Etela Vs Bandi: జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో బీజేపీ దారుణ పరాజయం పాలైంది.. ఇద్దరు కేంద్రమంత్రులు ప్రచారం చేసినా కాషాయ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు.. దానికి బీజేపీలో నేతల మధ్య సమన్వయ లోపమే కారణంగా కనిపిస్తోందంటున్నారు .. కమలం పార్టీలో జరుగుతున్న పరిణామాలు… ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు … ప్రస్తుతం ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయంట..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాషాయ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఈ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని బీజేపీ మూటగట్టుకుంది. ఈ బైపోల్‌లో గెలుపుపై ధీమాతో ఉన్న కమల దశానికి డిపాజిట్ కూడా దక్కకపోవడం తీవ్రస్థాయిలో నిరాశకు గురిచేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆదిలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర నాయకత్వం సైతం చేతులెత్తేసిందన్న టాక్ నడుస్తోందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరువు, బాధ్యతలన్నీ కిషన్ రెడ్డిపైనే మోపింది. ఎందుకంటే సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ కు జరుగుతున్న బైపోల్ కావడంతో ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో వేలు పెట్టడమెందుకని అంతా సైలెంట్ గా ఉండిపోయారని చర్చ జరిగింది.
కాగా తన సెగ్మెంట్ పరిధిలోకి వస్తుండటంతో అభ్యర్థి ఎంపిక మొదలు ప్రచారం వరకు అన్నీ తానై కిషన్ రెడ్డి చూసుకున్నారనే ప్రచారం జరిగింది. కిషన్ రెడ్డి కాళ్లకు బలపం కట్టుకుని సెగ్మెంట్ అంతా విస్తృతంగా తిరిగారు. తాము కింగ్ మేకర్ కాదని, కింగ్ గా నిలుస్తామనే ధీమాను వ్యక్త పరిచారు. కానీ డిపాజిట్ కూడా దక్కకుండా.. ఊహించని ఫలితాలు రావడంతో ఈ ఓటమి బాధ్యత ఎవరు తీసుకుంటారు అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. కిషన్ రెడ్డిపై నెపం మోపుతారా.. లేక రాష్ట్ర నాయకత్వం సంజాయిషీ ఇచ్చుకుంటుందా.. లేక సమిష్టిగా తీసుకుంటారా అనేది హాట్ టాపిక్ గా మారిందట.
ఓటమి బాధ్యత వహించేది ఎవరన్నది అటుంచితే..? ఈ ఘోర వైఫల్యంపై ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో తమ తమ అసహనాన్ని వ్యక్తపరుస్తూ వార్తల్లో కెక్కుతున్నారు నేతలు. రాష్ట్ర బీజేపీలో నేతలు డివిజన్ పాలిటిక్స్ చేస్తున్నారనే చర్చ జోరందుకుందట. ఇలాంటి డివిజన్ పాలిటిక్స్‌తో పార్టీ అధికారంలోకి రావడం సాధ్యమా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. అంతేకాదు మత రాజకీయాలు మంచిది కాదు, అవి ఎక్కువ కాలం నిలబడలేవు అదికూడా తెలంగాణ లాంటి ప్రాంతంలో అస్సలంటే అస్సలు నడవవు…డివిజన్ పాలిటిక్స్, మత రాజకీయాలు చేయడం ఇక్కడ నేతలు మానుకోవాలని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ రానీ ఘోర ఓటమి తర్వాత రాష్ట్ర బీజేపీలో నేతలు, క్యాడర్ మథ్య నిరాశ, నిస్పృహలు వ్యక్తవమువుతున్నాయి.
ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ నేరుగా బండి సంజయ్ టార్గెట్ చేసేలా ఉన్నాయనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మొలతాడు ఉన్నోళ్లకు, మొలతాడు లేనోళ్లకు జరుగుతున్న ఎన్నిక ఇది అంటూ బండి సంజయ్ చేసిన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వ్యక్తిగత అభిప్రాయం అంటూనే బండికి ఈటల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చుకొచ్చారనేది టాక్. అందులో భాగమే మత రాజకీయాలు నమ్ముకున్నోళ్లు ఎక్కువ కాలం నిలబడరని ఈటల చేసిన కామేంట్స్ బండిని ఉద్దేశించే మాట్లాడారనే టాక్ నడుస్తోందట.
ఈ మధ్య కాలంలో ఇద్దరి మద్య కరీంనగర్ టూ శామీర్ పేట్ అన్నట్టుగా వార్ నడిచింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనారిటీలపై బండి సంజయ్ చేసుకొచ్చిన వాఖ్యలకు ఈటల కౌంటర్ ఇచ్చారనే టాక్ రావడంతో ఇద్దరి మద్య పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చిందనే చర్చ నడుస్తోందట. అయితే ఈటల చేసిన కామేంట్లపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కొంత మంది తననుప్రతిరోజు మీడియాలో, సోషల్ మీడియాలో హేళన చేస్తుంటారని.. ఈ బండి సంజయ్ కు ఏ పనిలేదు, పొద్దున లేస్తే హిందూ ధర్మం గురించి మాట్లాడతాడని వ్యాఖ్యానించారు. హిందు, ముస్లిం మధ్య చిచ్చు పెట్టాలని చూస్తాడని విమర్శలు చేస్తున్నారని, ఎవరేం అన్నా తాను హిందూ సనాతన ధర్మ రక్షణ కోసమే పనిచేస్తానని పరోక్షంగా ఈటల రాజేందర్‌కు కౌంటర్ ఇచ్చారు.
ఇలా పార్టీలోని ముఖ్యనేతలైన ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలయిందా అన్న ప్రశ్నలు ఆ పార్టీ క్యాడర్ లో వినిపిస్తున్నాయట. ఇంతకు డివిజన్ పాలిటిక్స్, మతాల రాజకీయాలు పార్టీకి మంచివి కావు అన్న అంశాలు ఈటల రాజేందర్ ఇప్పుడెందుకు లేవనెత్తారు, కాషాయ పార్టీలో డివిజన్ పాలిటిక్స్ చేస్తున్న నేతలెవరు?.. డివిజన్ పాలిటిక్స్ చేసేంత పరిస్థితి ఆ పార్టీలో ఎందుకొచ్చింది? ..నేతలు డివిజన్ పాలిటిక్స్ కు మాత్రమే ఎందుకు పరిమితం అవుతున్నారు.. డివిజన్ పాలిటిక్స్, మత రాజకీయాలు అన్న మాట ఈటల రాజెందర్ నోట ఎందుకొచ్చింది? ..ఆ టైప్ ఆఫ్ రాజకీయాలు నిలబడవు అనే వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలు పార్టీ క్యాడర్‌ను సమతమతం చేస్తున్నాయట.
Story by Apparao, Big Tv