E-Paper
Advertisement

Anthropic AI: ఐటీపై ఏఐ పిడుగు.. ఆంథ్రోపిక్ దెబ్బ.. షేర్స్ ఢమాల్

Anthropic AI: ఐటీపై ఏఐ పిడుగు.. ఆంథ్రోపిక్ దెబ్బ..  షేర్స్ ఢమాల్

Anthropic AI: అపోకలిప్స్.. మాములుగా మహా వినాశనం అనే పరిస్థితి వచ్చినప్పుడు ఈ పదాన్ని వాడుతాం. కానీ ఇప్పుడు ఐటీ కంపెనీల్లో సాస్పోకలిప్స్‌ అనే వర్డ్‌ ఐటీ వరల్డ్‌లో తెగ వినిపిస్తోంది. ఇప్పుడు పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. మరి ఇది నిజమేనా? ఔనా.. కాదా? అని తెలుసుకునే ముందు.. ఈ రోజు ఒక్కసారి స్టాక్‌ మార్కెట్‌లో ఐటీ కంపెనీల షేర్లను ఒక్కసారి గమనించాలి. 1.9 లక్సల కోట్ల రూపాయల ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్.. ఒక్కరోజులోనే మాయమైపోయింది. ఇది జస్ట్ ఐటీ కంపెనీల స్టాక్స్‌కు సంబంధించిన లెక్క మాత్రమే. ఒక్క సింగిల్ ట్రేడింగ్ సెషన్‌లో ఈ స్థాయిలో కోల్పోవడం హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైమ్.

గ్లోబల్ సిగ్నల్స్‌తో కూలిన ఐటీ స్టాక్స్

ఇది కేవలం ఇండియన్ మార్కెట్‌ విషయమే. ఇక గ్లోబల్ మార్కెట్ల విషయానికి వస్తే.. ఒక్క అమెరికన్ మార్కెట్‌లో ఐటీ కంపెనీలకు చెందిన 300 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఆ ఎఫెక్ట్‌ అక్కడ మొదలై.. ఆ తర్వాత ఇండియన్ మార్కెట్లకు చేరింది. ఇప్పటికే ఏఐతో షేక్ అవుతున్న ఈ ఇండస్ట్రీకి మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయనే సిగ్నల్స్ స్టాక్స్ పతనానికి అర్థం. ఐటీ స్టాక్స్ కొన్న ఇన్వెస్టర్లలోనూ భయాలు పెరిగిపోతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇలా ఏ సంస్థ కూడా ఈ డౌన్‌ఫాల్‌ నుంచి తప్పించుకోలేకపోయింది. అన్ని కంపెనీలకు మార్కెట్లు స్ట్రోక్ ఇచ్చాయి. దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 6% నుండి 8% వరకు పడిపోయాయ్.

ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన ఐటీ దిగ్గజాలు

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారీ షాక్ తగిలింది. ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో కంపెనీ ఏకంగా 70 వేల కోట్ల రూపాయల మార్కెట్ విలువను కోల్పోయింది. షేరు విలువ 6.7% మేర పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. అటు దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ పరిస్థితి కూడా ఇంతే. ఏకంగా 8.1% మేర షేర్లు పడిపోవడంతో, కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు 50 వేల నుండి 54 వేల కోట్ల మేర కరిగిపోయింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా ఈ పతనం నుండి తప్పించుకోలేకపోయింది. షేరు ధర 5.3% తగ్గడంతో, దాదాపు 22,500 కోట్ల నష్టాన్ని ఈ కంపెనీ మూటగట్టుకుంది. అటు టెక్ మహీంద్రా ఇన్వెస్టర్లు కూడా భారీగానే నష్టపోయారు. షేరు ధర 6.1% పడిపోవడంతో కంపెనీ విలువ 10 వేల కోట్లు తగ్గింది. విప్రో షేరు కూడా 4.3% మేర నష్టపోయి 10 వేల కోట్ల నష్టపోయింది.

ఆంథ్రోపిక్ కొత్త AI టూల్ ఎఫెక్ట్‌.. ఐటీ స్టాక్స్‌లో భారీ డౌన్‌ఫాల్

మరి ఈ డౌన్‌ఫాల్‌కు రీజన్ ఏంటి? ఆన్సర్ సింపుల్ అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే స్టార్టప్ AI కంపెనీ. ఆ కంపెనీ రిలీజ్ చేసిన ఒక కొత్త టూల్. ఈ టూల్స్ ఇప్పుడు ఐటీ కంపెనీల్లో గేమ్‌ ఛేంజర్‌గా మారనున్నట్టు తెలుస్తోంది. ఈ టూల్స్‌ కారణంగా క్లయింట్లకు తక్కువ మంది సిబ్బంది అవసరమవుతారు. దీంతో ఐటీ కంపెనీల ఆదాయం పడిపోతుందనేది ఇన్వెస్టర్ల భయం. అందుకే పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఐటీ స్టాక్స్ షేక్ అయ్యాయి.

