Kavitha Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు తీర్పు కల్వకుంట్ల కవితకు నూతనోత్సహాం ఇచ్చింది. ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటి నుంచే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన పాలిటికల్ స్టాండ్ మార్చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఆమె కొత్త పార్టీ పెట్టనుండటం అందరిలో ఆసక్తి రేపుతోంది. పార్టీ ఏర్పాటు దిశగా కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్న మాజీ ఎమ్మెల్సీ… రాజకీయ పునాదులు బలపర్చుకోవడానికి సొంత జిల్లా నిజామాబాద్ పై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారంట. ఆ క్రమంలో కవిత వచ్చే ఎన్నికల్లో బోధన్ నుంచి పోటీచేసే అవకాశాలే ఎక్కవ ఉన్నాయంటున్నారు. ఆమె స్ట్రాటజీలు నిజామాబాద్ జిల్లా రాజకీయ సమీకరణలు మార్చే పరిస్థితి కనిపిస్తుండటంతో, బీఆర్ఎస్ పెద్దలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంట.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టాపిక్ నడుస్తోంది. బీఆర్ఎస్‌తో విభేదించి, తండ్రి స్థాపించిన పార్టీకి దూర మైన కల్వకుంట్ల కవిత దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య తలెత్తినా జాగృతి ఆధ్వర్యంలో కవిత రాజీలేని పోరాటానికి రెడీ అవుతున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన కవిత నిజామాబాద్ ఎంపీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
అప్పటి టీఆర్ఎస్ నుంచి ఎంపీ, ఎమ్మెల్సీ హోదాల్లో నిజామాబాద్ కేంద్రంగా రాజకీయాలు నడిపిన కవిత .. సొంత పార్టీ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెలలో పార్టీని ప్రకటించనున్నట్లు ఆమె ఇప్పటికే ప్రకటించారు. పార్టీ ఏర్పాటుపై సంకేతాలు ఇచ్చిన కవిత తెర వెనుక దానికి సంబంధించిన కసరత్తు ముమ్మరం చేస్తున్నారంట. పార్టీ పేరు కూడా దాదాపు ఖాయం చేసినప్పటికీ సస్పెన్స్ గా ఉండాలని బయటకు చెప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. రాజకీయ పార్టీ విషయంలో అన్ని సిద్ధం చేశారట. ఇక ప్రకటనే తరువాయిగా అంటున్నారు. తండ్రి కేసీఆర్ తరహాలో ముహూర్తాలను బలంగా విశ్వసించే కవిత అందుకే ఎదురుచూస్తున్నారంట.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవితకు దాదాపు అన్ని జిల్లాలో ఫాలోయర్స్ ఉన్నారు. వారంతా కవిత పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనేది జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ క్రమంలోనే పార్టీ ప్రకటనకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బలమైన నాయకులను, ముఖ్య వ్యక్తులను, మేధావులను పార్టీలో చేర్చుకోవడానికి కవిత టీమ్ సన్నాహాలు చేస్తోందంట. ఇప్పటికే కళాకారులు, ఉద్యమకారులు, కవులు, మేధావులు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాల వారితో కవిత ప్రత్యేక భేటీలు, నిర్వహించారు. పార్టీ ఏర్పాటుకు అవసరమైన ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారంట.
క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాటం చేస్తూనే మరో వైపు వివిధ వర్గాలతో సమావేశాలతో పార్టీ భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తూ, పార్టీ ప్రకటనకు ముందుగానే పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారట. ఇక ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని కొందరు నేతలు కూడా ప్రత్యక్షంగా అమెకు అల్ ద బెస్ట్ కూడా చెప్పేస్తున్నారట. ఈ నేపథ్యంలో తనకు కలిసొచ్చి, మెట్టినిల్లు నిజామాబాద్ నుంచే కవిత పార్టీకి శ్రీకారం చుట్టే అవకాశం ఉందంటున్నారు. అందుకే అక్కడ నుంచే పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్న పార్టీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ, సరైన గుర్తింపు లభించడం లేదని అసంతృప్తితో ఉన్న చాలా మంది కవితతో కలిసి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారని ఆమె సన్నిహితులు చెప్తున్నారు.
