Big Stories

CJI DY Chandrachud : జస్టిస్ డీవై చంద్రచూడ్ సంచలన తీర్పులు.. తండ్రికి తగ్గ తనయుడు..

CJI DY Chandrachud : అయోధ్యలో రామమందిర నిర్మాణం, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత, అవివాహిత అబార్షన్ చేయించుకునే అనుమతి, స్వలింగ సంపర్కం నేరం కాదు, వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు, భీమా కోరేగావ్ కేసు, ఆధార్ బిల్లు.. ఇలా అనేక సంచలన తీర్పులు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఒకరు. ఇప్పుడాయన భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రిలానే తనయుడు సైతం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం అత్యంత అరుదైన విషయం.

- Advertisement -

జస్టిస్ వైవీ చంద్రచూడ్. 1978 నుంచి 1985 వరకు సుదీర్ఘకాలం సీజేఐగా పని చేసి చరిత్రలో నిలిచారు. వైవీ చంద్రచూడ్ తనయుడే జస్టిస్ డీవై చంద్రచూడ్. మరో రెండేళ్ల పాటు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. నవంబర్ 10, 2024న పదవీ విరమణ చేస్తారు.

- Advertisement -

తండ్రి తీర్పునే తిరగరాసిన ఘనుడు. అనేక చారిత్రక తీర్పులు ఇచ్చిన సమర్థుడు. డీవై చంద్రచూడు 2016 మే 13 నుంచి సుప్రీంకోర్ జడ్జిగా కొనసాగుతున్నారు. అంతకుముందు 2013 నుంచి 2016 వరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2000 నుంచి 2013 వరకు బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందించారు. 1998 నుంచి రెండేళ్ల పాటు భారత అదనపు సోలిసిటర్ జనరల్‌గా పని చేశారు.

ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనమిక్స్‌లో హానర్స్ చేసిన చంద్రచూడ్.. ఢిల్లీ యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్‌ నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొందారు. హార్వర్డ్ లోనే ఫొరెన్సిక్ సైన్స్‌లో డాక్టరేట్ తీసుకున్నారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో లాయర్ గా పని చేశారు.

తండ్రి వైవీ చంద్రచూడ్‌ ఇచ్చిన రెండు తీర్పులకు పూర్తి వ్యతిరేక తీర్పులు ఇచ్చారు డీవై చంద్రచూడ్. 1976 లో శివకాంత్ శుక్లా వర్సెస్‌ ఏడీఎం జబల్‌పూర్ కేసులో.. గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పరిగణించలేమని తెలిపింది. ఆ ధర్మాసనంలో అప్పటి సీజేఐ వైవీ చంద్రచూడ్ ఒకరు. అయితే, 2017లో గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన ధర్మాసనంలో డీవై చంద్రచూడ్‌ ఉన్నారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని తండ్రి చెబితే.. గోప్యత ప్రాథమిక హక్కని తనయుడు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.

మరోకేసులోనూ అలానే జరిగింది. 1985లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్‌ ధర్మాసనం.. సౌమిత్ర విష్ణు కేసులో ఐపీసీ సెక్షన్‌ 497ను సమర్థించింది. సంబంధం కలిగి ఉండటానికి ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తి పురుషుడే కానీ, స్త్రీ కాదని సాధారణంగా అంగీకరించబడింది అని ధర్మాసనం తన తీర్పులో రాసింది. ఈ నిర్ణయాన్ని 2018 లో జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది.

కొన్నేళ్లుగా పలు కీలకమైన తీర్పులతో జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరు మీడియాలో మారిమోగిపోతోంది. కొన్నిసార్లు చంద్రచూడ్ పేరు ట్విటర్‌లో ట్రెండింగ్ గా కూడా నిలిచిందంటే ఆయన తీర్పులు ఎంత పాపులర్ అయ్యాయో తెలుస్తోంది. అయోధ్య-బాబ్రీ మసీదు కేసులో తుది తీర్పు ఇచ్చిన ధన్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ ఒకరు. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించే హక్కును సమర్థించిన ధర్మాసనంలోనూ ఆయన ఉన్నారు. ఇటీవల కలకలం రేపిన.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్స్ ను కూల్చేయాలనే తీర్పు ఇచ్చింది చంద్రచూడే.

మతం, పెళ్లి విషయంలో మేజర్లు తమకు నచ్చినట్లు ఉండే స్వేచ్ఛను సాఫిన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం కేసులో తీర్పునిచ్చారు. వ్యభిచారం నేరం కాదంటూ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు వెలువరించారు. స్వలింగ సంబంధాలను నేర రహితమనే తీర్పు ఇచ్చిన బెంచ్ లోనూ ఉన్నారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం 24 వారాల వరకు గర్భస్రావం చేయించుకునే హక్కు మహిళలకు, అవివాహితలకూ ఉంటుందంటూ తీర్పు ఇచ్చారు.

ఆధార్ బిల్లును మనీ బిల్లుగా రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదించినట్లు మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయానికి భిన్నంగా ప్రత్యేక తీర్పు ఇచ్చారు. ఆధార్ అనేది రాజ్రయాంగ వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. భీమా కోరేగావ్ కేసులో ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తల అరెస్టుకు సిట్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరంలేదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యతిరేక తీర్పు రాశారు. కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చడానికి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది.

టెక్నాలజీపై మంచి పట్టు ఉండి.. న్యాయమూర్తిగా కాస్త కఠినంగా ఉంటూ.. చట్టాలను తూచా తప్పకుండా పాటించే చంద్రచూడ్.. ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్న విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆయన మంచి న్యాయమూర్తి. మంచి మనిషి.. అంటారు ఆయన సహచరులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News