CID Investigation: ప్రభుత్వ కార్యాలయానికి తమ తప్పులు బయటపడతాయని నిప్పు పెట్టారు. చివరకు అత్యున్నత న్యాయస్థానం సైతం బెయిల్ నిరాకరించింది అయితే కేసు విచారిస్తున్న ఏపీ సీఐడీ అధికారులు మాత్రం మొద్దు నిద్ర విడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. సీఐడీకి కేసు ఇస్తే .. అదెలాగూ తేలదు.. నిందితులు ప్రశాంతంగా ఉండవచ్చన్న ప్రచారం ఉంది.. అది నిజం అనిపించేలా గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో సీఐడీ చేస్తున్న విచారణలు అత్యంత అలస్యంగా నడుస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఆ లిస్టులో మదనపల్లి పైల్స్ దగ్ధం కేసు కూడా చేరినట్లు కనిపిస్తుందని బాధితులు వాపోతున్నారంట.
తాజాగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏతో పాటు ఆయన ప్రధాన అనుచరుడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఈ కేసులో ఎ3, ఎ4 నిందితులుగా ఉన్న వంకిరెడ్డి మాధవరెడ్డి. బి మునిరత్నం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరిలో ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాజీ పీఏ కాగా.. మరొకరు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు.
వీరిద్దరికి బెయిల్ ఇచ్చే పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మదనపల్లి ఫైల్స్ దహనం కేసు దర్యాప్తునకు తాము అడ్డు రాలేమంటూ జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 20 వేల ఎకరాలకుపైగా భూములకు సంబంధించిన దస్త్రాల దహనం చిన్న విషయమేమీ కాదని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో వీరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో తాను దేశంలో లేనంటూ కోర్టు దృష్టికి ఒక నిందితుడు తీసుకెళ్లాడు. కుట్ర పన్నడానికి దేశంలోనే ఉండాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అదే విధంగా ఈ కేసులో ఇప్పటికే చాలా మంది నిందితులు బెయిల్‌పై బయటికి వచ్చారన్న నిందితుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కింది కోర్టుకు వెళ్లి.. రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని నిందితులకు ధర్మాసనం సూచించింది. ఇంత పెద్ద వ్యవహారంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆ క్రమంలో వీరు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
2024 జూలై 21 అర్ధరాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కావడంతో దీనిపై 22న కేసు నమోదు అయ్యింది.. పైర్ , ఎలక్రికల్ , పోరెన్సిక్ విభాగాల నుంచి వచ్చిన నివేదిక అదారంగా కుట్రకోణంతో ఇక్కడ కావాలనే రికార్డు గదికి నిప్పంటించి 2400 పైల్స్ దగ్ధం చేసారని నిర్ధారణ చేశారు..ఈ నేపథ్యంలో 316(5)326(జి),61(2) బిఎన్ ఎస్ యాక్ట్4 ప్రకారం మదనపల్లిలో కేసు నమోదు చేసిన తర్వాత కేసు సిఐడికి బదలీ చేసారు.. ఈ కేసులో ఏ 1 గా సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజా, ఏ 2గా పూర్వ అర్డీవో మురళి, ఏ 3గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు అయిన మాధవ రెడ్డి, ఏ 4గా పెద్దిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అయిన తుకారం ను చేర్చారు..
పైర్ జరిగిన రోజు అరగంట ముందు వరకు సాయితేజాతో అర్డీవో మురళీ ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో పాటు అక్కడ ఇంజన్ అయిల్ దొరకడం , అగ్గిపుల్లలు వంటివి దొరకడంతో పోర్సెనిక్ నిపుణుల ఇచ్చిన సమాచారం మేరకు కుట్రతో ప్రభుత్వం కార్యాలయాన్ని కాల్చి వేసారని నిర్ధారించారు. అప్పటికే 14 వేల ఎకరాలు మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో డీకేటీ భూములను ప్రీహోల్డ్ చేసాడనే కారణంతో అప్పటి అర్డీఓ మురళీని సస్పెండ్ చేసారు.
