కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం.. మొత్తం దేశాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చింది. గాంధీ పేరుని తొలగించడంపై.. ఇప్పుడు రాజకీయ దుమారం రేగింది. గాంధీ పేరుని తీసేయడంపై.. విపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు.. జాతిపిత పేరుని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఉన్నఫలంగా.. ఉపాధి హామీ పథకం పేరు మార్చడానికి కారణాలేంటి?
ఎన్డీయే సర్కార్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో.. దేశం మొత్తం నివ్వెరపోయింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఈ స్కీమ్‌కు.. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్-గ్రామీణ్ అని పెట్టారు. సింపుల్‌గా.. వీబీ జీ రామ్ జీ అని పిలుస్తారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరుని తీసేశారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ.. వీబీ-జీ రామ్ జీ-2025 బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన పాత చట్టం స్థానంలో తీసుకొస్తున్న ఈ కొత్త బిల్లుని.. వికసిత్ భారత్-2047 విజన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. పాత చట్టంలో వంద రోజులు తప్పనిసరిగా ఉపాధి కల్పించడం ప్రధాన అంశం. కొత్త బిల్లులో ఆ గ్యారెంటీని 125 రోజులకు పెంచారు. ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని, మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ.. కొత్త ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోగా.. దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీ చట్టం చేయాలని, నిబంధనలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేయాలని తెలిపింది కేంద్రం.
2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినపుడు కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మాత్రమే ఉండేది. 2009లో కాంగ్రెస్ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత.. పథకంలో కొన్ని మార్పులు చేశారు. అప్పుడే.. ఈ పథకానికి మహాత్మాగాంధీ పేరును చేర్చారు. ఇప్పుడు.. మహాత్మాగాంధీ పేరును తీసేయడంపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. గాంధీ పేరుని తొలగించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. బాపూ పేరుతో బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. మహాత్మాగాంధీ పేరు ఎత్తేయడం వల్ల ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనేకచోట్ల గాంధీ పేరును తొలగించాల్సి ఉంటుందని, స్టేషనరీ ఖర్చు దండగని ప్రియాంకగాంధీ అన్నారు. దేశ చరిత్రలోనే అతి గొప్ప నాయకుడి పేరును తొలగించినప్పుడు.. ప్రభుత్వం దానిపై వివరణ ఇస్తే బాగుంటుందన్నారు. పథకం ప్రధాన ఉద్దేశాన్ని సర్వనాశనం చేశారని.. దానిపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే గాంధీ పేరును తొలగించారని విపక్షాలు అంటున్నాయ్. ఎంజీ నరేగా పేరు నుంచి గాంధీ పేరు తొలగించడం అనైతికమని విమర్శిస్తున్నారు. అంతేకాదు.. కొత్త పేరులో రామ్ అనే పదాన్ని వాడటంపైనా అభ్యంతరాలు వస్తున్నాయ్. రాముడి పేరుని అపవిత్రం చేయొద్దంటున్నారు. మహాత్మాగాంధీ బోధించిన గ్రామ స్వరాజ్ సిద్ధాంతాలు, రామరాజ్య ఆదర్శాలు ఎన్నటికీ ఒకదానితో ఒకటి పోటీపడేవి కావంటున్నారు. స్కీమ్‌కు పేరు మార్చడం అంటే.. గాంధీజీ ఆదర్శాలను విస్మరించినట్లేనని చెబుతున్నారు. గాంధీ వారసత్వాన్ని అగౌరవపరిచే ప్రయత్నం చేయొద్దని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు.
ప్రధాని మోడీకి మహాత్మా గాంధీ ఆలోచనలు, పేదల హక్కులు రెండూ నచ్చవని, అందుకే ఈ పేరు మార్పు అని రాహుల్ గాంధీ కూడా విమర్శించారు. ఎంజీ నరేగా పథకం.. గ్రామ స్వరాజ్యం భావనల ప్రతిరూపమని, గ్రామీణ పేదలకు ఆర్థిక భద్రత కల్పిస్తోందని చెప్పారు. మోడీ ప్రభుత్వం పదేళ్లుగా ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని.. ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టే దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. గాంధీ పేరు తొలగించడం ఆయన ఆదర్శాలకు అవమానమని విపక్ష ఎంపీలంతా అంటున్నారు. ఇది.. గాంధీ ముద్రని చెరిపేందుకు చేసిన పక్కా పొలిటికల్ మూవ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉపాధి హామీ పథకం సామాజిక పోరాటం నుంచి పుట్టిందని.. గ్రామీణ ప్రజలకు పనిని డిమాండ్ చేసే చట్టపరమైన హక్కును ఇచ్చిందని చెబుతున్నారు. మహిళలు, భూమిలేని వారికి సాధికారత కల్పించి.. శ్రమ గౌరవాన్ని నిలబెట్టిందని కాంగ్రెస్ అంటోంది. గాంధీ ప్రతి పనిని గౌరవించడానికి, సామాజిక న్యాయానికి, పేదల పట్ల నైతిక బాధ్యతకు ప్రతిరూపంగా ఉన్నారు. ఇప్పుడు పేరు మార్చడం అంటే.. గాంధీ పట్ల బీజేపీ, ఆర్ఎస్ఎస్ అపనమ్మకానికి ఇది నిదర్శనం అంటున్నారు. ప్రజా సంక్షేమ చట్టంతో గాంధీకి ఉన్న అనుబంధాన్ని తుడిచిపెట్టే ప్రయత్నంలో భాగంగానే.. పేరు మార్చారంటోంది కాంగ్రెస్. కొత్త బిల్లుతో.. ఎంజీ నరేగా అందించిన చట్టబద్ధమైన పని హక్కుని రద్దు చేస్తుందంటున్నారు. మహాత్ముని పేరుని తొలగించడమనేది.. గాంధీ వారసత్వం, కార్మికుల హక్కులు, సామాజిక బాధ్యతపై జరిగిన ఉమ్మడి దాడిగా అభివర్ణిస్తోంది కాంగ్రెస్.
మరోవైపు.. విపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తిప్పికొట్టారు. మహాత్మాగాంధీ అంటే తమకెంతో గౌరవమని, ఆయన సిద్ధాంతాలను తమ ప్రభుత్వం పాటిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. గత ప్రభుత్వాల కంటే మోడీ సర్కారు ఎంతో కృషి చేసిందని తెలిపారు. పేదల సంక్షేమం, ఉపాధి పెంపు కోసమే ఈ బిల్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ.. విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయ్.