BL Santhosh: కోల్డ్ వార్‌తో సతమతమవుతున్న రాష్ట్ర బీజేపీ నేతలకు బీఎల్ సంతోష్ చేసిన కామెంట్స్ కొత్త సమస్యను తెచ్చిపెట్టిందా..? ఉంటే ఉండండి..లేదా వెళ్లిపోండి అనే ఘాటు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారు ? బీజేపీని అడ్డం పెట్టుకుని దందాలు ఎవరు చేస్తున్నారు ? రామచందర్‌రావుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలను గట్టిగానే అమర్చుకున్నాడా..? అసలు బీఎల్ సంతోష్ ..ఆగ్రహానికి కారణంమేంటి..? ఆయన ఎవరిని టార్గెట్ చేశారు ?
ఈ డైలాగులు.. తెలంగాణ కమలం పార్టీలో కలకలం సృషిస్తున్నాయి. హస్తిన నుంచి వచ్చిన అధిష్టానం దూత బీఎల్ సంతోష్.. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్‌తో ఒక్కసారిగా కాషాయ నేతలు కలవరపాటుకు గురయ్యారు. అసలు బీఎల్ సంతోష్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు. ఎవరికి ఈ కౌంటర్లు వర్తిస్తాయి. అధ్యక్షుడు రామచందర్‌రావును ఏ నేతలు లెక్కచేయడం లేదు..ఎవరు..బీజేపీని అడ్డం పెట్టుకుని దందాలు నడిపిస్తున్నారని ఇప్పుడు తీవ్ర చర్చనీయాశంగా మారింది.
నవంబర్ 30వ తేదీన తుక్కుగూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అధ్యక్షతన సంస్థాగత వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు ఆ పార్టీ జాతీయ సంస్థాగత ఇంచార్జ్ బీఎల్ సంతోష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పేరుకు ఇది వర్క్‌షాప్ అయినా.. ఈ కార్యక్రమంలో బీఎల్ సంతోష్.. కాషాయ నేతలను గట్టిగానే అమర్చుకున్నాడు.
ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్‌రావును నియమించిన సమయంలో అభ్యంతర వాఖ్యలు చేసిన నేతలకు బీఎల్ సంతోష్..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని టాక్. రామచందర్‌రావు శక్తిసామర్థ్యాలు పరిశీలించాకే..అధిష్టానం ఆయన్ను.. అధ్యక్షుడిగా నియమించిందని.. ఎవరిని యుద్ధ సమయంలో వాడుకోవాలో..ఎవరిని శాంతి సమయంలో వాడుకోవాలో తమకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటుగానే వ్యాఖ్యానించారట. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకోవాలని రామచందర్‌రావుకు ఫుల్ పవర్స్ ఇచ్చారని సమాచారం.
ప్రధానంగా పార్టీలో చేరిన కొత్త నేతలను టార్గెట్ చేస్తూ బీఎల్ సంతోష్ చేసిన కామెంట్స్‌తో ..ఆ లీడర్లకు దిమ్మతిరుగుతోందట. ఎవరి డబ్బా, ఎవరి పెత్తనం పార్టీకి అవసరం లేదని ఘాటుగానే వ్యాఖ్యానించారట. నేతలు ఎవరి కోసం, ఏ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో సోయిలో ఉండి మాట్లాడాలని.. అర్థం పర్థం లేకుండా అడ్డగోలుగా మాట్లాడితే అస్సలు సహించబోమని హెచ్చరించినట్లు టాక్. కొందరైతే పార్టీని అడ్డంపెట్టుకుని సొంత పనులు చేసుకుంటున్నారని బహిరంగంగానే బీఎల్ మాట్లాడటం హాట్‌టాపిక్‌గా మారింది. పదవుల కోసం పార్టీలోకి వచ్చి..పదవులు తీసుకుని సొంత దందాలు చేసుకుంటున్న వారు..నిర్దాక్షిణ్యంగా తప్పుకోవాలని హెచ్చరించడం చర్చనీయాంశమైంది. నేతల పనితీరుతో పార్టీ పదవులకు వన్నె తీసుకురావాలి తప్ప..పార్టీ పరువు తీసే విధంగా ఉంటే ఊరుకోమని గట్టిగానే హెచ్చరించారట. ప్రతీ నాయకుడిపై కేంద్ర పార్టీ నిఘా ఉంటుందని..ఎవరు తోక జాడిస్తున్నారో..ఎవరు అండగా ఉంటున్నారో..అన్నీ గమనిస్తున్నామని బాంబ్ పేల్చారు. నేతలంతా కలిసికట్టుగా వెళ్లాలని.. ఎవరికి వారుగా ప్రవర్తిస్తే..పార్టీకే కాదు వ్యక్తిగతంగా కూడా నష్టపోతారని నేతలకు చురకలు అంటించినట్టుగా తెలుస్తోంది.
