Hyderabad Metro: హైదరాబాద్ ఎకానమీకి మెట్రో రైల్వే లైఫ్ లైన్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2కు డీపీఆర్ లు రెడీ చేసి విస్తరించాలన్న ఆలోచనతో ఉంది. కేంద్రం నుంచి ఎప్పుడు ఆమోదం వస్తుందా అని ఎదురుచూస్తున్న ఈ టైంలో L&T నుంచి పిడుగులాంటి వార్త. హైదరాబాద్ మెట్రోను నడపలేం.. మీరే చూసుకోండి అని కేంద్రానికి లెటర్ రాయడం సంచలనంగా మారింది. PPP మోడల్ లో నిర్మించిన తొలి మెట్రోగా దేశంలో ఖ్యాతి పొంది.. ఇప్పుడు ఫెయిల్యూర్ దిశగా ఎందుకు వెళ్లింది? బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది? ఎందుకు L&T తప్పుకోవాలన్న ఆలోచన చేస్తోంది?
HYD మెట్రో నుంచి తప్పుకుంటామంటున్న L&T
హైదరాబాద్ మెట్రో రైలుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన చేసింది. నష్టాలతో మెట్రో మెయింటెనెన్స్ తమ వల్ల కాదని తేల్చి చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా ఇవ్వడానికి రెడీ అన్నది. నష్టాలు భరించలేని స్థాయికి వెళ్లినపోయాయని కేంద్రానికి రాసిన లేఖలో క్లారిటీ ఇచ్చింది. దీంతో మెట్రో విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నట్లైంది. ఒకవైపు హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ గా సత్తా చాటుతున్న టైంలో సిటీలో మెట్రో విస్తరణ కోసం రేవంత్ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే డీపీఆర్ పంపించారు. కేంద్రం నుంచి ఎలాంటి రియాక్షన్ రావట్లేదు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎల్ అండ్ టీ భారీ ట్విస్ట్ ఇచ్చింది.
PPP పద్ధతిలో నిర్మించిన తొలి మెట్రో మనదే..
హైదరాబాద్ లోని 3 కారిడార్‌లలో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ PPP పద్ధతిలో దేశంలో నిర్మించిన తొలి మెట్రో మనదే. అయితే పక్కనున్న చెన్నై, బెంగళూరు, ఇప్పుడు వచ్చే కొత్త మెట్రోలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే స్పెషల్ పర్పస్ వెహికిల్స్ క్రియేట్ చేసి నడిపిస్తున్నారు. పీపీపీ లేదు. ఎక్కడా లేనిది హైదరాబాద్ లో మనకు ఎందుకు ఈ తలనొప్పి అని ఎల్ అండ్ టీ అనుకుంటోందా? అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఈ నిర్వహణ వద్దు.. ఈ నష్టాల భారం వద్దు.. తప్పుకుంటేనే బెటర్ అన్న ఆలోచనతో ఉందా అన్న చర్చ ఇప్పుడు కేంద్రానికి రాసిన లేఖతో పెరుగుతోంది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తాము రెడీగా ఉన్నామని ఎల్ అండ్ టీ అనడం వెనుక మతలబు ఏంటన్నదే ఇప్పుడు సంచలనంగా మారుతోంది. మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్‌ని ఏర్పాటు చేసి అప్పగించినా అందుకు తాము రెడీనే అంటోంది. గత కొన్నాళ్లుగా వరుసగా నష్టాలు వస్తున్నాయని, భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్ ఉండటం వల్ల.. మెట్రో రైళ్లను నడపడం కష్టంగా ఉందంటోంది.
69 కిలోమీటర్లకి రూ. 22 వేల కోట్ల ఖర్చు..
