Kavitha Vs KTR: పాలిటిక్స్‌లో పరిస్థితులను బట్టి దూకుడు ప్రదర్శించే నేతలు హైలెట్ అవుతుంటారు. అందివచ్చిన అవకాశాల్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వారే ఎదుగుతారు. సరైన టైమింగ్ చూసి రియార్ట్ అయితే దాని ఫలితం ఎలా ఉంటుందో జాగృతి అధ్యక్షురాలు కవిత తాజాగా నిరూపించే ప్రయత్నం చేశారు. కొత్త పార్టీ పెడతానంటున్న కవిత .. వెలుగుమట్ల వివాదంలో స్పందించిన తీరుతో పొలిటికల్ మైలేజ్ పెంచుకున్నట్లే కనిపించారు. కవిత రోడ్డెక్కి పోరాటం చేస్తే.. ఆమె అన్న కేటీఆర్ ఆ ఇష్యూపై ఎప్పటిలాగే సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితమవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులే పెదవి విరుస్తున్నాయంట.. అసలు వెలుగుమట్ల వివాదంపై కల్వకుంట్ల అన్నా చెల్లెళ్ల వ్యవహారంపై జరుగుతున్న చర్చేంటి?
ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రజల పక్షాన నిలిచి పోరాడి.. ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేయటం అంత తేలికైన విషయం కాదు. పార్టీ అధికారంలో ఉంటే.. సర్కారు పరంగా ఆయా పార్టీ నేతల మాట ఇట్టే చెల్లుబాటు అవుతుంది. కాని విపక్షంలో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటం చేయడం … బాధితులకు న్యాయం జరిగే వరకు పట్టు విడవకపోవడం అనేది మామూలు విషయం కాదు. అలా చివరి వరకు ప్రజల పక్షాన నిలబడగలిగే లీడర్లకు సహజంగానే మైలేజ్ పెరుగుతుంది. ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పేదల ఇళ్లను కూల్చివేయడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం చివరకు దిగిరాక తప్పలేదు. ఎక్కడైతే ఇళ్లు కూల్చివేతకు గురయ్యాయో, సరిగ్గా అదే ప్రాంతంలో సుమారు 9 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి బాధితులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 311 మంది బాధితులకు ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున ఇంటి పట్టాలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముగ్గురు కీలక మంత్రుల సమక్షంలో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుండటంతో, బాధితుల్లో ఇన్నాళ్లకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Tadepalligudem Accident: తాడేపల్లిగూడెంలో టెంపో బోల్తా.. స్పాట్ లో 27 మంది..
అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందే .. వెలుగుమట్ల వివాదంపై రియాక్ట్ అయిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత… బాధితుల పక్షాన నిరాహార దీక్షకు దిగి హైలెట్ అయ్యారు. అదే సమయంలో ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అందివచ్చిన వెలుగుమట్ల వివాదంలో అన్నాచెల్లెళ్లు అయిన కేటీఆర్ కవితల తీరు భిన్నంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ ఇష్యూలో అందరి కంటే ఎక్కువగా కవిత హైలెట్ అవ్వడం జాగృతి శ్రేణుల్లో జోష్ నింపింది. బాధితుల పక్షాన నిలిచి పోరాడాలని డిసైడ్ కావటమే కాదు.. అందుకు ఎంతవరకైనా సరే వెళదామన్నట్లుగా కవిత దూకుడు ప్రదర్శించారు. అందుకు తగ్గట్లే ఖమ్మం వెళ్లిన కవిత.. బాధితులతో కలిసి.. వారితో పాటే.. వారి నివాసాల వద్దే నిరాహార దీక్ష చేపట్టారు. బాధితుల పూరిగుడిసెల్లోనే ఉండి వారికి మద్దతు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. అదే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేలా చేసింది. బాధితులకు న్యాయం జరిగే వరకు తన దీక్షను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన కవితను.. అర్థరాత్రి వేళ బలవంతంగా పోలీసులు ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అయినప్పటికీ తాను దీక్షను కంటిన్యూ చేస్తానని.. ప్రభుత్వం సానుకూల ప్రకటన చేసే వరకు తన పోరు ఆగదని స్పష్టం చేశారు.
ఆ క్రమంలో కవిత ఖమ్మం జిల్లా పెద్దవాళ్లు పేదల భూముల విలువ పెరగడంతో వాటిని కొట్టేయాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దాదాపు 30 ఎకరాల్లో పేదల ఇళ్లు అందుకే కూలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ క్షేత్రస్థాయి ఉద్యమంతో జాగృతి అధ్యక్షురాలు కవిత ఉద్యమనేతగా క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నం చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి చెల్లెలు నేరుగా పోరు చేస్తే.. ఆమె అన్న కేటీఆర్ మాత్రం డిజిటల్ మీడియా.. సోషల్ మీడియాలను వేదికగా చేసుకొని ప్రభుత్వంపై విమర్శలతో సనిపెట్టారు. అర్థరాత్రి వేళ గుడిసెల్ని కూల్చివేతలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. పేదల వ్యతిరేక ప్రభుత్వమంటూ ప్రెస్ మీట్లు పెట్టి.. ప్రభుత్వ తీరును తప్పు పడుతూ దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు. అంతేతప్పించి.. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి.. వారితో మమేకమై.. వారికి అండగా ఉంటామన్న భరోసా ఇవ్వలేకపోయారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
దీంతో.. కేటీఆర్ కు మించి కవితనే ఈ ఇష్యూలో హైలెట్ అయ్యారని చెప్పాలి. తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో బాధితులకు పట్టాలు ఇస్తామని, ఇళ్లు కూల్చిన చోటే కట్టించి ఇస్తామని ప్రకటించింది. అదంతా కవిత పోరుతోనే సాధ్యమైందని ఆమె వర్గీయులు క్రెడిట్ దక్కించుకునే పనిలో పడ్డారు. మరి ప్రభుత్వ హామీతో వెలుగుమట్ల వివాదం పూర్తిగా సద్దుమణుగుతుందో లేదో కాని… ఇదంతా చూస్తూ నెటిజన్లు..బాధితుల పక్షాన పోరు చేయడం ఎలాగో? చెల్లెలు దగ్గర అన్న కేటీఆర్ ట్యూషన్ చెప్పించుకోవాలని సెటైర్లు విసురుతున్నారు. ఏమైనా.. ఈ ఎపిసోడ్ తో కవితను ఉద్యమ నేతగా.. కేటీఆర్‌ని ట్విటర్ పులి .. అని యద్దేవా చేస్తూ పోస్టులు పెడుతుండటం అభివర్ణిస్తుండటం.. గులాబీ శ్రేణులకు మింగుడుపడకుండా తయారైందంట.
Story by Anup, Big TV
Also Read: Viral Video: రైలులో సీటు కోసం గొడవ.. ఈ ఆంటీకి ఆస్కార్ ఇవ్వాల్సిందే, చివరిలో మిస్ కావద్దు!