BigTV English

Quantum Computer: మైక్రోసాఫ్ట్ మహాసృష్టి.. ఏఐని మించిన క్యాంటమ్ కంప్యూటర్

Quantum Computer: మైక్రోసాఫ్ట్ మహాసృష్టి.. ఏఐని మించిన క్యాంటమ్ కంప్యూటర్

Quantum Computing Chip: ఊహించిందే కానీ… ఇప్పుడప్పుడే జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు! టెక్నాలజీ రంగంలో ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న పరిశోధనలో చివరికి ఫలితం దక్కింది. దశాబ్ధాలు పడుతుందని అనుకున్నలక్ష్యం ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లోనే పూర్తి కానుంది. దీనితో క్వాంటమ్ యుగం మొదలయ్యింది. అవును, క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ఎప్పటి నుండో పరిశోధనలు జరుగుతున్న తరుణంలో… మైక్రోసాఫ్ట్ ఒక మహాసృష్టి చేసింది. ఘన, ద్రవ, వాయువులకు సంబంధంలేని ఒక కొత్త పదార్థాన్ని తయారుచేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటమ్ చిప్‌ను రూపొందించింది. దీనితో మునుపెన్నడూ లేని కంప్యూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ రానుంది. ఈ టెక్నాలజీతో పర్యావరణం నుండీ వ్యవసాయం వరకూ పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఇంతకీ, ఏంటీ టెక్నాలజీ..? ఇది ఎందుకంత స్పెషల్…?


బ్యాటరీలు, ఔషధాల నుండి కృత్రిమ మేధస్సు వరకూ..

ప్రైమరీ స్కూల్లో సైన్స్ చదివిన ఎవరికైనా పదార్థం అంటే ఏంటీ.. దానికి మూడు బేసిక్ రూపాలు ఉంటాయని తెలుస్తుంది. అస్సలు, అక్షరం ముక్క రాని వాళ్లకు కూడా పదార్థంలో రూపాలు అర్థమవుతాయి. అవే ఘన, ద్రవ, వాయువులు. వీటికి మించిన ఏదైనా పదార్థం ప్రపంచంలో ఉంటుందా..? ఇకపై ఉంటుంది..! అవును, మైక్రోసాఫ్ట్ ఈ మహాసృష్టి చేసింది. బ్యాటరీల నుండి.. ఔషధాల నుండి.. కృత్రిమ మేధస్సు వరకూ.. ప్రతి రంగంలో అభివృద్ధిని వేగవంతం చేయగల క్వాంటం కంప్యూటర్‌ను మైక్రోసాఫ్ట్ సాకారం చేయనుంది. ఇలాంటి శక్తివంతమైన యంత్రాన్ని తయారు చేయాలనే తపనతో మైక్రోసాఫ్ట్.. పదార్థానికి కొత్త రూపాన్ని సృష్టించింది. ఫిబ్రవరి 19న, మైక్రోసాఫ్ట్ శాస్త్రవేత్తలు.. భౌతికంగా కనిపించే పదార్థానికి కొత్త దశను రూపొందించారు.


మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ చిప్‌ ‘మజోరానా-1’

మనకు తెలిసిన అల్యూమినియం ఆధారంగా “టోపోలాజికల్ క్విట్” అని పిలిచే నయా పదార్థాన్ని నిర్మించారు. దీనితో, క్వాంటం కంప్యూటింగ్‌ రేసులో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ చరిత్ర సృష్టించింది. అరచేతిలో ఇమిడిపోయే క్వాంటం కంప్యూటర్‌ను రూపొందించే లక్ష్యానికి మరింత చేరువైంది. ప్రస్తుత కంప్యూటర్లకు సాధ్యం కాని కాంప్లెక్స్‌ ప్రాబ్లమ్స్‌ను ఊహించని వేగంతో సాల్వ్‌ చేయగల ప్రాసెసర్‌ను తయారుచేసింది. టెక్నాలజీ రంగంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ చిప్‌, మజోరానా-1 అనే సూపర్ పదర్థాన్ని తయారుచేసింది. ఇకపై దీనితో గణిత, శాస్త్రీయ, సాంకేతిక సమస్యలను అత్యంత స్పీడ్‌గా పరిష్కరించొచ్చు. ఈ కొత్త డెవలప్‌మెంట్‌తో… ప్రస్తుతం నడుస్తున్న ఆర్టిఫిషియల్ టెక్నాలజీ రేసుకు మించిన అతిపెద్ద టెక్నలాజికల్ పోటీని పెంచబోతోంది మైక్రోసాఫ్ట్.

