E-Paper
Advertisement

Iran: అగ్నిగుండంలా ఇరాన్.. ఖమేనీ పని ఖతం.. !

Iran: అగ్నిగుండంలా ఇరాన్.. ఖమేనీ పని ఖతం.. !
Advertisement

Iran:  సిగరెట్లు కాల్చిపడేస్తున్నారు.. హిజాబ్‌లు తీసిపడేస్తున్నారు. ఇరాన్ ప్రజల్లో ఒక్కసారిగా ఇంత ఆగ్రహం పెల్లుబుకడానికి కారణమేంటి? ఆందోళనకర స్థాయిలో ఆ దేశంలో ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. ప్రపంచం మొత్తం ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. అసలు.. ఇరాన్‌లో ఇంత ప్రజాగ్రహం ఎందుకు తన్నుకొచ్చింది? సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోలు కనిపిస్తే చాలు కాల్చేసేంత కోపంతో జనం ఎందుకు రగిలిపోతున్నారు?

ఖమేనీ ఫోటోలు కాల్చి సిగరెట్లు వెలిగిస్తున్నారు..

ఇరాన్‌లో రక్తపాత ప్రజా తిరుగుబాటులో కొత్త ట్రెండ్‌ మొదలైంది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఫోటోలను తగలబెట్టి.. ఆ మంటల్లో ఇరాన్ మహిళలు సిగరెట్లు వెలిగిస్తున్న దృశ్యాలు.. గ్లోబ్ అంతటా వైరల్ అవుతున్నాయ్. రెండు వారాలుగా మధ్యప్రాచ్య దేశాన్ని కుదిపేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో.. ఈ తరహా నిరసనలు టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారాయ్. కఠినమైన సామాజిక కట్టుబాట్లు, మహిళల హక్కులపై ఆంక్షలకు పేరుగాంచిన దేశంలో.. ఈ ట్రెండ్ ధిక్కరణకు చిహ్నంగా మారింది. ఇస్లామిక్ దేశంలో.. సుప్రీం లీడర్ చిత్రాలను దహనం చేయడం చట్టప్రకారం తీవ్రమైన నేరం. మహిళలు సిగరెట్లు కాల్చడంపైనా నిషేధం ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి, ప్రభుత్వ భవనాలను తగలబెట్టిన నిరసనకారులకు మరణశిక్ష విధించబడుతుందని టెహ్రాన్ ప్రాసిక్యూటర్ తెలిపారు. అయినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా.. యువ ఇరానియన్ మహిళలు.. ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా విప్లవానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ నిరసనలు.. ఇరాన్ ప్రభుత్వాన్ని సవాల్ చేయడమే కాదు.. మహిళలపై కఠినమైన సామాజిక కట్టుబాట్లను వ్యతిరేకిస్తున్నారని సూచిస్తున్నాయ్. అనేక మంది మహిళలు హిజాబ్ చట్టాలని ధిక్కరిస్తున్నారు. మహిళలు హిజాబ్‌లు తొలగించడం, బహిరంగంగా సిగరెట్లు కాల్చడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ ప్రజలు

Advertisement

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇస్లామిక్ మత గురువుల పాలనపై.. ఇరాన్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఖమేనీకి మరణం అనే నినాదాలతో జనం రోడ్లపైకి వస్తున్న దృశ్యాలు దేశమంతటా కనిపిస్తున్నాయ్. 2022లో మొదలైన హిజాబ్ వ్యతిరేక పోరాటం ఇప్పుడు మరింత తీవ్రమైంది. మహిళలు సిగరెట్లు కాల్చడం, హిజాబ్‌లు తీసేయడమనేది.. ఒక రకంగా చట్టాల ఉల్లంఘన అనే చెప్పాలి. తమపై బలవంతంగా రుద్దిన డ్రెస్‌ కోడ్‌ని తాము అంగీకరించబోమని చెప్పడానికి ఇదొక చిహ్నం. తమ శరీరంపై తమకే అధికారం ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇరాన్ సమాజంలో మహిళలు బహిరంగంగా సిగరెట్లు కాల్చడంపై.. తీవ్రమైన సామాజిక, మతపరమైన ఆంక్షలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోల్లో.. మహిళలు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫోటోలను తగలబెట్టి.. ఆ మంటతో సిగరెట్లు వెలిగిస్తున్నారు. ఇది.. ఇస్లామిక్ ప్రభుత్వ అధికారాన్ని తాము లెక్కచేయడం లేదని చెప్పేందుకు చేస్తున్న చర్య.

