Jammalamadugu: ఏపీలో ఆ నియోజకవర్గ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే..! అక్కడ రెండు కుటుంబాల మధ్య రాజకీయ ఆరోపణలే కాదు.. ఎదురుపడితే దాడులు ప్రతి దాడులు సర్వసాధారణమే. ఇన్నాళ్లు రెండు విభిన్న వర్గాల మధ్య జరిగిన వార్..ఇప్పుడు ఒకే కుటుంబంలో చెలరేగింది. ఈ నియోజకవర్గంలో తామే కింగ్ అని చెప్పుకునే ఆ కుటుంబంలోనే ఇప్పుడు అంతర్యుద్ధం నెలకొంది. ఓ వైపు బాబాయ్..మరో వైపు అబ్బాయ్.. మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ వార్‌కు ముగింపు ఎలా..? బాబాయ్..అబ్బాయ్ మధ్య సయోధ్య కుదిరేనా..? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటీ..? ఆ ఇద్దరు నేతలు ఎవరు..?
ఏపీలో కూటమి నేతల కుమ్ములాటలు రోజు రోజుకు ముదిరిపోతున్నాయి. పైకి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నా.. లోలోపల మాత్రం.. నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇదే తీరులో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో…బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా మారింది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
కడప జిల్లాలోనే కీలక నియోజకవర్గం జమ్మలమడుగు నియోజకవర్గం. ఈ జిల్లాలో రాజకీయం మొత్తం ఒక ఎత్తైతే.. జమ్మలమడుగు పాలిటిక్స్ మరో ఎత్తు. ఇక్కడ దశాబ్దాలుగా దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది. అయితే జమ్మలమడుగు నియోజకవర్గంలో 2024కు ముందు.. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచేది. కానీ మొన్నటి వరకు కూటమి వర్సెస్ వైసీపీ ఉన్న పోరు..ఇప్పుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన అన్న కొడుకు టీడీపీ ఇంఛార్జ్ భూపేష్ రెడ్డిగా మారిందట.
ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అయినా.. భూపేష్ రెడ్డి జమ్మలమడుగు టిడిపి ఇంచార్జ్‌గా ఉన్నా కూడా ఇద్దరు ప్రతిపక్షా పార్టీ నేత జగన్‌పై ఒంటికాలిపై లేచేవారు. సందుదొరికితే చాలు బాబాయ్..అబ్బాయ్.. వైసీపీ నేతలను, జగన్‌ను గట్టిగానే విమర్శించేవారు. కానీ ఇప్పుడు మాత్రం బాబాయ్..అబ్బాయ్‌లే ఒకరినొకరు విమర్శించుకుంటున్నారట.
2024 ఎన్నికల ముందు వరకు జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని భూపేష్ రెడ్డి ప్రచారం చేసుకున్నారు. అయితే చివరి క్షణంలో బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి టికెట్ దక్కించుకోవడంతో టిడిపి క్యాడర్‌తో పాటు భూపేష్ రెడ్డి సైతం అసంతృప్తికి గురయ్యారు. ఈ సమయంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో భూపేష్ రెడ్డి సర్దుకుపోయారట. కానీ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినా.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డే.. దక్కించుకోవడంతో భూపేష్ రెడ్డి అనుచరుల్లో అసంతృప్తి మొదలైందని టాక్. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ పనుల్లో సైతం ఆది అనుచరులే పెత్తనం చలాయిస్తుండడంతో భూపేష్ రెడ్డి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. బాబాయ్ ఆది పెత్తనంపై అబ్బాయ్ భూపెష్ రెడ్డి సైతం అసంతృప్తిలో ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగు సాగుతోంది.
అయితే అబ్బాయ్ బాబాయ్ మధ్య కొంత సయోధ్య కుదిరినా.. మద్యం షాపుల విషయంలో నిప్పు రాజుకుందని టాక్. ఈ క్రమంలో మద్యం షాపుల కోసం టీడీపీ , బీజేపీ మధ్య మొదలైన వార్.. ఇప్పుడు స్మార్ట్ కిచెన్ పనుల్లో కత్తితో దాడి చేసుకునే వరకు వచ్చిందని తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ హవా నడుస్తున్నా.. జమ్మలమడుగులో మాత్రం బీజేపీ హవా సాగడంపై టిడిపిలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయట. జమ్మలమడుగు బాబాయ్.. అబ్బాయ్ వార్‌పై అధిష్టానం కూడా అయోమయంలో ఉందని తెలుస్తోంది. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అయినా.. అబ్బాయ్.. బాబాయ్ మధ్య కోల్డ్ వార్ చల్లబడుతుందా..? అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి..క్యాడర్ కలిసి పని చేసేలా చేస్తుందా..అనేది కాలమే నిర్ణయించాలి.
Story By Kishan, Big Tv