ఎప్స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. మీడియాకు ఇప్పుడు ఇది మసాలా దట్టించిన న్యూస్ ఐటెమ్. ప్రపంచ దిగ్గజాలకు మాత్రం.. ఇదో పెద్ద బూచి. ఏ తప్పు చేయనివాడు.. మనకేం కాదులే అని ధైర్యంగా ఉండవచ్చు. కానీ, తెరచాటు యవ్వారాలు నడిపిన పెద్దలకు మాత్రం.. ఇది నిద్రలేకుండా చేస్తోంది. ఇంతకీ ఏమిటీ ఎప్స్టీన్ ఫైల్స్? అందులో ఏం ఉన్నాయ్?
అమెరికా ప్రభుత్వం ఇటీవలే ఎస్స్టీన్ ఫైల్స్‌ను రిలీజ్ చేసింది. ఇందులో మిలియన్ల కొద్ది పేజీల్లో అనేక వివాదాస్పద అంశాలు దాగి ఉన్నాయి. వాటిలో మన ప్రపంచ దిగ్గజాల జాతకాలు ఉన్నాయి. వారి రాసలీలల నుంచి ఆర్థిక అవకతవకల వరకు ప్రతి ఒక్కటీ మెయిల్స్, మెసేజులు, డాక్యుమెంట్లు, వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. ఈ పాపాల చిట్టా బయటపడటానికి కారణం.. జెఫ్రీ ఎప్స్టీన్. వీడిని మనిషి అనడం కంటే.. ఒక మదమెక్కిన రాక్షసుడు అనడం బెటర్. ఎంతోమంది బాలికలు, అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన కరుడుగట్టిన క్రిమినల్ ఇతగాడు. మరి, ఇలాంటి వాడితో ప్రపంచ దిగ్గజాలకు ఏంటీ పని అని అనుకుంటున్నారా? ఎందుకంటే.. ఎప్స్టీన్ రిచ్ బ్రోకర్. రాజకీయ, వాణిజ్య దిగ్గజాలతో సన్నిహితంగా ఉంటూ.. వారి అవసరాలను తీర్చుతూ తన పనులను చక్కబెట్టుకొనే బిజినెస్ మ్యాన్.
అమెరికాలోని అత్యంత సంపన్నుల్లో జెఫ్రీ ఎప్స్టీన్ ఒకడు. న్యూయార్క్, ఫ్లొరిడా.. మరికొన్ని ప్రైవేట్ ఐలాండ్స్‌లో పెద్ద బంగ్లాల్లో నివసించేవాడు. అయితే, వీడు పెద్ద కామపిశాచి. అమ్మాయి కంటపడితే చాలు.. అమాంతంగా ఎత్తుకుపోయి సొంతం చేసుకొనేవాడు. వాడి వేషాలు బయటకు పొక్కకుండా.. బాధితులకు డబ్బులిచ్చేవాడు. కానీ.. చేసిన పాపం ఊరికే పోదు అన్నట్లు.. జెఫ్రీగాడు టీనేజర్లను లైంగికంగా వేధించి దొరికిపోయాడు. 2008లో కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించాడు. విడుదల తర్వాత కూడా అతడి ఆగడాలు ఆగలేదు. పెద్ద పెద్ద నేరాలు చేయడం మొదలుపెట్టాడు. అమ్మాయిలను అక్రమంగా తరలించేవాడు. లైంగికంగా వాడుకోవడమే కాకుండా.. మిగతావారికి కూడా వారిని సప్లై చేసేవాడు. దీంతో పోలీసులు 2019లో జెఫ్రీని అరెస్టు చేశారు. జెఫ్రీ జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కానీ, అది ఆత్మహత్య కాదు.. హత్యేనని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కారణం.. అతడికి ప్రపంచ దిగ్గజాలతో ఉన్న సంబంధాలే. అతడు బతికి ఉంటే వారి అరాచకాలు బయటకు వస్తాయనే కారణంతోనే.. జెఫ్రీ ఎప్స్టీన్‌ను హత్య చేయించి ఉంటారని అంతా భావిస్తున్నారు.
