MLA Report: ఐవిఆర్ఎస్ సర్వే పేరు వింటేనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజా ప్రతినిధులు బెంబేలెత్తిపోత్తుంటారు. అలాంటిది ఇప్పుడు అధికారులు కూడా ఆ పేరు చెప్తే హడలెత్తిపోతున్నారంట. అధికారుల పనితీరుపై కూడా ఐవిఆర్ఎస్ సర్వేల ద్వారా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందంట. అధికారుల పనితీరును బేరీజు వేయడానికి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం సదుద్దేశంతో ఆ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ అఫిషియల్స్ మాత్రం ఇదేం తలనొప్పిరా అని చిర్రుబుర్రులాడుతున్నారంట .. ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా ఈ ఐవిఆర్ఎస్ సర్వేలతో అటు ప్రజాప్రతినిధుల్లోనూ ఇటు అధికారుల్లోనూ ఆందోళన మాత్రం షరా మామూలైందంటున్నారు
ప్రజాప్రతినిధుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వేలు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా ప్రతినిధుల పని తీరుపై ఎప్పటికప్పుడు ఐవిఆర్ఎస్ సర్వేల ద్వారా అభిప్రాయాన్ని సేకరిస్తుంది. ఆ క్రమంలో ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై ఓసారి అభిప్రాయాన్ని తీసుకుని వారి పనితీరుకు కొన్ని మార్కులు ఇచ్చేసిందట. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ లకు రాష్ట్రంలోని అందరి ఎమ్మెల్యేల కంటే తక్కువ మార్కులు వచ్చాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరికీ క్లాస్ కూడా పీకినట్లు చర్చ జరుగుతుంది. పార్టీ అధినేత క్లాసు పీకినప్పటి నుంచి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజల మధ్య ఉండేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.
అధికారుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వేలు
అదలా ఉంటే ఈ ఐవిఆర్ఎస్ సర్వే కాల్స్ ద్వారా అధికారుల పనితీరును కూడా ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఫలానా అధికారి పని తీరు ఎలా ఉంది అని ప్రజలకు నేరుగా కాల్స్ వెళ్తున్నాయి. బాగుంది అంటే ఒకటి నొక్కండి బాగాలేదు అంటే రెండు నొక్కండి అంటూ కాల్స్ వస్తుండటంతో ప్రజలు వారి అభిప్రాయాన్ని నిర్భయంగా వెల్లడించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీనివల్ల అధికారులు కూడా పనితీరు మెరుగుపరుచుకుంటారని చంద్రబాబు ప్రభుత్వం ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా అధికారుల పనితీరును మెరుగుపరిచేలా ముందుకు సాగుతోంది. అయితే అందరికీ ఐవిఆర్ఎస్ కాల్స్ వెళ్లడం కూడా ఇబ్బందిగానే మారిందని అధికారులు లోలోన మదన పడుతున్నారట. ఒక పని మీద కార్యాలయానికి వచ్చిన వారి నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటే తమ పనితీరు స్పష్టమవుతుందని, అలా కాకుండా నేరుగా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరికీ కాల్స్ వెళ్లడం ద్వారా పనితీరును ప్రజలు ఎలా స్పష్టంగా చెప్పగలరని ప్రశ్నిస్తున్నారు.
ఐవీఆర్ఎస్ సర్వేల్లో ఖచ్చితత్వం ఉంటుందా?
ఐవిఆర్ఎస్ సర్వే అటు ప్రజాప్రతినిధుల్లోనూ ఇటు అధికారుల్లోనూ గుబులు పుట్టిస్తున్న వేళ వాటి ద్వారా వచ్చే అభిప్రాయ సేకరణలో ఖచ్చితత్వం ఉంటుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఓ అధికారి నిబంధనల ప్రకారం పనిచేయలేదు అన్నది ఆయన దగ్గరకి వెళ్లిన వారికి మాత్రం తెలుస్తుంది. అలాంటివారిని ఈ కాల్స్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తే ఖచ్చితమైన సమాచారం వస్తుంది. కానీ ఎలాంటి పని నిమిత్తం అధికారిని కలవని వారి నుంచి కూడా అభిప్రాయ సేకరణ తీసుకోవడం సమంజసం కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పైకి చెప్పలేకున్నా ఈ విషయంలో వారు గట్టిగానే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
పనితీరు సరిగ్గా లేదని ఎలా నిర్ధారిస్తారు?
ప్రజా ప్రతినిధులు సైతం ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వారు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అభిప్రాయ సేకరణ జరిగేటప్పుడు ఖచ్చితంగా తమ పార్టీ కాదు కనుక వ్యతిరేకంగానే సమాధానం చెప్తారు. అలాంటి సమాచారంతో తమను పనితీరు సరిగా లేదని పేర్కొనడం ఎంతవరకు సమంజసం అని అంతర్గతంగా మదన పడుతున్నారట. ఈ విషయాన్ని ఎవరో ఒకరి ద్వారా పార్టీ అధిష్టానానికి తీసుకువెళ్లాలని చెబుతున్నారని సమాచారం. ఇలా ఐవిఆర్ఎస్ కాల్స్‌పై నాయకులు, అధికారులు ఒకే రకమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో హైటెక్ సీఎం చంద్రబాబు ఆ సర్వేల్లో ఎంతవరకు పారదర్శకత తీసుకొస్తారో చూడాలి.
Story By Ajay Kumar, Bigtv