Supreme Court: దొంగకే శిక్ష వెయ్యమని దొంగకే చెబితే ఎలా ఉంటుంది..? ఆలోచించండి! కేంద్ర ప్రభుత్వం ధోరణి కూడా అచ్చం అలాగే ఉంది. న్యాయం తన పని తాను చేసుకుపోతుందని చెప్పే ప్రభుత్వం.. రాజకీయ నేతల్లో నేరస్థుల అంశం మాత్రం కోర్టులకు కాదు.. రాజకీయ నాయకులకే వదిలేయమంటోంది. వారికి ఎంత శిక్ష వేయాలన్నది వారే నిర్ణయిస్తారని చెబుతోంది. ఏంటీ విడ్డూరం అనుకుంటున్నారా..? అవును, క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతలు.. రాజకీయ పదవులె చేపట్టకుండా, జీవితకాలం నిషేధించడం కఠిన చర్య అవుతుందట! ఇప్పుడున్న ఆరేళ్ల నిషేధం చాలు.. దాని కంటే ఎక్కువ శిక్ష వేయాలంటే అది పార్లమెంట్‌లో ఉన్న రాజకీయ నేతలకే వదిలేయమని మోడీ ప్రభుత్వం మొహమాటం లేకుండా చెబుతోంది. కేంద్రం చేస్తున్న వాదన కరెక్టేనా..? దోషులుగా తేలిన వారిపై కఠినంగా ఎందుకు ఉండకూడదు..?
దోషులైన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం కఠిన చర్య
భారతదేశంలో నేరాలు, రాజకీయాలు ఎంతగా ముడిపడి ఉంటాయంటే… క్లీన్ పొలిటీషియన్‌ని భూతద్దంలో పెట్టి వెతకినా కనిపెట్టడం చాలా కష్టం. ప్రస్తుతం, చట్ట సభల్లో కూర్చున్న ప్రజాప్రతినిధుల్లో నేర చరిత్ర ఉన్నోళ్లు ఎంతమందో తెలిస్తే.. షాకవుతాం. అవినీతి, క్రిమినల్ కేసుల్లో దోషులుగా ఉన్నవాళ్లు చాలా మంది పార్లమెంట్, శాసనసభల్లో దర్జాగా కూర్చొని పాలన చేస్తున్నారు. వీళ్లందరి నేరాలూ కోర్టుల్లో రుజువైనా.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అధికారం చేపట్టొచ్చు.. అజమాయిషీ చేయొచ్చు. ఇది కరెక్టేనా..? కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే.. “అందులో ఏమంత పాపం ఉంది..? నిరభ్యంతరంగా దోషులు రాజకీయాల్లో ఉండొచ్చని” అన్నట్లుంది. వివిధ క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం చాలా కఠినమైన చర్య అని కేంద్రం భావించింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8, సెక్షన్ 9 రాజ్యాంగ చెల్లుబాటుపై స్పందన
ప్రస్తుత చట్టాల ప్రకారం ఆరు సంవత్సరాల అనర్హత కాలం చాలని కేంద్రం, సుప్రీంకోర్టుకు తెలియజేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని.. దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ.. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగా ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8, సెక్షన్ 9 రాజ్యాంగ చెల్లుబాటుపై స్పందన తెలియజేయాలని కేంద్రంతో పాటు ఎన్నికల సంఘాన్ని ఈ నెల 10న సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలోనే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో.. అనర్హత కాలాన్ని నిర్ణయించడం పూర్తిగా పార్లమెంటు పరిధిలో ఉంటుందని కేంద్రం పేర్కొంది.
