Kalvakuntla Kavitha: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి తెలంగాణ జాగృతి సిద్ధమైంది. జాగృతి క్యాడర్‌లో జోష్ నింపేందుకే పురపోరుకు కవిత సన్నద్దమవుతున్నారనే టాక్ వినిపిస్తుందట. ఓవైపు పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తూనే…ఎన్నికల బరిలో నిలిచేందుకు వ్యూహారచన చేస్తున్నారట కవిత. మున్సిపల్ ఎన్నికల బరిలో దిగేందుకు జాగృతి సిద్ధమవుతున్న తరుణంలో… గులాబీ నేతల్లో ఆందోళన మొదలైందంటున్నారు.
రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పురు పోరు నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. పోటీకి సిద్ధమనే సంకేతాలు కవిత నుంచి వస్తున్నాయట. ఎన్నికల బరిలో దిగేందుకు కసరత్తును ప్రారంభించారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జాగృతి జనం బాట యాత్ర పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ కవిత ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు యువత, ఉద్యమకారులు, మేధావులు, రాజకీయ వేత్తలతోనూ భేటీ అవుతున్నారు.
అంతేకాదు స్థానిక సంస్థల స్థితిగతులపై కవిత సీరియస్‌గా అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఇప్పటి వరకు మహిళా సాధికారత, తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యమనే అంశాలపై ఆయా వర్గాలతో కవిత చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు జాగృతి వేదికను రాజకీయ రంగ ప్రవేశం చేయించి… మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కవిత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ తన అభ్యర్ధుల మద్దతుదారులతో పోటీ చేయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ పార్టీని ప్రకటించకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చిందంటున్నారు. అప్పటికి ఏ పార్టీతోనూ పొత్తులపై సంప్రదింపులు జరగకపోవటంతో పంచాయతీ ఎన్నికలు దూరంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే జాగృతి కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి పెరుగుతుండటంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి కవిత నిర్ణయం తీసుకున్నారంట మున్సిపల్ స్థాయి నుంచి బలాన్ని పెంచుకొని, క్రమంగా స్థానిక సంస్థలన్నింటిలో పోటీ చేయాలన్నది జాగృతి అధినేత వ్యూహంగా కనిపిస్తోంది.
కవిత నూతన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీకి సంబంధించి ప్రకటన ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే పార్టీ ప్రకటించే లోగా మున్సిపల్, పురపాలక సంఘం ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కవిత పోటీకి సన్నాహాలు చేస్తున్నారట. అందులో భాగంగానే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో సంప్రదింపులు జరిపారంట. ఆ పార్టీతో ఒప్పందం కుదరడంతోనే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు సింహం కావడంతో ఆ గుర్తునుపైనే కవిత టీమ్ పోటీ చేయడానికి ఫిక్స్ అయ్యారు. బలమైన, ధైర్యాన్ని సూచించే గుర్తుగా సింహంను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా జాగృతికి గుర్తింపు వస్తుందని కవిత లెక్కలు వేసుకుంటున్నారట. అలాగే పార్టీ గుర్తు సమస్య లేకుండా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కూడా కలుగుతుందని అందుకే ఈ గుర్తును కవిత ఎంచుకున్నట్లు జాగృతి వర్గాలు చెబుతున్నాయి.
మహిళా ఓటర్లలో జాగృతికి ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా అడుగులు వేసేందుకు కవిత వ్యూహారచన చేస్తున్నారు. ఇప్పటికే జాగృతి సంస్థ గ్రామస్థాయిలోకి వెళ్లింది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి పోటీచేసి గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను తయారు చేయాలనే సంకల్పంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కేవలం జాగృతి సంస్థగానే పనిచేసింది. అయితే ప్రజల్లోని ఆదరాభిమానాలను పార్టీగా మలుచుకోవాలని, ఆ ప్రభావం మున్సిపల్, స్థానిక సంస్థల నుంచే ప్రారంభించి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారట. కవిత పోటీ నిర్ణయంతో జాగృతి క్యాడర్‌లో జోష్ నెలకొంది. పలువురు పోటీకి సిద్ధమవుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం కావాలంటే ఈ ఎన్నికల్లో పోటీ అనివార్యమని భావించే కవిత రంగంలోకి దిగినట్లు సమాచారం.
కవిత రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో పోటీకి సిద్దమవుతున్నారు. అదే విధంగా పరిషత్ ఎన్నికల్లోనూ పోటీచేయాలని కసరత్తు ప్రారంభించారట. జాగృతి నేతలతో సమావేశం అయి వారి అభిప్రాయం మేరకు పోటీకి సిద్ధమయ్యారంట. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ కవిత జాగృతి కమిటీలు ఉన్నాయి. గులాబీ పార్టీలోనూ ఆమెకు కొంతమంది అనుచరులు ఉన్నారు. అయితే, ఆమె పార్టీకి రాజీనామా చేసిన తర్వాత గులాబీపార్టీలోని ఆమె అనుచరులు కిమ్మనడం లేదు. అలాంటి వారు మున్సిపోల్స్‌లో ఆమెకు సహకరించే అవకాశాలు ఉన్నాయి.
కవిత పోటీతో బీఆర్ఎస్ ఓట్లు చీలే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు మహిళగా ఆమెపై సానుభూతి సైతం ఉండటంతో కలిసి వచ్చే అవకాశం ఉందని జాగృతి నేతలు అభిప్రాయపడుతున్నారు. కవిత పోటీతో గులాబీ పార్టీ గెలుపోటములపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఆ పార్టీ నేతలు పోటీ ప్రకటన తర్వాత మల్లగుల్లాలు పడుతున్నారట. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలనుకున్న గులాబీ పార్టీకి కవిత గండికొట్టే అవకాశాలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది.
మొత్తానికి తెలంగాణ జాగృతి అధినేత కవిత సొంతగా ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమైంది. మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫలితాలపై కవిత రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందనిరాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Story by: Apparao ,Big Tv