తర్వాత విచారణలో మరిన్ని వాస్తవాలు బయటపడ్డాయి..ఏకంగా 48,360 ఎకరాలలో 22, 523 ఎకరాల భూమిని ప్రో హోల్డ్ చేసినట్లు గుర్తించారు..వాటి మీద విచారణ జరుగుతుండగా సమస్య తీవ్రమవుతుందన్న భయంతో, 2,400 పైల్స్ దగ్ధం చేయించాడని సిఐడి విచారణలో బయటపడింది. దీంతో పాటు చాలా వరకు భూముల వివరాలు , వాటి రికార్డులు ఏ 3 మాధవరెడ్డి ఇంట్లో సోదాల సందర్భంగా బయటపడ్డాయని సీఐడీ వెల్లడించింది. సదరు నిందితులు నలుగురు నిరంతరం రెగ్యులర్ టచ్ లో ఉన్నట్లు వారి పోన్ డేటా అధారంగా కనుగొన్నారు.
మొదట్లో ఈ కేసును సీఐడీ సీరియస్ గా తీసుకున్నప్పటికీ, తర్వాత ఎందుకో దర్యాప్తులో వేగం మందగించిందని అంటున్నారు. ముఖ్యంగా ముని తుకారం ను ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు. మాధవరెడ్డి అరెస్ట్ చేసినప్పటికి వెంటనే బెయిల్ పై విడుదల అయ్యాడు. మొత్తం మీద సిఐడి దర్యాప్తు చేస్తున్న తీరుపై బాధితులు పెద్ద ఎత్తున అగ్రహం వ్యక్తం చేస్తున్నారు..పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం పోన్ ట్యాపింగ్ కేసులో, విదేశాలలో ఉన్న పోలీసు అధికారులతో పాటు, మీడియా హౌస్ అధిపతులను సైతం విదేశాలనుంచి రప్పించింది.
ఇక్కడ చూస్తే పేదవాడి భూములను అక్రమంగా అక్రమించుకోవడమే కాకుండా, వారిని అనేక ఇబ్బందులు పెట్టి, చివరకు సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేయడానికి మీన మేషాలు లెక్కించడమేంటని బాధితులు మండి పడుతున్నారు. ఘటన జరిగిన వెంటనే మదనపల్లికి అప్పటి డిఐజి ద్వారక తిరుమల రావు, సీఐడీ చీప్ అయ్యన్నార్ తో పాటు ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా వచ్చి వెళ్లారు. బాధితుల నుంచి వినతలు తీసుకున్నారు..అయితే పలితం మాత్రం శూన్యమే అన్న విమర్శులు పెరుగుతున్నాయి.
ఘటన జరిగిన వెంటనే అధికారుల హాడావుడి చూసి వేలమంది బాధితులు తమ భూములు అన్యాక్రాంతం అయ్యాయని సాక్ష్యాధారాలతో సహా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేశారు. తీరా సీఐడీ విచారణ తీరు చూస్తూ.. తమకు న్యాయం జరగడం అసాధ్యమే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన నకిలీ పట్టాదారు పుస్తుకాల కేసులో సైతం పట్టాదారు పుస్తుకాలు తయారు చేసిన వారు బయట తిరుగుతుండగా, అమాయక రైతులు మాత్రం కొర్టుల చుట్టు తిరుగుతున్నారు..అదే విధంగా మదనపల్లి పైల్స్ దహనం కేసు కూడా అటకెక్కుతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఈ కేసు కు సంబంధించి సిఐడి చేసింది శూన్యమని ..సిట్ కాని సిట్టింగ్ జడ్జాతో కాని విచారణ కమిషన్ వేయాలని బాధితులు కోరుతున్నారంటే.. సీఐడీపై వారు ఎంత అపనమ్మకంతో ఉన్నారో స్పష్టమవుతోంది.
Story by : Apparao, Big Tv