అవుట్‌పుట్ బేస్డ్ ఛార్జింగ్‌పై ఇన్వెస్టర్ల టెన్షన్

ఇప్పటివరకు పనిచేసిన గంటల ప్రాతిపదికన సాఫ్ట్ వేర్ కంపెనీలు క్లైంట్స్ నుంచి డబ్బులు వసూలు చేసేవి. కానీ ఇప్పుడు అవుట్‌పుట్ ఆధారంగా ఛార్జ్ చేస్తున్నారు. అంటే AI సహాయంతో పని వేగంగా జరిగినా, ఆ పనితో క్లయింట్‌కు కలిగే లాభం ఆధారంగా పేమెంట్ తీసుకుంటున్నారు. సో ఐటీ సేవల బిజినెస్ మోడల్స్ మారిపోయాయి. ఇవి ఎటు దారి తీస్తాయోనన్న టెన్షన్ ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. అందుకే ఐటీ స్టాక్స్ షేక్ అయ్యాయి.

ఏఐ టూల్స్‌తో ఇండియన్ ఐటీ బిజినెస్ మోడల్‌కు సవాల్

ఇండియన్ ఐటీ కంపెనీలు అమెరికా, యూరోప్ కంపెనీల నుండి వచ్చే అవుట్‌సోర్సింగ్ పనుల మీద ఆధారపడి ఉంటాయి. డేటా ఎంట్రీ, టెస్టింగ్, మెయింటెనెన్స్ వంటి పనులను ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ టూల్స్ చాలా తక్కువ ఖర్చుతో, వేగంగా చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు తగ్గిపోతాయనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. మాములుగా ఐటీ కంపెనీలు మ్యాన్ పవర్ అంటే ఉద్యోగుల సంఖ్య ఆధారంగా క్లయింట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తాయి. అయితే ఏఐ వల్ల ఒక మనిషి చేసే పనిని నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. దీనివల్ల బిల్లింగ్ అవర్స్ తగ్గిపోయి, కంపెనీల ఆదాయం పడిపోయే అవకాశం ఉంది.

ఆంథ్రోపిక్ ఇచ్చిన స్టేట్‌మెంట్ తర్వాత అమెరికా మార్కెట్లో సేల్స్‌ఫోర్స్, అడోబ్, సర్వీస్‌ నౌ వంటి సాఫ్ట్‌వేర్ దిగ్గజాల షేర్లు 7 నుంచి 10% పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంపై ఏఐ ప్రభావం చూపుతుండటంతో దాని సెంట్రిమెంట్ ప్రభావం భారతీయ మార్కెట్లపై కూడా బలంగా పడింది.

చాట్‌జీపీటీ తర్వాత మరో షేక్.. ఆంథ్రోపిక్ కథ ఏంటి?

అయితే ఆంథ్రోపిక్‌ గురించి ఆందోళన అనవసరం అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇండియన్ ఐటీ కంపెనీలు ఇప్పటికే ఏఐ ట్రైనింగ్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. క్లయింట్లకు ఏఐ సొల్యూషన్స్ అందించడం ద్వారా కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. అంతేకాదు బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఏఐని నేరుగా వాడటానికి ఇంకా ముందడుగు వేయడం లేదు. అక్కడ ఐటీ కంపెనీల అవసరం తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు. అసలు ఐటీ కంపెనీలను ఇంతగా షేక్ చేస్తున్న ఆంథ్రోపిక్ కథేంటి? అది రిలీజ్ చేసిన ప్లగిన్స్‌ వల్ల వచ్చే మార్పులేంటి?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త విప్లవం

ఆంథ్రోపిక్… ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వరల్డ్‌లో ఒక కొత్త రెవల్యూషన్. 2021లొ డారియో అమోడెయ్, డానియెలా అమోడెయ్‌ ఇద్దరు దీనిని స్థాపించారు. వీరద్దరు కూడా ఓపెన్‌ ఏఐను తీసుకురావడంలో కీ రోల్ ప్లే చేసిన వారు. అయితే ఆంథ్రోపిక్‌కు గూగుల్, అమెజాన్‌ సపోర్ట్ చేయడంతో.. ఈ స్టార్టప్‌ చాలా తక్కువ టైమ్‌లోనే ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏఐ అనేది కేవలం తెలివైనది మాత్రమే కాదు, సురక్షితంగా ఉండాలనేది ఈ సంస్థ స్థాపించడం వెనక ముఖ్య ఉద్దేశం. ఇది నచ్చే అమెజాన్, గూగుల్.. ఇందులో బిలియన్ల కొద్ది డాలర్లను ఇన్వెస్ట్‌ చేశాయి. దీంతో ఓపెన్‌ ఏఐని చాలెంజ్‌ చేసే స్థాయికి ఎదిగింది ఆంథ్రోపిక్. ఇది ఈ సంస్థ బ్యాక్‌గ్రౌండ్ స్టోరి.

