Donald Trump: నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ రేసులో ఎంత బలంగా ఉన్నారో.. గ్లోబ్ మొత్తం తెలుసు! అయితే.. నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటనకు ఒక్క రోజు ముందు.. దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాయెల్-గాజా ఘర్షణలో.. కీలకమైన శాంతి ఒప్పందాన్ని కుదిర్చినట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి.. నిజంగానే ట్రంప్‌ని నోబెల్ శాంతి బహుమతి వరిస్తుందా?
నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ ఆరాటం
కొన్నాళ్లుగా.. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ పడుతున్న ఆరాటం.. అంతా ఇంతా కాదు. ఏకంగా ఐక్యరాజ్యసమితి వేదికగానే.. తాను ఏడు యుద్ధాలు ఆపి.. శాంతిని నెలకొల్పిన వ్యక్తిగా ప్రకటించుకున్నారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పనిని కూడా తానే చేశానని.. చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారాయ్. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ.. తాను నోబెల్ శాంతి బహుమతికి ఎందుకు అర్హుడిననే విషయాలు కూడా చెబుతూ వచ్చారు. చివరికి.. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది కూడా తానేనని ప్రకటించుకున్నారు. దీనిని.. భారత్ ఎన్నోసార్లు తోసిపుచ్చింది. ఇలా.. కొన్నాళ్లుగా నోబెల్ శాంతి బహుమతి కోసం.. ట్రంప్ బాగానే పోరాడుతున్నా్రు. ఇప్పుడు కూడా నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ఒక్క రోజు ముందు.. దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాయెల్-గాజా వివాదంలో.. కీలకమైన శాంతి ఒప్పందాన్ని కుదిర్చినట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు.. వైట్ హౌజ్ ఆయనని.. ది పీస్ ప్రెసిడెంట్ అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేసింది. దీంతో.. ట్రంపో నోబెల్ పీస్ ప్రైజ్ రేసుకి.. మరింత ఊతమిచ్చినట్లయింది. ఈ పరిణామాలతో.. నిజంగానే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందా? వైట్ హౌజ్ హంగామాని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.
నోబెల్ శాంతా బహుమతి ప్రకటనకు ఒక్కరోజు ముందు ఒప్పందం..
గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్ తొలి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేశాయని.. తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. రెండేళ్ల గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు.. ఇదొక అపూర్వ అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడానికి ఒక్క రోజు ముందు ఈ ఒప్పందం కుదిరింది. 79 ఏళ్ల ట్రంప్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మకమైన బహుమతి ఇది. ఇలాంటి క్షణంలో.. వైట్ హౌజ్ చాలా తెలివిగా ఈ ట్వీట్ చేసింది.
ఏమీ చేయని వ్యక్తికి నోబెల్ ఇస్తారన్న ట్రంప్ వ్యాఖ్యలపై చర్చ..
మరోవైపు.. ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం నోబెల్ కమిటీ తనకు బహుమతి ఇవ్వకుండా ఉండేందుకు.. ఓ మార్గాన్ని కనుగొంటుందన్నారు. వాళ్లు శాంతి స్థాపన కోసం ఏమీ చేయని వ్యక్తికే.. బహుమతి ఇస్తారనడం కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. తాము రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించేందుకు కూడా దగ్గరగా ఉన్నామని ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది. చరిత్రలో ఎవరూ కూడా ఇన్ని యుద్ధాలు పరిష్కరించలేదంటున్నారు. పైగా.. తనకు నోబెల్ బహుమతి అందకపోతే.. అది అమెరికాకే పెద్ద అవమానం అవుతుందంటున్నారు ట్రంప్. అమెరికాకే.. నోబెల్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నానని.. వర్జీనియాలోని జరిగిన ఉన్నత స్థాయి సైనిక సమావేశంలో అన్నారు. మొత్తానికి.. ప్రెసిడెంట్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి గెల్చుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
యుద్ధాల్లో జోక్యం, శాంతి కోసం ఒప్పించేందుకు ప్రయత్నాలు..
నిజం చెప్పాలంటే.. ట్రంప్ ప్రపంచానికి వ్యతిరేకంగా పోటీ పడుతున్నారు. యుద్ధాల్లో జోక్యం చేసుకోవడం, శాంతి కోసం ఒప్పించేందుకు ప్రయత్నించడం లాంటివన్నీ.. నోబెల్ కోసమే చేస్తున్నాడని క్లియర్‌గా తెలుస్తోంది. దీనికితోడు.. రిపబ్లికన్ నేతలు, అనేకమంది ప్రపంచ నాయకులు ట్రంప్‌ని.. నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ఇప్పుడు కూడా రెండేళ్లుగా కొనసాగుతున్న గాజా యుద్ధాన్ని ఆపడం వల్ల.. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి కోసం.. తన రెజ్యూమెలో పెద్ద ఎత్తున పాయింట్లు దక్కుతాయ్. ఇప్పటికే.. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా.. అమెరికాకే ఎక్కువ ప్రభావం ఉందని.. ట్రంప్ మాత్రమే గాజా యుద్ధాన్ని ఆపగలరని చెప్పడంతో.. నోబెల్ విషయంలో ట్రంప్‌కి మరింత మద్దతు పెరిగింది.
