ఆ ఉమ్మడి జిల్లాలో ఆయన పవర్ ఫుల్ నేతగా చక్రం తిప్పారు. దశాబ్దం పాటు మంత్రిగా కొనసాగిన ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు సాగింది.. ఉమ్మడి జిల్లాలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు అందరు అతని మాట వినాల్సిందే. ఎందుకంటే గులాబీబాస్‌కి అత్యంత సన్నిహితుడు ఆ నేత . ఇప్పుడాయన్ని సొంత పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలతో పాటు, నియోజకవర్గ ప్రజలు కూడా పట్టించుకోవడం మానేసారట. ఆ మాజీ మంత్రి రోడ్డు మీదకు వచ్చినా చుట్టూ పట్టుమని పది మంది కూడా కనిపించడం లేదంట. పదేళ్లు రాజసం వెలగబెట్టిన ఆ నేతాశ్రీకి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?.. అసలింతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? పట్టించుకోవడం మానేసిన జనం.
2023 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక సూర్యాపేట నియోజకవర్గం మినహా మిగతా పదకొండు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆరెస్ పార్టీ అభ్యర్థిగా సూర్యాపేట నుండి బరిలో నిలిచిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. లాయర్‌గా కెరీర్ ప్రారంభించిన జగదీష్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరి తెలంగాణ ఉద్యమంలో హడావుడి చేశారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009లో హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన జగదీష్‌రెడ్డి అప్పటి కాంగ్రెస్ మినిస్టర్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన హుజూర్‌నగర్ వైపు చూడటమే మానేశారు. తర్వాత టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధిగా, పొలిట్ బ్యూరో మెంబర్‌గా కూడా పనిచేశారు. 2014లో జరిగిన ఎన్నికలలో సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రెండోసారి గెలిచారు.
గులాబీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన రెండు టర్మ్‌లు మంత్రిగా కొనసాగారు. గత ఎన్నికల్లో తిరిగి సూర్యపేట నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు పార్టీకి దక్కిన ఏకైక సీటు సూర్యాపేటే కావడం గమనార్హం. అదలా ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో కారు పార్టీ చతికిల పడటంతో ఆ మాజీ మంత్రిని జిల్లాలోనే కాదు సొంత నియోజకవర్గంలో కూడా పట్టించుకునే వారే కరువయ్యాంట. సుర్యాపేట సెగ్మెంట్లో గులాబీ శ్రేణులే ఆయన్ని లైట్ తీసుకుంటున్నాయంట.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానే అన్నట్లు వ్యవహరించిన జగదీష్‌రెడ్డి ఇప్పుడు చేతిలో పవర్ లేకపోయే సరికి నియోజకవర్గ ప్రజలతో తనకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారంట. గడచిన సంవత్సర కాలంగా నియోజకవర్గంలో కేవలం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలలో పాల్గొనడం, ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప, బయట ప్రజలను కలవడం కానీ ,వారి సమస్యలను పట్టించుకోవడం గాని చెయ్యడం లేదంట. మూడు సార్లు గెలిపించిన తమ పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరుతో నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కులసంఘాలకు భవనాలు నిర్మిస్తానని మాటలు చెప్పి శిలాఫలకాలు వేసి పదేళ్లు వాటిని పట్టించుకోలేదని వివిధ కులసంఘాల నేతలు ఆయనపై ఫైర్ అవుతున్నారు.
Also Read: ఫార్ములా -ఈ రేస్ కేసు.. డొంక కదులుతోంది, ఏసీబీ ముందుకు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు
ఇక పార్టీకి చెందిన గ్రామస్థాయి నేతలు, మండల స్థాయి నేతలు సైతం ఆయనపై అసహనంతో కనిపిస్తున్నారు. ఆయనను నమ్మి అప్పులు తెచ్చి కాంట్రాక్టు పనులు చేస్తే చివరకు తమకు రావలసిన బిల్లులు కూడా సాంక్షన్ చేయించలేకపోయారని గుర్రుగా ఉన్నారంట. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని వారు హెచ్చరిస్తున్నారంట. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటు ప్రజలకు మరింత చేరువవుతున్నారు. దాంతో ప్రజలు ఆయన్నే తమ ఎమ్మెల్యేగా భావిస్తూ పనుల కోసం ఆయన దగ్గరకే వెళ్తుండటం విశేషం. మరోవైపు జగదీష్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి డమ్మీ ఎమ్మల్యేగా మిగిలిపోయారన్న టాక్ వినిపిస్తుంది.