Indiramma Houses: స్వేచ్ఛ బ్యూరో: ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు అనే లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకెళ్తోంది. కిరాయి ఇళ్లలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఆత్మగౌరవంతో కూడిన జీవితం అందించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గృహ విప్లవంగా ముందుకు తీసుకెళ్తోంది. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్ల మంజూరు, రెండో విడతలో మరో 3.50 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టడంతో.. అందులోనూ భాగ్యనగరంలో విలువైన చోట్ల అతి తక్కువలో పేదవారికి ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలకు సైతం ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునాది వేశారు.
దీంతో పట్టణాల్లోని లక్షలాది పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోంది. అసంపూర్తిగా మిగిలిన ఇళ్లకు ఆర్థిక చేయూతనివ్వడంతో పాటు, పూరిళ్లలో నివసిస్తున్న 43 వేల కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ.. “ఇల్లు ఒక చిరునామా కాదు.. పేదవాడి ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక” అన్న నినాదాన్ని ప్రజా ప్రభుత్వం కార్యరూపంలో చూపిస్తోంది.
మార్చి 11న శ్రీరామ క్షేత్రం భద్రాచలం నుంచి ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేశారు. మొత్తం 32 జిల్లాల్లో 3.68 లక్షల ఇళ్లను హౌసింగ్ శాఖ కేటాయించగా, వాటిలో 3,24,564 ఇళ్లకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ఇప్పటికే 2,74,301 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా, 1,09,682 ఇళ్లు కూడా పూర్తయ్యాయి. ఇండ్లు నిర్మించుకుంటున్న వారికి..నిర్మాణం వివిధ దశల్లో ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.6,500 కోట్ల నిధులను విడుదల చేసింది.
Also read: ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?
పథకం ప్రారంభమైన తక్కువ కాలంలోనే ప్రభుత్వం వేగంగా పనులు పూర్తి చేస్తోంది. గత ఏడాది ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కేవలం 13 నెలల్లోనే లక్షకు పైగా ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసి సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం నాటికి మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత విస్తరిస్తూ ప్రభుత్వం రెండో విడతకు శ్రీకారం చుట్టింది. జూన్ 1, 2026 నుంచి రెండో విడతలో మొత్తం 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లు నిర్మించనున్నారు. అదే రోజు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు వెంటనే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలనే నిర్ణయం తీసుకున్నారు.
తొలి విడతలో పైలట్ ప్రాజెక్టు కింద 16 నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల్లో 7,680 ఇళ్లను నిర్మించేందుకు జూన్ 21న సచివాలయంలో ‘క్యూర్’ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యనేతలతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పేదల కోసం నిర్మించ తలపెట్టిన అపార్ట్‌మెంట్ల తరహా ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 13, 2026 న భూమిపూజ చేసి పైలాన్ ఆవిష్కరించారు. మొన్నటి వరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
Also Read: చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం
ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇండ్లు చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1920 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా ఇళ్లను కేటాయిస్తారు. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం రూ.11 లక్షలు కాగా, అందులో రూ.5 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ, రూ.6 లక్షలు లబ్ధిదారుల వాటాగా నిర్ణయించారు. లబ్ధిదారులకు రూ.40 నుంచి రూ.60 లక్షల విలువైన స్థలాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. లబ్ధిదారుల వాటాను నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం కూడా ప్రజా ప్రభుత్వం కల్పించింది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరై వివిధ కారణాలతో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయడానికీ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. చాలా మంది లబ్ధిదారులు ఇండ్లు మంజూరై సగం సగం నిర్మాణాలు చేసుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం పునాదులు పూర్తై గోడలు, శ్లాబ్ వేయని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తై శ్లాబ్ దశలో నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో 500 అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించనుంది. సొంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.
Also Read: BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!
రాష్ట్ర వ్యాప్తంగా పూరిళ్లలో నివసిస్తున్న వారిపై నిర్వహించిన సర్వేలో 43 వేల కుటుంబాలు తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో భాగంగా పూరిళ్లలో నివాసం ఉంటున్న ఈ 43 వేల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనుంది. ఈ ప్రక్రియను వారం, పది రోజుల్లో పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ భావిస్తోంది. పూరిళ్లలో ఉండే వారికి డబ్బులు పెట్టి కట్టుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారికి హౌసింగ్ శాఖ ద్వారానే ఇంటిని నిర్మించి ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 43 వేల కుటుంబాలకు షీర్ వాల్ సాంకేతికత ద్వారా ఇళ్లు కట్టించి ఇస్తే వారిపై ఆర్థికంగా భారం పడే అవకాశాలు ఉండవని.. ఆ దిశగా అధికారులు పరిశీలిస్తున్నారు.
గిరిజన సాధికారత కోసం 8750 ఇండ్లను ప్రభుత్వం కేటాయించింది. ఏజెన్సీ ఏరియాల్లో చెంచులు, కోలాం, తోటి వంటి పీవీటీజీ లకు 13,266 ఇండ్లను మంజూరు చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లోనూ ఇండ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం గిరిజనుల కోసం నిర్మించిన 28 ఇళ్లను ప్రారంభించడమే కాకుండా, షియర్ వాల్ టెక్నాలజీతో కేవలం 12 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో వేగవంతమైన నిర్మాణంతో పాటు నాణ్యత కూడా మెరుగుపడుతోంది.
Also read: ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?