టీపీసీసీ చీఫ్ కావాల్సినోడు. తృటిలో తప్పిపోయింది. రేవంత్ కూడా సహకరించకపోవడం ఓ ప్రధాన కారణం. అంతకు ముందు రేవంత్‌పై మధుయాష్కీ వ్యక్తిగత దూషణలకు దిగడం కూడా అతనికి ఈ కీలక పదవిని దక్కనీయకుండా చేసింది. ఇప్పుడు ఢిల్లీ పెద్దలే పిలిచి మరీ కీలక పదవిని కట్టబెట్టారు.
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) జాతీయ చైర్మన్‌గా మధుయాష్కీని నియమించడం ద్వారా.. గౌడ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టందనే చెప్పాలి. రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలిచి… ఢిల్లీ పెద్దతలతో సత్సంబంధాలను మరింత పదిలం చేసుకున్నారు. ఈ పరిచయాలను అలాగే కొనసాగించిన మధుయాష్కీకి ఆపై అదృష్టం ముఖం చాటేసింది.
వరుసగా ఓటమి పాలే అవుతూ వచ్చారు. మూడో సారి ఎంపీగా ఘోర పరాభవం పొందడం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసినా గెలవలేదు. ఒకవేళ గెలిచి ఉంటే మంత్రివర్గంలో చోటు కోసం ఢిల్లీ లెవల్ ప్రయత్నాలు చేసి ఫలితం సాధించి ఉండేవారు. టీపీసీసీ చీఫ్ చాన్సు తనకు రావాల్సింది.. రేవంత్ చక్రం తిప్పడంతో మహేశ్ కుమార్ గౌడ్ వశమైంది.
పోనీ ప్రభుత్వంలోనైనా మంచి గౌరవం దక్కుతుందా? అంటే .. రేవంత్ అసలు పట్టించుకోనే లేదు. పక్కన పెట్టేశారు. ఇదిగో ఇన్నాళ్లకు ఇలా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మంచి ఆఫర్ దక్కింది. జాతీయ స్థాయిలో తన పేరును పదిలం చేసుకునే అవకాశం చిక్కింది.
ఈ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఏర్పాటు రాహుల్ గాంధీ మదిలోంచి పురుడు పోసుకున్నదే. అందుకే ఈ పదవికి ఆ పార్టీలో అత్యంత ప్రయార్టీ ఉంది. వివిధ రంగాల్లోని విద్యావంతులైన ప్రొఫెషనల్స్‌నందరినీ కాంగ్రెస్ వైపు ఆకర్షితులను చేయడం, వారి కష్టనష్టాలపై చర్చించి సమస్యల పరిష్కారానికి దోహద పడటం ఈ పదవి చేయాల్సిన బాధ్యత.
అంతే కాదు.. మేధావుల సలహాలను తీసుకుని రానున్న కాలంలో పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి..? ఎలాంటి పథకాలు రూపకల్పన చేయాలి..? అనే విషయాలపైనా కీలక సూచనలు చేయాల్సి ఉంటుంది. పార్టీ మ్యానిఫెస్టోలో మేధావి వర్గం సలహాలు, సూచనలను పొందుపరిచే క్రమంలో ఈ జాతీయ పదవికి కీలక బాధ్యతలున్నాయి.
మొన్నటి దాకా సొంత ఇలాఖా నిజామాబాద్‌తో పాటు రాష్ట్రంలోనూ తన రాజకీయ ఉనికి కనుమరుగైపోతున్న తరుణంలో మధుయాష్కీకి అదృష్టం ఇలా తలుపులు తెరిచింది. ఢిల్లీ పెద్దలకు విధేయుడిగా ఉన్న నేపథ్యం ఇన్నాళ్లకు ఇలా కలిసి వచ్చింది. సముచిత ప్రాధాన్యం దక్కింది. ఇప్పటి వరకు ఈ పదవిని చేపట్టిన వారిలో శశిథరూర్, ప్రవీణ్ చక్రవర్తి ఉన్నారు. మూడో చైర్మన్‌గా మధుయాష్కీని ఎన్నికయ్యారు.