అలాంటి నేతలతో కవిత పక్కా ప్రణాళిక, వ్యూహాలతో ముందుకుసాగుతున్నారట. అందులో భాగంగానే ఒక్కో జిల్లాలో కీలక నేతలను బాధ్యులుగా నియమించినట్లు తెలిసింది. ప్రతి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూనే, అవసరం. సందర్భాలను బట్టి కవిత బీఆర్ఎస్ నేతలను కూడా వదిలిపెట్టడం లేదు. పరోక్షంగా కేసీఆర్ ను కూడా వదలడం లేదట. నిత్యం వార్తల్లో ఉండేలా, తీరిక లేకుండా పర్యటనలు చేస్తూ దాదాపు అన్ని జిల్లాల్లో జనంబాట కార్యక్రమం పూర్తి చేశారు. అప్పుడే జిల్లాల్లో చేరికలకు సంబంధించి మంతనాలు సాగాయంట.
ఆ క్రమంలో నిజామాబాద్ జిల్లాపై కల్వకుంట్ల వారసురాలుప్రత్యేక ఫోకస్ పెట్టారట. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలకు గాలం వేసే పనిలో పడినట్లు చెప్తున్నారు. ఆ జిల్లాలో పలువురు నేతలు కవిత ప్రోత్సాహంతోనే ఎంఎల్ఏ, తదితర పదవులు అధిరోహించారు. వారంతా ముందు నుంచి ఆమెతో పాటు గులాబీ పార్టీకి పనిచేసిన వారే. అలాగే బీజేపీ, కాంగ్రెస్ నేతలను కూడా సంప్రదిస్తున్నారట కవిత.. పార్టీలో సరైన గుర్తింపు లేక, అవకాశాలు రావడం లేదని నిరాశలో ఉన్న నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
అలాగే రాజకీయాల్లోకి రావాలనే ఉత్సాహం ఉన్న ఔత్సాహికులను పార్టీలో చేర్చుకోడటంపై కవిత ప్రత్యేక దృష్టి సారించారట. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని, ప్రత్యేక టీం ద్వారా కవిత తన కొత్త పార్టీలోకి చేరికలను వేగవంతం చేసే పనిలో పడ్డారంట. అనేకమంది నేతలతో కవితనే నేరుగా సంప్రదింపులు, సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అదలా ఉంటే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన కవిత భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇక్కడ కవిత పోటీ పరిసర జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని జాగృతి శ్రేణులు భావిస్తున్నాయి. కవిత తనకు అత్యంత పట్టు ఉన్న బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మార్పులు జరిగితే ఆలోచన మారే అవకాశం లేకపోలేదంటున్నారు.
కవిత కొత్త పార్టీ పెట్టిన తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణాలు, పరిణామాలు మారడం ఖాయమంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఆమెకు క్లీన్ చీట్ రావడంతో జాగృతిలో జోష్ పెరిగింది. మొన్నటి వరకు స్తబ్దతుగా ఉన్న క్యాడర్ తో పాటు లీడర్లు కూడా యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇక కవితతో మొన్నటి వరకు దూరంగా ఉన్న వాళ్ళు కూడా త్వరలో కవిత కొత్త పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారంట.
ఐదు నెలల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత బెయిల్ పై బయటకు రాగానే ఛాలెంజ్ చేశారు. అన్నట్లుగానే నిర్దోషిగా బయటపడ్డారు. ఆ కేసులో గతంలో ఆమె అరెస్ట్ అయినప్పుడు గులాబీ పార్టీ పెద్దగా స్పందించలేదు. ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాసీనత, కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లు అయిందని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అదే విషయాన్ని కవిత కోర్టు తీర్పు తర్వాత మీడియా ముందు ఎత్తిచూపారు. పార్టీ ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారని ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ను డిఫెన్స్‌లో పడేశాయి. అలాగే కోర్టు తీర్పు తర్వాత కవిత అరెస్ట్ తమకు రాజకీయంగా నష్టం చేసిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కవిత ఖండించారు.
మొత్తానికి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తన విశ్వరూపం చూపిస్తున్న కవిత రాజకీయాల్లో భవిష్యత్ ను పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు. ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవితకు ప్రధాన అనుచరులు ఉన్నారు. కీలకనేతలు వస్తే బలంగా నిలబడొచ్చనే ఆలోచనతో పావులు కదుపుతున్నారు. ఆమె టార్గెట్ లిస్టులో బీఆర్ఎస్ ప్రధానంగా కనపడుతుండటంతో ఆ పార్టీ నేతలు మింగలేక కక్కలేక సతమతమవుతున్నారంట.
Story by: Apparao, Big Tv