రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు మేడమ్ మీనాక్షి నటరాజన్‌కి అప్పగించిన్నపుడు చాలా స్ట్రిక్ట్‌గా, సింపుల్‌గా ఉన్నారు…ఇంచార్జి అంటే ఇలా ఉండాలి అనే చర్చ నడిచింది. కానీ సమయం గడిచే కొద్దీ ఇన్ఛార్జ్ పై నేతలో, కార్యకర్తలో నమ్మకం తగ్గుతూ వస్తోంది. మేడమ్ చెప్పేటప్పుడు చాలా సీరియస్ మరియు సిన్సియర్ గా చెప్తున్నారు.. కానీ ఆ అంశం అమల్లోకి వచ్చే సరికి ఇన్ఛార్జ్ చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంది. ఇంతకీ ఇన్ఛార్జ్ పై పార్టీ లో ఎలాంటి చర్చ నడుస్తోంది?… రాహుల్‌గాంధీ దూత పట్ల నమ్మకం తగ్గడానికి కారణాలేంటి?
అల్ ఇండియా కాంగ్రస్ పార్టీ ప్రతి రాష్ట్రానికి ఏఐసిసి నుండి ఒక ఇన్ఛార్జ్‌ని నియమిస్తుంటుంది. ఈ ఇన్చార్జి బాధ్యతలు ఏముంటాయి అంటే… రాష్ట్రం లో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం, పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి హై కమాండ్ కి చెప్పి పదవులు ఇప్పించడం, ఏఐసిసి ఆదేశాలను పాటిస్తూ ఇచ్చిన కార్యక్రమాలను ఆ రాష్ట్రంలో సక్సెస్ ఫుల్ గా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం, ఎప్పటికప్పుడు హై కమాండ్ కి రాష్ట్రం లో జరుగుతున్న పరిణామల పై రిపోర్ట్ ఇవ్వడం వంటివి ఎప్పటికప్పుడు చేస్తుండాలి. ఈ ఇన్ఛార్జ్ లు గా హై కమాండ్ తమ నమ్మకస్తులనే ఎక్కువగా నియమిస్తుంది. రాష్ట్ర ఇన్ఛార్జ్‌లకి పార్టీలో చాలా మంచి ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా?.. మన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఏఐసిసి ఇన్ ఛార్జ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి.
మీనాక్షి నటరాజన్ ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్… ఆమె రాహుల్ గాంధీ టీమ్ మెంబర్ అనే పేరు ఉంది.. ఇంతే కాదు హై కమాండ్ కి, పార్టీ కి చాలా లాయలిస్ట్ అని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారంటారు. మీనాక్షి నటరాజన్ ని ఇన్ ఛార్జ్ గా నియమించిన్నపుడు ఇదే టాక్ నడిచింది. ఫుల్ స్ట్రిక్ట్..ఎవరి మాట వినదు పార్టీ బలోపేతం, పార్టీ కోసం కష్టపడిన వారిని ఐడెంటిఫై చేయడం, ఏఐసిసి ఇచ్చిన లైన్ దాటకుండా పని చేయడం ఇది మాత్రమే చేస్తారని చర్చ నడిచింది. ఈ సమయంలో పార్టీ లోని క్యాడర్, సెకండ్ గ్రేడ్ నేతలు మా సమస్యలు చెప్పుకోవడానికి మంచి ఇన్ ఛార్జ్ వచ్చిందని ఆనందపడ్డారు. ఐతే ఇది ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిందని వాపోతున్నారందరూ.
ఇన్ ఛార్జ్ గా మీనాక్షి బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ అధికారిక భవన్లో సమావేశాలు పెడతామని అన్నారు కానీ, కంచె గచ్చిబౌలి భూముల విషయం లో సెక్రటేరియట్ లో సమావేశం నిర్వహించి విమర్శలు ఎదురుకున్నారు. అది ఒకే ..ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ మారి వచ్చిన వారికీ అప్పుడే కాంగ్రెస్ పరంగా ప్రభుత్వ, పార్టీ పదవులు ఉండవని… 5 ఏళ్లు కష్టపడాలని అప్పుడే పదవులు వరిస్తాయని స్పష్టం చేశారు. కానీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా విజయశాంతి కి పార్టీ అవకాశం ఇచ్చింది. 2018 ఎన్నికల తర్వాత విజయశాంతి బీజేపీ కి వెళ్ళి 2023 ఎన్నికల కంటే ముందు హస్తం పార్టీ లోకి వచ్చారు. ఇక్కడ మీనాక్షి చెప్పిన్నట్లు జరుగలేదు.
అలాగే పార్టీ నియామకంలో కూడా అదే జరిగింది. పార్టీ మారి వచ్చిన వారికీ, పదవి ఉన్న వారికీ ఇంకో పదవి ఉండదని అన్నారు కానీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పదవుల్లో అలాంటి వారికి అవకాశం కల్పించారు. ఇక రీసెంట్ గా జిల్లా అధ్యక్షుల విషయం లో ను ఇన్ ఛార్జ్ గా మీనాక్షి ఏం చెప్పారంటే డీసీసీ ల ఎంపిక విషయంలో ఏఐసిసి అబ్జర్వర్లు చూసుకుంటారు.. కంటిన్యూ గా 5 ఏళ్లు డీసీసీ లు గా ఉన్నవారికి, నామినేటెడ్ పదవులు అంటే రెండు పదవులు ఒక్కరికే రావని, బంధువులకి అవకాశం ఉండదని, పార్టీ లోకి ఎవరైనా వస్తే డీసీసీ ఆశిస్తే 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారికే డీసీసీ ప్రెసిడెంట్‌గా అవకాశం ఉంటుందని రూల్స్ ఫ్రేమ్ చేశారు.
కానీ తీరా లిస్ట్ వచ్చాక చూస్తే… వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న అత్రం సుగుణకి డీసీసీ ప్రెసిడెంట్‌గా, సిద్ధిపేట జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడిగా ఉన్న నర్సారెడ్డి బిడ్డ ఆంక్ష రెడ్డికి డీసీసీ పదవి కట్టబెట్టారు. పలువురు ఎమ్మెల్యే లకు డీసీసీ అధ్యక్షులుగా అవకాశం కల్పించడంతో పాటు జిల్లా పై పూర్తి అనుభవం, పట్టు లేని వారికి కొందరికి పదవులు ఇచ్చారానే విమర్శలు ఉన్నాయి. ఈ మాత్రం దానికి రూల్స్ ఎందుకు.. ఏఐసిసి అబ్జర్వర్ల పేరుతో కసరత్తు ఎందుకనే టాక్ పార్టీ వర్గాలో నడుస్తోంది.
మేడం ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా, ఎంత గట్టిగా చెప్పినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయని.. సామాన్య కార్యకర్తలకు సమయం ఇవ్వడం, వారి బాధలు వినడం లోను 100% టైం కేటాయించడం లేదనే గుసగుసలు పార్టీ వర్గాలో వినిపిస్తోంది. ఇలా నేతలో, కార్యకర్తలో, రోజు రోజుకి మేడం పై మేడం చెబుతున్న మాటల పై నమ్మకం తగ్గుతుందట …! మరి పార్టీ, ప్రభుత్వం ప్రెజర్ ఇన్ఛార్జ్ పై కూడా ఉందా..! లేదా పార్టీ అధికారం లో ఉంది కాబట్టి మేడమే ఏం జరిగిన లైట్ తీసుకుంటున్నారా? అన్నది అందుపట్టడం లేదని పార్టీ వర్గాలు సతమతమవుతున్నాయి.
Story By Ajay, Big Tv