జెఫ్రీ ఈ పనులన్నీ ఒంటరిగా చెయ్యలేదు. గిస్లైన్ మాక్స్వెల్ అనే మహిళ అతడికి కుడి భుజంగా వ్యవహరించింది. అమ్మాయిలను సప్లై చేయడానికి, వారిని వేధించడానికి సహకరించింది. 2021లో కోర్డు ఆమెను కూడా దోషిగా నిర్ధరించింది. జెఫ్రీతో కలిసి ఈమె 18 ఏళ్లు కూడా నిండని బాలికలను లైంగికంగా వేధించేవారు. ప్రస్తుతం ఆమె జైలులోనే ఉంది. కేసు విచారణలో భాగంగా అధికారులు ఇప్పటివరకు చాలా ఆధారాలను సేకరించారు. దాదాపు మిలియన్ల కొద్ది పేజీల్లో వారి అరాచకాలను పొందుపరిచారు. కోర్టు ఆదేశాలతో ఇటీవలే వాటిని పబ్లిక్ ముందుకు తెచ్చారు. కానీ, కొన్ని డార్క్ సీక్రెట్లను మాత్రం రహస్యంగా ఉంచేసినట్లు టాక్.
చెడ్డవాడితో సావాసం చేస్తే.. ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే సరైన ఉదాహరణ. జల్సాలకు, అమ్మాయిలకు కక్కుర్తిపడి.. ఎప్స్టీన్‌తో స్నేహం చేసిన ఎంతోమంది ప్రపంచ దిగ్గజాల జాతకాలన్నీ ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉన్నాయి. ఎప్స్టీన్‌కు ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ విమానం ఉండేది. దాని పేరు ‘లొలితా ఎక్స్‌ప్రెస్’. అమెరికాతోపాటు వివిధ దేశాల వీఐపీలంతా ఈ విమానంలోనే ప్రయాణిస్తూ జల్సాలు చేసేవారు. ఆ విమానంలో ప్రయాణించిన ప్రతి ఒక్కరి పేరును ఎప్స్టీన్ తన లాగ్ బుక్‌లో నమోదు చేశాడు. ఎప్స్టీన్ మెయిల్స్, ఫోన్లు పరిశీలించగా.. వాటిలో చాలా మంది ప్రపంచ దిగ్గజాల ఫోన్ నెంబర్లు, వారికి చేసిన మెసేజులు దొరికాయి. FBI అధికారులు కొన్ని ఏళ్లపాటు శ్రమించి.. ఆధారాలన్నీ సేకరించి.. కోర్టు ముందు ఉంచారు.
జెఫ్రీ ఎప్స్టీన్ ల్యాప్ టాప్, మొబైళ్లు ఇతరాత్ర ఫైళ్లను స్వాధీనం చేసుకున్న ఎఫ్‌బీఐ అధికారులు ఇప్పటివరకు 3.5 మిలియన్ పేజీలను విడుదల చేశారు. వాటితోపాటు 2వేలకు పైగా వీడియోలు.. 1,80,000 ఫొటోలను ప్రభుత్వానికి అప్పగించారు. అయితే, చాలా ఏళ్ల నుంచి ఈ ఫైళ్లను బహిర్గతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వీటిని బయట పెట్టక తప్పలేదు. దీని కోసం ఏకంగా ఒక చట్టాన్నే రూపొందించారు. 2025 జులై నెలలో కాంగ్రెస్ సభ్యులు రొ ఖన్నా, థామస్ మస్సీ కలిసి.. ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ చట్టాన్ని రూపొందించారు. దీనికి రాజకీయ నేతలు, కాంగ్రెస్ సభ్యులంతా సానుకూలంగా ఓటేయడం గమనార్హం. నవంబర్ నెలలో ట్రంప్ దానిపై సంతకం చేశారు. దీంతో దశలవారీగా ఎప్స్టీన్ ఫైల్స్‌ను పబ్లిక్‌లోకి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఏడాది జనవరి 30న ఏకంగా 3 మిలియన్ పేజీలు, వీడియోలు, ఫొటోలు రిలీజ్ చేశారు. https://www.justice.gov/epstein వెబ్ సైట్‌లో వీటిని మీరు చూడవచ్చు.