ఏజెంట్ ఏఐ అంటే ఇదే..

ఓపెన్‌ ఏఐకి చాట్‌ జీపీటీ ఎలానో.. ఆంథ్రోపిక్‌ ఏఐ మోడల్ పేరు క్లాడ్. క్లాడ్ కోవర్క్ అనేది పని చేసే విధానాన్ని మార్చే టూల్. చాట్ జీపీటీ కావొచ్చు.. పాత క్లాడ్ మోడల్స్ కూడా మనం క్వశ్చన్స్‌ అడిగితే.. ఆన్సర్స్‌ ఇస్తాయి. అవసరమైతే పెద్ద పెద్ద కొన్ని వ్యాసాలు రాసిస్తాయి. కానీ క్లాడ్ కోవర్క్ అలా కాదు. ఇది ఒక ఏజెంట్. ఇది పనిని ఎలా చేయాలో చెప్పడమే కాదు.. పనిని కూడా చేసి పెడుతుంది. మీ కంప్యూటర్‌ను కంట్రోల్ చేస్తుంది. స్క్రీన్‌ను అర్థం చేసుకుంటుంది.. అవసరమైతే మౌస్‌ను కదిలించడం.. బటన్స్‌ను నొక్కడం వంటి పనులను ఇది తనంతట తానే చేస్తుంది.

ఐటీ వరల్డ్‌ను షేక్ చేస్తున్న క్లాడ్ కోవర్క్ కొత్త ప్లగిన్స్

డేటాను కలెక్ట్ చేయడం.. దానిని మాడిఫై చేయడం.. అవసరమైతే అందరికీ మెయిల్ చేయడం.. ఈ పనులన్ని కూడా క్లాడ్ కోవర్క్ చేస్తుంది. అంటే ఒక ఆఫీస్‌ ఎంప్లాయిలాగా.. మిగిలిన సాఫ్ట్‌వేర్‌లను అర్థం చేసుకొని.. వాటితో కలిసి పని చేస్తుంది. ఇది ఐటీ వరల్డ్‌లో ఓ గేమ్‌ఛేంజర్. అయితే క్లాడ్‌ వర్క్‌ కొత్తగా 11 కొత్త ప్లగిన్స్‌ను లాంచ్‌ చేసింది. ఇప్పుడీవి ఓ రెవల్యూషన్ అనే చెప్పాలి. ఈ 11 ప్లగిన్స్‌ కూడా చాలా పవర్‌ఫుల్. ఈ కొత్త ప్లగిన్స్‌ కోడ్ రాయడమే కాదు.. అందులో బగ్స్‌ను ఆటోమెటిక్‌గా వెతుకుతాయి. వాటిని ఫిక్స్‌ కూడా చేస్తాయి. ఇది ఐటీ కంపెనీల్లో జూనియర్ డెవలపర్ల అవసరాన్ని తగ్గించే అవకాశం ఉంది.

లీగల్ నుండి ఫైనాన్స్ వరకు.. సరికొత్త AI టూల్స్

లీగల్ ప్లగిన్.. ఆంథ్రోపిక్‌ రిలీజ్ చేసిన వాటిలో ఇదే పవర్‌ఫుల్. ఎందుకంటే కాంట్రాక్టులను రివ్యూ చేయడం, నాన్ డిస్‌క్లోజర్ అగ్రిమెంట్స్‌ను చదవి.. లీగల్ రిస్క్‌ను అసెస్‌మెంట్ చేయడం చేస్తుంది. ఇది చాలా క్లిష్టమైన డాక్యుమెంట్లలోని లోపాలను రెడ్ ఫ్లాగ్ చేసి మరీ చూపిస్తుంది. నెక్ట్స్‌ సేల్స్ ప్లగిన్. సేల్స్ టీమ్స్ కోసం క్లయింట్ల వివరాలను వెతకడం.. సేల్స్ కాల్స్ కోసం నోట్స్ సిద్ధం చేయడం, క్లయింట్లకు పంపాల్సిన ఫాలో-అప్ మెయిల్స్ సొంతంగా రాయడం.. వాటిని అవసరమైన వారికి పంపడం.. అన్నీ చేస్తుంది.