అయితే బీఎల్ సంతోష్ చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారన్నది ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాట్ హాట్‌గా సాగుతున్న చర్చ. అయితే హలో రామచందర్ రావు అంటూ వార్నింగ్ ఇచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్‌కేనా ఈ వార్నింగ్ అంటూ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. కాదు కాదు…రామచందర్‌రావు కిషన్‌రెడ్డి చేతిలో లబ్బర్ స్టాంప్ అంటూ వ్యాఖ్యానించిన రాజాసింగ్‌కే అంటూ మరికొంత మంది అనుకుంటున్నారట. అయితే అధ్యక్ష పదవి దక్కలేదని అసహనంలో ఉన్న ఈటల రాజేందర్‌కే అని ఇంకొందరు గుసగుసలాడుకుంటున్నారట. అయితే రామచందర్‌రావుపై అసహనంతో ఫుట్ బాల్ ఇచ్చి నిరసన తెలిపిన కొండా విశ్వేశ్వర్ రెడ్డినే బీఎల్ సంతోష్ హెచ్చరించారంటూ క్యాడర్ చెవులు కొరుక్కుంటారట.
బీజేపీ వర్క్‌షాప్‌లో బీఎల్ సంతోష్ కామెంట్స్‌తో కిందస్థాయి నేతలు, కార్యకర్తలు తెగ సంబరపడిపోతున్నారని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ..పార్టీపై, పార్టీ నాయకత్వంపై దుమ్మెత్తిపోసే నాయకులను గట్టిగా అర్సుకున్నారని అనుకుంటున్నారట. కొత్తగా చేరి.. అధిష్టానంపైనే అవాకులు చవాకులు పేలుతున్న వారికి గట్టిగానే గడ్డిపెట్టారని చర్చించుకుంటున్నారు. ఉంటే ఉండండి.. లేదా వెళ్లిపోండి.. అనే తీరులో బీఎల్ సంతోష్ చేసిన కామెంట్స్‌తో కొత్త నేతలంతా డైలామాలో పడ్డట్టుగా కూడా చర్చ జరుగుతోంది. అయితే కావాలనే బీఎల్ సంతోష్‌తో రాష్ట్ర నాయకత్వం..కొత్త నేతలను టార్గెట్ చేయించారనే టాక్ సైతం నడుస్తోంది.
ఇప్పటికే నిత్యం పంచాయితీలు ..నేతల మధ్య కోల్డ్ వార్‌లతో సతమతం అవుతున్న బీజేపీ నేతలు… బీఎల్ సంతోష్ చేసిన దిశ నిర్దేశాలతో సెట్ అవడం..! కొత్త పాత అనే భేదం లేకుండా కలిసి నడవడం ఇప్పట్లో కష్టమే. అధిష్టానం దూతగా వచ్చిన సంతోష్..మాటను పాటిస్తూ..కొత్త పాత అనే భేదాలు తీసేసి నేతలంతో ఒక్కటైతే మాత్రం కాషాషాయానికి ఢోకా ఉండదు. అయితే ఇక్కడ బీఎల్ సంతోష్ చేసిన కామెంట్స్‌ను కొత్త నేతలు ఎలా తీసుకుంటారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Story by Kishan, Big Tv