ఎప్స్టీన్.. అమెరికాలోనే పేరొందిన ధనవంతుడు కావడంతో చాలామంది రాజకీయ నేతలు, సంపన్నులు, సెలబ్రిటీలు అతడితో స్నేహం చేశారు. వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ఉన్నారు. చిత్రం ఏమిటంటే… ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ మీద సంతకం చేసిన ట్రంప్ పేరు కూడా ఉంది. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, మెక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్పేస్ ఎక్స్- టెస్లా సంస్థల అధినేత ఎలన్ మస్క్, వర్జిన్ కంపెనీ వ్యవస్థపాకుడు రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఎప్స్టీన్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగినవారే. ఎప్స్టీన్ ఇచ్చే పార్టీల్లో కూడా పాల్గొన్నారు. అయితే, ఆ పార్టీల్లో ఏం జరిగిందనే విషయాలు ఇప్పటికీ సీక్రెట్. ఎందుకంటే.. అవన్నీ కేవలం చనిపోయిన ఎప్స్టీన్‌కు మాత్రమే తెలుసు. ప్రస్తుతం ప్రభుత్వం పెట్టిన ఫైల్స్‌లో ఉన్నది కేవలం.. సంభాషణలు మాత్రమే. దారుణం అనిపించే ఏ అంశాన్ని బయట పెట్టలేదు. వాటిని గోప్యంగా ఉంచారేమో అనే సందేహాలున్నాయి. ఎప్స్టీన్.. తన వద్దకు వచ్చే పెద్దలకు ఏం కావాలో.. అవి అరేంజ్ చేసేవాడని టాక్. పిల్లలు, యువతులతో ‘పెద్దల’ లైంగిక కోరికలు తీర్చేవాడని ఆరోపణలు ఉన్నాయి. కానీ, వాటికి సంబంధించిన విషయాలేవీ ఈ ఫైల్స్‌లో లేవు. ఇందులో కేవలం ఎప్స్టీన్ సన్నిహితులు, స్నేహితులు.. అతనికి దగ్గరగా ఉన్న వ్యక్తుల గురించి మాత్రమే ఉన్నాయి. వారికి ఎప్స్టీన్ చేసిన ఫేవర్స్ గురించి లేనేలేవు.
ఎఫ్‌బీఐ అధికారులు ఇందులో కొన్ని విషయాలను చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఎప్స్టీన్‌తో స్నేహంగా ఉన్నంత మాత్రాన్న.. వారంతా నేరాలు చేశారని అర్థం కాదని తెలిపారు. పైగా దిగ్గజాలు ఎప్స్టీన్‌తో కలిసి నేరాలు చేసినట్లు ఆధారాలేవీ లేవన్నారు. వాళ్లలో చాలామంది అతడితో కలిసి బిజినెస్ చేశారని, అతడి విమానంలో ప్రయాణాలు చేశారని చెప్పారు. అంత మాత్రాన్న వారు చట్టాన్ని వ్యతిరేకించినట్లుగా భావించలేమని అన్నారు. ఎప్స్టీన్ ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేసినట్లు గానీ.. అతడిని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినట్లు గానీ ఆధారాలు లభించలేదన్నారు. అయితే, కొందరి ప్రైవసీ నిమిత్తం పేర్లు, అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లను బ్లాక్ మార్క్ చేసి కనిపించకుండా చేశామన్నారు. బాధితుల పేర్లు కూడా బయటపెట్టేదలేదని చెప్పారు. అనుమానితలపై మాత్రం విచారణ సాగుతోందని, ప్రస్తుతం ఆ వివరాలు గోప్యంగా ఉంచామని తెలిపారు. అయితే, కావాలనే కొందరి పేర్లు, వారి నేరాలను బయటకు పొక్కకుండా దాచి