E-Paper
Advertisement

Jagan Padayatra 2.0: మళ్లీ పాదయాత్ర బాటలో జగన్.. 2029 లక్ష్యంగా మాస్టర్ ప్లాన్!

Jagan Padayatra 2.0: మళ్లీ పాదయాత్ర బాటలో జగన్.. 2029 లక్ష్యంగా మాస్టర్ ప్లాన్!

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్.. జగన్ పాదయాత్ర

పాదయాత్రతోనే.. జగన్ జనంలోకి వెళ్లారు. జనంతో మమేకమయ్యారు. వారి కష్టాలను నేరుగా తెలుసుకున్నారు. సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ఏ పాదయాత్ర అయితే.. జగన్‌ని ప్రజలకు దగ్గరచేసిందో.. అదే పాదయాత్ర జగన్‌కి అధికారాన్ని తెచ్చిపెట్టింది. సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. తెలుగు రాజకీయాల్లో ఇప్పటిదాకా పాదయాత్ర చేసిన ఏ నాయకుడిని కూడా ఓటమి దరి చేరలేదు. దాంతో.. పవర్‌లోకి రావాలంటే.. పాదయాత్రమే సరైన మార్గమనే ముద్ర పడిపోయింది. ఈ క్రమంలోనే.. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది. అధికారం కోల్పోయిన తర్వాత.. నిశ్శబ్దంగా ఉంటూ, అప్పుడప్పుడూ ప్రెస్ మీట్లతో జనం ముందుకు వస్తున్న జగన్.. ఇప్పుడు ఒక్కసారిగా గేర్ మార్చేశారు. 2029 ఎన్నికలే టార్గెట్‌గా.. ఆయన ప్రకటించిన పాదయాత్ర నిర్ణయం ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోసారి అధికారంలోకి రావాలంటే.. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు ఏలూరు వైసీపీ నేతలతో జరిపిన సమావేశంలో ప్రకటించారు. ఏడాదిన్నర పాటు జనంలోనే ఉంటానని తెలిపారు. పాదయాత్రకు ముందే.. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు ప్రతి వారం ఓ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కావాలని జగన్ నిర్ణయించుకున్నారు. వరుస ఓటములు, కేసులతో డీలా పడ్డ వైసీపీ శ్రేణుల్లో.. జగన్ నిర్ణయం కొత్త ఉత్సాహాన్ని నింపింది.

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కనిపించడంలేదని జగన్ వ్యాఖ్య

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, చంద్రబాబు మోసాలను జనం గుర్తించారని జగన్ అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏమైనా చేయొచ్చనే అహంకారంతో ఉన్నారని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కనిపించడం లేదని ఆరోపించారు. వ్యవసాయ రంగం నాశనమైందన్నారు. ప్రభుత్వానికి మిగిలింది మూడేళ్లు మాత్రమేనని.. ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర మొదలవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓసారి తన తండ్రి వైఎస్సాఆర్ అడుగుజాడల్లో నడుస్తూ.. 2017లో పాదయాత్ర చేపట్టారు జగన్. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజుల పాటు 13 జిల్లాల మీదుగా 3 వేల 648 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించారు. రావాలి జగన్ – కావాలి జగన్ అనే నినాదంలో ప్రజల్లోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చారు. అయితే.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అంతకుముందు 151 స్థానాలు గెలిచిన వైసీపీ.. కూటమి సునామీలో కొట్టుకుపోయింది. కేవలం.. 11 సీట్లలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దాంతో.. వైసీపీని మళ్లీ నిలబెట్టాలంటే.. పాదయాత్రే మార్గమని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభించి.. ఎన్నికల సమయానికి పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