హైదరాబాద్ మెట్రో మొదటి దశ 2017లో ప్రారంభమైంది. 69 కిలోమీటర్ల పొడవైన ఈ మెట్రో మార్గాన్ని సుమారు 22 వేల కోట్ల రూపాయలతో నిర్మించారు. మొదటి కారిడార్ పూర్తయినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఎల్‌అండ్‌టీకి 3,756 కోట్ల రాయితీ బకాయిలను చెల్లించాల్సి ఉంది. అవి 2020 నాటికి కాస్తా 5 వేల కోట్లకు చేరింది. నిజానికి ఈ పెండింగ్ అమౌంట్ బీఆర్ఎస్ హయాంలో ఎల్ అండ్ టీకి ఇచ్చేసి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చి ఉండేదే కాదన్న వెర్షన్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎల్ అండ్ టీ చెబుతున్న మరో విషయం ఏంటంటే.. వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద రావాల్సిన 254 కోట్లను కేంద్రం ఇంకా ఇవ్వలేదన్నది. ఇది బీఆర్ఎస్ హయాంలో, అటు మోడీ ప్రభుత్వం సెకెండ్ టర్మ్ లో జరిగిన సమస్య. అప్పుడే L&Tకి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఉంటే ఇప్పుడు ఇలా లేఖలు రాయాల్సిన పరిస్థితి రాకుండా ఉండి ఉండేది.
గతంలోనే మెట్రో నష్టాలతో బయటికొచ్చే ప్లాన్స్
గతేడాది హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో L&T సీఎఫ్ఓ శంకర్ రామన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. హైదరాబాద్ మెట్రో నుంచి L&T వైదొలగాలనుకుంటోందన్నారు. L&T ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆయన ఒక అర్థం వచ్చేలా మాట్లాడితే.. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మెట్రోకు వస్తున్న నష్టాలతోనే బయటికొచ్చే ప్లాన్ తో ఉన్నట్లు ప్రచారం చేశారు. నాన్ కోర్ బిజినెస్ నుంచి క్రమంగా వైదొలిగి కోర్ బిజినెస్ పై మాత్రమే ఫోకస్ చేయాలన్న ఆలోచనలో L&T ఉంది. కోవిడ్ తర్వాత ఈ విషయంపై సంప్రదింపులు కూడా జరిపింది. 2021లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే.. అప్పటికప్పుడు అమ్మితే నష్టాలు వస్తాయి కాబట్టి, క్రమంగా అప్పులను తగ్గించుకుని లాభసాటిగా మార్చుకుని 2026-31 మధ్య అమ్మితే మేలన్నది L&T ఆలోచన. దానికి తగ్గట్లుగానే ప్రణాళికలను వేసుకుంది. ఇప్పుడు కేంద్రానికి రాసిన లేఖ సారాంశం కూడా అదే.
సుదీర్ఘ ప్రయాణంలో మధ్యలోనే జర్నీ బ్రేక్ చేసే ప్లాన్
నిజానికి పీపీపీ మోడల్ పెట్టినప్పుడు ఎల్అండ్ టీ ఆసక్తితో ముందుకు వచ్చింది. L&T-తో హైదరాబాద్ మెట్రో పీపీపీ ఒప్పందం మొత్తం 35 సంవత్సరాలు. మరో 25 ఏళ్లు పొడగించుకునే వెసులుబాటు ఉంది. అంటే ఇది సుదీర్ఘ ప్రయాణం. కానీ మెట్రో జర్నీని మధ్యలోనే బ్రేక్ చేసేందుకు L&T రెడీ అవుతోంది. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫేజ్ 2 కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న టైంలో ఈ సంస్థ కేంద్రానికి లేఖ రాయడం చాలా డౌట్లకు కేంద్రంగా మారుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పాత బాకీలను వసూల్ చేసుకునే ఉద్దేశంతోనే ఈ లెటర్ రాశారా.. తెరవెనుక మరేదైనా కారణం ఉందా అన్నది కీలకంగా మారుతోంది.
L&Tకి భారీగానే సమకూరుతున్న ఆదాయాలు
రాయదుర్గం టూ అమీర్ పేట్ రూట్లో పీక్ హవర్స్ లో మెట్రోలో చాలా రద్దీ.. కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు. యువతులకైతే చాలా ఇబ్బంది. అయినా సరే ఎలాగొలా జర్నీ చేస్తున్నారు. L&Tకి చేయాల్సింది చాలా చేశారు. టికెటింగ్, అడ్వర్టయిజింగ్, మాల్స్, పార్కింగ్ ఇలాంటి వాటితో ఆదాయాలు బాగానే సమకూరుతున్నా.. ఖజానా నింపుకుని, నష్టాలు తగ్గించుకుని బయటపడేందుకే L&T చూస్తోందన్న వాదన పెరుగుతోంది. ఎందుకంటే మన మెట్రోలో జనం విపరీతంగా పెరిగారు. అయితే నష్టాలను సాకుగా చూపుతూ జనాలకు మెట్రో సేవలను పరిమితంగా అందిస్తోందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. కనీసం పెరిగిన రద్దీకి తగ్గట్లు మౌలిక వసతులను కల్పించడంలో నిర్వహణ విఫలమైందని, అందుకే మెట్రో తరచూ టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయంటున్నారు.
