ONGC Gas Blowout: పచ్చని పంటపొలాలలో కనువిందు చేసే కోనసీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాసేపట్లోనే పచ్చని ప్రాంతం అంతా మంటల్లో చిక్కుకుపోయింది. పెద్ద శబ్దాలు.. ఎటు చూసిన అగ్నికీలలు.. కాలిపోయిన కొబ్బరి తోటలు, కమ్ముకున్న పొగలు, మొత్తంగా ఓ భయానక వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు ఉంటాయో? పోతాయో? తెలియని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసమండలోని మోరి ఫీల్డ్ 5లో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ రిగ్ సమీపంలో జరిగిన బ్లో అవుట్ తో ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. వరుస పేలుళ్లతో ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. ఇరుసుమండతో పాటు సమీప గ్రామాల ప్రజలు పేలుడు శబ్దాలకు వణికిపోయారు. ప్రాణభయంతో పరిగెత్తారు. చిన్నపిల్లల తల్లులు, వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నిమిషాల వ్యవధిలోనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇరుసుమండతో పాటు లక్కవరంలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఆ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
బ్లోఅవుట్ కారణంగా అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లింది. కొబ్బరి తోటలు మాడిపోయాయి. పంటలన్నీ బూడిదయ్యాయి. పచ్చని పంట నాశనం కావడం పట్ల రైతులు కంటతడి పెడుతున్నారు. మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారు. నిన్నటితో పోల్చితే ఈ రోజు కాస్త మంటలు తగ్గినప్పటికీ, పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ నిపుణుల ఆధ్వర్యంలో మంటలను నియంత్రించే పనులు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో బ్లో అవుట్ అనేది ఇదేం కొత్తకాదు. కోనసీమ ప్రాంతం అంతా కృష్ణ-గోదావరి బేసిన్ లో ఉంటుంది. సహజవాయు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. దశాబ్దాలుగా చమురు, సహజ వాయువు వెలికితీత రాష్ట్రానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే, ఈ ప్రాంతం భౌగోళికంగా అధిక పీడన మండలాలలను కలిగి ఉంటుంది. దేశంలో అత్యంత అద్భుతమైన వనరులు ఉండటంతో పాటు అదే స్థాయిలో వినాశకరమైన పరస్థితులకు కేరాఫ్ గా నిలిచింది. ఈ ప్రాంతంలో చాలాసార్లు బ్లో అవుట్ జరింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఎకరాల పంట నష్టం కూడా జరిగింది.
పసర్లపూడి బ్లో అవుట్ అనేది దేశంలోనే అతిపెద్ద విపత్కర సంఘటనగా గుర్తింపు తెచ్చుకుంది. జనవరి 8, 1995 సాయంత్రం 6.50 గంటలకు ఈ ఘటన జరిగింది. డ్రిల్లింగ్ సైట్ నంబర్ 19, రిగ్ నంబర్ E 1400-18GF దగ్గర ఈ బ్లో అవుట్ సంభవించింది. మంటలు ఏకంగా 200 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. సుమారు 65 రోజుల పాటు అగ్ని జ్వాలలు కొనసాగాయి. మొదట్లో నీల్ ఆడమ్స్ ఫైర్ ఫైటర్స్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ, వారితో సాధ్యం కాలేదు. మార్చి 15, 1995న ఇంటర్నేషనల్ వెల్ కంట్రోల్ అధికారులు ఈ మంటలను అదుపు చేశారు. ఈ బ్లోఅవుట్ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, డ్రిల్లింగ్ రిగ్ ధ్వంసమైంది. సుమారు రూ. 9.2 కోట్ల నష్టం వాటిల్లింది. అటు వెల్ సైట్ ప్రాంతంలోని దాదాపు రూ. 7 కోట్ల విలువైన పరికరాలు ధ్వంసం అయ్యాయి. వేడికి కిలోమీటరు పరిధిలోని కొబ్బరి తోటలు ఎండిపోయాయి. వేలాది మంది ఇళ్లు ఖాళీ చేయవలసి వచ్చింది. ఈ సంఘటన ప్రపంచ పెట్రోలియం ఇంజనీరింగ్‌లో ఒక కేస్ స్టడీగా మిగిలిపోయింది.
అటు 1997లో రావుల పాలెం మండలం దేవరపల్లి శివారు ప్రాంతం అయిన పితానివారిపాలెం మండపేట వెస్ట్ 1 బావి దగ్గర బ్లో అవుట్ జరిగింది. ఫిబ్రవరి 19న ఈ ఘటన జరిగింది. కొద్ది నిమిషాల్లోనే డ్రిల్లింగ్ రిగ్ పూర్తిగా దగ్ధమైంది. సుమారు 45 రోజుల పాటు మంటలు ఆర్పేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ, ఆ తర్వాత ఈ బావిని శాశ్వతంగా వదిలివేయాల్సి వచ్చింది.
సెప్టెంబర్ 19, 2005లో అమలాపురం పట్టణానికి సమీపంలో తాండవపల్లిలో బ్లో అవుట్ జరిగింది. గ్యాస్ అన్వేషణ కోసం తవ్వుతున్న బావి గుండా గ్యాస్ ఉప్పొంగి, 150 అడుగుల ఎత్తుకు మంటలు ఎగిసిపడ్డాయి. 1995తో పోల్చితే అధికారులు కంటే వేగంగా స్పందించారు. కానీ, ఈ సంఘటన కోనసీమ డెల్టాలో మళ్లీ మళ్లీ బ్లో అవుట్స్ జరుగుతాయనేదానికి నిదర్శనంగా నిలిచింది.
2014 జూన్ 27న మామిడికుదురు మండలం నగరంలో బ్లో అవుట్ జరిగింది. GAIL (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) నిర్వహిస్తున్న పైప్ లైన్ తెల్లవారుజామున పగిలిపోయింది. మంటలు అంటుకుని ఏకంగా 22 మంది మృతి చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోనసీమలో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన బ్లో అవుట్ గా నగరం ప్రమాదం గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఇరుసమండ ఘటన జరగింది.
కోనసీమలో ఆయిల్, నేచురల్ గ్యాస్ నిల్వలు అధికంగా ఉన్నాయి. అయితే, ఇప్పటికీ ఈ ప్రాంతానికి బ్లో అవుట్ భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025లో కాకినాడ, కోనసీమలో జరిగిన సంఘటనలలో రీ డ్రిల్లింగ్ సమయంలో సబ్ సీ లీకేజీలు, హై ప్రెజర్ గ్యాస్ జెట్ లు సంభవించాయి. కోనసీమలో బ్లో అవుట్స్ కు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి KG బేసిన్ అంతా అధిక పీడనం కలిగి ప్రాంతంగా ఉంది. రెండు మిడిల్ ఈస్ట్ లోని ఎడారి చమురు క్షేత్రాల మాదిరిగా కాకుండా, APలోని గ్యాస్ క్షేత్రాలు ప్రపంచంలోని అత్యంత జనసాంద్రత కలిగిన వ్యవసాయ ప్రాంతాల్లో ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే పెద్ద మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టం కలుగుతోంది. ఈ రెండు కారణాలతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
Read Also: మంటల్లో పచ్చని కోనసీమ! అసలు ఎలా జరిగింది.. పాయింట్ టు పాయింట్