Akal Takht: అకాల్ తఖ్త్.. ఇప్పుడు ఇండియా మొత్తం హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం. సిక్కు మతంలో ఈ అకాల్ తఖ్త్‌దే అత్యున్నత అధికారం. మహారాజా రంజింత్ సింగ్ దగ్గర్నుంచి.. మొన్నటిదాకా పంజాబ్ డిప్యూటీ సీఎంగా పనిచేసిన నాయకుడి దాకా.. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష విధించింది ఈ వ్యవస్థ. అసలేంటీ.. అకాల్ తఖ్త్? సిక్కుమతంలో ఎవ్వరికైనా శిక్షలు అమలు చేస్తుందా? శిక్షల్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది?
దేశంలో చర్చనీయాంశంగా సిక్కుల అకాల్ తఖ్త్
తప్పు చేసిన వారికి.. సిక్కు మతంలో అత్యున్నత అధికారం కలిగిన అకాల్ తఖ్త్ విధిస్తున్న శిక్షలివి. శతాబ్దాల నుంచి ఎంతోమంది ఈ అకాల్ తఖ్త్ ని ఎదుర్కొన్నారు. ఇటీవలే.. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు అకాల్ తఖ్త్ మతపరమైన శిక్ష విధించింది. 2007 నుంచి 2017 మధ్య అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన తప్పిదాలకుగానూ.. ఆయన్ని శిక్షించారు. సుఖ్‌బీర్‌తో పాటు శిరోమణి అకాలీదళ్ కేబినెట్‌లో సభ్యులుగా ఉన్న చాలామందికి అకాల్ తఖ్త్ మతపరమైన శిక్ష విధించింది. వారంతా.. ఆ ఆదేశాల్ని ఉల్లంఘించకుండా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై జరిగిన హత్యాయత్నం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో అకాల్ తఖ్త్ విధించిన శిక్షల గురించి కూడా చర్చ మొదలైంది.
సిక్కు మతంలో అకాల్ తఖ్త్‌కే అత్యున్నత అధికారం
సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక విభాగమే అకాలీ తఖ్త్. సిక్కు నియమాలను ఉల్లఘించినా, మత సిద్ధాంతాలకు వ్యతిరేకమైన పనులు చేసినా.. సదరు వ్యక్తికి మతపరమైన శిక్ష విధించే అధికారం అకాల్ తఖ్త్‌కు ఉంటుంది. ఇలాంటి శిక్షలను తన్ఖా అని పిలుస్తారు. ఇది కేవలం మతపరమైన ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు మాత్రమే ఏర్పాటు చేసింది కాదు. సిక్కు కమ్యూనిటీని క్రమశిక్షణలో ఉంచేందుకు ఓ కోర్టుగానూ పనిచేస్తోంది. అంతేకాదు.. సిక్కులు చేసిన తప్పులకు జవాబుదారీతనంగా ఉండేలా చూస్తుంది అకాల్ తఖ్త్. చక్రవర్తులైనా, రాజకీయ నేతలైనా, సాధారణ సిక్కులైనా.. ఎవరైనా సరే.. దీనికి లోబడి ఉండాల్సిందే! కొన్ని శతాబ్దాలుగా సిక్కుల్లో వినయ, విధేయతల్ని, క్రమశిక్షణని పెంపొందిస్తూ.. తప్పులు చేసిన వాళ్లకు శిక్షల్ని అమలు చేస్తోంది అకాలీ తఖ్త్.
అకాల్ తఖ్త్ శిక్షలపై దేశవ్యాప్తంగా చర్చ
ఒక వ్యక్తి ఎంత శక్తిమంతుడైనా, ఎంతటి ప్రముఖుడైనా.. సిక్కు మత సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే.. ఎవరైనా ఆ వ్యక్తిపై అకాల్ తఖ్త్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అందుకనుగుణంగా.. అకాల్ తఖ్త్ వారికి శిక్షలు విధిస్తుంది. ప్రధానంగా గురుద్వారాల్లో పరిసరాలను, భక్తుల చెప్పులను శుభ్రం చేయడం, బాత్రూంలు కడగడం, వంటగదుల్లో పాత్రలు శుభ్రం చేయడం లాంటివి శిక్షలుగా ఉంటాయ్. వాళ్లు చేసిన తప్పిదాలను బట్టి.. తప్పు చేసినవాళ్లతో సిక్కు ప్రజలు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తారు. పాప పరిహారం కింద సేవా కార్యక్రమాల ద్వారా పాప పరిహారం చేసుకునేందుకు అవకాశం ఇస్తారు.
నేర తీవ్రతను బట్టి.. సిక్కు సమాజం నుంచి వాళ్లను వెలివేస్తారు. ఇది.. కొంత కాలపరిమితితో ఉంటుంది. అప్పుడు.. వాళ్లు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండదు. అకాల్ తఖ్త్ విధించిన శిక్ష పూర్తయ్యాక.. తను చేసిన తప్పుల్ని క్షమించమని కోరుతూ ప్రార్థన చేయాల్సి ఉంటుంది.
సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక విభాగం అకాల్ తఖ్త్
ఇక.. ఎవరైనా అకాల్ తఖ్త్ నిర్ణయాన్ని వ్యతిరేకించినా.. శిక్ష అనుభవించేందుకు నిరాకరించినా.. తర్వాతి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ్. శిక్షలకు తలొగ్గని వాళ్లను శాశ్వతంగా సిక్కు సమాజం నుంచి వెలివేసే అవకాశం కూడా ఉంది. సామాజిక బహిష్కరణలో భాగంగా.. సిక్కు కమ్యూనిటీ నుంచి వాళ్లకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎలాంటి సాయం అందించరు. సిక్కులెవరూ వాళ్లను పట్టించుకోకుండా ఒంటరిని చేసేస్తారు. మతపరమైన కార్యక్రమాల్లోనూ, సిక్కుల శుభకార్యాల్లోనూ పాల్గొనేందుకు అవకాశం లేకుండా చేస్తారు. ఇంకొందరిని శిక్షించడానికి బదులుగా.. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేలా మారుస్తారు.
కౌన్సెలింగ్ లాంటివి ఇప్పించి.. వాళ్లను మళ్లీ దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం మరొకటి ఉండదని నమ్ముతారు. అందుకే.. చేసిన తప్పుల్ని ఒప్పుకొని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు. ఇవేవీ పని చేయని క్రమంలో సిక్కు సంఘాలే నేరుగా రంగంలోకి దిగుతాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. ఇన్నేళ్ల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదంటారు.
అకాల్ తఖ్త్.. అసలు పేరు అకాల్ బుంగా
అకాల్ తఖ్త్.. అసలు పేరు అకాల్ బుంగా. సిక్కులు పవిత్రంగా భావించే ఐదు తఖ్త్‌లలో ఇది ఒకటి. పంజాబ్ అమృత్‌సర్ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్‌లో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక విభాగం. సిక్కు మతగురువు గురు హరగోవింద్ 1606వ సంవత్సరంలో.. అమృత్ సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఈ అకాల్ తఖ్త్‌ని నెలకొల్పారు. ఆధ్యాత్మికంగానే కాదు సిక్కు సమాజానికి ఎదురయ్యే ఆందోళనలపైనా చర్చ జరిపే ఉద్దేశంతో.. ఈ అధికార వేదికను గురు హరగోవింద్ స్థాపించారు.
ఆయనతో పాటు బాబా బుద్ధా, భాయ్ గురుదాస్ కూడా అకాల్ తఖ్త్ ఏర్పాటులో భాగమయ్యారు. సర్బత్ ఖాల్సా యావత్ సిక్కు సంఘాలకు అత్యున్నత అధికారి కాగా జతేదార్‌ను.. అకాల్ తఖ్త్ అధికార ప్రతినిధిగా గుర్తిస్తారు. అమృత్‌సర్‌లోని అకాల్ తఖ్త్ సెక్రటేరియట్‌లో.. జతేదార్ నేతృత్వంలో అయిదు తఖ్త్‌లకు చెందిన ప్రతినిధులు సమావేశమై.. ఆరోపణలు వచ్చిన వాళ్లపై విచారణ జరిపి శిక్షను నిర్ధారిస్తారు.
ఎవరైనా సరే.. అకాల్ తఖ్త్‌కు లోబడి ఉండాల్సిందే!
శతాబ్దాల కిందట.. అణచివేతకు వ్యతిరేకంగా చేసిన సిక్కులు చేసిన పోరాటానికి గుర్తుగా ఏర్పాటైందే అకాల్ తఖ్త్! అప్పట్లో.. సిక్కుల సార్వభౌమాధికార ప్రతీకపై దాడులు జరిగాయి. 18వ శతాబ్దం నుంచి మొదలై.. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌లో అకాల్ తఖ్త్ దెబ్బతింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో తాత్కాలికంగా అకాల్ తఖ్త్ నిర్మాణం జరిగినప్పటికీ.. దానిని ప్రభుత్వ వ్యతిరేక వర్గం ధ్వంసం చేసి.. మళ్లీ నిర్మించారు. సిక్కులకు మతపరమైన అధికారానికి కేంద్రంగా అకాల్ తఖ్త్ పనిచేస్తుంది. పంజాబ్ సహా పట్నా, బిహార్, మహారాష్ట్రలో.. ఇలాంటి అధికార కేంద్రాలున్నాయి. అకాల్ తఖ్త్ నుంచి జారీ అయ్యే ఆదేశాలను ప్రతి సిక్కు తప్పనిసరిగా పాటించాల్సిందే.