ప్రయాణికులకు బోగీలు పెంచకుండా వ్యవహారం
నిజానికి పెరుగుతున్న రద్దీ ప్రకారం మెట్రోకు అదనపు బోగీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు వెయ్యి మంది ప్రయాణించేందుకు వీలుగా యావరేజ్ గా మూడు బోగీలు మాత్రమే ఉంటున్నాయి. వీటిలోనూ పరిమితికి మించి జనం జర్నీ చేస్తుండడంతో తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. గడిచిన ఏడాదిన్నర కాలంగా మెట్రోకు అదనంగా మూడు బోగీలు తీసుకురావాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ ఆర్థిక భారం పేరుతో ఉన్న బోగీలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో జనం కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. పాపం హైదరాబాదీలు టికెట్ డబ్బులు కడుతున్నా పెద్ద మనసుతో సర్దుకుపోతున్నారు. ఒకవైపు 2050 నాటికి 31 రూట్లు 662 కిలోమీటర్లు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేసుకుంటుంటే.. ఇంకోవైపు ఎల్ అండ్ టీ గేమ్ మార్చేస్తోంది. ఒక పవర్ ఫుల్ గ్రోత్ ఇంజిన్ గా ఉన్న హైదరాబాద్ కు ఇది నిజంగా పెద్ద షాకే.
ఒకసారి హైదరాబాద్ మెట్రోను మెయింటేన్ చేస్తున్న L&Tకి మన మెట్రోతో వస్తున్న లాభాలెంత.. నష్టాలెంత..? వారి ఆడిట్ రిపోర్ట్ ప్రకారమే లెక్కలు వేద్దాం.. ఎక్కడ లాస్ అవుతోంది.. దాన్ని ఎలా పరిష్కరించాలి.. ఏం చేస్తే మెరుగవుతుందో చూద్దాం. ఈ మొత్తం వ్యవహారంపై అంతిమ నిర్ణేతలు ప్రజలే. 55 ఏళ్ల సుదీర్ఘ బంధంతో పీపీపీ మోడల్ లో అడుగు పెట్టిన L&T.., హైదరాబాద్ మెట్రోను పట్టాలెక్కించి ఇప్పుడు తప్పుకుంటాం.. నడవట్లేదు, కుదరట్లేదు అనడం కరెక్టా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
పీక్ డేస్‌లో 5 లక్షలకు మించి ప్రయాణాలు
హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజూ నాలుగున్నర లక్షల నుంచి 5 లక్షల దాకా జర్నీ చేస్తున్నారు. పీక్ డేస్ లో అయితే 5 లక్షలు మించి వెళ్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైడర్‌షిప్ 25% పెరిగింది కూడా. ఈ ఏడాది మే లో మెట్రో టిక్కెట్ రేట్లు కూడా పెంచారు. ఆ మధ్య మహాలక్ష్మి స్కీం కొత్తగా వచ్చినప్పుడు కొంత మహిళల సంఖ్య తగ్గింది. కానీ ఆ తర్వాత ఆ బస్సుల్లో రద్దీ, ట్రాఫిక్ డిలేస్ ను తప్పించుకునేందుకు మళ్లీ అందరూ మెట్రో వైపే వచ్చారు. సో రైడర్ షిప్ పెరిగింది. ఒక్క టిక్కెట్ల అమ్మకాలతోనే L&Tకి ఏటా యావరేజ్ గా 622.99 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇది ఏటికేడు పెరుగుతోంది కూడా. 2024-25లో L&T మొత్తం ఖర్చులు 1,738.95 కోట్లకు చేరాయి. ఇందులో రెవెన్యూ 1,108.54 కోట్లుగా ఉంది. అంటే నష్టం 625.88 కోట్లుగా లెక్క తేల్చింది L&T. వీటికి తోడు 940 కోట్లు ఇంటరెస్ట్ కట్టాల్సి వస్తోందంటోంది. పైగా తెలంగాణ ప్రభుత్వం 5 వేల కోట్లు బాకీ, కేంద్రం 254 కోట్ల బకాయిలు ఉన్నాయని, క్యాష్ లాసెస్ 269.94 కోట్లు, డెప్రిసియేషన్ 302 కోట్లు ఇలా లెక్కలు వేస్తూ పోతోంది L&T.