1951లోని సెక్షన్ 8 (1) ప్రకారం, అనర్హత కాలం ఆరేళ్లు
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8 (1) ప్రకారం, అనర్హత కాలం, దోషిగా తేలిన తేదీ నుండి ఆరు సంవత్సరాలు లేదా… జైలు శిక్ష విధించబడితే, విడుదల తేదీ నుండి ఆరు సంవత్సరాలు రాజకీయాల్లో పదవులు చేపట్టకుండా నిషేధం ఉంది. ఇక, సెక్షన్ 9 ప్రకారం, అవినీతి లేదా దేశ ద్రోహం కారణంగా తొలగించిన ప్రభుత్వ ఉద్యోగులను తొలగింపు తేదీ నుండి ఐదు సంవత్సరాల కాలానికి అనర్హులుగా ప్రకటిస్తారు. అయితే, ఈ రెండు సందర్భాలలోనూ అనర్హత కాలం జీవితాంతం ఉండాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ కోరారు. అయితే, కేంద్రం సమర్పించిన న్యాయ సమీక్ష అఫిడవిట్‌లో.. శిక్షల ప్రభావాన్ని నిర్థిష్ట కాలానికి పరిమితం చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదనీ.. ఇది ఇప్పటికే ఉన్న చట్టం ప్రకారం సబబేనని కేంద్రం పేర్కొంది.
చివరి నిర్ణయం పార్లమెంటు శాసన విధానం పరిధిలోకి వస్తుందని స్పష్టం
ఇక, పిటిషనర్ లేవనెత్తిన అంశాలు.. విపరీత పరిణామాలకు దారి తీస్తాయనీ.. నిజానికి, దీనిపై చివరి నిర్ణయం తీసుకోవడం పార్లమెంటు శాసన విధానం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే, పార్లమెంట్ న్యాయ సమీక్షలో, సుప్రీంకోర్టు చట్టాలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా కొట్టివేయొచ్చనీ.. కానీ, పిటిషనర్ కోరిన జీవితకాల నిషేధం సబబు కాదనీ కేంద్రం వాదించింది. దీనితో, ఈ అంశం న్యాయ వ్యవస్థకు సంబంధం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది కేంద్రం.
అనర్హత వ్యవధి నిర్ణయించే అధికారం పార్లమెంటుకే ఉందన్న కేంద్రం
ఇక, ప్రస్తుత చట్టాలు రాజ్యాంగపరంగా బలమైనవనీ.. అదనపు అధికార ప్రతినిధ్యం ఏమంత దుర్మార్గం కాదనీ కేంద్రం తన అఫిడవిట్‌లో వెల్లడించింది. అలాగే, దేశ రాజ్యాంగం.. ఇలాంటి అనర్హతలను నియంత్రించే మరిన్ని చట్టాలను రూపొందించడానికి పార్లమెంట్‌కు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా… అనర్హతకు కారణాలు, అనర్హత వ్యవధిని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉందని తెలిపింది. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభలు, శాసన మండలి సభ్యత్వానికి అనర్హతలను వివరించే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, 191లను ఉటంకిస్తూ కేంద్రం తన అఫిడవిట్‌లో ఈ వాదనలు చేసింది.
ఏప్రిల్ 2013లో సుప్రీంకోర్టు తీర్పు…
అయితే, ఏప్రిల్ 2013లో, సుప్రీంకోర్టు కనీసం రెండేళ్ల జైలు శిక్ష విధించబడిన ఎంపీలు, ఎమ్మెల్యేలను మూడు నెలల అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా వెంటనే సభ నుండి అనర్హులుగా ప్రకటిస్తామని తీర్పు చెప్పింది. కాగా.. నాడు, కేంద్రంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం దీనిని తోసిపుచ్చడానికి ఒక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్యను పూర్తిగా అర్ధంలేనిదని అన్నారు. చివరికి ఆర్డినెన్స్‌ను రద్దు చేశారు.
మార్పును ఏ పార్టీ అంగీకరిచకపోవచ్చనే అభిప్రాయం
ప్రస్తుత నిబంధనల్లో… ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్ కేసులో దోషిగా తేలితే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తారు. ఆరేళ్ల తర్వాత తిరిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. నేరస్థులు రాజకీయాల్లో ఉండకూడదు – పాలన స్వచ్ఛంగా ఉండాలంటే, క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినవారిపై శాశ్వత నిషేధం ఉండాలి. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు కాపాడాలి – రాజకీయ నాయకులు అనేవారు ఎలాంటి మచ్చ లేకుండా ఉండాలి.