ప్రజల మద్య నడిచి, రాజకీయ చరిత్ర రాసిన యాత్రలు

అధికారంలోకి రావాలంటే.. పాదయాత్రే ఎందుకు? అనే చర్చ ఇప్పుడు వినిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో.. దీనికి హిస్టారికల్ సెంటిమెంట్ ఉంది. రాజ్యాధికారం సాధించాలంటే.. ప్రజల మధ్య నడవడమే ఏకైక మార్గమని గత చరిత్ర స్పష్టం చేస్తోంది. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1470 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి.. కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చారు. 2012లో.. వస్తున్నా మీకోసం యాత్రతో చంద్రబాబు నాయుడు 2 వేల 840 కిలోమీటర్లు నడిచి.. 2014లో విజయం సాధించారు. వైఎస్ జగన్ కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి.. 2019లో వైసీపీకి చరిత్రాత్మకమైన విజయాన్ని అందించారు. 2023లో నారా లోకేశ్ చేసిన యువగళం పాదయాత్ర.. 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. ఇలా.. ప్రజలతో నేరుగా మమేకమయ్యేందు, వారి కష్టాలను స్వయంగా వినడానికి పాదయాత్ర కంటే మెరుగైన మార్గం లేదని జగన్ బలంగా నమ్ముతున్నారు.

వైసీపీకి జోష్ తెచ్చే పాదయాత్ర

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్ర అనేది విజయానికి శక్తివంతమైన మార్గమే కాదు.. రాబోయే ప్రభంజనానికి సంకేతంగా మారింది. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకోవడానికి, వారిలో నమ్మకాన్ని నింపడానికి, పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులు ఈ బాటను ఎంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసి సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన నాయకులున్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితుల్లో.. వైసీపీకి మళ్లీ బలం పుంజుకోవాలన్నా, కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపాలన్నా.. ఎన్నికల హీట్ మొదలయ్యే ఏడాదిన్నర ముందు నుంచే.. తాను జనంలో ఉండాలని జగన్ అనుకుంటున్నారు. అప్పుడే.. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.

జగన్ పాదయాత్ర.. వ్యూహం వెనుక రాజకీయ ఆలోచనలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్ర అనేది ప్రజలతో మమేకమయ్యే ప్రయాణం మాత్రమే కాదు.. అధికార పీఠాన్ని చేరుకునేందుకు బలమైన రోడ్ మ్యాప్‌గా మారిపోయింది. ముఖ్యంగా.. వైఎస్ ఫ్యామిలీకి పాదయాత్రతో విడదీయలేని అనుబంధం ఉంది. వైఎస్సార్ మాత్రమే కాదు, ఆయన కుమారుడు జగన్, కూతురు షర్మిల కూడా పాదయాత్ర చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ మోహన్ రెడ్డి.. పాదయాత్ర వైపు మొగ్గు చూపడం వెనుక.. అనేక రాజకీయ సమీకరణాలు, వ్యూహాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. జగన్ ఎంచుకున్న అస్త్రం వెనుక ఆలోచన వేరే ఉంది. వైఎస్ జగన్ తన రాజకీయ జీవితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా.. జనంలోకి వెళ్లడమే పరిష్కారమని బలంగా నమ్ముతారు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే.. ఓ ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర పుట్టాయి. 2019లో వైసీపీ సాధించిన అఖండ విజయానికి ప్రజా సంకల్ప యాత్ర పునాది వేసింది. ఇప్పుడు మళ్లీ అదే బాటని ఎంచుకునేందుకు కీలక కారణాలున్నాయ్.