2024-25లో హైదరాబాద్ మెట్రోతో వచ్చిన ఆదాయం..
టిక్కెట్ల అమ్మకాలతో 622.99 కోట్ల రూపాయలు ఆర్జించింది. అలాగే రెంటల్ ఇన్‌కమ్‌తో 114.89 కోట్లు వస్తున్నాయి. అడ్వర్టైజింగ్ తో అంటే స్టేషన్ల దగ్గర, ట్రైన్లపై, డిజిటల్ బోర్డులు ఇలాంటి వాటితో 105.39 కోట్లు సంపాదిస్తోంది. కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్ ట్రాన్స్‌ఫర్, కన్‌స్ట్రక్షన్ వంటి వాటితో 353.73 కోట్లు ఆర్జిస్తోంది L&T. అన్ని రకాలుగా కలిపి మొత్తం ఆదాయం 1,108.54 కోట్లుగా ఉంది.
L&T చేస్తున్న మొత్తం ఖర్చులు..
ఆపరేషనల్ ఖర్చులు అంటే ట్రైన్లు నడిచేందుకు వాడే కరెంట్, మెయింటెనెన్స్, ట్రైన్ రిపేర్లు సర్వీసింగ్ కు ఏటా యావరేజ్ గా 421.74 కోట్లు ఖర్చవుతోంది.
ఎంప్లాయీస్ జీతాలు, పీఎఫ్ లు, స్టాఫ్ వెల్ఫేర్, గ్రాట్యూటీలకు 38.35 కోట్లు ఖర్చు చేస్తోంది. అడ్మినిస్ట్రేషన్, ఆఫీస్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, ఆడిట్ ఫీజు, అడ్వర్టైజింగ్, ఎక్స్చేంజ్ గెయిన్/లాస్ కు 31.49 కోట్లుగా ఉంది.
PPP ప్రాజెక్ట్‌లో మిగిలిన నిర్మాణ పనులకు 4.12 కోట్లు ఖర్చు అలాగే, ఫైనాన్షియల్ ఖర్చులు అంటే వడ్డీ చెల్లింపు 940.03 కోట్లు అవుతోంది. డెప్రిసియేషన్ &అమార్టైజేషన్ కు 302.84 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏటా మొత్తం ఖర్చులు 1,738.57 కోట్లుగా లెక్క చూపుతోంది L&T.
పేరుకుపోయిన నష్టాలు రూ.6,600 కోట్లు-L&T
2024-25 ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం 625.88 కోట్లు, అక్యుములేటెడ్ లాసెస్ 6,600 కోట్లుగా చెబుతోంది. ఫైనాన్షియల్ ఖర్చులు మొత్తం ఖర్చుల్లో 54% షేర్ కలిగి ఉన్నాయంటోంది. సో L&T చెబుతున్న లెక్కలు బాగానే ఉన్నాయి. ఇంత పెద్ద హైదరాబాద్. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కల్పతరువుగా ఉన్నది ఈ సిటీ. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఎంత ట్రాన్స్ పోర్ట్ పెట్టినా నష్టం లేకుండా నడిచే పరిస్థితులు ఉన్నాయ్. చెప్పాలంటే ఇదో బంగారు బాతు మాదిరి. అలాంటిది L&T నష్టాల పేరు చెప్పడం ఏంటన్న డౌట్లు వస్తున్నాయి. 55 ఏళ్లు కలిసి సాగాల్సిన సంస్థ మధ్యలోనే ఎందుకు చేతులు ఎత్తేస్తోందన్న డౌట్లు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్న 5 వేల కోట్లు, కేంద్రం ఇవ్వాల్సిన 254 కోట్లు రాకపోవడంతో మొత్తం ప్రాజెక్టే వేస్ట్ అన్న భావన క్రియేట్ చేయడం కరెక్టేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఆక్యుపెన్సీ పెంచడంపై L&T ఫోకస్ పెట్టట్లేదా?