ఇంకొన్ని గంటల్లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించనున్న వేళ.. ట్రంప్‌కి నోబెల్ దక్కుతుందా? లేదా? అనే డిబేట్ వరల్డ్ వైడ్ మొదలైంది. అసలు.. ట్రంప్ నోబెల్ కోసం ఎందుకు ఇంతలా తపించిపోతున్నారు? ఆ ప్రైజ్ దక్కడం వల్ల.. ట్రంప్‌కి ఒరిగేదేంటి? ఎందుకోసం.. ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ తనకే రావాలంటున్నా్రు? ట్రంప్ విషయంలో నోబెల్ కమిటీ ఎలా ఆలోచిస్తుంది?
ది పీస్ ప్రెసిడెంట్ హ్యాష్ ట్యాగ్‌తో వైట్ హౌజ్ ప్రచారం
నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు కొన్ని గంటల ముందు.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, ఆ వెంటనే.. వైట్ హౌజ్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో.. ది పీస్ ప్రెసిడెంట్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం మొదలుపెట్టడం వెంటనే వెంటనే జరిగిపోయాయ్. ఇది.. నోబెల్ కమిటీని ప్రభావితం చేసేందుకేననే చర్చ కూడా జరుగుతోంది. వాస్తవానికి.. 2025 నోబెల్ శాంతి బహుమతికి.. ట్రంప్‌ని కొందరు నామినేట్ చేశారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ఆయన పోషించిన పాత్ర, ఇతర ప్రపంచ వివాదాలను పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలను.. నామినేషన్లకు కారణంగా చూపారు. ట్రంప్ కూడా.. గడిచిన కొన్ని నెలల్లో.. అనేక శాంతి ఒప్పందాలు కుదిర్చినట్లు, ఏడు యుద్ధాలను ఆపినట్లు చెప్పుకుంటున్నారు. ఇలాంటివన్నీ.. నోబెల్ ప్రైజ్‌కు.. ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నప్పటికీ.. కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. నోబెల్ శాంతి బహుమతికి గత జనవరితోనే నామినేషన్ల గడువు ముగిసింది. ఇజ్రాయెల్-గాజా ఒప్పందం లాంటి ఇటీవలి పరిణామాలు టెక్నికల్‌గా.. ఈ ఏడాది పురస్కారానికి పరిగణనలోకి రాకపోవచ్చు. అయినప్పటికీ.. ఇది కమిటీ సభ్యులపై సానుకూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
ట్రంప్ నోబెల్‌కు అర్హుడు కాదని భావిస్తున్న 76 శాతం అమెరికన్లు
ఇక.. ట్రంప్ విధానాలు, ఆయన వ్యవహార శైలిపై.. అంతర్జాతీయంగా మిశ్రమ స్పందనలున్నాయి. సొంత దేశంలోనే.. ఓ సర్వే ప్రకారం 76 శాతం మంది అమెరికన్లు.. ఆయన నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదని భావిస్తున్నారు. అయితే.. నోబెల్ కమిటీ.. తన నిర్ణయాల్లో అత్యంత గోప్యతని, స్వతంత్రతని పాటిస్తుంది. రాజకీయ ఒత్తిళ్లు, చివరి నిమిషంలో జరిగే ప్రచారాలు వారిని ఎంతవరకు ప్రభావితం చేస్తాయనేది సందేహమే. అయినప్పటికీ.. ఈ పరిస్థితుల్లో ది పీస్ ప్రెసిడెంట్ ప్రచారం స్పష్టంగా ట్రంప్ ప్రతిష్టను పెంచడానికి, ఆయనను శాంతి స్థాపకుడిగా ప్రపంచానికి చూపించడానికి ఉద్దేశించిందేనని తెలుస్తోంది. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందు.. ఇలాంటి ప్రచారం చేయడం ద్వారా.. ఓ సానుకూల వాతావరణాన్ని సృష్టించి.. కమిటీపై పరోక్షంగా ఒత్తిడి తీసుకురావాలనే వ్యూహం కనిపిస్తోంది. ఒకవేళ.. ట్రంప్‌కి నోబెల్ శాంతి బహుమతి దక్కకపోయినా.. ప్రపంచ శాంతికి ఇంత కృషి చేసినా గుర్తించలేదనే వాదనని.. తమ మద్దతుదారుల ముందు ఉంచడానికి.. ది పీస్ ప్రెసిడెంట్ లాంటి ప్రచారం బాగా ఉపయోగపడుతుంది.