జనంతో మళ్లీ మమేకం: జగన్ పాదయాత్రపై ప్రశ్నలు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సానుభూతి పొందడానికి, ప్రజల మధ్య ఉండటం కంటే మించిన మార్గం లేదని జగన్ భావిస్తున్నారు. పాదయాత్రతో.. నేరుగా ప్రజలతో మమేకమయ్యే అవకాశం దొరుకుతుంది. అంతేకాదు.. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నిస్తేజంగా ఉన్న వైసీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు.. నాయకుడు రోడ్డు మీదకు రావడం అత్యవసరం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలులో జరుగుతున్న జాప్యం, సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. పాదయాత్ర ఓ వేదికగా మారుతుంది. పైగా.. జగన్‌కు ఇది బాగా సెంటిమెంట్ ఎలిమెంట్. కానీ.. గతానికి, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు ఉంది. జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసినప్పుడు అధికారానికి దూరంగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జనంలోకి వచ్చారు. ప్రజలకు కూడా జగన్‌పై ఓ విధమైన ఆశ ఉండేది. ఓసారి అవకాశం ఇచ్చి చూద్దామనే ఆలోచన ఉండేది. కానీ.. ఇప్పుడలా కాదు. జగన్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మళ్లీ జనంలోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే.. ఆయన పరిపాలన ఎలా ఉంటుందో ఏపీ చూసింది. మళ్లీ పాదయాత్రతో తమ మధ్యలోకి వస్తే.. జనం ఆయన మాటలతో పాటు గత పాలనని కూడా బేరీజు వేస్తారు. అందువల్ల.. జగన్ మళ్లీ జనంలోకి వస్తే.. ఆంధ్రా ప్రజలు ఓన్ చేసుకుంటారా? లేదా? అనేదే.. ఇప్పుడున్న బిగ్ సస్పెన్స్.

అభివృద్ధి vs రాజకీయ మద్దతు.. జగన్ పాదయాత్ర సవాళ్లు

జగన్ పాదయాత్రని ప్రజలు ఆదరిస్తారా? లేదా? అనేది కీలక అంశాలపై ఆధారపడి ఉంది. మరో ఏడాదిన్నర తర్వాత.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత గనక మొదలైతే.. జగన్ యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. ఇదికాకపోతే.. జగనే మరోసారి మీకోసం వచ్చాను, అభివృద్ధి అయినా, సంక్షేమమైనా.. వైసీపీతోనే అనే నినాదాన్ని జగన్ ఎంత బలంగా ప్రజల్లోకి పంపుతారనేది కూడా ఆధారపడి ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత.. జగన్ పాదయాత్రతో వచ్చేసరికి.. ఇప్పుడున్న ప్రభుత్వంపై ఏపీ ప్రజలకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది. కూటమి వైపు నిలబడాలా? మరోసారి జగన్‌తో కలిసి నడవాలా? అనేది దాదాపుగా డిసైడ్ అయిపోతుంది. అందువల్ల.. ఈసారి జగన్ పాదయాత్రకు పూలబాట ఏమీ ఉండదు. పైగా.. ఆయన కొన్ని సవాళ్లని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా.. వైసీపీ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఎందుకు జరగలేదనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎంతవరకు ఆయన వెంట నడుస్తుందనేది కూడా ముఖ్యమే. గతంతో పోలిస్తే.. ఇప్పుడు డిజిటల్ మీడియాలో నెగటివ్ క్యాంపెయిన్ చాలా వేగంగా జరుగుతోంది. దీనిని ఎలా డీల్ చేస్తారనేది కూడా కీలకమే.

ఎన్నికల ముందస్తు యుద్ధ వ్యూహం..

పాలిటిక్స్‌లో.. టైమింగ్ చాలా ముఖ్యం. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే.. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని ప్రకటించడం చూస్తుంటే.. జగన్ ముందస్తుగానే యుద్ధానికి సిద్ధమయ్యారనే విషయం తేలిపోయింది. అధికారం పోయాక మౌనంగా ఉంటే.. పార్టీ శ్రేణులు చెదిరిపోయే అవకాశం ఉందని గ్రహించిన జగన్.. ఈ పాదయాత్ర అస్త్రాన్ని ప్రయోగించారు. దాని ద్వారానే.. కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని చూస్తున్నారు. పైగా.. జనం పల్స్ పట్టుకోవడంలో జగన్‌కు అనుభవం ఉంది. అది కేవలం నడకతోనే సాధ్యమని నమ్ముతున్నారు. మరోసారి జగన్ నడిచొచ్చి చరిత్రను తిరగరాస్తారో, లేదో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఏపీ రాజకీయాల్లో మరో భారీ ఘట్టానికి ఈ పాదయాత్ర తెరలేపడం ఖాయం.

Story by: Anup, Big Tv

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×