17 ఏళ్లుగా సుదీర్ఘ పరిశోధన తర్వాత పాత్ బ్రేకింగ్ ఫలితం

నిజానికి, ఈ టెక్నాలజీ ఇప్పుడప్పుడే రూపొందించగలరని ఎవ్వరూ ఊహించలేదు. అందుకే, ఇంత గొప్ప సృష్టిని మైక్రోసాఫ్ట్ సాధించిందా అనేది ఇంకా చాలా మంది నమ్మలేకపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా చాలా మంది ప్రముఖ విద్యావేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. క్వాంటం కంప్యూటర్లు తయారుచేయాడానికి ఇంకా దశాబ్దాల కాలం పడుతుందని అనుకున్నారు. కానీ, మైక్రోసాఫ్ట్ శాస్త్రవేత్తలు 17 ఏళ్లుగా సుదీర్ఘ పరిశోధన చేసిన తర్వాత ఒక పాత్ బ్రేకింగ్ మార్గాన్ని సృష్టించారు. ఇప్పుడు సాధించిన విజయంతో క్వాంటం కంప్యూటర్ అభివృద్ధిలో త్వరగా ముగింపును చేరుకోవచ్చని అంటున్నారు.

ఫిబ్రవరి 19న ‘నేచర్’ సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన రీసెర్చ్ పేపర్‌

అందుకే, “దీనిని చేరుకోడానికి దశాబ్దాల దూరంలో కాదు.. సంవత్సరాల దూరంలోనే ఉన్నట్లు భావిస్తున్నాము” అని ఈ టెక్నాలజీని సృష్టించిన టీమ్ లీడర్, మైక్రోసాఫ్ట్ టెక్నికల్ ఫెలో చేతన్ నాయక్ గర్వంగా చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ సాధించిన ఈ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి వివరాలను… ఫిబ్రవరి 19న నేచర్ అనే సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన రీసెర్చ్ పేపర్‌లో వెల్లడించారు.

టోపోకండక్టర్స్ అనే కొత్త మెటీరియల్స్‌ ఉపయోగించి..

ఈ అద్భుత ఆవిష్కరణపై మైక్రోసాఫ్ట్ సీఈఓ, సత్య నాదెళ్ల సోషల్ మీడియా ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. మైక్రోసాఫ్ట్ టోపోకండక్టర్స్ అనే కొత్త మెటీరియల్స్‌ ఉపయోగించి.. క్యూబిట్‌ అనే.. పూర్తిగా న్యూ స్టేట్‌ ఆఫ్‌ మ్యాటర్‌ని సృష్టించినట్లు తెలిపారు. ఈ ఆవిష్కరణ కంప్యూటింగ్ పవర్‌లో అతిపెద్ద డెవలప్‌మెంట్‌కు కారణం అవుతుందని చెప్పారు. చాలా మంది ఊహించినట్లు కొన్ని దశాబ్దాల్లో కాకుండా, కొన్ని సంవత్సరాల్లోనే.. నిజమైన, అర్ధవంతమైన క్వాంటం కంప్యూటర్‌ను రూపొందించడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. కొత్త క్యూబిట్స్ మునుపటి కంటే వేగవంతమైనవనీ.. నమ్మదగినవనీ.. చాలా చిన్నవిగా ఉన్నాయని తెలిపారు.

