Rythu Garjana: ప్రజా సమస్యలను రాజకీయంగా ప్రధాన అస్త్రంగా మలుచుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. సాగునీరు, వ్యవసాయ విద్యుత్ సరఫరా రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావిస్తూ ‘రైతు గర్జన’ పేరుతో ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. రైతాంగానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను ప్రజల ముందుంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 11న నిర్మల్ జిల్లాలో, 19న కామారెడ్డి జిల్లాలో రైతు గర్జన సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు సభలతో కార్యక్రమాన్ని పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాజకీయ కార్యాచరణలో కీలక అంశంగా తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. సాగునీటి లభ్యత, ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరా, ఆయకట్టు పరిస్థితులు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ హామీలు, వాటి అమలు తీరును సభల్లో ప్రస్తావించేందుకు సిద్ధమవుతోంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రైతుల తరఫున పోరాటం చేయాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. యాసంగిలో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి పూర్తి హామీ రాకపోవడం, ప్రత్యామ్నాయపంటలపై క్లారిటీ ఇవ్వకపోవడం వంటి అంశాలపై గళం వినిపించాలని భావిస్తుంది.
రైతు గర్జన కార్యక్రమంలో భాగంగా రెండు జిల్లాలకు డేట్ ఫిక్స్ చేసింది. ఇప్పటికే ఆదిలాబాద్ లో నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో ఈ నెల 11న నిర్మల్ జిల్లాలో, 19న కామారెడ్డి జిల్లాలో భారీ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాంతాల్లో వ్యవసాయం, సాగునీటి వసతులు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను ప్రధానంగా చర్చకు తీసుకురావాలని భావిస్తోంది. స్థానిక రైతుల ఇబ్బందులను గుర్తించి, వాటిని ప్రభుత్వానికి నివేదించడంతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రస్తావించేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. సభల నిర్వహణ, జనసమీకరణ, స్థానిక నాయకుల భాగస్వామ్యంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నేతలకు జనసమీకరణలో నిమగ్నమయ్యారు.
Also read: హైదరాబాద్‌లోని కోఠి డిఎంఈ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. డాక్టర్లు అరెస్ట్!
రైతు గర్జనను ఈరెండు జిల్లాలకే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్త కార్యక్రమంగా మలచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రతి జిల్లాలోనూ అక్కడి రైతాంగం ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను గుర్తించి సభలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జిల్లాల వారీగా సాగునీటి పరిస్థితులు, విద్యుత్ సరఫరా, వ్యవసాయానికి సంబంధించిన ఇతర సమస్యలను అధ్యయనం చేసి వాటి ఆధారంగా కార్యక్రమాల రూపకల్పనకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల నుంచి సమాచారాన్ని సేకరించే అవకాశముంది. రైతు గర్జన సభల ద్వారా ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచడంతో పాటు పార్టీ శ్రేణులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
మరోవైపు ఈ నెల 29న కరీంనగర్లో దీక్షా దివస్ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కరీంనగర్‌కు ఉన్న ప్రత్యేకత నేపథ్యంలో ఈ సభకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీ శ్రేణులను పెద్దఎత్తున సమీకరించి దీక్షా దివస్‌ను నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించాలని భావిస్తోంది. రైతు గర్జన సభలతో పాటు దీక్షా దివస్ కార్యక్రమం ద్వారా పార్టీ తన రాజకీయ కార్యాచరణను మరింత విస్తృతం చేయాలని చూస్తోంది.
రైతాంగ సమస్యలతో పాటు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రధాన అజెండాగా తీసుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ హామీలు, పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రశ్నలు లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. జిల్లాల వారీగా ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని వాటిపై పోరాట కార్యక్రమాలు రూపొందించాలని భావిస్తోంది. ఒక వైపు రైతు గర్జనలు, మరోవైపు వరుస కార్యక్రమాల ద్వారా పార్టీ శ్రేణులను క్రియాశీలం చేయాలన్నది నాయకత్వం ఆలోచనగా ఉంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు యాక్టీవ్ గా ప్రజాసమస్యలపై గళం వినిపించాలని ఇప్పటికే పార్టీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
Also read: సిద్దిపేట వేదికగా రక్షణసేన బిగ్ ప్లాన్.. 13న భూమిపూజతో కేడర్‌లో కొత్త జోష్!