ప్రపంచ శాంతి స్థాపకుడిగా చరిత్ర గుర్తుపెట్టుకునే అవకాశం
డొనాల్డ్ ట్రంప్ నోబెల్ కోసం ఇంతలా తపించిపోవడానికి కేవలం ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తింపు పొందాలనే కోరిక మాత్రమే కారణం కాదు. దీని వెనుక బలమైన వ్యక్తిగత, రాజకీయ, చారిత్రక కారణాలు ముడిపడి ఉన్నాయి. ఏ అధ్యక్షుడికైనా.. చరిత్రలో నిలిచిపోవాలనే ఆకాంక్ష బలంగా ఉంటుంది. నోబెల్ శాంతి బహుమతి గెలవడం ద్వారా.. ట్రంప్ తననొక ప్రపంచ శాంతి స్థాపకుడిగా చరిత్ర గుర్తుపెట్టుకునేలా చేయొచ్చు. ముఖ్యంగా.. ట్రంప్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి.. తనని తాను బరాక్ ఒబామాతో పోల్చుకుంటూ ఉంటారు. అధ్యక్ష పదవి చేపట్టిన కొద్ది కాలానికే.. ఒబామాకు 2009లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అందువల్ల.. ఎన్నో యుద్ధాలు ఆపిన తనకు కచ్చితంగా నోబెల్ ఇవ్వాలనేది ట్రంప్ వాదన. ఒబామాని అధిగమించి, ఆయన కన్నా తను గొప్ప ప్రెసిడెంట్‌నని నిరూపించుకోవడమే ట్రంప్ ముందున్న టార్గెట్.
నోబెల్ బహుమతిలో విమర్శలన్నింటికి చెక్ పెట్టొచ్చనే భావన
ఇప్పటికే.. ట్రంప్ విదేశాంగ విధానంపై ప్రపంచవ్యాప్తంగా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ఒప్పందాల నుంచి తప్పుకోవడం, మిత్ర దేశాలతోనూ కఠినంగా వ్యవహరించడం లాంటివన్నీ.. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో.. నోబెల్ శాంతి బహుమతి గెలవడం ద్వారా.. ఈ విమర్శలన్నింటికి చెక్ పెట్టొచ్చని ట్రంప్ భావిస్తున్నారు. తన రూటు వేరైనా.. ఫలితం సాధించానని చెప్పుకోవడానికి, శాంతిని నెలకొల్పానని ప్రకటించడానికి.. నోబెల్ పీస్ ప్రైజ్.. ఓ గ్రేట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందనే లెక్కల్లో ట్రంప్ ఉన్నారు. ఒకవేళ.. నోబెల్ కమిటీ.. ట్రంప్‌కి గనక పీస్ ప్రైజ్ అనౌన్స్ చేస్తే.. వైట్ హౌజ్ ప్రచారం చేస్తున్న ది పీస్ ప్రెసిడెంట్ అనే ట్యాగ్‌కి.. అధికారిక ముద్ర దక్కుతుంది. ఇది.. ట్రంప్ పొలిటికల్ ఇమేజ్‌ని పూర్తిగా మార్చేస్తుంది. వివాదాస్పద నేత అనే ముద్రని చెరిపేసి.. ప్రపంచ శాంతిదూతగా ట్రంప్‌ని నిలబెడుతుంది. అంతేకాదు.. అమెరికాలోనూ, అంతర్జాతీయంగానూ.. ట్రంప్ పరపతి అమాంతం పెరుగుతుంది.
Also Read: ఘరానా మోసం.. AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు
ఇప్పటివరకు.. కేవలం నలుగురు అమెరికా అధ్యక్షులకు మాత్రమే.. నోబెల్ శాంతి పురస్కారం వరించింది. ట్రంప్ ఈ బహుమతి గెలిస్తే.. ఆ ఎలైట్ క్లబ్‌లో చేరతారు. అందువల్ల.. నోబెల్ పీస్ ప్రైజ్ రేసులో.. ట్రంప్ ఓ బలమైన పోటీదారుగా కనిపిస్తున్నారు. అయితే.. నోబెల్ కమిటీ కేవలం.. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలనే కాకుండా.. ఒక వ్యక్తి దీర్ఘకాలికంగా శాంతి స్థాపనకు చేసిన కృషిని, వారి మొత్తం విధానాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అందువల్ల.. వైట్ హౌజ్ ప్రచార ఆర్భాటాలు, చివరి నిమిషంలో కుదిరిన ఒప్పందాలు.. నోబెల్ కమిటీ నిర్ణయాన్ని ఏమేరకు ప్రభావితం చేస్తాయన్నది.. ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.
Story By Vamshi Krishna, Bigtv