కేసీఆర్ వెయ్యి రోజులుగా ఎందుకు బయటకు రావడం లేదనే అంశంపై రాజకీయ రగడను లేవనెత్తింది అధికార కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తూ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారంటూ .. కేసీఆర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలకు కూడా పిలుపునిచ్చింది సర్కార్.
అంతకు ముందు వెయ్యి రోజుల పాలనలో.. ఏవీ హామీల అమలు..? అనే అంశంలో నిరసనలకు పిలుపునిచ్చిన బీఆరెస్‌కు కౌంటర్ ఎటాక్‌గా సర్కార్ కేసీఆర్ ఫామ్‌హౌజ్ అంశాన్ని లేవనెత్తింది. అయితే సర్కార్ వ్యూహాన్ని పసిగట్టిన బీఆరెస్.. కేసీఆర్ తన బాధ్యతను మరిచి ఫామ్‌హౌజ్‌కు పరిమితమయ్యాడనే ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రమాదాన్ని పసిగట్టింది. దీనిపై నష్ట నివారణకు దిగింది.
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో టైం పాస్ చేయడం లేదని చెబుతూనే.. ఆయన మేధోమథనం చేస్తున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. మొన్నటి వరకు… రేవంత్ రెడ్డికి మేం సరిపోమా? ఆయన ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు.. ముందుక మాకు సమాధానం ఇవ్వు.. అని కేటీఆర్ ఈ విషయంలో కాంగ్రెస్‌ను ఉల్టా దబాయిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.
కానీ ఈ అంశాన్ని సర్కార్ మరింత సీరియస్‌గా జనం ముందుకు తీసుకుపోయేందుకు వేసిన ఎత్తుగడను పసిగట్టిన బీఆరెస్.. తన వ్యూహాన్ని కూడా మార్చుకున్నది. జనం ముందు కేసీఆర్‌ను దోషిలా నిలపాలనే అధికార పార్టీకి చిక్కకుండా ఉండేందుకు సమర్థింపు ప్రకటనలు షురూ చేశారు.
కేసీఆర్ అక్కడ మేధోమథనం చేస్తున్నారని, ఇంకా మంచి మంచి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు ఆయన ఆలోచనలు కొనసాగుతున్నాయని, కొత్త పథకాలకు రూపకల్పన జరుగుతున్నదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీన్‌కుమార్ ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
అంటే జనం కోసమే కేసీఆర్ నిరంతరం చర్చిస్తారని, వారికి మరింత మేలు చేసే పథకాలను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారనే ప్రచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా .. కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేయవచ్చని భావిస్తున్నారు. బీఆరెస్ చెప్పిన దాన్ని బట్టి రెండు అంశాలు చర్చకు వస్తున్నాయి.
తమ ఓటమికి గల కారణాలేంటీ అని ఆత్మ పరిశీలన చేసుకోవడంతో పాటు.. వచ్చే ఎన్నికలకను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్రజారంజక పథకాలను రూపొందిస్తున్నారనే విధంగా హింట్ ఇస్తున్నారు బీఆరెస్ నేతలు. అంటే ఓ రకంగా వచ్చే ఎన్నికల కోసం ఇప్పట్నుంచే బీఆరెస్ మ్యానిఫెస్టో రూపొందించే పనిలో కేసీఆర్ బాగా బిజీగా ఉన్నారనే విషయాన్ని కూడా చెప్పకనే చెబుతున్నాయి గులాబీ శ్రేణులు.