అయితే, కేంద్రం సమర్పించిన అఫిడవిట్ తర్వాత.. ఇప్పుడు సుప్రీంకోర్టు దీనిపై తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. కాగా.. ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరిగే అవకాశముంది. ఇందులో, సరైన వాదోపవాదాలు జరిగితే.. రాజకీయ నాయకుల అర్హతలు, నిషేధ నిబంధనలపై భవిష్యత్‌లో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ, కేంద్రం దీనిపై స్పష్టంగానే తన అఫిడవిట్‌లో వివరణ ఇచ్చింది కాబట్టి, పార్లమెంట్‌లో చర్చకు వచ్చినా ఏ పార్టీ మార్పు చేయాలని అంగీకరిచకపోవచ్చు. ఎందుకంటే, పొలిటికల్‌గా ఎంత శత్రుత్వం ఉన్నా.. అల్టిమేట్‌గా అందరూ రాజకీయ నాయకులే..!
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక
నిజానికి, అవినీతిలో కూరుకుపోయిన రాజకీయాలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలు ఈ కుళ్ళిపోయిన నిజాన్ని ఎప్పటి నుండో ఎత్తి చూపుతున్నాయి. ఆ మధ్య.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులలో దాదాపు 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీళ్లపైన ఉన్న కొన్ని అభియోగాలు చిన్నవే అయినప్పటికీ.. 20 శాతం మంది ఎంపీల మీద హత్యాయత్నం, ప్రభుత్వ అధికారులపై దాడి, దొంగతనం వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి.
ప్రభుత్వ అధికారులపై దాడి, దొంగతనం వంటి తీవ్ర అభియోగాలు
అధికార, విపక్షమనే తేడా లేకుండా.. భారతదేశంలోని దాదాపు అన్ని పార్టీలు నేరస్తులుగా అభియోగాలున్న అభ్యర్థులనే బరిలోకి దింపుతున్నారని నివేదిక పేర్కొంది. రాజకీయన నేతలు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగానే ఈ విశ్లేషణ జరిగింది. అయితే, ఇలాంటి పరిస్థితిపైన దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రమైన విమర్శలు చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు రాజకీయ రంగంలోకి ప్రవేశించకుండా ఉండేలా ఒక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకంగా మారకముందే ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోర్టు తెలిపింది. అయితే, ఇప్పటికీ దీన్ని నేతలు లైట్ తీసుకుంటున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన వారిలో…
భారతదేశం ఖచ్చితంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అనడంలో సందేహం లేదు. కానీ, ఈ ప్రజాస్వామ్యం ఆదర్శ నేతల నేతృత్వంలో నడుస్తుందా అంటే నమ్మేవారు చాలా తక్కువ. ఇప్పటి వరకూ దేశ రాజకీయ చరిత్రలో ప్రజాప్రతినిధులైన నేరస్థుల లిస్ట్ చూస్తే.. పేర్లు చదవడానికే చాలా టైమ్ పడుతుంది. ఇక, వాళ్ల నేరాల చిట్టా తీస్తే.. రోజులు తరబడి చెప్పాల్సి ఉంటుంది. అయితే క్లుప్తంగా చూస్తే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన వారి లెక్కలు చూస్తే.. 46 శాతం మంది క్రిమినల్ కేసుల్లో నేరస్థులుగా ఉన్నారు. ఇక, తీవ్రమైన నేరాల్లో దోషులుగా ఉన్నవారు 31 శాతం మంది. 93 శాతం మంది కోట్లాదిపతులు.
