Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊపుతో రాష్ట్రంలో ఏ బై ఎలక్షన్ వచ్చినా..గెలవడం ఈజీ అని కాంగ్రెస్ భావిస్తోందంట. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్‌లో జెండా ఎగురవేసిన కాంగ్రెస్ టీమ్ .. పార్టీ మారివచ్చిన మిగిలిన ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో గెలుపొందడం పెద్దకష్టమేమీ కాదని ధీమాగా ఉందంటున్నారు. దీంతోనే బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు స్పీకర్, కోర్టుల నుంచి టెక్నికల్ ఇబ్బందులు వచ్చినా, రిజైన్ చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి విడతగా ఖైరతాబాద్, ఆ తర్వాత స్టేషన్ ఘన్ పూర్ ను సెలక్ట్ చేసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఓటమి పాలవ్వడంతో కాంగ్రెస్‌కు జైకొట్టారు. వారిపై అనర్హత వేటు వేయాలని గులాబీపార్టీ నేతలు కోర్టులను ఆశ్రయించారు. దానిపై న్యాయస్థానం స్పీకర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. చర్యలకు నిర్ధిష్ట గడువు కూడా విధించింది. ఆ గడువు ముగియడంతో బీఆర్ఎస్ స్పీకర్ కోర్టు ధిక్కారానికి పాల్పాడ్డారంటూ తిరిగి పిటీషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరగాల్సి ఉంది.
ఆ క్రమంలో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను వివరణ అడుగుతున్నారు. అదలా ఉంటే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టిక్కెట్ పై గెలుపొందిన దానం నాగేందర్, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేయడం టెక్నికల్ గా చిక్కులు ఏర్పడ్డాయి. ఇక బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలుపొందిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే …తన కూతురు కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ తెచ్చుకోగా, దగ్గరుండి మరీ చేసిన ప్రచారం, స్టేజీలపై ఇచ్చిన స్పీచ్ లు టెక్నికల్ గా ఇబ్బందులకు గురి చేసే ఛాన్స్ ఉంది. అయితే స్పీకర్, కోర్టుల నుంచి వ్యతిరేకంగా తీర్పు వస్తే రిజైన్ చేసి కాంగ్రెస్ బీ ఫామ్ పై పోటీ చేయాలని ఆయా ఎమ్మెల్యేలు భావిస్తున్నారట.
ఇప్పటికే తాము రిజైన్ చేస్తామని ఆయా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్‌కూ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఏఐసీసీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ ను చూసి పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ స్థానాల్లో జరిగిన బైపోల్స్‌లో బీఆర్ఎస్‌ను ఓడించిన కాంగ్రెస్..మిగతా సెగ్మెంట్లపై కూడా ఫోకస్ పెంచింది. ఇవి హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ బలం మరింత పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని సర్కార్ భావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ గెలిచిన కీలక నియోజకవర్గంలో తమ పట్టు నిరూపించుకునేందుకు ఉప ఎన్నికలకు కాంగ్రెస్ ఆసక్తి చూపుతోంది.
అందులో భాగంగానే ఖైరతాబాద్ లో మరోసారి ఉప ఎన్నిక ట్రయల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అంతేగాక బాన్సువాడ లో కూడా తాను రాజీనామా చేస్తానని కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పినట్లు తెలిసింది. టెక్నికల్‌గా ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు కాకముందే రిజైన్ చేయడం బెటర్ అనే అభిప్రాయంలో పోచారం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ బీ ఫామ్ పై పోటీ చేసి గెలుస్తానని హామీ ఇచ్చారట. దీంతో ఆ నియోజకవర్గంలోనూ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉన్నదనే చర్చ గాంధీభవన్ లో జరుగుతోంది.
పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజకీయంగా మరింత పట్టు సాధించాలని, అలాగే పార్టీ పటిష్టతను చాటుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోందంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు విడతల వారీగా, వ్యూహాత్మకంగా ఉప ఎన్నికలను నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటు అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ గట్టిగానే భావిస్తోంది.
ఉప ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరేందుకు రంగం సిద్ధమవుతున్న ట్లు తెలుస్తుంది. గతంలో కేసీఆర్ కూడా ఈ ప్లాన్‌ను అమలు చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దశల వారీగా బై ఎలక్షన్లు నిర్వహించి, విజయం సాధించి, తమ పార్టీనే ప్రజలు ఆదరిస్తున్నారనే సంకేతాలను చూపారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే లైన్ లో సాగుతుందనేది పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం .
ఒకే సారి పార్టీ విలీనానికి అవసరమయ్యే ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే ఇంకా సులువుగా ఉంటుందనేది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒక వేళ అలా కుదరకపోయినా పార్టీ మారిన వారితో రిజైన్ చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నయా స్ట్రాటజీకి ఏఐసీసీ నుంచి పూర్తి మద్దతు లభించినట్లు సమాచారం. దీని వలన రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచడానికి, ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను మరింత బలంగా చూపడానికి ఈ ఉప ఎన్నికలు కీలకంగా మారతాయని అధిష్ఠానం భావిస్తోంది.
బీఆర్ ఎస్ ప్రభుత్వంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరపగా… పాలేరు, నారాయణఖేడ్ , నాగార్జునసాగర్, హూజూర్ నగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో జాయినింగ్స్ కూడా భారీగానే జరిగాయి. ఇక దుబ్బాక, హుజూరాబాద్, లో ఓటమి చెందగా, ఈ ఎన్నికలు బీఆర్ ఎస్ కు కాస్త నష్టాన్ని చేకూర్చాయి. అయితే ప్రభుత్వంలో ఉన్నందున ఉప ఎన్నికల్లో ప్రజలు తమవైపే ఉంటారనేది కాంగ్రెస్ బలమైన నమ్మకంతో కనిపిస్తోంది.
Story by Apparao, Big Tv