ఫైనాన్స్ ప్లగిన్.. ఇది కంపెనీ అకౌంట్స్‌ను చెక్ చేస్తుంది. ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌ను తయారు చేస్తుంది. ఖర్చులను అనలైజ్ చేస్తుంది. ఆడిట్ రిపోర్ట్‌లను సిద్ధం చేస్తుంది. డేటా అనలిటిక్స్ ప్లగిన్.. ఇది భారీ డేటా సెట్‌లను విశ్లేషించి గ్రాఫ్‌లు, విజువలైజేషన్లు తయారు చేస్తుంది… ప్రొడక్టివిటీ ప్లగిన్.. క్యాలెండర్‌ను మెయింటేన్ చేయడం.. టాస్క్ లిస్ట్ అప్డేట్ చేయడం, ఇమెయిల్‌లు, స్లాక్ మెసేజ్‌లను స్కాన్ చేసి ముఖ్యమైన పనులను గుర్తు చేయడం లాంటి పనులను కూడా ఇదే చేస్తుంది.

మీ సొంత ఏఐ ప్లగిన్‌ను మీరే తయారు చేసుకోండి

ఇలానే మార్కెటింగ్ ప్లగిన్, కస్టమర్ సపోర్ట్ ప్లగిన్, ఎంటర్‌ప్రైజ్ సెర్చ్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ ప్లగిన్ ఇలా అనేక ప్లగిన్‌లు తీసుకొచ్చింది ఆంథ్రోపిక్. అయితే ఇందులో బయాలజీ రీసెర్చ్ ప్లగిన్ కాస్త ఇంట్రెస్టింగ్‌. ఎందుకంటే ఇది సైంటిస్టుల కోసం స్పెషల్‌గా తీసుకొచ్చింది. ఈ ప్లగిన్‌ క్లినికల్ ట్రయల్స్ డేటాను చదవడమే కాదు.. రీసెర్చ్ పేపర్స్‌ను అనలైజ్ చేస్తాయి. ఇక చివరి ప్లగిన్ అయితే మరింత ఇంట్రెస్టింగ్. దీని పేరే ప్లగిన్ మేనేజ్‌మెంట్ లేదా ప్లగిన్ బిల్డర్. దీని పని ఏంటంటే.. ప్లగిన్స్‌ను మేనేజ్ చేయడం లేదా ఒక కంపెనీ తన సొంత అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లగిన్‌ను తయారు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

అంథ్రోపిక్ సంచలనం.. నెలల ప్రాజెక్టులు ఇక వారాల్లోనే!

ఇలా ఒక వ్యక్తి కావొచ్చు.. లేదా ఒక టీమ్‌ మొత్తం చేయాల్సిన పనులను ఈ ప్లగిన్స్‌ చాలా ఈజీగా చేసి పెట్టేస్తాయి. ఇదే ఇప్పుడు అనేక ఐటీ కంపెనీలను టెన్షన్ పెడుతోంది. నెలల తరబడి పట్టే ప్రాజెక్టులు.. ఇక వారాల్లోనే పూర్తవడం ఒక భయమైతే.. ఇక ఐటీ ప్రొఫెషన్స్‌ అవసరం లేదు అనేది మరో టెన్షన్. మరో విషయం ఏంటంటే.. వీటిని ఓపెన్‌ సోర్స్‌లో ఉంచింది అంథ్రోపిక్. అంటే ఉచితంగా వాడుకునే అవకాశం ఉంది. ఇది కూడా ఐటీ కంపెనీలకు మరో తలనొప్పిగా మారింది. ఈ టూల్స్‌ కారణంగా జూనియర్ లెవల్ ఉద్యోగాలకు ఎసరు పడటం తప్పదనిపిస్తోంది. కోడింగ్, టెస్టింగ్, డేటా ఎంట్రీ, బగ్ ఫిక్సింగ్‌ ఇక నిమిషాల్లో జరిగిపోతుంది. గతంలో క్లయింట్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఒక సర్వీస్ టీమ్‌లు ఉండేవి. ఇప్పుడు ఆ అవసరం ఉండదు.

ఏఐతో సవాల్ మాత్రమే కాదు.. భారీ అవకాశాలు!

ఈ ప్లగిన్స్‌ను పూర్తిగా నెగటివ్ ధోరణిలో చూడకూడదు అనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఏఐ సాయంతో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం అనేది ప్రొడక్టివిటీని పెంచుతుంది. అంతేకాదు ఏఐ ఇంకా పూర్తిగా చేయలేని కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, హ్యూమన్ స్ట్రాటజీ, బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో ఐటీ కంపెనీల ప్రాధాన్యత తగ్గదని చెబుతున్నారు. ఇప్పటికే మన ఐటీ కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇస్తున్నాయి. ఏఐని వాడటంలో క్లయింట్లకు సహాయం చేయడం ద్వారా కొత్త ప్రాజెక్టులు పొందే అవకాశం లేకపోలేదు. అయితే ఇంకా పాత, ట్రెడిషనల్‌ మోడల్‌ను ఫాలో అయ్యే ఐటీ కంపెనీలకు మాత్రం ఈ టూల్స్‌ మాత్రం ముప్పే.

Story By: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×