ఇంటర్నెట్, ఇంటర్నేషనల్‌ ఫోన్‌కాల్స్‌పై నిషేధం

ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా.. కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. గత డిసెంబర్ చివరి వారం నుంచి మొదలైన ఉద్యమం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వందకు పైగా నగరాలకు పాకింది. జనం పెద్ద సంఖ్యల్లో వీధుల్లోకి తరలివచ్చి ర్యాలీలు చేస్తున్న వీడియోలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో.. ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, ఇంటర్నేషనల్‌ ఫోన్‌కాల్స్‌పై నిషేధం విధించింది. దాంతో.. ఆందోళనల తీవ్రత బయటి ప్రపంచానికి పూర్తి స్థాయిలో తెలియడం లేదు. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 2 వందల మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒక్క టెహ్రాన్‌లోనే ఈ స్థాయిలో మరణాలు సంభవించాయని, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది యువకులే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఖమేనీ ప్రభుత్వం 2500 మందికి పైగా నిరసనకారుల్ని అరెస్ట్ చేశారని.. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఉద్యమానికి మద్దతుగా చాలా మంది వ్యాపారులు షాపులు మూసివేసి పోరాటంలో భాగస్వాములవుతున్నారు. కేవలం హిజాబ్ గురించే కాదు, ఆర్థిక స్వేచ్ఛ, రాజకీయ మార్పు కోసం ఇరాన్ ప్రజలు చేస్తున్న పోరాటం ఇది.

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం

Advertisement

దేశంలో చెలరేగిన ఉద్రిక్తతలు, ఆందోళనలపై ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేతులు.. ఇరాన్ ప్రజల రక్తంతో తడిచాయన్నారు. ట్రంప్‌ని ఖుషీ చేసేందుకు.. సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారంటూ ఇరాన్ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని ఇరాన్ మాజీ రాజకుటుంబ వారసుడు, చివరి షా కుమారుడు రెజా పహ్లావి ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతో.. రాజధాని టెహ్రాన్‌లో వీధుల్లో మంటలు వేశారు. ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెజా పహ్లావి తిరిగి రావాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఇక.. శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్న ప్రజలకు సాయం చేయాల్సిందిగా.. విదేశాల్లో ఉన్న ఇరాన్‌ యువరాజు రెజా పహ్లావి ప్రెసిడెంట్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. నిరసనలను అణిచివేసేందుకు.. ప్రభుత్వం చేస్తున్న దాడుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని కోరారు.

ప్రజల్లో ఇంత ఆగ్రహం పెల్లుబుకడానికి కారణమేంటి?

ప్రజల్లో ఇంతటి ఆగ్రహం పెల్లుబుకడానికి మూడు ముఖ్య కారణాలున్నాయ్. ఇస్లామిక్ పాలనలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రస్తుతం.. ఆ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఒక అమెరికన్ డాలర్ విలువ 12 లక్షల రియాల్స్‌కు చేరింది. ద్రవ్యోల్బణం 42 శాతానికి పైగా చేరడంతో.. ఆహారం, మందులు లాంటి నిత్యవసర వస్తువులు సామాన్యులు భరించలేనంత భారంగా మారాయ్. అమెరికా లాంటి దేశాలు విధించిన కఠినమైన ఆంక్షలు కూడా ఇరాన్ ఆదాయ వనరుల్ని, చమురు ఎగుమతుల్ని దెబ్బతీశాయ్. దాంతో.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు నేరుగా సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేశారు. అతని పాలనని నియంతృత్వంగా వర్ణిస్తూ.. గద్దె నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇరాన్ తమ దేశ ప్రజల సంక్షేమం కంటే.. విదేశీ యుద్ధాలపై ఎక్కువ నిధులు ఖర్ుచ చేస్తోందని జనం భావిస్తున్నారు. ఇటీవలే.. ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం వల్ల.. ఇరాన్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయ్. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడం ప్రజల సహనాన్ని పరీక్షించింది. గతంలో మాదిరిగా సంస్కరణల కోసం కాకుండా.. ఈసారి మొత్తం వ్యవస్థ మార్పు కోసం జనం ఆందోళనలు చేస్తున్నారు. పూర్తిగా.. ఇస్లామిక్ రిపబ్లిక్‌నే తిరస్కరిస్తున్నారు.

ఇరాన్‌ విసిగిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే.. ఆ దేశం అలసిపోయింది. కరెన్సీ విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానికి తాకడంతో.. జనం ఇస్లామిక్ పాలనపై ఆగ్రహావేశాల రగిలిపోతున్నారు. అందుకే.. దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ఇవన్నీ చూస్తుంటే.. ఇరాన్‌లో ఇస్లామిక్ పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైందా? జనమంతా.. సుప్రీం లీడర్ ఖమేనీని గద్దె దించడం ఖాయమా?