పాప పరిహారం కింద సేవా కార్యక్రమాలతో పరిహారం
అకాల్ తఖ్త్ ద్వారా శిక్షించబడిన వాళ్లలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. సిక్కుల తొలి చక్రవర్తి, శక్తిమంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించిన వీరుడు, లయన్ ఆఫ్ పంజాబ్‌గా పిలుచుకునే.. మహారాజా రంజిత్ సింగ్‌కు కూడా అకాల్ తఖ్త్ శిక్ష అనుభవించ తప్పలేదు. పరమతానికి చెందిన నృత్యకారిణిని వివాహం చేసుకున్నారనే నేరం కింద.. 1802లో అకాల్ తఖ్త్ ఆయనకు కొరడా దెబ్బలు తినాలనే శిక్ష విధించింది. అయితే.. ఆయన క్షమాపణలు చెప్పడంతో మన్నించి వదిలేసింది. కానీ.. ఒక్క విషయం మాత్రం క్లియర్. ఓ సామ్రాజ్యాధినేత అయినా.. ఇంకెవరైనా.. మత విశ్వాసానికంటే ఎక్కువ కాదు అని చెప్పే సంఘటన ఇది.
1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత చాలా మంది అకాల్ తఖ్త్ శిక్షలు అనుభవించారు. భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్‌ని కూడా అకాల్ తఖ్త్ శిక్షించింది. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ టైంలో ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు. అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీని అనుమతించారనే నేరం కింద ఆయన్ని శిక్షించారు. అయితే.. రాతపూర్వకంగా క్షమాపణలు కోరుతూ ఆయన లేఖ రాశారు. మాజీ కేంద్రమంత్రి బూటా సింగ్‌ని కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కిందే శిక్షించింది అకాల్ తఖ్త్. శిక్షను అంగీకరించిన ఆయన.. కమ్యూనిటీ సేవలో పాల్గొన్నారు.
శిక్షలకు తలొగ్గపోతే సిక్కు సమాజం నుంచి వెలివేత!
పంజాబ్ మాజీ సీఎం సుర్జిత్ సింగ్ బర్నాలాని కూడా అకాల్ తఖ్త్ శిక్ష అనుభవించారు. గోల్డెన్ టెంపుల్‌లోకి బ్లాక్ క్యాట్ కమాండోలను అనుమతించడంలో ఆయన పాత్ర ఉండటంతో.. కాస్త కఠినంగానే శిక్షించారు. అకాల్ తఖ్త్‌కు జరిమానా కట్టడంతో పాటు భక్తుల బూట్లు శుభ్రం చేసి.. సిక్కు ప్రార్థనల్లో పాల్గొని తన పాప పరిహారం చేసుకున్నారు. ఇప్పుడు.. పంజాబ్ మాజీ సీఎం సుఖ్‌వీర్ సింగ్ బాదల్‌కి కూడా మతపరమైన శిక్ష విధించింది అకాల్ తఖ్త్. అధికారంలో ఉన్న సమయంలో మతపరమైన తప్పిదాలకు పాల్పడారనే ఆరోపణలున్నాయ్. ఇందులో.. ఇందులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మద్దతు ఇవ్వడం కూడా ప్రధానమైన అంశం.
ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్‌బీర్‌ను దోషిగా తేల్చింది. తాను చేసిన తప్పులను అంగీకరించి.. సుఖ్‌బీర్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆపై.. కాలు ఫ్రాక్చర్ అయి.. వీల్ చైర్‌కు పరిమితమైనా సరే.. అభియోగాలు ఎదుర్కొంటున్న తోటి పార్టీ నేతలతో కలిసి అకాల్ తఖ్త్ శిక్షలను అనుభవించారు. ఈ శిక్షలు విధించే జతేదార్లు కూడా అకాల్ తఖ్త్ నుంచి తప్పించుకునేందుకు వీల్లేదు. 2022లో పట్నా సాహిబ్‌కు చెందిన జతేదార్.. జ్ఞాని ఇఖ్బాల్ సింగ్‌కి శిక్ష విధించారు. గురుద్వారాలో అధికారం కోసం జరిగిన ఆధిపత్య పోరులో ఆయన ప్రమేయం ఉందనే విషయంలో శిక్ష వేశారు.
చక్రవర్తులైనా, రాజకీయ నేతలైనా, సాధారణ సిక్కులైనా..
అకాల్ తఖ్త్ ఉద్దేశం కేవలం శిక్షలు విధించడం మాత్రమే కాదు. సిక్కుల విశ్వాసాలు, విలువలు, జవాబుదారీతనం, సమానత్వాన్ని కాపాడటం కూడా. శతాబ్దాలుగా సిక్కులకు న్యాయం చేకూర్చడంతో పాటు వారిని ఐక్యంగా ఉంచేందుకు కృషి చేస్తోంది. ఎవ్వరైనా సరే.. సిక్కు మత సూత్రాలకు అతీతులు కాదని చెప్పడమే అకాల్ తఖ్త్ ముఖ్య ఉద్దేశం. అందుకే.. మహారాజా రంజిత్ సింగ్ లాంటి చక్రవర్తి అయినా.. పాలకులైనా, రాజకీయ నాయకులైనా, సాధారణ సిక్కు భక్తుడైనా సరే.. అకాల్ తఖ్త్ ముందు అంతా సమానమే.!