నిజానికి L&T రెవెన్యూ పెంచుకునేలా 17వేల కోట్ల ఇన్వెంటరీ అందుబాటులోకి వచ్చింది. కానీ ఇందులో ఆక్యుపెన్సీ పెంచడంపై ఆ సంస్థ దృష్టి సారించకపోవడంతో కేవలం టికెట్ల రూపంలో వచ్చే రెవెన్యూ ప్రధాన ఆదాయంగా ఉంది. కానీ L&T సంస్థ మాత్రం ఉన్న ఇన్వెంటరీని తగ్గించుకుంటూ, రెవెన్యూ అవకాశాలపై దృష్టి పెట్టకపోవడం వ్యూహాత్మకమేనా అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మెయింటెనెన్స్ అంతా ఎందుకు? ఈ తలనొప్పులు ఎందుకు అనుకుంటున్నారా? TOD ట్రాన్స్‌ఫర్‌లతో లాభాలు వచ్చాయి. ఇక మే నుంచి ఫేర్ హైక్ చేశారు. దీంతో 2025-26లో 10 శాతం రెవెన్యూ పెరుగుదలకు ఆస్కారం ఉంది. ఇలాంటి సందర్భంలో తప్పుకుంటామని లేఖలు రాయడం స్ట్రాటజిక్ అన్న చర్చ జరుగుతోంది. నిజానికి L&Tకి బకాయిలు క్లియర్ చేసి, జైకా లేదంటే ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకురావడం, ట్రాన్స్ ఫర్ ఆన్ డెవలప్ మెంట్ మానిటైజేషన్ చేయడం వంటివి చేస్తే కొనసాగుతారా అన్న ప్రశ్నలకు L&T జవాబులు చెప్పాల్సి ఉంటుంది. లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలి.. SPV క్రియేట్ చేసుకోవాలి.. ఇక గుడ్ బై అంటే… మెట్రో ఫేజ్ 2 సంగతి ఏంటన్నది క్వశ్చన్ మార్క్ అవుతుంది.
Also Read: రేవంత్ మార్క్.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు ఇవే..!
లక్నోలో రోజూ లక్షన్నర మాత్రమే మెట్రో ప్రయాణికులు ఉంటున్నారు. అలాంటి చోట కేంద్రం ఓకే చెబుతోంది. అదే మన దగ్గర రోజూ 5 లక్షల దాకా ప్రయాణికులు ఉంటున్నా కొత్త లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 కూడా కేంద్ర రాష్ట్రాలు తలా కొంత ఖర్చు భరించడం, ఇతర మార్గాల ద్వారా రుణాలు తీసుకుని చేపట్టాల్సి ఉంటుంది. ఫీజబులిటీ లేదన్న కారణాన్ని కేంద్రం చూపుతూ వస్తోంది. నిజానికి మెట్రో ఫేజ్ 2 నిర్మాణం హైదరాబాద్ కు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా ఫేజ్-2Aలో 76.4 కిలోమీటర్ల పొడవున్న ఐదు కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌లు గతేడాది నవంబర్ 4న కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. అలాగే ఫేజ్-2B కింద 86.1 కిలోమీటర్ల పొడవున్న మూడు కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌లు ఈ ఏడాది జూన్ 22న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. బెంగళూరులో కిలోమీటర్ కు 373 నుంచి 569 కోట్లు కోట్ చేస్తే, చెన్నైలో కిలోమీటర్ మెట్రో నిర్మాణానికి ఏకంగా 619 నుంచి 756 కోట్ల రూపాయలు, ముంబైలో 543 నుంచి 1,492 కోట్ల రూపాయలు కోట్ చేశారు. మన దగ్గర మాత్రం ఫేజ్-2Aలో కిలోమీటరుకు 318 కోట్ల రూపాయలు, ఫేజ్-2Bలో 227.39 కోట్ల అంచనా వేశారు. మిగితా నగరాలతో పోలిస్తే కిలోమీటర్ కు చాలా తక్కువ ఖర్చుతోనే మెట్రో లైన్ నిర్మాణానికి కోట్ చేశారు. అయినా సరే అడుగు ముందుకు పడట్లేదు. ఇంతలోనే L&T ఇలా షాక్ ఇచ్చింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.
Story By Vidya Sagar, Bigtv