TGRPDCL: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ విద్యుత్ రంగంలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మూడో విద్యుత్ పంపిణీ సంస్థ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి, ఎత్తిపోతల పథకాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం మూడో విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఆర్పీడీసీఎల్) పేరుతో ఈ కొత్త సంస్థ కార్యరూపంలోకి వచ్చింది. తెలంగాణలో ఇప్పటికే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ(ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) రెండు డిస్కంలు పనిచేస్తున్నాయి. తాజాగా మూడో డిస్కంగా టీజీఆర్పీడీసీఎల్ ను అధికారికంగా ఏర్పాటు చేశారు.
తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రిజిస్టర్డ్ కార్యాలయంగా టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయ ప్రాంగణంలోని బీ బ్లాక్ లో రూమ్ నంబర్ 2ను ప్రభుత్వం కేటాయించింది. టీజీఆర్పీడీసీఎల్ పరిధిలోకి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, కాంపోజిట్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లయ్ స్కీమ్(సీపీడబ్ల్యూఎస్)/మిషన్ భగీరథ నీటి సరఫరా వ్యవస్థలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ & సీవరేజ్ బోర్డు(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బీ) పరిధిలోని కనెక్షన్లు, ప్రత్యేక డీటీఆర్ల ద్వారా ఎల్టీ VI-బీ కేటగిరీ పరిధిలోని మునిసిపల్ నీటి సరఫరా కనెక్షన్లు విద్యుత్ సరఫరా విస్తరణ, తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలోకి రానున్నాయి. కేటాయించిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్ వాటా ప్రకారం విద్యుత్ కొనుగోలు నిర్వహణ, అవసరమైన రెగ్యులేటరీ ఫైలింగ్స్, నిబంధనల అనుసరణ వంటి ముఖ్య కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
Also Read: Urdu School: బయట పడ్డ ఉర్దూ మీడియం హై స్కూల్ బండారం.. మరీ ఇంత నిర్లక్ష్యమా..!
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో సీఎండీగా పనిచేసిన అనుభవమున్న ముషారఫ్ ఫరూఖీని తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఆర్పీడీసీఎల్) కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. సంస్థ ప్రారంభ మూలధనం రూ.5 కోట్లుగా నిర్ణయించారు. దీనిని ప్రస్తుతం ఉన్న టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ సంస్థలు సమానంగా భరించనున్నాయి. కాగా ఐదుగురు సభ్యులతో కూడిన తొలి బోర్డు ఆఫ్ డైరెక్టర్లను ప్రభుత్వం ప్రకటించింది. సీఎండీగా ముషారఫ్ ఫరూఖీ వ్యవహరించనుండగా డైరెక్టుర్లుగా మరో నలుగురిని సర్కార్ నియమించింది. ఇందులో ఆర్థిక, ప్రాజెక్ట్స్, ఆపరేషన్స్ విభాగాలకు చెందిన నిపుణులను సభ్యులుగా చేర్చారు. దక్షిణ, ఉత్తర తెలంగాణ పంపిణీ సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్న తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీ మోహన్ రావు, డాక్టర్ ఎన్ నరసింహులును సంస్థ పాలక మండలి సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీజీఆర్పీడీసీఎల్ నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని డిప్యూటేషన్, ప్రత్యక్ష నియామకాలు లేదా అవుట్‌సోర్సింగ్ విధానం ద్వారా సమకూర్చుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ డిస్కం ఏర్పాటు ద్వారా వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సేవల సామర్థ్యాన్ని పెంచడం, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.
1 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
2 ఎత్తిపోతల పథకాలు
3 మిషన్ భగీరథ/మల్టీ విలేజ్ స్కీమ్స్
4 హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్, సీవరేజ్ బోర్డు
5 మున్సిపల్ వాటర్ కనెక్షన్లు.
Also Read: Hansika Motwani: భర్తతో అధికారికంగా విడాకులు తీసుకున్న హన్సిక.. కారణమేమిటంటే..!