BigTV English

MLC Kavitha: అక్కడ నుంచి ఎమ్మెల్యేగా కవిత పోటీ.!

MLC Kavitha: అక్కడ నుంచి ఎమ్మెల్యేగా కవిత పోటీ.!

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జగిత్యాలపై ఫోకస్ చేశారా..? మొదటి నుంచీ కూ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న జగిత్యాల నియోజకవర్గంపై కవిత ప్రత్యేక శ్రద్ద కనబరుస్తూ వచ్చారు. ఇప్పుడా శాసనసభ స్థానంలోని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీని వీడటంతో అక్కడ బీఆర్ఎస్ కు సరైన అభ్యర్థి లేకుండా పోయారు. దాంతో కవిత జగిత్యాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారా? అక్కడెలాగైనా బీఆర్ఎస్ జెండా పాతాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఇంతకీ కవితకు జగిత్యాల అంటే అంత ఇంట్రస్ట్ ఎందుకు?


బీఆర్ఎస్‌లో గెలిచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం.. వారిపై అనర్హత వేటు వేయించడానికి పార్టీ అధిష్టానం న్యాయ పోరాటం చేస్తుండటంతో.. ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. ఇదే విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు పదేపదే చెప్తున్నారు. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్ట్ పరిధిలో ఉన్న నేపథ్యంలో.. ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఒకవేళ ఇప్పటికిప్పుడు ఉపఎన్నికలు వస్తాయనో? లేకపోతే భవిష్యత్తులో అయినా అక్కడ నుంచే పోటీ చేయడానికో? ఎమ్మెల్సీ కల్వకుంట్ కవిత జగిత్యాలపై ఫోకస్ పెడుతున్నారు.

ఇటీవల కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి.. ఆ తర్వాత బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి జాతరకు కూడా వెళ్లివచ్చిన కవిత.. తెల్లవారి జగిత్యాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరడంతో.. ఇక్కడి బీఆర్ఎస్‌లో ఒక స్తబ్ధత నెలకొంది. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గవిభేదాలు తారాస్థాయిలో కనిపిస్తున్నాయి. సో వీటిని పొలిటికల్ గా క్యాష్ చేసుకోవాలంటే.. అక్కడ బీఆర్ఎస్‌కు ఒక బలమైన అభ్యర్ధి అవసరం ఉంది.


ఆ క్రమంలో ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్నందున కవిత చూపు ఇప్పుడు జగిత్యాలపై పడిందంటున్నారు. రేపెప్పుడైనా ఉపఎన్నిక వచ్చినా.. లేక, భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికల నాటికైనా జగిత్యాల నుంచి పోటీ చేయాలని కవిత భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెప్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రాజకీయంగా ఫైట్ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కవితకు ఆయనతో సత్సంబంధాలున్నాయి. అటు జగిత్యాల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్‌కుమార్‌ను ముందు నుంచి కవితే రాజకీయంగా ప్రోత్సహించారు.. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు గాడ్ మదర్‌లా నిలిచారు.

Also Read: హరీష్‌ రావును దూరం పెడుతోన్న కేటీఆర్, కవిత.. మామ మంత్రం పఠిస్తున్న మేనల్లుడు!

అయితే సంజయ్ కుమార్ కారు దిగి వెళ్లిపోవడంతో.. ఎలాగైనా జగిత్యాలలో మళ్లీ బీఆర్ఎస్ జెండా పాతాలని.. అందుకు తానే బరిలో నిలవాలని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. సంజయ్ పై రాజకీయంగా పైచేయి సాధించేందుకు.. జీవన్ రెడ్డి కూడా తనకు పరోక్షంగా సహకరిస్తారని కవిత లెక్కలు వేసుకుంటున్నారంట. ఇలా అన్ని రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకునే కవిత జగిత్యాలవైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే, కవితతో పాటు, ఇక్కడి నుంచి బరిలోకి దిగేందుకు తాజా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, చాలాకాలంగా పోటీలో ఉండేందుకు విఫలయత్నం చేస్తున్న ఓరుగంటి రమణారావు వంటివారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కవిత వారిని బలపర్చడంపై ఫోకస్ పెడతారా?.. లేక, తానే బరిలోకి దిగడంపై దృష్టి సారిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కవిత నిజామాబాద్ ఎంపీగా ఓటమి పాలవ్వడంతో పాటు.. కేంద్రం పసుపు బోర్డును ప్రకటించడంతో ఇక నిజామాబాద్ సేఫ్ ప్లేస్ కాదనే భావనలో ఉన్నట్టు చెప్తున్నారు. ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న ఆ ఎమ్మెల్సీ అదే జిల్లాలోని బోధన్ నియోజకవర్గంపైన కూడా దృష్టి పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు జగిత్యాలలో కూడా కవిత యాక్టివ్ అవుతుండటంతో.. రాబోయే రోజుల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకదాన్ని కవిత ఎంచుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మరి కవిత జగిత్యాలలో పోటీ చేస్తారా? లేదంటే డాక్టర్ సంజయ్‌కుమార్ స్థానాన్ని తన ప్రియ శిష్యురాలు దావ వసంతతో భర్తీ చేస్తారా? అన్నది చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×