కెమికల్స్ వాడతారు.

కోనసీమ కొబ్బరికి ‘యుద్ధ’ సెగ

చెప్పాలంటే ఎగుమతి చేసే వాటి రేట్లు తగ్గుతున్నాయ్. దిగుమతి చేసుకునే వాటి రేట్లు పెరుగుతున్నాయ్. చివరికి కోనసీమ కొబ్బరి రైతులపైనా యుద్ధ ప్రభావం పడుతోంది. కోనసీమ కొబ్బరి రైతులు కొబ్బరి ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటారు. కొబ్బరి రైతులకు స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడంతో ఏ రోజు దింపిన కాయలను ఆ రోజే ఎక్స్ పోర్టర్స్ కి అమ్మేస్తూ ఉంటారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో సరుకు ఎగుమతి కావడం లేదని సుమారుగా వెయ్యికాయకి 10 వేలు నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. 2 నెలల క్రితం వరకు వెయ్యి కొబ్బరికాయ రేటు పాతిక వేలు ఉంటే ఇప్పుడు 15వేల రూపాయలకు పడిపోయిందని ఎగుమతి లేకే ఇలా జరుగుతోందంటున్నారు. యుద్ధ ప్రభావం చివరికి ఇలా కూడా సమస్యలు క్రియేట్ చేస్తోంది.

ఆసుపత్రి బిల్లు బాదుడు

అటు మెడికల్ ఇండస్ట్రీపైనా సమస్యలు పెరుగుతున్నాయ్. సిరంజిలు, ఐవీ బ్యాగులు, కాథెటర్లు, సర్జికల్స్ తయారీకి ఉపయోగించే పాలీప్రొపీలిన్, హై డెన్సిటీ పాలిథిలిన్ ధరలు కిలోకు 55 పైగా పెరిగాయి. యుద్ధం కారణంగా రవాణా మార్గాలు మార్చాల్సి వస్తోంది. దిగుమతుల లేట్ అవుతున్నాయి. సరుకు రవాణా ఛార్జీలను రెట్టింపు అవుతున్నాయి. వైద్య పరికరాల తయారీదారులకు ప్లాస్టిక్ ఖర్చులు 50% ప్యాకేజింగ్ ఖర్చులు 20% పైగా పెరిగాయంటున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే కథ చాలా దూరం వెళ్తుందంటున్నారు. సప్లై చైన్ పై ఎఫెక్ట్ పడుతోంది.

రేట్లు పెంచాలంటూ రాష్ట్రాలకు కంపెనీల లేఖలు

యుద్ధంతో గ్లాస్ బాటిల్ తయారీకి అవసరమైన ఉత్పత్తులు, అల్యూమినియం ముడి పదార్థాల దిగుమతులు నిలిచిపోయాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల గ్లాస్ ఫ్యాక్టరీల నిర్వహణ ఖర్చు పెరిగింది. దీనివల్ల బాటిళ్ల ధరలు 15% నుంచి 25 శాతం వరకు పెరిగాయి. బీర్లు, కూల్ డ్రింక్ ల కోసం వాడే గ్లాసులు, ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ ఖర్చు పెరగడంతో వాటి ఎఫెక్ట్ కూడా ఉండబోతోంది. పెరుగుతున్న రవాణా, లాజిస్టిక్స్, ముడిసరుకు ఖర్చులను భరించేలా ధరల సర్దుబాటు కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్ పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది కూడా. యుద్ధం వల్ల ఎర్ర సముద్రం మీదుగా వచ్చే ఓడలు దారి మళ్లించాల్సి వస్తోంది.

గాజు పరిశ్రమపై యుద్ధం దెబ్బ

దీనివల్ల గ్లాస్ తయారీకి కావాల్సిన యంత్ర పరికరాలు, ముడి సరుకు రావడం ఆలస్యమవుతోంది. దిగుమతులు తగ్గడంతో దేశీయ గ్లాస్ తయారీ పరిశ్రమపై ఒత్తిడి పెరిగింది. ఆర్డర్లు పెండింగ్‌లో ఉండటం వల్ల బ్రూవరీస్‌కు సకాలంలో బాటిళ్లు అందడం లేదు. గాజు సీసా తయారు చేసే పరిశ్రమలు రేట్లు పెంచేశాయంటున్నారు. వీటికి తోడు లేబుల్స్, టేప్ వంటి ఇతర ప్యాకేజింగ్ సామగ్రి ధరలు కూడా పెరిగాయంటున్నాయి కంపెనీలు. గ్లాస్ తయారీ ఇండస్ట్రీకి గ్యాస్ కచ్చితంగా అవసరం. ప్రస్తుతం గ్యాస్ సమస్యలతో గ్లాస్ ఇండస్ట్రీ పరిశ్రమల్లో కొన్ని మూతపడగా, కొన్ని పాక్షికంగా పని చేస్తూ నెట్టుకొస్తున్నాయి.

యుద్ధం ముగిసేదెప్పుడు? ధరలు తగ్గేదెప్పుడు?

సో ఒక్క యుద్ధం.. చాలా సమస్యలను పెంచేసింది. చాలా వస్తువుల రేట్లు పెరిగేందుకు రెడీగా ఉన్నాయి. చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అమెరికాలోనూ గ్యాసోలిన్ ధరలు భారీగా పెరిగాయి. థాయ్ లాండ్ కూడా డీజిల్ రేటు పెంచేసింది. ట్రంప్ స్పీచ్ తర్వాత ఈ వారంలో డీజిల్ రేట్లు పెరగడం ఇది రెండోసారి. మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే కథ మరోలా ఉండబోతోంది. వీటికి లింక్ అయ్యే ప్రతి వస్తువు రేటు పెరిగే ప్రమాదం ఉండడంతో కేంద్రం రేట్లను కంట్రోల్ చేస్తోంది. సుంకాలు తగ్గించుకుంటోంది. యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం ఏదైనా జరగొచ్చంటున్నారు.

Also Read: Trump: రాతియుగానికి ఇరాన్? ట్రంప్ హెచ్చరికతో వణికిపోతున్న ప్రపంచం!

Story by: Anup, Big Tv

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×