పెట్టారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్స్టీన్ ఫైల్స్‌లో దేశ ప్రధాని నరేంద్ర మోడి, వాణిజ్యవేత్త అనిల్ అంబానీల పేర్లు కూడా ఉన్నాయి. అయితే, వారికి నేరుగా ఎప్స్టీన్‌తో సంబంధం లేదు. అమెరికా పర్యటనలు, దౌత్య సంబంధాల కార్యక్రమాల నేపథ్యంలో మాత్రమే వారి పేర్లను ఎప్స్టీన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వీరి పేర్లు కేవలం మెయిల్స్, మెసేజుల్లో మాత్రమే కనిపించాయి. వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలేవీ లభించలేదు. 2017లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనల నేపథ్యంలో ఎప్స్టిన్ మోడీ పేరును ప్రస్తావించారు. అయితే, అది కేవలం రాజకీయ చర్చల్లో భాగంగా వచ్చిందేనని, అతడితో మోడికి ఏ మాత్రం సంబంధం లేదని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.
అనిల్ అంబానీ: 2019లో అనిల్ అంబానీ ఎప్స్టిన్‌ను కలిశారని, ఈ సందర్భంగా ఆయన అమెరికా రాజకీయాలు, వ్యాపారం, ట్రంప్‌కు సన్నిహితులైన జారెడ్ కుష్నర్, స్టీవ్ బ్యాన్నన్‌లతో మీటింగ్ తదితర విషయాలు గురించి మాత్రమే మాట్లాడారు. అలాగే వారు మోడి ట్రిప్స్ గురించి కూడా మెసేజులు చేసుకున్నారు. భారత సంతతికి చెందిన వెల్‌నెస్ గురు, ప్రముఖ రచయిత దీపక్ చోప్రా కూడా ఎప్స్టిన్‌ను పలు సందర్భాల్లో కలిశారు. అయితే, వీరు ఈవెంట్స్.. ఆర్థిక లావాదేవీల గురించే కలిసేవారట.
మీరా నయ్యర్, అనురాగ్ కాశ్యప్: ‘సలామ్ బొంబే’, ‘మాన్సూన్ వెడ్డింగ్’ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ మీరా నయ్యర్ పేరు కూడా ఎప్స్టిన్ ఫైల్స్‌లో ప్రస్తావనకు వచ్చింది. అయితే, ఎప్స్టిన్ నిర్వహించిన పార్టీకి మాత్రమే ఆమె వెళ్లిందని, అతడితో నేరుగా ఎలాంటి స్నేహం లేదని తెలిసింది. అలాగే మరో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ పేరు కూడా ఇందులో ఉంది. అతనికి కూడా ఎప్స్టిన్‌తో నేరుగా సంబంధం లేదు. ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్ పేరు కూడా ప్రస్తావన ఉన్నప్పటికీ.. ఎప్స్టిన్ ఎలా పరిచయం అనే విషయాలపై స్పష్టమైన వివరాల్లేవు. ఇప్పటివరకు విడుదలైన ఎప్స్టిన్ ఫైల్స్‌లో ప్రస్తావనకు వచ్చిన ఏ సెలబ్రిటీ, వాణిజ్య దిగ్గజాలపై ఎలాంటి నేరారోపణలను పేర్కొనలేదు. ఎప్స్టిన్ ఫైల్స్‌ను బహిరంగ పరిచామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా.. అందులో వీఐపీలు చేసిన నేరాలేవీ బయటకు ప్రస్తావించలేదు. చాలా ఆధారాలను బయట పెట్టకుండా.. సాధారణ విషయాలను మాత్రమే రిలీజ్ చేశారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: ఏంటి బ్రో.. సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెడుతున్నారా? SMAS వస్తోంది జాగ్రత్త!