సూపర్ కంప్యూటర్లు నిర్వహించలేని సంక్లిష్ట సమస్యల పరిష్కారం

అవి ఒక మిల్లీమీటర్‌లో కేవలం 100లో ఒకటో వంతు మాత్రమే ఉంటాయనీ.. వీటితో మిలియన్-క్యూబిట్‌ ప్రాసెసర్‌ క్రియేట్‌ అవుతుందని వివరించారు. ఈ కొత్త టెక్నాలజీ నేడు అత్యంత పవర్‌ఫుల్‌ కంప్యూటర్లు కూడా నిర్వహించలేని సంక్లిష్ట సమస్యలను సాల్వ్‌ చేస్తుందని అన్నారు. అయితే, దీని ద్వారా కంప్యూటింగ్‌లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఇది ప్రతి రంగంపై ప్రభావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన ప్రొడక్టివిటీ, ఎనామిక్‌ గ్రోత్‌కి దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లు…

అయితే, క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా పనిచేస్తుంది? క్వాంటం మెకానిక్స్ అనేది భౌతిక శాస్త్రంలో.. అంటే, ఫిజిక్స్‌లో ఒక సబ్జెక్ట్. దశాబ్దాల పరిశోధన చేసి, నిర్మించే ఈ క్వాంటం కంప్యూటింగ్ ఇప్పటికీ ఒక ప్రయోగాత్మక టెక్నాలజీ. కానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇతర కంపెనీలు కలిసి ఇటీవల కాలంలో చేపట్టిన పురోగతుల తర్వాత, శాస్త్రవేత్తలు తమ లక్ష్యాన్ని చాలా వేగంగా చేరుకోబోతున్నారని నమ్మకంతో ఉన్నారు. ఎలాగంటే..? సాధారణంగా.. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లు.. పిసి సెమీకండక్టర్లతో తయారు చేసిన చిన్న చిప్‌లపై ఆధారపడతాయి. అన్ని సందర్భాల్లో కాకపోయినప్పటికీ… ఇవి కొన్ని సందర్భాల్లో విద్యుత్తును మేనేజ్ చేసే పదార్థాలుగా కూడా పనిచేస్తాయి.

ఒకేసారి నాలుగు విలువలను కలిగి ఉండే రెండు క్విట్‌లు

నిజానికి, ఈ చిప్‌లు నెంబర్లను నిల్వ చేసి, ప్రాసెస్ చేస్తాయి. వాటిని యాడ్ చేస్తాయి, గుణిస్తాయి. ఇలా చాలా పనులు చేస్తాయి. సాధారణంగా, ఇవి “బిట్స్” సమాచారాన్ని మార్చడం ద్వారా ఈ లెక్కింపులను పూర్తిచేస్తాయి. ఇక్కడ, ప్రతి బిట్.. ఒకటి లేదా సున్నాని కలిగి ఉంటుంది. అయితే, క్వాంటం కంప్యూటర్ దీనికి భిన్నంగా పనిచేస్తుంది. ఇక్కడ క్వాంటం బిట్, లేదా క్విట్ అనే పదార్థం.. సబ్‌-అటామిక్ కణాలు లేదా చాలా తక్కువ ఉష్ణోగ్రతలకు చల్లబడిన ఎగ్జాటిక్ పదార్థాల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇది చాలా చిన్నగా, చాలా చల్లగా ఉన్నప్పుడు.. ఒకే వస్తువు ఒకే సమయంలో రెండు వేర్వేరు వస్తువుల్లా ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తన వల్ల.. శాస్త్రవేత్తలు ఒకటి, సున్నా కలయికతో క్విట్‌ను నిర్మించవచ్చు. అంటే రెండు క్విట్‌లు ఒకేసారి నాలుగు విలువలను కలిగి ఉంటాయి. అలాగే, ఈ క్విట్‌ల సంఖ్య పెరిగేకొద్దీ.. ఇది మరింత శక్తివంతంగా మారుతుంది.