ఇస్లామిక్ పాలన పట్ల కట్టలు తెంచుకున్న జనాగ్రహం

ఇరాన్‌లో కనిపిస్తున్న దృశ్యాలు.. ఆ దేశ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైనవిగా మారుతున్నాయ్. సిగరెట్లు వెలిగించడానికి సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోలను వాడటం, హిజాబ్‌లు తీసివేసి.. మంటల్లో వేయడం, వినూత్న రీతుల్లో నిరసన తెలపడం వెనుక.. దశాబ్దాల అణచివేతతో పాటు, ఇటీవల ముంచుకొచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రధాన కారణాలుగా ఉన్నాయ్. ఆర్థిక ఇబ్బందులే కాదు.. సామాజిక స్వేచ్ఛ లేకపోవడం, అణచివేత ధోరణులు.. ఇరాన్ పౌరులను వీధుల్లోకి వచ్చేలా చేశాయ్. ఈ పరిస్థితుల్లో.. ఇరాన్ ఓ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓ వైపు.. అంతర్జాతీయ ఆంక్షలు, మరోవైపు.. అంతర్గత తిరుగుబాట్లు.. ఆ దేశ పునాదులను, ఇస్లామిక్ పాలన గోడలను కదిలిస్తున్నాయ్.

రికార్డు స్థాయిలో పడిపోయిన ఇరాన్ కరెర్సీ

ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయ్. మాంసం, పాలు, కూరగాయల ధరలు.. గడిచిన కొన్నేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువయ్యాయ్. నిరుద్యోగం, ఉపాధి దొరకకపోవడంతో.. దేశ భవిష్యత్తుపై యువతలో నమ్మకం సన్నగిల్లింది. మరోవైపు.. 80 ఏళ్లు పైబడిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వారసత్వంపైనా ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ప్రజలు ఆయన్ని ఒక మత నాయకుడిగా కాకుండా.. తమ కష్టాలకు మూలకారణమైన నియంతలా చూస్తున్నారు. ఖమేనీ తర్వాత వచ్చే నాయకత్వంపై అస్పష్టత కూడా.. ప్రస్తుత వ్యవస్థ పట్ల ఉన్న వ్యతిరేకతను మరింత పెంచుతోంది. ప్రజలు విసిగిపోయినా.. ఇరాన్‌లో ఇస్లామిక్ పాలన అంతం కావడం అంత తేలికైన విషయం కాదనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఇరాన్ సైన్యం కంటే శక్తిమంతమైన.. రెవల్యూషనరీ గార్డ్స్.. ఇప్పుడున్న వ్యవస్థకు వెన్నెముకలా ఉంది. వీరు.. ఆర్థికంగా, సైనికంగా దేశాన్ని శాసిస్తున్నారు. వ్యవస్థ కూలిపోతే తమ మనుగడకే ప్రమాదమని భావించి.. నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఈ సమయంలో.. నిరసనకారులందరినీ ఏకం చేసే బలమైన నాయకుడు, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ప్రస్తుతం ఇరాన్‌లో కనిపించడం లేదు. అమెరికా లాంటి దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఇతర మార్గాల ద్వారా చమురు ఎగుమతులు చేస్తూ.. ప్రభుత్వం మనుగడను సాగిస్తోంది.

తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు

ఇరాన్‌లో నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులను హతమార్చాలనుకుంటే.. వారిని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగుతుందని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే.. ట్రంప్ ప్రకటనని ఇరాన్ ఖండించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. వెనెజుయెలాపై అమెరికా ఎటాక్ తర్వాత.. ఇరాన్ విషయంలో యూఎస్ ఏం చేయబోతోందన్నది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే.. చరిత్రను చెబుతున్నదేమిటంటే.. ఏ దేశంలోనైనా ఆర్థిక సంక్షోభం, సామాజిక అణచివేత పతాక స్థాయికి చేరినప్పుడు విప్లవాలు సంభవించాయి. ఇరాన్‌లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వం తుపాకీ తూటాలతో నిరసనలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నా.. జనం గుండెల్లో రగులుతున్న అసంతృప్తిని ఆపడం కష్టం. ఇది.. ఇస్లామిక్ పాలన అంతానికి దారితీస్తుందా? ఉద్రిక్తతలు, నిరసన జ్వాలలు అంతెత్తున ఎగసి.. కొన్నాళ్లకు చల్లారిపోతాయా? అన్నది.. కాలమనే నిర్ణయించాలి. కానీ.. గడిచిన 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలమైన సవాల్‌ను మాత్రం ఇరాన్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. దీని నుంచి ఇస్లామిక్ ప్రభుత్వం ఎలా బయటపడుతుందన్న దానికోసం.. ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

 Story by: Anup, Big Tv 

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×