స్వచ్ఛమైన అభ్యర్థి గెలిచే అవకాశాలు 5 శాతం
అంటే, నేరస్థులు.. ధనవంతులకు తప్ప ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో వేరే వాళ్లు అవకాశమే లేదన్నది స్పష్టం అర్థమవుతోంది. ఇప్పటి వరకూ ఉన్న చాలా నివేదికలను పరిశీలిస్తే.. నేర నేపథ్యం ఉన్న అభ్యర్థి, నేర నేపథ్యం లేని అభ్యర్థి కంటే దాదాపు రెండు రెట్లు గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒక నేరస్థుడు గెలిచే అవకాశాలు 13 శాతం ఉండగా, స్వచ్ఛమైన అభ్యర్థి గెలిచే అవకాశాలు 5 శాతమే ఉన్నాయి. నేర నేపథ్యం ఉన్న శాసనసభ్యులు శక్తివంతులనీ.. అందువల్ల, ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్లే పని పూర్తి చేస్తారని సామాన్య ఓటర్లు కూడా భావిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
అధిక శాతం అభ్యర్థులు కోటీశ్వరులు, నేరస్తులు
రాజకీయాల్లోకి ప్రవేశించడమంటే అవినీతికి పాల్పడడం అన్న అభిప్రాయం ఈ దేశంలో దాదాపు అందిరిలో ఉంది. ఏ ఎన్నికలు చూసుకున్న అధిక శాతం అభ్యర్థులు అయితే కోటీశ్వరులు, లేకపోతే నేరస్తులు. ఆర్థికబలం, అంగబలం లేనివాళ్ళు ఎన్నికల్లో గెలవరనే భావన పార్టీల్లోనే కాదు.. ప్రజల్లో కూడా బలంగా నాటుకుంది. ఆ బలాలు ఉన్న అభ్యర్థిని గ్యారెంటీగా ఏదో ఒక పార్టీవాళ్ళు లాగేసుకోవడం.. వాళ్లను గెలిపించేదాకా ప్రజల్ని ఆకర్షించడం అలవాటుగా మారింది. ప్రజలకు కూడా వేరే ఆప్షన్ లేకుండా పోయింది.
ప్రజాస్వామ్య ప్రభుత్వ మూలాలకు పెద్ద దెబ్బ
డబ్బులు తీసుకుని ఓటేసేలాగా వ్యవస్థను తయారుచేసింది ఇలాంటి నేతలే. ఇద్దరూ రౌడీలే.. ఇద్దరూ ధనవంతులే.. ఇక నిజాయితీగా ఓటేసే ఛాన్స్ ఎక్కడిది..? వేస్తే మాత్రం ఉపయోగం ఏముంటుంది? ఇలాంటి నిరాశనిస్పృహలను ఓటర్ల ఆలోచనల్లో నింపేశారు. చివిరికి పొలిటికల్ పార్టీలే సక్సెస్ అయ్యాయి. భారత ప్రజాస్వామ్యంలో నేరాలు చేస్తున్న నేతలు క్రమంగా పెరుగుతూనే ఉన్నారు. ఇది రాజ్యాంగ నైతికతకు భంగం కలిగించడమే కాకుండా.. ప్రజాస్వామ్య ప్రభుత్వ మూలాలను కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా, దేశంలోని సామాన్య ప్రజలపై దీని ప్రభావం అధికంగా ఉంటోంది.
ప్రజాస్వామ్య పాలనపై ప్రతికూల ప్రభావాలు తప్పవు
ఇలా, రాజకీయాలను నేరస్థులతో నింపేస్తే.. ప్రజాస్వామ్య పాలనపై ప్రతికూల ప్రభావాలు తప్పవని మేథావులు మొత్తుకుంటూనే ఉంటారు. దీన్ని అడ్డుకోడానికి కఠినమైన చట్టాలు లేకపోతే.. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడే వేదికలుగా మారతాయి. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుంది. ఇలాంటి వారిని కట్టడి చేయకపోతే.. దేశ అభివృద్ధి చతికలపడుతుంది. ఎందుకంటే, నేర నేపథ్యం ఉన్న రాజకీయ నాయకులు ప్రజల సంక్షేమం కంటే తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి వారి వల్ల ప్రజాస్వామ్య సంస్థలు కూడా బలహీనపడతాయి. వీళ్లు, వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
యువత తప్పుదారి పడుతుందనే ఆందోళన
దీనితో, నిష్పక్షపాతంగా ప్రభుత్వ విధానాలు అమలు కావు. నేరస్థులు నేతలైతే… ప్రభుత్వ ఉద్యోగుల సమగ్రతపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇది సమాజంలో అవినీతిని పెంచుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రభావితం చేస్తుంది. సామాజిక అసమానతకు కూడా కారణమవుతుంది. ముఖ్యంగా, సమాజంలో హింసాత్మక సంస్కృతిని పెంచుతుంది. ముఖ్యంగా, దేశానికి వెన్నుముకగా ఉండాల్సిన యువత తప్పుదారి పడుతుంది. ఇలాంటి పాలనా వ్యవస్థ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని తగ్గిస్తుంది.
