BigTV English

Kolikapudi Srinivasa Rao: కొలికపూడి మర్యాద రామన్న అవుతాడా?

Kolikapudi Srinivasa Rao: కొలికపూడి మర్యాద రామన్న అవుతాడా?

Kolikapudi Srinivasa Rao: రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయంటారు. సరిగ్గా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు అది వర్తిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే అయిన ఏడు నెలల్లో ఆయన రెండోసారి ఆయన టీడీపీ విచారణ కమిటీ ముందు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. పదేపదే ఆయన తరచూ వివాదాల్లో చిక్కుకుంటుండటం, అనవసర దూకుడు ప్రదర్శిస్తుండటం నియోజకవర్గ ప్రజలతో పాటు ఇటు టీడీపీ అధిష్ఠానానికి కూడా తలనొప్పిగా మారింది. రెండుసార్లు కమిటీకి వివరణ ఇచ్చుకున్న ఆయన ఈసారైనా జాగ్రత్తగా ఉంటారా, లేదా అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.


ఉమ్మడి కృష్ణాజిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. ఒక ఎమ్మెల్యేకి పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులిచ్చి పిలిపించి. విచారించడం అంటే మామూలు విషయం కాదు.. అలాంటిది గెలిచిన ఏడు నెలల్లో కొలికపూడి శ్రీనివాసరావు రెండు సార్లు డిసిప్లీనరీ కమిటీ ముందు రెండు సార్లు అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆయన వ్యవహార తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. గీత దాటుతున్నారు జాగ్రత్త అని క్రమశిక్షణ సంఘంతో వార్నింగులు ఇప్పించుకోవాల్సి వచ్చింది.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ క్రమ శిక్షణ సంఘం ముందు ఎమ్మెల్యే కొలికపూడి హాజరయ్యారు. క్రమ శిక్షణ సంఘం సభ్యులు వర్ల రామయ్య, ఎంఎ షరీఫ్‌, కొనకళ్ల నారాయణ, బీసీ జనార్దనరెడ్డి, పంచుమర్తి అనురాధ ఈ విచారణలో పాల్గొన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలో ఈ నెల పదకొండో తేదీన ఒక రోడ్డు వివాదంలో ఒక వ్యక్తిపై ఎమ్మెల్యే చేయి చేసుకొన్నారని, ఆ రోడ్డుపై ఉన్న కంచెను పీకివేశారని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆ వ్యక్తి భార్య పురుగులమందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే తీరుపై అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశంతో పార్టీ క్రమ శిక్షణ సంఘం కొలికపూడిని తమ ముందుకు పిలిచింది. అయితే తాను ఏ తప్పూ చేయలేదని కొలికపూడి శ్రీనివాసరావు వాదిస్తున్నారు.


ఏదేమైనా ఓ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ క్రమశిక్షణా కమిటీ ముందు రెండుసార్లు విచారణకు హాజరైన ఏకైక వ్యక్తిగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నిలిచారు. గతంలో కూడా ఆయన వైఖరిని నిరసిస్తూ ఆ నియోజకవర్గ నేతలు కొందరు విజయవాడలో ధర్నాలు చేశారు. అప్పుడు కూడా కొలికపూడిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఈ ఏడు నెలల్లోనే ఇప్పుడు రెండోసారి ఆయన తన వివాదాలపై పార్టీ కార్యాలయం మెట్లు ఎక్కారు. కొందరు కొత్త ఎమ్మెల్యేలు తప్పులు చేసి వివాదాల్లో చిక్కుకొంటున్నారని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఈ వివాదాలు మసకబారుస్తున్నాయని తన నివాసంలో జరిగిన మంత్రులు, ఎంపీల సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన మర్నాడే కొలికపూడికి తాఖీదు జారీ అయింది.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇంతకు ముందెప్పుడూ ఏ ఎమ్మెల్యే కూడా ఇలా క్రమశిక్షణా కమిటీ ముందు హాజరైన దాఖలాలు లేవు. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీ మధ్య వివాదం తలెత్తినపుడు మాత్రమే ఒకసారి టీడీపీ క్రమశిక్షణా సంఘం జోక్యం చేసుకుంది. అయితే, అప్పట్లో విచారణకు మాత్రం పిలవలేదు. ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన కొలికపూడి అధికారిగా మారి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో క్రమశిక్షణా కమిటీ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది.

Also Read: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి మోహన్ బాబు?

గతంలో వైసీపీ నాయకుడు అక్రమ భవనం కట్టుకున్నాడని దానిని కూల్చేందుకు వెళ్లిన కొలికపూడి అక్కడ నానా హంగామా సృష్టించారు. అధికారులకు ఫిర్యాదు చేయకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. స్థానికంగా ఉన్న బెల్ట్‌షాపు తొలగింపులోనూ ఆయనే ఇదే దుందుడుకు స్వభావాన్ని ప్రదర్శించారు. ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదు చేయకుండానే సదరు బెల్ట్‌షాప్‌ వద్దకు వెళ్లి ఓ అధికారి మాదిరిగా హడావిడి చేసి విమర్శల పాలయ్యారు.

నియోజకవర్గంలో పేకాట నిర్వహణకు సంబంధించి తనకు ఎమ్మెల్యే అనుమతులు ఇచ్చారని చిట్యాల సర్పంచ్‌ ఎక్కడో వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని కూడా కొలికపూడి వివాదాస్పదం చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులతో సమావేశం పెట్టి సదరు సర్పంచ్‌ను బండబూతులు తిట్టడం, ఈ విషయానికి మనస్థాపం చెంది సర్పంచ్‌ సతీమణి ఆత్మహత్యకు ప్రయత్నించటం వివాదాస్పదంగా మారింది.

ఒక సిమెంట్‌ రోడ్డుకు వేసిన ఫెన్సింగ్‌కు సంబంధించిన వివాదంలో కూడా ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని, ఒక కుటుంబంపై దాడికి పాల్పడ్డారన్నది తాజా అభియోగం. ఈ వివాదంపైనే ఆయన టీడీపీ విచారణ కమిటీకి వివరణ ఇచ్చుకున్నారు. వైసీపీ వార్డు సభ్యుల కుటుంబాన్ని ఆయన ప్రస్తావిస్తూ గతంలో ఈ కుటుంబం జవహర్‌, స్వామిదాసులపైనే దాడులకు పాల్పడిందని ఆరోపించారు. ఇది వాస్తవమే అయినా.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవటానికి యంత్రాంగం ఉందని, కొలికపూడి దుందుడుకుతనం అవసరం లేదనే వాదన వినిపిస్తోంది.

ఓ వైసీపీ నేత గ్రావెల్‌ తవ్వుతున్నాడని నానా యాగీ చేసిన ఎమ్మెల్యే ఆ తర్వాత అదే గ్రావెల్‌ క్వారీని ఆయన సతీమణి పేరిట తవ్వుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వీటిపై కొలికపూడి సమాధానం, వివరణ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. కానీ, ఈ వివాదాల్లో తన తప్పేమీ లేదని కొలికపూడి వాదిస్తున్నారు. కమిటీ ముందు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన వాదన నిజమే అయినా.. ఆ పేరుతో నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులను గురిచేసేలా వ్యవహరించటం విమర్శల పాలవుతుంది.

 

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×