మైక్రోసాఫ్ట్ తయారుచేసిన ఈ పదార్థం సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్

ఇంతకీ, ఇది మన జీవితాన్ని ఇది ఎలా మార్చగలదు అనేగా సందేహం.. అక్కడికే వస్తున్నాం. మైక్రోసాఫ్ట్ తయారుచేసిన ఈ పదార్థం.. ఒక సెల్ఫ్ హీలింగ్ పదార్థం. క్వాంటం కంప్యూటింగ్ అనేది ఇంత వరకూ పరిష్కరించని తప్పు పట్టిన రహస్యాలను కూడా పరిష్కరించగలదు. వంతెనలు, విమాన భాగాలు, ఫోన్ స్క్రీన్‌లు వాటిని అవే రిపేర్ చేసుకోవడానికి ఈ సరికొత్త పదార్థం వీలు కల్పిస్తుంది. అంతేకాదు, ప్లాస్టిక్ కాలుష్యానికి ఇది పరిష్కారం చూపిస్తుంది.

వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణలో కొత్త విప్లవం

ప్లాస్టిక్‌లు, కాలుష్య కారకాలను ఉపయోగకరమైన బైప్రొడక్ట్‌లుగా మార్చడానికి ఈ పదార్థం పనిచేస్తుంది. అలాగే, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణలో కొత్త విప్లవం తీసుకొస్తుంది. క్వాంటం ఎనర్జీతో పనిచేసే ఎంజైమ్ పరిశోధన.. నేలలో సారాన్ని పెంచుతుంది. అలాగే, ఆహార దిగుబడిని కూడా పెంచుతుంది. ఇక, తీవ్రమైన వాతావరణ పరిస్థితు్లో కూడా ఇది స్థిరమైన వ్యవసాయానికి సహకారం అందిస్తుంది.

10 సెప్టిలియన్ సంవత్సరాలలో పూర్తి చేయలేని లెక్కింపును..

ఇటీవల, గూగుల్ ఒక ప్రయోగాత్మక క్వాంటం కంప్యూటర్‌ను ఆవిష్కరించినప్పుడు టెక్నాలజీ రంగంలో ఉత్సాహం మరింత పెరిగింది. ఆ తర్వాత ఈ నూతన సృష్టి జరిగింది. ఈ క్వాంటం కంప్యూటర్… ఇప్పటి వరకూ ప్రపంచానికి తెలిసిన సూపర్ కంప్యూటర్లు కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. ఎంత వేగంగా అంటే.. 10 సెప్టిలియన్ సంవత్సరాలలో పూర్తి చేయలేని లెక్కింపును కేవలం ఐదు నిమిషాల్లో ఇది పూర్తి చేస్తుంది. ఒకటి పక్కన 24 సున్నాలు పెడితే ఎంతో.. దాన్ని ఒక సెప్టీలియన్ సంవత్సరం అనొచ్చు. దాన్ని బట్టి 10 సెప్టీలియన్ సంవత్సారాలు అంటే ఎంతో ఊహిచుకోండి. మైక్రోసాఫ్ట్ తయారుచేసిన ఈ కొత్త టెక్నాలజీతో అత్యంత వేగంతో లెక్కను పక్కగా పరిష్కారించొచ్చు.

చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద చల్లబరిస్తే మరింత వేగంగా పని

నిజానికి, మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఈ క్వాంటం టెక్నాలజీ.. ప్రస్తుతం గూగుల్‌లో అభివృద్ధి చెందుతున్న పద్ధతులను కూడా అధిగమిస్తుందనే అభిప్రాయం ఉంది. ఈ కొత్త రకమైన కంప్యూటర్ చిప్ లోపల మల్టీ-టోపోలాజికల్ క్విట్‌లను నిర్మించి, మజోరానా-1ను రూపొందించింది మైక్రోసాఫ్ట్. ఇది సాంప్రదాయ కంప్యూటర్‌లకు శక్తినిచ్చే సెమీకండక్టర్ల బలాలను మిక్స్ చేసి, మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ… క్వాంటం కంప్యూటర్‌ను నిర్మించడానికి ఉపయోగించే సూపర్ కండక్టర్‌లతో కలిపి రూపొందించింది. అయితే, ఇటువంటి చిప్‌ను చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద చల్లబరిచినప్పుడు.. అది అత్యంత శక్తివంతంగా ప్రవర్తిస్తుంది. ఇప్పటి వరకూ సాంప్రదాయ యంత్రాలు చేయలేని సాంకేతిక, గణిత, శాస్త్రీయ సమస్యలను పరిష్కరించడంలో వేగంగా పనిచేస్తుంది.