పీపుల్స్ యాక్ట్‌లోని నిబంధనలను సవరించాలి
రాజకీయ పార్టీలు నేరస్తులకు టికెట్లు ఇవ్వడాన్ని రద్దు చేయమని చెప్పే కఠినమైన చట్టం లేకపోవడమే ఈ వ్యవస్థలో అవినీతి ఇంతగా పాతుకుపోవడానికి ప్రధాన కారణమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడానికి పార్లమెంట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, పీపుల్స్ యాక్ట్‌లోని నిబంధనలను సవరించకపోతే.. ఈ వ్యవస్థ ఇలాగే పాతకుపోతుందని గతంలో ఎంతో మంది న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, నేరస్థులైన రాజకీయ నేతలకు పలుకుబడి ఎప్పుడూ ఉంటుంది.
దేశంలో కులం, మతం ద్వారా నడిచే సామాజిక విభజనలు
అందులోనూ.. వాళ్లు గెలుస్తారు కాబట్టి, ప్రభుత్వం కూడా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. దీనితో వాళ్లకు నష్టం వచ్చే నిర్ణయాలు వాళ్లు తీసుకోరు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం, రెండు సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష అనుభవించిన వారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కాబట్టి.. ఇలాంటి నేతలంతా దానికి తగ్గట్లే వాళ్ల ప్లాన్లు రూపొందించుకుంటున్నారు. ఇక, భారతదేశంలో కులం, మతం ద్వారా నడిచే సామాజిక విభజనలు తీవ్రంగా ఉండటం వల్ల ఓటర్లు కూడా ఇలాంటి నాయకులనే గెలిపిస్తున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న నేతలు దర్జాగా అధికార పీఠం ఎక్కుతున్నారు.
కోర్టుల్లో సుదీర్ఘ విచారణలు, తక్కువ శిక్షలు
ఇక, రాజకీయంలో ఇలా నేరప్రవృత్తి ఎక్కువ కావడానికి మరో కారణం.. కోర్టుల్లో సుదీర్ఘ విచారణలు, తక్కువ శిక్షలు పడటం కూడా అని విశ్లేషకులు అంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. క్రిమినల్ కేసులున్న రాజకీయ నేతల్లో కేవలం 6 శాతం మాత్రమే దోషులుగా నిర్థారించబడ్డారని తెలుస్తోంది. ఇక, తీవ్రమైన నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను పార్టీలు నిలబెట్టడానికి కారణం.. వారి దగ్గరున్న డబ్బేనన్నది నిజం. పెరుగుతున్న ఎన్నికల ఖర్చు వల్ల పార్టీలు డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇలాంటి వారి వల్ల పార్టీ ఖజానా క్షేమంగా ఉంటుంది.
పార్లమెంటు ఒక యంత్రాంగాన్ని రూపొందించడం అవసరం
బదులుగా పార్టీకి మరింత డబ్బు వచ్చి పడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. కర్ణుడి చావుకి సవాలక్షా కారణాలన్నట్లు నేరస్థులు రాజకీయాలను ఏలడానికి చాలా లొసుగులే ఉన్నాయి. అందుకే, నేరస్థులైన రాజకీయ నాయకులను రాజకీయ పోరాటం నుండి దూరంగా ఉంచడానికి పార్లమెంటు ఒక యంత్రాంగాన్ని రూపొందించడం అత్యవసరమని అంటున్నారు నిపుణులు. అలాగే, రాజకీయాలను నేరస్థుల నుండి దూరంగా ఉంచడానికి ప్రజలు కూడా సహకారం అందించాలి. లేకపోతే.. త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశం.. నేరస్థుల నిరంకుశత్వానికి బలైపోతుంది.