2004లో ఈ టెక్నాలజీపై పని ప్రారంభించిన మైక్రోసాఫ్ట్

నిజానికి, మైక్రోసాఫ్ట్ 2004లో ఈ టెక్నాలజీపై పని చేయడం ప్రారంభించింది. క్వాంటం కంప్యూటింగ్‌లో ఎర్రర్‌ రేట్స్‌ను పరిష్కరించడంపై దృష్టి సారించిన గూగుల్ వంటి పోటీదారుల్లా కాకుండా.. మైక్రోసాఫ్ట్, భిన్నమైన విధానాన్ని తీసుకుంది. H ఆకారంలో అల్యూమినియం నానోవైర్‌లను కనెక్ట్ చేయడం ద్వారా, ఇండియమ్ ఆర్సెనైడ్ స్ట్రిప్స్‌ను… ఆటమ్‌-బై-ఆటమ్‌ కలపడం ద్వారా ప్రత్యేకమైన డిజైన్‌ను తయారు చేశారు. ఈ సిస్టమ్‌ను మ్యాగ్నెటిక్‌ ఫీల్డ్‌తో జాగ్రత్తగా అడ్జస్ట్‌ చేసి, దాన్ని దాదాపు అబ్‌సల్యూట్ జీరో‌‌కి చల్లబరచడం ద్వారా, క్వాంటం కంప్యూటింగ్ బేసిక్‌ యూనిట్‌ ‘క్యూబిట్’ను సృష్టించగలిగారు.

1.25% పెరిగి $414.77 చేరుకున్న మైక్రోసాఫ్ట్ షేర్లు

అయితే గూగుల్‌ పేరెంట్‌ కంపెనీ ఆల్ఫాబెట్ గత డిసెంబర్‌లో సొంత క్వాంటం చిప్‌ను అనౌన్స్ చేసింది. ఈ గూగుల్‌ చిప్ కేవలం ఐదు నిమిషాల్లో ఒక కాంప్లెక్స్‌ ప్రాబ్లమ్‌ని సాల్వ్‌ చేసింది. ఇదే పనికి సంప్రదాయ కంప్యూటర్లు చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయి. అయితే, మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన మజోరానా-1 చిప్ లోపాలకు గురయ్యే అవకాశం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ కొత్త ఆవిష్కరపై మైక్రోసాఫ్ట్‌ ప్రకటన తర్వాత, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మైక్రోసాఫ్ట్ షేర్లు 1.25% పెరిగి $4 వందల 14.77 డాలర్లకి చేరుకున్నాయి. ప్రతి గంటకు స్టాక్‌ ప్రైస్‌ పాజిటివ్‌గానే కొనసాగింది.

గతేడాది గూగుల్ తన సొంత కొత్త క్వాంటం చిప్‌ ప్రదర్శన

ఇలాంటి, అత్యంత పవర్ ఫుల్ క్వాంటం కంప్యూటర్లు ఎప్పుడు వస్తాయనే విషయంపై టెక్ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. గత నెలలో ఎన్విడియా, సిఇఒ జెన్సెన్ హువాంగ్ మాట్లాడుతూ.. ఈ టెక్నాలజీతో తన కంపెనీ చిప్‌లను తయారు చేస్తుందనీ… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అధిగమించడానికి మరో రెండు దశాబ్దాల్లోనే ఈ చిప్ రెడీ అవుతుందని అన్నారు. తర్వాత, గతేడాది గూగుల్ తన సొంత కొత్త క్వాంటం చిప్‌ను ప్రదర్శించింది. అయితే, ట్రేడ్ క్వాంటం కంప్యూటింగ్ అప్లికేషన్‌లు తయారుచేయాడానికి మరో ఐదు సంవత్సరాల కాలం పడుతుందని అన్నారు.

ఇటాలీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఎట్టోర్ మజోరానా కృషి

ఇక, 2033 నాటికి పెద్ద ఎత్తున క్వాంటం కంప్యూటర్లు ఆన్‌లైన్‌లో ఉంటాయని IBM కూడా తెలిపింది. అయితే, దాదాపు రెండు దశాబ్దాలుగా పరిశోధనలో ఉన్న ఈ ప్రక్రియతో మజోరానా ఫెర్మియన్ అనే సబ్‌టామిక్ కణంపై ఆధారపడి, మైక్రోసాఫ్ట్ ‘మజోరానా-1’ సృష్టి జరిగింది. ఈ చిప్‌ను వాషింగ్టన్, డెన్మార్క్‌లోని మైక్రోసాఫ్ట్ ల్యాబ్‌లలో తయారు చేశారు. నిజానికి, మొదటసారి 1930లలో దీని గురించి సిద్ధాంతీకరించారు. ఇటాలీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఎట్టోర్ మజోరానా దీనికి పాదులు వేశారు. అందుకే, మైక్రోసాఫ్ట్ సృష్టించిన దీనికి మజోరానా పేరు పెట్టారు.

స్కేలబుల్ క్వాంటం కంప్యూటర్‌ను నిర్మించడం..

గత వారం దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ప్రభుత్వాల సదస్సులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, 10 సంవత్సరాల క్రితం మనుషులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏమనుకున్నారో.. ఇప్పుడు క్వాంటం కంప్యూటర్లపై అలాంటి అభిప్రాయమే ఉంది అన్నారు. అయితే, అది చాలా వేగంగా సాకారం చేసింది మైక్రోసాఫ్ట్. ఇది ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్న టెక్నాలజీలో అతిపెద్ద ముందడుగు. నిజానికి, ఇది భవిష్యత్తు. అయితే, క్వాంటం కంప్యూటింగ్ చాలా సంక్లిష్టమైనది.

మజోరానా-1 కొత్త రకమైన మజోరానా కణంతో నిర్మాణం

ఆచరణాత్మకమైన, స్కేలబుల్ క్వాంటం కంప్యూటర్‌ను నిర్మించడం మోడర్న్ సైన్స్‌లో అత్యంత సవాలుతో కూడిన సమస్యలలో ఒకటి. అయితే, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రసిద్ధ టెక్ కంపెనీలు చాలా వేగంగా పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే… మైక్రోసాఫ్ట్ తన మొదటి క్వాంటం ప్రాసెసర్, మజోరానా-1తో ఒక పెద్ద ఆవిష్కరణ చేసింది. ఎలక్ట్రాన్-ఆధారిత క్విట్‌లపై ఆధారపడే సాంప్రదాయ క్వాంటం చిప్‌ల మాదిరిగా కాకుండా, మజోరానా-1 పూర్తిగా కొత్త రకమైన మజోరానా కణాన్ని ఉపయోగించి నిర్మించారు.

రోజువారీ జీవితంలో కూడా గణనీయమైన ప్రభావం

నిజానికి, క్వాంటం కంప్యూటింగ్ మనుషుల రోజువారీ జీవితంలో కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు, ఇది సాంప్రదాయ కంప్యూటర్లు చేయలేని విధంగా అణువులు, రసాయన ప్రతిచర్యలను అనుకరిస్తుంది. దీని ద్వారా వైద్యం, ఔషధాల ఆవిష్కరణలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. అలాగే, సైంటిస్ట్‌లు… మరింత సమర్థవంతమైన సోలార్ ప్యానళ్లు, బ్యాటరీలు, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

వాతావరణ మార్పు సమస్యలకు పరిష్కారం

వీటి ద్వారా వాతావరణ మార్పు సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. అంతేకాదు, రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతికి క్వాంటం కంప్యూటింగ్ మరింత దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో ఇది విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే, క్వాంటమ్ కంప్యూటింగ్.. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడం నుండి ట్రాఫిక్ వ్యవస్థలను నిజ సమయంలో ఆప్టిమైజ్ చేయడం వంటి చాలా క్లిష్టమైన సమస్యలను మరింత సమర్థవంతంగా, ఖచ్చితంగా పరిష్కరిస్తుంది.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×